21.07.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
మన సద్గురువయిన శ్రీ
సాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తుడయిన శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గురించి పూర్తిగా
తెలుసుకుందాము. మనకు తెలియని ఎన్నో విషయాలు
ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. బాబాకు శ్యామా
అంటే ఎందుకంత అభిమానమో ఈ వ్యాసమ్ చదివితె మనకర్ధమవుతుంది. ఈ వ్యాసం శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్ -
ఏప్రిల్ 2006 సంచికలో ప్రచురింపబడింది.. మరాఠీ మూలం శ్రీమతి ముగ్ధా దివాద్కర్. ఆంగ్లంలోకి అనువాదమ్ శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్: ఆత్రేయపురపు
త్యాగరాజు
మాధవరావు దేశ్ పాండే (శ్యామా) - 3 వ.భాగమ్
“బాబా పొగాకుతో చిలుము
పీలుస్తూ ఉండేవారు. నేను కూడా ఆయనతో కలిసి
చిలుము పీల్చడానికి మాటిమాటికి వెడుతూ ఉండేవాడిని. గ్రామంలోని ప్రముఖులందరూ బాబా పట్ల ఎంతో వినయంగా
భక్తిప్రపత్తులతో మెలిగేవారు. తాత్యాపాటిల్
తల్లి, కుటుంబ సభ్యులు, గోడ్ కర్ కుటుంబం, మహల్సపతి సోనార్, కుల్ కర్ణి యింకా మరికొంతమంది
ఆయన భక్తులు వీరందరూ ఆయనని ఒక ఫకీరుగా ఎంతగానో ప్రేమించేవారు. అలాంటివారిలో నేనూ ఒకడిని. కాని ఏంజరిగిందో నాకు తెలీదు. శ్రీసాయిబాబాను దర్శించుకోగానే నాకెంతగానో ఆనందం
కలగసాగింది. నేను ఆయనకు దగ్గరగా ఉన్నపుడు ఆయన
నామీద ఏదయినా సమ్మోహనాస్త్రం ప్రయోగించారా అని అనిపించేది.
ఆయన సమక్షంలో నామనసు స్వచ్చంగాను, పవిత్రమయిన ఆలోచనలతోను
నిండిపోయేది. నాశరీరంలో ప్రకంపనాలు కలిగేవి. నాకళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయేవి. ఈ అనుభూతులవల్ల బాబాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని
తహతహలాడుతూ ఉండేవాడిని. ఆయన దర్శనభాగ్యాలు,
ఆయనతో పరిచయాలు, మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చాయి.
ఇక సహజంగానే శ్రీసాయిబాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరి గురించి తెలుసుకోవడం
ప్రారంభించాను. సాయిబాబా కూడా షిరిడీగ్రామం
వెలుపలినుంచి వచ్చే భక్తులందరికి కావలసిన ఏర్పాట్లు చూడమని నాకు చెప్పడం మొదలుపెట్టారు. వారందరికి మాయింటిలో భోజనాలు ఏర్పాటు చేసేవాడిని. ఆవిధంగా షిరిడీ వెలుపలినుంచి, ఇతర ప్రాంతాలనుంచి
వచ్చే భక్తులతో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి.
వారు కూడా నన్ను తమతమ యిళ్ళకు రమ్మని ఆహ్వానిస్తూ ఉండేవారు. అవిధంగా నేను వారి యింటికి వెడుతూ ఉండేవాడిని. నేను ఎవరింటికి వెళ్ళినా ముందుగా బాబా అనుమతి తీసుకున్న
తరవాతనే వెళ్ళేవాడిని. ఆవిధంగా పట్టణాలకు వెళ్ళినపుడు
నాకింకా ఎంతోమందితో పరిచయాలు కలిగాయి. ఇంకా
విచిత్రమయిన విషయం ఏమిటంటే నాకు కొత్తగా పరిచయమయినవారితో నేను బాబా గురించి మాట్లాడిన
వెంటనే అవతలివారు కూడా బాబా విషయాలపై మంచి ఆసక్తిని కనబరచి సమ్మోహితులయేవారు. ఆవిధంగా ప్రజలను ఆకర్షించడానికి బాబా నన్ను ఉపయోగించుకున్నారు.”
అయితే పైన చెప్పిన కధ
పాతదే అయివుండచ్చు. ఆ కాలంలో మాధవరావు మంచి
యుక్త వయసులో ఉన్నాడు. ఏదేమయినప్పటికి కొన్నిసార్లు
బాబా ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు తన వద్దకు రావాలని కోరుకునేవారు. దానికోసమే ఆయన మాధవరావులాంటి వ్యక్తులని వినియోగించుకునేవారని
అర్ధమవుతుంది. చాలా సందర్బాలలో బాబా ఆవిధంగా
చెప్పినప్పటికి మాధవరావు బాబా వద్దకు భక్తులను తీసుకుని వచ్చేవాడు. అపుడు బాబా కోపాన్ని నటిస్తూ మాధవరావుని కొట్టబోతున్నట్లుగా
“వాడు నాదగ్గరకు మనుషుల్ని పంపిస్తున్నాడు” అనేవారు. కొంతసేపటి తరువాత ఆయన శాంతం వహించేవారు. భక్తులు మసీదుకు వచ్చినపుడు బాబా “శ్యామా, ఎవరో
వచ్చారు, వాళ్ళని కాస్త చూడు” అనేవారు.
మాధవరావు మంచి ఆరోగ్యంవంతుడే కాక బలమయినవాడు. ఏభక్తుడయినా జబ్బుపడి నీరసించి ఉన్నపుడు మాధవరావు
ఆభక్తుడిని తన వీపుమీద మోసుకొంటూ మసీదుకు తీసుకుని వచ్చేవాడు. ఒకసారి బాపూసాహెబ్ బుట్టీ టైఫాయిడ్ తో బాధపడుతున్నాడు. అపుడు బాబా మాధవరావుతో “నీ వీపుమీద మోసుకుంటూ అతనిని
మసీదుకు తీసుకొనిరా” అని పురమాయించారు. సాధారణంగా
అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులను తన వీపుమీద మోసుకొంటూ తీసుకొని రావడం మాధవరావు బాధ్యత.
సాయంత్రం వేళ బాబా తన
షికారు పూర్తయిన తరువాత మసీదుకు తిరిగి వస్తూ ఉండేవారు. ఆసమయంలో ప్రత్యేకంగా ముగ్గురు, నలుగురు భక్తులకి
తప్ప ఎవరినీ మసీదులోకి ప్రవేశించటానికి అనుమతినిచ్చేవారు కాదు. అటువంటి నియమనిబంధనలు ఉన్నా గాని మాధవరావుకి మాత్రం
ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు. అతను ఎప్పుడయినా సరే తన యిష్టప్రకారం మసీదులోకి వెళ్ళేవాడు,
వచ్చేవాడు. అంతేకాకుండా బాబాను ఏదయినా అడగదలచుకున్నా
అడుగుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి వేళకాని వేళలో
రాత్రి సమయాలలో మాధవరావు వెళ్ళినపుడు బాబా నరసింహావతారం ఎత్తీ ఉగ్రంగా ఊగిపోతున్నట్లుగా
నటించేవారు. కాని వెంటనే శాంతం వహించేవారు.
ఒకసారి తాత్యాసాహెబ్
నూల్కర్ షిరిడీలో ఉండగా బాగా జబ్బుపడ్డాడు.
అతని అంతిమక్షణాలు దగ్గరపడ్డాయి. ఆసమయంలో
అతనికి బాబా పాదతీర్ధం సేవించాలనే కోరిక కలిగింది. అపుడు సమయం రాత్రి గం. 1.00 – 1.30 అయింది. అంత మధ్యరాత్రివేళ బాబా దగ్గరకు వెళ్ళి ఆయన పాదతీర్ధం
తీసుకురావడానికి ఎవరు ధైర్యం చేయగలరు? మాధవరావు
లేచి పంచపాత్ర ఉధ్ధరిణి తీసుకుని మసీదుకు వెళ్ళాడు.
బాబా లేచి “ఎవరది?” అని గట్టిగా గర్జించారు.
“నేను, శ్యామాని” మాధవరావు
సమాధానమిచ్చాడు.
“ఇంత రాత్రివేళ వచ్చావా?”
అంటూ బాబా అతనిని కొట్టడానికి వస్తున్నట్లుగా నటించారు. మాధవరావు ఒక కాలు ముందుకు పెట్టి మసీదు మెట్లమీద
అలా నుంచుండిపోయాడు.
“తాత్యాసాహెబ్ ప్రాణాలు
పోయే దశలో ఉన్నాడు. అతను మీపాద తీర్ధం కావాలంటున్నాడు. దయచేసి వెంటనే యివ్వండి బాబా” అని మాధవరావు బ్రతిమాలాడు.
“ఇవ్వను” అన్నారు బాబా. మాధవరావు ధైర్యం చేసి ముందుకు రాబోయాడు. తాత్యాసాహెబ్ కూడా బాబాకు గొప్ప భక్తుడు. బాబా తనకాలి బొటనవ్రేలును అతనిముందుకు జరిపారు. మాధవరావు వెంటనే తన పంచపాత్రతో తెచ్చిన నీటిలో బాబా
కాలిబొటనవ్రేలును ముంచి తీసుకు వెళ్ళాడు.
బాబా పాదతీర్ధాన్ని తాత్యాసాహెబ్
నోటిలో పోసి అతని ఆఖరి కోరికను తీర్చాడు మాధవరావు.
బాబా కొంతమంది భక్తులకు
డబ్బు యిస్తూ వుండేవారు. కాని మాధవరావుకు మాత్రం
ఎప్పుడూ యివ్వలేదు. ఒకసారి షిండేసర్కార్ మాధవరావుకు
అయిదువేల రూపాయలు యిద్దామనుకొన్నాడు. కాని
బాబా యివ్వనివ్వలేదు. బాబా మాధవరావుకు ఎప్పుడూ
డబ్బు యివ్వనప్పటికీ అత్యంత ప్రేమను అందించారు.
కొంతమంది భక్తులు తాము
తెచ్చిన వస్తువులను బాబాకు యిచ్చి ఆయన పవిత్రం చేసిన తరువాత తిరిగి తీసుకునేవారు. వాటిని బాబా ఆశీర్వదించి యిచ్చిన ప్రసాదంగా భక్తులు
భావించేవారు. కాని చాలా సార్లు బాబా ఆవిధంగా
తెచ్చిన వారికి వారి వారి వస్తువులను వారికి తిరిగి యివ్వకుండా మాధవరావుకి యిచ్చి,
“దీనిని నీదగ్గర ఉంచుకో” అనేవారు. ఈవిధంగా
ఆయన మాధవరావుకు, విష్ణుసహస్రనామం, ఏకనాధ భాగవతం, రామలక్ష్మణ సీతారాముల చిత్రంతో ఉన్న
నాణెం, వెండిపాదుకలు, ఒక మట్టి విగ్రహం యిచ్చారు.
“శ్యామా, నా పూజామందిరాన్ని నిర్మించి, అందులో వీటినన్నిటినీ ఉంచు” అన్నారు.
ప్రతిరోజు మధ్యాహ్నం,
బాబా భక్తులందరూ నైవేద్యంగా సమర్పించిన వివిధరకాలయిన పదార్ధాలన్నిటినీ మిశ్రమంచేసి
మధ్యాహ్నం వేళ భిక్షగా అడిగిన కొంత మంది భక్తులకి
పంచేవారు.
వారిలో మాధవరావు కూడా ఒకడు. కాని అతనికి ఆ మిశ్రమాన్ని యిష్టపడడని ఊహించి, భక్తులందరూ
భోజనాలు ముగించి వెళ్ళిపోయేదాకా ఆగేవారు. అపుడు
బాబా ఒక ప్లేటునిండుగా మామిడిపండ్ల ముక్కలను మాధవరావుకు యిచ్చేవారు.
బాబా, మాధవరావు అడిగిన
కోరికలన్నిటినీ తీర్చారు. బాబా అతనికి ధనాన్ని
యివ్వకపోయినా, డబ్బువల్ల సమకూరే అన్ని సుఖాలను అందించారు. ధనరూపేణా చూసుకుంటే కష్టసాధ్యమయినటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాల
దర్శనాలను చేయించారు. మాధవరావు ఎటువంటి కష్టం
లేకుండా చార్ ధామ్, కాశీ, గయ, అయోధ్య, మధుర, గోకుల్, ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ, గిర్నార్,
యాత్రలన్నిటికీ వెళ్ళాడు. బాబా అనుగ్రహం వల్లనే
మాధవరావు ఈ యాత్రలన్నిటినీ చాలా సునాయాసంగా చేయగలిగాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment