17.07.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీల ద్వైమాస
పత్రిక జనవరి – ఫిబ్రవరి 2006 సంచికలో ప్రచురింపబడిన వ్యాసానికి తెలుగు అనువాదమ్..
మరాఠీ మూలమ్ శ్రీమతి ముగ్ధా దివాద్కర్
మరాఠీ నుండి ఆంగ్లంలోనికి అనువాదం శ్రీ సుధీర్
నా అవతారమ్ మీ శ్రేయస్సు
కోసమే – 2వ. భాగమ్
దక్షిణ :
బాబా దక్షిణ అడుగుతూ
ఉండేవారు. కాని కొంతమంది బాబా దక్షిణ అడగటంలోని
ఆంతర్యాన్ని అర్ధం చేసుకోలేక ఆయనని తప్పుగా భావించేవారు. బాబాకు తనకంటూ కోరికలేమీ లేవు. అందుచేత బాబా ఎవరిని దక్షిణ అడిగినా అది తనకోసం
కాదు.
తన వద్దకు వచ్చిన భక్తుని పాపాలను ప్రక్షాళన చేయటానికే ఆయన దక్షిణ అడుగుతూ ఉండేవారు. ఇక్కడ ఒక ముఖ్యమయిన విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. బాబా అందరినీ లేక ఎవరిని పడితే వారిని దక్షిణ అడిగేవారు కాదు. కొంతమంది భక్తులను మాత్రమే దక్షిణ అడిగేవారు. ఎవరయినా తమంతతాముగా బాబా ముందు దక్షిణపెడితే, అనేకసార్లు ఆయన స్వీకరించేవారు కాదు. ఎవరయినా యిష్టపూర్వకంగా యివ్వలనిపించిన వారినుంచి దక్షిణ అడిగి తీసుకొనేవారు. కాని చాలాసార్లు అటువంటివారిని దక్షిణ అడిగేవారు కాదు. ఒక్కొక్కసారి ఆయన స్త్రీలను, పిల్లలను దక్షిణ అడిగేవారు.
తన వద్దకు వచ్చిన భక్తుని పాపాలను ప్రక్షాళన చేయటానికే ఆయన దక్షిణ అడుగుతూ ఉండేవారు. ఇక్కడ ఒక ముఖ్యమయిన విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. బాబా అందరినీ లేక ఎవరిని పడితే వారిని దక్షిణ అడిగేవారు కాదు. కొంతమంది భక్తులను మాత్రమే దక్షిణ అడిగేవారు. ఎవరయినా తమంతతాముగా బాబా ముందు దక్షిణపెడితే, అనేకసార్లు ఆయన స్వీకరించేవారు కాదు. ఎవరయినా యిష్టపూర్వకంగా యివ్వలనిపించిన వారినుంచి దక్షిణ అడిగి తీసుకొనేవారు. కాని చాలాసార్లు అటువంటివారిని దక్షిణ అడిగేవారు కాదు. ఒక్కొక్కసారి ఆయన స్త్రీలను, పిల్లలను దక్షిణ అడిగేవారు.
దక్షిణ అడిగినా యివ్వని వ్యక్తిమీద బాబా ఎప్పుడూ కోపం చూపించేవారు కాదు. ఒకవేళ ఎవరయినా దక్షిణ యివ్వడం మర్చిపోయినపుడు బాబా వారికి ఆవిషయం ఏదో విధంగా గుర్తుకు తెచ్చేవారు. ఒక్కొక్కసారి దక్షిణయిచ్చిన భక్తుడిని మళ్ళీ మళ్ళీ దక్షిణ అడిగేవారు. ఒకవేళ అతని వద్ద యింక దక్షిణ యివ్వడానికి డబ్బు లేకపోతే ఎవరిదగ్గరనుంచయినా అడిగి తీసుకుని దక్షిణ యివ్వమని చెప్పేవారు.
బాబా దక్షిణను ధనరూపేణా
కాకుండా సంకేతాల ద్వారాను, ఆధ్యాత్మికపరంగాను అడిగిన సందర్భాలున్నాయి. ఆయన చేసే సంకేతాలయొక్క అర్ధాన్ని బాబా కొంతమంది
భక్తులకి స్వప్నాలలోగాని లేక జాగరూకత స్థితిలో ఉన్నప్పుడుగాని వివరించి చెప్పేవారు. కొంతమంది భక్తులకి ఒక నిర్ణీత ప్రదేశంలో పోతీని
వినమని చెప్పేవారు. ఆవిధంగా చెప్పబడ్డ భక్తుడు
పోతీ ద్వారా బాబా చెప్పిన సంకేతాల యొక్క అర్ధాన్ని అర్ధం చేసుకునేవాడు.
దక్షిణ అడగడానికి బాబా
ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఆయన మసీదులోనే భక్తులనుండి
దక్షిణను అడిగి తీసుకునేవారు. ప్రతిరోజు ఆ విధంగా
స్వీకరించిన దక్షిణను ఆరోజే పంచిపెట్టేస్తూ ఉండేవారు. సాయంత్రానికి ఆయన జేబులు ఖాళీ అవుతూ ఉండేవి. సాయంత్రం తరువాత బాబా ఎప్పుడూ దక్షిణను స్వీకరించలేదు.
అంతేకాకుండా బాబా ఏభక్తునికయినా
డబ్బుయిచ్చి దానిని పూజించుకోమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా బాబా యిచ్చిన ధనాన్ని పూజించుకున్న భక్తుడు
తనకెంతో బ్రహ్మాండమయిన ఫలితాలు కలిగినట్లుగా గ్రహించుకునేవాడు.
బాబా ఎప్పుడూ తనకోసమని
దక్షిణను అడగలేదు.
సంక్షిప్తంగా చెప్పాలంటే
బాబా దక్షిణ అడగడం ద్వారా భక్తునియొక్క ఆత్మసాక్షాత్కారాన్ని పొందే మార్గంలో గల అడ్డంకులయినటువంటి
అహంకారాన్ని అవరోధాలను తొలగించేవారు.
బాబా అడిగిన రెండు పైసల
దక్షిణ శ్రధ్ధ, సబూరి. “నాగురువు నన్ను ఈ రెండు పైసలనే దక్షిణగా అడిగారు. నేనవి వారికి యిచ్చేశాను. నాకు నా గురువు అనుగ్రహం లభించింది” అన్నారు బాబా.
ఎవరికయితే తన సద్గురువుపై
నిస్సందేహమయిన నమ్మకం నిశ్చలమయిన భక్తిని కొనసాగించగల మనోధైర్యం ఉంటాయో సాగరాన్ని సులభంగా
ఈది తన లక్ష్యాన్ని సాధించగలడు. తల్లి తాబేలు
ఏవిధంగానయితే తన పిల్లలను తన దృష్టితో పెంచి పోషిస్తుందో నేను మీ ఎడల అదేవిధంగా నా
దృష్టిని సారిస్తాను. మీరు నాయందు నిశ్చలమయిన
భక్తితో దృష్టి నిలిపితే నేను మీయోగక్షేమాలను గమనిస్తూ మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను.”
బాబా అధ్భుతమమయిన బోధనలు
అభ్యాసం లేనివారికి బాబావారి
ఉపదేశాలు చాలా విచిత్రంగా కనిపిస్తాయి.
బాబా తన భక్తులకు కలలో
కనిపించి బోధనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
భీమాజీ పాటిల్ కి కలలో
ఒక స్కూలు మాస్టరుగా దర్శనమిచ్చి అతని వీపుమీద బెత్తంతో దెబ్బలు కొట్టారు. మరొకసారి స్వప్నంలో ఒకవ్యక్తి అతని చాతీమీద కూర్చుని
బండరాయితో గట్టిగా రుద్దసాగాడు. భీమాజీ పాటిల్
కి ఆవిధంగా క్షయవ్యాధి నయమయింది.
ఒకరోజు మేఘుడు జాగ్రతావస్థలోనే
ప్రక్కమీద కళ్ళుమూసుకుని పడుకుని ఉండగా బాబాయొక్క ఆకృతిని స్పష్టంగా చూశాడు. బాబా అతని ప్రక్కపై అక్షంతలు చల్లి “మేఘా త్రిశూలాన్ని
గీయి” అని అతన్ని లేపి అదృశ్యమయ్యారు. మేఘా
అది ఒక స్వప్నంగా భావించాడు. ఆతరువాత అతడు
బాబా దర్శనానికి వెళ్ళినపుడు బాబా, “నేను అన్న మాటలను స్వప్నంలా భావించకు. నాకొక విస్తారమయిన ఆకారం లేదు. నేను సర్వత్ర ఉంటాను. నేను ప్రవేశించటానికి ద్వారాలు అడ్డు పడవు. నాపై భారం వేసి, విశ్వాసముంచినవారి యొక్క శరీరవ్యాపారాలను
సూత్రధామంగా నేను నడిపిస్తానని” అన్నారు.
మేఘా వాడాకు వెళ్ళి బాబాఫొటో
ప్రక్కగా గోడపై త్రిశూలాన్ని గీశాడు. మరునాడు
మసీదుకు రామదాసు భక్తుడొకడు పూనానుండి వచ్చి బాబాకు భక్తితో నమస్కరించి ఒక లింగాన్ని
బాబాకు అర్పించాడు. బాబా ఆలింగాన్ని మేఘాకు
యిచ్చి అర్చించుకోమని చెప్పారు.
అంతేకాకుండా బాబా ఉపదేశాలను
స్వప్నాలలోనే కాకా జాగ్రదావస్థలో కూడా యిచ్చిన సందర్భాలున్నాయి.
ఒకసారి తర్ఖడ్ గారి భార్య,
కొడుకు షిరిడీలో ఉన్నారు. బాంద్రాలో తర్ఖడ్
గారు ప్రతిరోజు తన కుమారుడు పూజ చేసినట్లే బాబాకు పూజ చేశారు. కాని బాబాకు నైవేద్యం పెట్టడం మర్చిపోయారు. ఆ సమయంలో యిక్కడ షిరిడీలో తర్ఖడ్ గారి భార్యతో బాబా
“అమ్మా, నేనేమిచేయను, ఎప్పటిలాగే బాంద్రాలోని మీయింటికి వెళ్ళాను. కాని నాకక్కడ తినడానికేమీ దొరకలేదు. ఆకలితో కడుపులో నెప్పులు వచ్చాయి. ఆకలితో తిరిగివచ్చేశాను” అన్నారు. జరిగిన సంఘటనలతో వివరంగా కొడుకు, తండ్రికి ఉత్తరం
రాశాడు. అదే సమయంలో జరిగిన పొరబాటు గుర్తించి
తండ్రికూడా కుమారునికి జరిగిన విషయాన్నంతా ఉత్తరం వ్రాశాడు.
ఊదీ :
మొదటిసారిగా బాబా ధునిని
ఎప్పుడు వెలిగించారో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు.
షిరిడీకి వచ్చిన భక్తులందరూ ధునిలో కొబ్బరికాయలు, మంచిగంధపు చెక్కలు, సాంబ్రాణి
భక్తిపూర్వకంగా వేస్తూ, బాబా వెలిగించిన ధునిని నిరంతరాయంగా మండటానికి దోహదపడుతున్నారు.
ధునిలోనుంచి వచ్చిన భస్మమే బాబా వారి పవిత్రమయిన ఊదీ.
ధునిలోనుంచి వచ్చిన భస్మమే బాబా వారి పవిత్రమయిన ఊదీ.
బాబా కొంతమందికి తనే
స్వయంగా ఊదీనిచ్చేవారు. మరికొంతమందికి భాగోజీ
షిండే ద్వారా యిప్పించేవారు. ఇంకా మరికొంతమందికి
“ఊదీ తీసుకో. వెళ్ళి వాడాలో కూర్చో” అని చెప్పేవారు. భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు గాని, లేక మరొక గ్రామానికి
వెళ్ళేటప్పుడు గాని ఊదీ తీసుకుని వెళ్ళేవారు,
వారు ఏదయినా ముఖ్యమయిన పనిమీద వెళ్ళేటప్పుడు గాని, అనారోగ్యంతో బాధపడుతున్న
వ్యక్తిని చూడటానికి వెళ్ళేటప్పుడు గాని ఊదీని తీసుకుని వెడుతూ ఉండేవారు. తమపనులు విజయవంతంగా పూర్తవడానికి ఊదీ ఎంతగానో సహాయపడిందని
భక్తులు విశ్వసించేవారు.
ఏవ్యక్తికయినా అంతిమక్షణాలు
దగ్గరపడ్డాయని తెలిసినపుడు చాలా సార్లు బాబా ఊదీనిచ్చేవారు కాదు. కొన్ని సమయాలలో బాబా తనే స్వయంగా ఒక భక్తుని చేత
ఊదీనిచ్చి రోగికి పంపించేవారు. ఏవ్యక్తయినా
బాబామీద నమ్మకం లేకుండాను, ఆయనను పరీక్షించాలనే ఉద్దేశ్యంతోను వచ్చినట్లయితే బాబా ఊదీనిచ్చే
సమయంలో అతనిని పట్టించుకోకుండా వెళ్ళి బయట దూరంగా కూర్చోమని చెప్పేవారు. కొంతమంది భక్తులకి బాబా తనే స్వయంగా ఊదీని వారి
నుదుటిమీద రెండుకనుబొమల మధ్య తమ బొటనవ్రేలితో గట్టిగా నొక్కి అద్దేవారు. ఆవిధంగా చేసినపుడు ఆయన మిగిలిన నాలుగు వ్రేళ్ళు
ఆ భక్తుని తలమీద ఆన్చి ఉంచేవారు.
బాబా ఆవిధంగా తన బొటనవ్రేలితో
కలిగించే వత్తిడికి బాలాసాహెబ్ లాంటి చాలా మంది భక్తులు నిలదొక్కుకోలేకపోయేవారు. అంతే కాదు వారికి బాహ్యస్మృతి కూడా తెలిసేది కాదు. ఆతరువాత యిహంలోకి వచ్చి బాహ్యస్మృతి కలిగిన తరువాత
తాము కొంతసేపు సమాధిస్థితిలోకి వెళ్ళామని చెప్పేవారు. ఆతరువాతనుంచి వారి ఆధాత్మిక ప్రగతి చాలా వేగంగా
జరిగేది.
బాబా యొక్క ఊదీ ఎంతోమంది
భక్తుల రోగాలను నయం చేసింది. కొంతమంది చాలా
ప్రమాదకరమయిన విపత్తులనుండి, సంకటాలనుండి బయటపడ్డారు. దీనికి సంబంధించి శ్రీసాయి సత్ చరిత్రలో ఎన్నో దృష్టాంతాలున్నాయి. నేటికీ బాబా ఊదీ ఎన్నో అద్భుతాలను మనకందిస్తూనే
ఉంది.
వివేకము మరియు వైరాగ్యము
:
ఊదీ, దక్షిణ వివేక వైరాగ్యాలకి
చిహ్నాలు. ఈ శరీరం నశ్వరం. ఈ శరీరం ఎప్పటికయినా బూడిద కావలసిందే. అందుచేత ప్రతివారు వివేకం కలిగి ప్రవర్తించాలి. మన శరీరం మానవ సంక్షేమానికి ఉపయోగపడాలి. మనం సంసార జీవితాన్ని సాగిస్తూనే వైరాగ్యాన్ని పొందవచ్చు. అందుచేతనే బాబా గుప్పిటనిండుగా భక్తులకి ఊదీనిచ్చి
పంపెవేస్తూ ఉండేవారు. భక్తులందరూ తమ వద్ద ఊదీ
ఉంటే బాబాయే తమ చెంత ఉన్నట్లుగా భావించేవారు.
సాధు సత్పురుషుల జీవితాల
మార్గదర్శక సూత్రాలు కారుణ్యం, కృపాలత (దయకలిగి ఉండుట) , పరోపకారత.
భగవంతుడు దుర్జనులని నాశనం చేస్తాడన్న విషయం గుర్తుంచుకోవాలి. కాని సత్పురుషులు మాత్రం దుర్జనులను సజ్జనులుగా
మారుస్తారు.
కుమ్మరి కొలిమిలో పడబోతున్న
బిడ్డని బాబా రక్షించారు. దాదాసాహెబ్ కపర్దె
కుమారునికి సోకిన ప్లేగు వ్యాధి బొబ్బలను బాబా తన శరీరం మీదకు తెచ్చుకొని ఆపిల్లవాడిని
రక్షించారు.
అదే సాధుసత్పురుషులయొక్క
గొప్పతనం.
సాయిబాబా సర్వశక్తిమంతుడు,
సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. కాబట్టే మనం ఆయన
ఉనికిని నేటికీ అనుభూతిని పొందుతున్నాము. ఇది
సాయిభక్తులందరికీ అనూహ్యమయిన ఆనందాన్నిస్తుంది.
ప్రాధమిక సద్గుణాలు ఎప్పుడూ ఒకేలాగ ఉంటాయి. మనలో శాశ్వతంగా నివసించే భగవంతుడిని మనం కనుగొనాలి. ఇది ఆధ్యాత్మికమయిన సంపూర్ణమయిన ఆనందానికి దారితీస్తుంది. ఆయన బోధనలను మనం ఆచరణలో పెట్టినట్లయితే ఆయనయొక్క
అవతార లక్ష్యాన్ని మనం నెరవేర్చగలము.
(అయిపోయింది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment