20.07.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
మన సద్గురువయిన శ్రీ సాయిబాబాకు
అత్యంత ప్రియతమ భక్తుడయిన శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గురించి పూర్తిగా తెలుసుకుందాము. మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. బాబాకు శ్యామా అంటే ఎందుకంత అభిమానమో ఈ వ్యాసమ్
చదివితె మనకర్ధమవుతుంది. ఈ వ్యాసం శ్రీసాయి
లీల ద్వైమాస పత్రిక మార్చ్ - ఏప్రిల్ 2006 సంచికలో ప్రచురింపబడింది.. మరాఠీ మూలం శ్రీమతి
ముగ్ధా దివాద్కర్. ఆంగ్లంలోకి అనువాదమ్ శ్రీ
సుధీర్
తెలుగు అనువాదమ్: ఆత్రేయపురపు
త్యాగరాజు
మాధవరావు దేశ్ పాండే (శ్యామా) - 2 వ.భాగమ్
1910 వ.సంవత్సరంలో తర్ఖడ్ గారు బాబాను దర్శించుకోవడానికి రెండవసారి షిరిడీకి వచ్చారు. ఆయన రెండవసారి షిరిడీకి వచ్చిన కారణాలను తెలుసుకుందాము.
ఆ రోజుల్లో భక్తులు షిరిడీకి వచ్చినపుడు బసచేయడానికి సాఠేవాడా ఒక్కటే ఉండేది. తన రోజువారీ కార్యక్రమాలనుంచి, ఉద్యోగం, కుటుంబ సమస్యలనుంచి తప్పించుకుని కొంతకాలం షిరిడీలో ప్రశాంతంగా గడుపుదామనుకున్నారు తర్ఖడ్ గారు. బాబావంటి సత్పురుషుని పాదాలవద్ద కాస్త మనశ్శాంతిగా గడుపుదామనే ముఖ్యోద్దేశంతో షిరిడీ వచ్చారు. ఆసందర్భంగా ఆయన ఒక్కరే షిరిడీకి వచ్చారు. ఆవిధంగా షిరిడీ చేరుకున్న తర్ఖడ్ గారు ప్రయాణ బడలిక వల్ల బాగా అలసిపోయారు. పైగా ఎండవేడిమి. ఉదయంనుంచి త్రాగుదామంటే టీ కూడా దొరకని పరిస్థితి. అందువల్ల చాలా చికాకుతో ఉన్నారు.
తర్ఖడ్ గారు అప్పుడే
సాఠేవాడాకు చేరుకున్నారు. ఆయన అక్కడికి అడుగుపెట్టిన
వెంటనే ఇద్దరు పెద్దమనషులు వచ్చి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. వారిద్దరూ ఎవరో ఆయనకు పరిచయంలేదు. ఆధ్యాత్మిక విషయాల గురించి ఆయనను ప్రశ్నల వర్షం
కురిపించారు. అయినాకాని, తను వారు సంధించే
ప్రశ్నల ధాటికి అలసిపోయినట్లుగా బయటకు కనపడనివ్వలేదు. బాలాభావు (నానాసాహెబ్ చందోర్కర్ మేనల్లుడు, నానాసాహెబ్
తర్ఖడ్ గారికి షిరిడీలొ భోజనాన్ని ఏర్పాటు చేశాడు) తర్ఖడ్ గారికి ఒక కప్పు టీ యిచ్చాడు. టీ త్రాగిన తరువాత ఆయనకి ఎంతో హాయిగా అనిపించింది. టీ త్రాగడం పూర్తయిన తరువాత బాలాభావు ఆయనని బాబా
దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. బాబా దర్శనానికి వెడుతున్నా గాని, ఆయన
ఆలోచనలు ఈవిధంగా సాగాయి, “బొంబాయిలో చికాకులను వదిలించుకోవడానికి, కాస్త ప్రశాంతంగా
గడుపుదామని ఇక్కడికి వచ్చాను. కాని ఇక్కడ కూడా
నన్ను చికాకులు వదిలేటట్లు లేవు. అనవసరంగా
వచ్చాను ఇక్కడికి. దీనికన్నా బొంబాయిలోనే ఉండివుంటే
బావుండేది”. అయిదు నిమిషాలలోనే ఇటువంటి పరస్పర
విరుధ్ధమయిన ఆలోచనలు మనసులో మెదులుతూ వున్నాయి.
మనసులో అవే ఆలోచనలు మెదులుతూ ఉండగా మాధవరావుతో కలిసి బాబా దర్శనానికి వెళ్ళాడు.
ఎప్పటిలాగే సాంప్రదాయం
ప్రకారం, అగరువత్తులు, కర్పూరం వెలిగించి, బాబాముందు కొబ్బరికాయనుంచి నమస్కరించుకున్నాడు. బాబా తమ హస్తాన్ని ఆయన శిరసుపై వుంచి, ప్రసాదంగా
పండ్లు యిచ్చి కూర్చోమని చెప్పారు. తర్ఖడ్
గారు మనసులో బాబానుంచి అనుమతి తీసుకుని బొంబాయి వెళ్ళిపోదామని అడగడానికి సిధ్ధంగా ఉన్నాడు.
అకస్మాత్తుగా బాబా మాధవరావుతో,
“శ్యామా, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఆయనకి
కాస్త సలహా యివ్వు. వెళ్ళు, ఊదీ తీసుకుని వాడాలో
కాస్త స్థిమితంగా కూర్చో” అన్నారు.
ఊదీ తీసుకుని తర్ఖడ్,
మాధవరావు యిద్దరూ మసీదునుంచి బయటకు వచ్చారు.
ఇద్దరూ రోడ్డుమీద నడుచుకుంటూ వస్తున్నారు.
అక్కడ మాధవరావు తర్ఖడ్ ని ఆపి, "ఏంజరిగింది?" అని ప్రశ్నించాడు. తర్ఖడ్ తను షిరిడీకి వచ్చిన కారణంతో సహా విషయాలన్నీ
పూసగుచ్చినట్లు వివరంగా చెప్పాడు. అంతా విన్న
తరువాత మాధవరావు “ఇదే విచిత్రం మరియు భగవంతుని సందేశం. ఆయన నిన్ను అచంచలమయిన భక్తితో మెలగమని ఉపదేశిస్తున్నారు. ఈ ప్రపంచంలో సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ భక్తి సడలకుండా
చూసుకో. నీ ఉద్యోగ బాధ్యతలలో ప్రతిరోజు ఏవో
సమస్యలు, అవరోధాలు ఉంటూనే ఉంటాయి. ఎన్ని ఉన్నాగాని,
నీ మనస్సు మాత్రం భగవంతుని మీదనే లగ్నం చేయాలి.
ఇపుడు మనం మళ్ళీ మన భగవంతుని దగ్గరకు వెడదాం పద. ఆయన ఏమి బోధిస్తారో విని అర్ధం చేసుకుందాము” అన్నాడు.
ఇద్దరూ కలిసి మళ్ళీ మసీదులోకి
అడుగుపెట్టారు. వారలా మసీదులోకి అడుగుపెట్టారో
లేదో అదే క్షణంలో బాబా “భావు, శ్యామా చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండు”
అన్నారు.
ఈ అధ్భుతమయిన చమత్కారాన్ని
చూసి తర్ఖడ్ ఉద్వేగభరితులయి బాబా ముందు సాగిలపడి నమస్కారం చేసుకొన్నారు. బాబా చెప్పిన ఉపదేశాన్ని అర్ధం చేసుకొన్నారు. మన దైనందిన జీవితంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా
గాని శిష్యునికి తన సద్గురువుమీద అచంచలమయిన భక్తి ఉండాలి. స్థిరమయిన సంతృప్తి ఉండాలి.
బాబా తన మానసిక స్థితితో
సంబంధం లేకుండా కోపంగా గాని చికాకుగా గాని ఉండేవారు. అటువంటి సమయంలో మాధవరావు ఎంతో ఆత్మ విశ్వాసంతో మెల్లగా
ఆయన దగ్గరకు వెళ్ళి బాబా చిలుము నింపేవాడు.
ఆవిధంగా ఎంతో నేర్పుగా ఆయనతో మాట్లాడుతూ ఆయన స్వభావాన్ని మార్చేసేవాడు. ఇదేకాదు, ఒక్కొక్కసారి బాబాతో దెబ్బలాడేవాడు. ఆయనమీద కోపాన్ని ప్రదర్శించేవాడు. ఒట్టు పెట్టి మరీ ఆయనను కట్టిపడేసేవాడు. ఒక్కొక్కసారి సలహాల గురించి కొన్ని విషయాలను చెబుతూ
వుండేవాడు. తనమీద మాధవరావుకు ఎంతటి ప్రేమాభిమానాలు
ఉన్నాయో బాబాకు తెలుసు కనకనే కాస్త నవ్వి ఊరుకునేవారు. బాబా ఎప్పుడూ అతనిపై కోపగించలేదు. ఎటువంటి ఉద్రేకాన్ని ప్రదర్శించేవారు కాదు. కారణం మాధవరావుయొక్క శరీరమంతా ‘సాయిమయం’ అతను నిరంతరం
‘సాయినాధ్, సాయినాధ్, సాయినాధ్’ అని బాబా నామస్మరణ చేస్తూనే ఉండేవాడు. అతను మేలుకొని ఉన్నా, నిద్రలో ఉన్నా, కలలు కంటూ
ఉన్నా సాయిని మాత్రమే దర్శించేవాడు. అతని పంచేంద్రియాలు,
పంచప్రాణాలు అన్నింటినీ సాయిపాదాలవద్ద అర్పణ చేసాడు.
దాదా సాహెబ్ ఖపర్దే తన
డైరీలో మాధవరావు గురించి ఒక అద్భుతమైన సంఘటనను వ్రాసుకొన్నారు.
డిసెంబరు 8వ.తేదీ
1911 వ.సంవత్సరంలో ఆయన ఈవిధంగా వ్రాసారు.
“నేను ఈ అద్భుతాన్ని
గురించి విన్నాను. అంతే. కాని ఎప్పుడూ ప్రత్యక్షంగా
చూడలేదు. ఇపుడు నేను నాకళ్ళతో చూస్తున్నాను. నా చెవులతో వింటున్నాను. మాధవరావు ఇక్కడే ఉన్నాడు. అతను గాఢనిద్రలో ఉన్నాడు. అతను శ్వాస పేల్చేటప్పుడు, వదిలేటప్పుడూ (శ్వాస
నిశ్వాసలలో) ‘సాయినాధ్ మహరాజ్, సాయినాధ్ బాబా’ అనే మాటలు చాల స్పష్టంగా వినిపించాయి. అతను గుఱ్ఱు పెడుతున్న సమయంలో కూడా కాస్త దూరంనించి,
ఆమాటలు వినిపించాయి. ఇది చాలా అత్యధ్భుతమయిన
సంఘటన.”
మాధవరావు తన బాల్యంలోనే
షిరిడీకి వచ్చాడు. తరువాత అతను షిరిడీలో ఉన్న
బడిలోనే అసిస్టెంట్ టీచర్ గా ఉద్యోగంలో చేరాడు.
సర్కిల్ ఇన్స్ పెక్టర్ గోపాలరావు గుండు కట్టించిన గదిలోనే అతను పిల్లలకు పాఠాలు
బోధిస్తూ ఉండేవాడు. (కొంతకాలం రాధాకృష్ణ ఆయి
తను మరణించేవరకు అక్కడె నివసించింది. ఆతరువాత
ఆగది ‘శ్యామ్ సుందర్ అశ్వానికి అశ్వశాలగా మారింది) ఆగదిని యిటుకలు, మట్టితో కట్టారు. మసీదువయిపు ఉన్న గోడకి చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీలోనుంచి మసీదు కనపడుతూ ఉండేది. మాధవరావు ఆ కిటికీలోనుంచి ద్వారకామాయిలో గాని మసీదులోగాని
బాబా కూర్చుని ఉండటం చూస్తూ ఆయన చర్యలను గమనిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా అరబ్బీ భాషలో గాని, పర్షియన్
భాషలో గాని పాటలు పాడుతూ ఉండేవారు. మాధవరావు
తరగతి గదిలోనుంచి బాబా పాడే పాటలను వింటూ ఉండేవాడు.
మాధవరావు బడిలో ఉపాధ్యాయునిగా
చేరేనాటికి అతని వయస్సు 14 – 15 సంవత్సరాలు.
ఆసమయంలో బాబా అతని కళ్ళకి చిలుము పీల్చేవానిగా, మంచి వయసులో ఉన్న ఒక పిచ్చి
ఫకీరుగా కనిపించారు. బాబాని అతను ఒక ‘సగుణపరమాత్ముడని,
సిధ్ధపురుషుడని’ అనుకోలేదు. 10 -12 సంవత్సరాలపాటు అతను ఇదే భావంతో ఉన్నాడు. ఆతరువాత 10 – 12 సంవత్సరాలనుంచి బాబా ఒక సత్పురుషుడనే భావం ఆయనలో
కలిగింది. ఆతరువాతనుంచి బాబా సమక్షంలో ఎక్కువ
సమయాలు గడుపుతూ ఉండేవాడు. బాబా ఒక సిధ్ధపురుషుడని,
మూర్తిమంతుడయిన సగుణపరమాత్మయని అర్ధం చేసుకొన్నాడు. 20 – 22 సంవత్సరాలపాటు బాబా ఆజ్ఞకు బధ్ధుడయి ఆయనకు విధేయుడిగా
భక్తులకి సేవ చేశాడు. ఆవిధంగా 42 -43 సంవత్సరాలాపాటు
తన జీవితాన్ని నిరంతరం సాయి సాన్నిహిత్యంలో గడిపాడు.
మాధవరావు మొట్టమొదటిసారిగా
బాబాని పాడుపడిన మసీదులో చూశాడు. మాధవరావుకి
బాబాకి యిధ్ధరిమధ్య ఉన్న అద్వితీయమయిన సంబంధం గురించి తెలుసుకోవాలని శ్రీ నార్కేకి
చాలా కుతూహలంగా వుండేది. ప్రతి విషయాన్ని బాగా
పరిశోధించి కారణాలను తెలుసుకోవాలనే మస్తత్త్వం ఉన్నవాడు నార్కే. ఆప్రకారంగా వారిద్దరూ అంత సన్నిహితంగా ఉండటం, చనువుగా
మాట్లాడుకోవడం వెనుక గల కారణాలను తెలుసుకోవాలనుకున్నాడు. మాధవరావు కుటుంబం, నార్కే కుటుంబం రెండు కుటుంబాలవారు
చాలా సన్నిహితంగాను స్నేహంగాను ఉండేవారు. ఆవిధమయిన
చనువు ఉండటం వల్ల నార్కే మాధవరావుని తన సందేహ నివృత్తి చేసుకోవడానికి ప్రశ్నలవర్షం
కురిపించాడు. అపుడు మాధవరావు తన కధనంతా చాలా
వివరంగా చెప్పాడు.
(రేపటి సంచికలో మాధవరావు చెప్పిన కధ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో మాధవరావు చెప్పిన కధ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment