25.07.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
మన సద్గురువయిన శ్రీ
సాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తుడయిన శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గురించి పూర్తిగా
తెలుసుకుందాము. మనకు తెలియని ఎన్నో విషయాలు
ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. బాబాకు శ్యామా
అంటే ఎందుకంత అభిమానమో ఈ వ్యాసమ్ చదివితె మనకర్ధమవుతుంది. ఈ వ్యాసం రెండవ భాగమ్ శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక
మే - జూన్ 2006 సంచికలో ప్రచురింపబడింది.. మరాఠీ మూలం
శ్రీమతి ముగ్ధా దివాద్కర్. ఆంగ్లంలోకి అనువాదమ్ శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్: ఆత్రేయపురపు
త్యాగరాజు
బాబా అనుగ్రహమ్ వల్ల నాకు మనవరాలు జన్మించింది. ఆ కారణంగా మూడు రోజులుగా ప్రచురించడమ్ కుదరలేదు. ఈ రోజు నాలుగవ భాగం ప్రచురిస్తున్నాను చదవండి.
మాధవరావు దేశ్ పాండే (శ్యామా) - 4 వ.భాగమ్
ఒకసారి బాబా ఆదేశానుసారం
మాధవరావు నాగపూర్ లో ఉన్న బాపూసాహెబ్ బుట్టీ దగ్గరకు వెళ్ళాడు. నాగపూర్ లో ఉండగా అతను నాగపూర్ కి దక్షిణం వైపున
ఉన్న శ్రీతాజుద్దీన్ బాబా దర్శనం చేసుకొన్నాడు.
నాగపూర్ నుంచి షిరిడీకి
వచ్చిన తరువాత జరిగిన సంఘటన.
అది సాయంసమయం. బాబా చుట్టూ ఎంతోమంది భక్తులు కూర్చుని ఉన్నారు. బాబా శ్యామాతో, “శ్యామారావ్ ఏమిటి? నువ్వు ఏఏ ప్రదేశాలు చూశావు?” అని ప్రశ్నించారు. “దేవా నేను నాగపూర్ వెళ్ళాను”. అని సమాధానమిచ్చాడు
శ్యామా.
“నువ్వు నాగపూర్ వెళ్ళావా? అయితే అక్కడ నాగపూర్ కి దక్షిణంగా ఉన్న బంగారపు
వృక్షాన్ని చూశావా?” అని అడిగారు బాబా.
మాధవరావు మంచి పరిశీలనా
దృష్టి, మంచి మేధస్సు కలిగినవాడవడం చేత బాబా ప్రశ్నలోని ఆంతర్యాన్ని వెంటనే గ్రహించాడు. బాబా బంగారు వృక్షం అని సంబోధించినది తాజుద్దీన్
బాబా గురించేనన్నది అర్ధం చేసుకొన్నాడు.
మాధవరావు వెంటనే “అవును
దేవా, నాగపూర్ పట్టణానికి దక్షిణంగా ఉన్న రాఘోజీ రాజె బోన్స్ లే గార్డెన్ లో ఉన్న తాజుద్దీన్ బాబాగారిని దర్శించుకున్నాను” అన్నాడు.
“ఆతరువాత ఎక్కడెక్కడి
ప్రదేశాలు చూశావు?” అడిగారు బాబా
“దేవా, నాగపూర్ నించి
నేను అమరావతి వెళ్ళాను. అక్కడికి బెట్ కెడ్
గావ్ నుండి నారాయణ్ మహరాజ్ గారు వచ్చారు. నేను
ఆయన దర్శనం కూడా చేసుకొన్నాను”
మాధవరావు బాబాతో హాస్యపూర్వకంగా
మాట్లాడుతూ ఉండేవాడు. అందువల్లనే అతను “ఏమిటి
దేవా ఎంతోమంది ప్రజలు నారాయణ మహరాజ్ దర్శనానికి వస్తూ ఉంటారని నీకు తెలుసు కదా!" ఎంతోమంది ప్రజలు అనే మాటను కాస్త వత్తి పలుకుతూ
అన్నాడు. తనన్న మాటలకు బాబా ఏమని సమాధానం యిస్తారా
అని ఆతృతగా చూస్తున్నాడు. బాబా కూడా అదేవిధంగా
మాధవరావుని ఆటపట్టిస్తూ ఉండేవారు. మొదట బాబా
అసలు సమాధానం యివ్వలేదు. మాధవరావు మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని పదే పదే అడగడం మొదలుపెట్టాడు.
ఆఖరికి 5 – 10 నిమిషాల తరువాత బాబా అతనిని అనునయిస్తూ ఈ విధంగా అన్నారు, “శ్యామా
నేను వివరించబోయేది ఈ విధంగా ఉంటుంది. ఏ తండ్రయినా
సరే అతని కొడుకుకే తండ్రి. ఏతండ్రయినా తన కొడుకుని కొట్టచ్చు, తిట్టచ్చు. కాని తండ్రికి మాత్రమే జాలి, సానుభూతి ఉంటాయి. ఇంకెవరికయినా అటువంటి భావాలు ఉంటాయా? నేను నీ తండ్రిని. మిగిలినవారితో నీకేమిటి అవసరం?”
అన్నారు.
ఇక్కడ బాబా మాధవరావు
ఒక్కడికే కాకుండా భక్తులందరికీ ఒక సందేశమిచ్చారు.
ఆయన ఇస్తున్న సందేశం ఏమిటంటే “ఎవరినీ దోషదృష్టితో చూడవద్దు (ఎవరిలోనూ తప్పులను
ఎంచవద్దు). సత్పురుషులలోని తప్పులను కనుగొనడానికి
ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఆయనపై స్థిరమైన విశ్వాసముంచాలి. ఇంతేకాకుండా యితరుల ఎడల వినయంగా ఉండాలి.”
ఈ సందర్భంగా బాబా ఒక
ముఖ్యమయిన సందేశాన్ని పదేపదే చెప్పారు. “ప్రతివారు
తన యిష్టదైవమందు భక్తి కలిగి ఉండాలి”.
బాబా ఒక వ్యక్తికి ఏదయినా
గుణపాఠం చెప్పదలచుకున్నపుడు ఆవ్యక్తిని తన శరీరాన్ని మర్దనా చేయమని చెప్పేవారు. తాత్యాబా పాటిల్, మహదు ఫాస్లే, మాధవరావు దేశ్ పాండే,
అన్నాసాహెబ్ చించణీకర్, మావిసీబాయి లాంటివారి చేత గంటలతరబడి బాబా తమ శరీరాన్ని మాలిష్ చేయించుకునేవారు. వారు బాబా వీపుని బాగా మర్ధనా
చేసి ఆయన శరీరాన్ని బాగా మాలిష్ చేసేవారు.
ఆవిధంగా వారు తమ శరీరం చమటలు పట్టి యిక ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడేంత
వరకు శ్రమించేవారు. అప్పటికీ బాబా “ఇకచాలు”
అనేవారు కాదు. ఆఖరికి తమంతట తామే యిక ముగించేవారు.
అనేక రకాలయిన రోగాలను
పరీక్షించి అది ఏరోగమో గుర్తించడంలో మాధవరావు మంచి సమర్ధత, నైపుణ్యం కలవాడు. ఎన్నో రకాల మందుల గురించి వాటి గుణగణాల గురించి
అతనికి బాగా తెలుసు. ‘నాడీపరీక్ష’ చేసి వ్యాధిని
నిర్ధారణ చేయడంలో బహునేర్పరి.
ఈ పరిజ్ఞానం
అతనికి సహజంగా అబ్బింది. ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. అతని వద్ధ ఎప్పుడూ స్వదేశీమందులు, విదేశీమందులు
స్టాకు ఉండేవి. రోగులకు వైద్యం చేసి డబ్బు
సంపాదిస్తూ ఉండేవాడు. ఏడాక్టరూ నయంచేయలేక చేతులెత్తేసిన
జబ్బులను కూడా తన మందులతో తగ్గించాడు. ఆవిధంగా
ఎంతోమంది రోగులకు వైద్యం చేసి నివారణ కావించాడు.
ప్రజలందరికి అతనికి యింత పరిజ్ఞానం ఏవిధంగా అబ్బిందని ఆయనను కుతూహలంగా అడుగుతూ
ఉండేవారు. శ్రీసాయిబాబాయే తనకు ఏఔషధాన్ని వాడాలో
చేప్పేవారని సమాధానమిచ్చాడు. “నేను మనసులోనే
సాయిబాబాతో మాట్లాడుతూ ఉండేవాడిని ఆవిధంగా నాదేవుడు ఏరోగానికి ఏమందు వాడాలో సూచించేవాడు.”
అంతేకాదు, రోగులకు మందులిచ్చేటప్పుడు
ఆమందులలో ఊదీని కూడా మిశ్రమం చేసి యిచ్చేవాడు.
దానికి తోడు మాటిమాటికీ ఔషధాలు, రోగాలకి సంబంధించిన పుస్తకాలను కూడా పరిశీలిస్తూ
ఉండేవాడు. పురాణిక్ (పన్వేల్, ముంబాయి), సాందు,
(చెంబూర్) ఫ్యాక్టరీలలో తయారయిన మందులనే ఉపయోగించేవాడు. కొన్ని మందులను తనే స్వయంగా తయారు చేసేవాడు.
మాధవరావు మంచి వివేకం,
వ్యవహార దక్షత కలవాడు. బాబా అతనికి ఏవిధంగాను
ధనం యివ్వలేదు. అతనికి నిమోన్ గ్రామంలో కొంత
పొలం ఉంది. ఆపొలంమీద అతను చేసే వైద్యం మీద మాత్రమే
ఆదాయం లభిస్తూ ఉండేది. ఆవిధంగా వచ్చే ఆదాయాన్ని
చాలా నేర్పుగా ఖర్చుపెట్టేవాడు. అంతే కాదు,
బాబాను దర్శించుకోవడానికి వచ్చే సందర్శకుల అవసరాలను కూడా బాబా ఆదేశాలకనుగుణంగా ఖర్చు
పెట్టేవాడు.
ఒకసారి మాధవరావు స్నానం
చేసిన తరువాత గదిలో ఒక మూలగా ఉన్న దేవుని పూజాసామాగ్రిని తీస్తున్నాడు. అకస్మాతుగా అక్కడే మూలలో దాక్కున్న ఒక పాము అతనిని
కాటువేసింది. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల
ముందుగానే బాబా అతనికి ఒక హెచ్చరిక చేశారు, “శ్యామా? జాగ్రత్తగా ఉండు. ఏసందులలోను, మూలల్లోను చేయిపెట్టకు జాగ్రత్త” అని
ముందుగానే హెచ్చరించారు. పాము విషం శరీరంలోకి
ఎక్కుతున్న కొద్దీ మాధవరావు చాలా భయపడిపోయి ఆందోళన పడసాగాడు. అందరూ అక్కడికీ యిక్కడికీ పరుగులు పెట్టసాగారు. మాధవరావుని విఠోబా ఆలయానికి తీసుకుని వెళ్ళండి అంటూ
అందరూ చాలా కంగారుగా చెప్పారు. మాధవరావుకు
మూర్ఛలు వస్తున్నాయి. శరీరం బిగుసుకు పోతూ
ఉంది. కాని అటువంటి స్థితిలో ఉన్నా, మాధవరావు,
“నన్ను వెంటనే మసీదుకు తీసుకుని వెళ్ళి నాదేవుని ముందు ప్రవేశ పెట్టండి” అన్నాడు.
అందరూ కలిసి అతనిని మసీదులోని
మండపానికి తీసుకుని వచ్చారు. కాని బాబా మాధవరావుని
చూడగానే గట్టిగా అరుస్తూ.
“ఖబడ్దార్, పైకి ఎక్కవద్దు. ఇప్పుడే వెంటనే కిందికి పో దిగిపో. నేను చెప్పింది వినకపోతే నిన్ను చిన్న చిన్న ముక్కలుగా
ఆవగింజలలా చేసేస్తాను” అని అన్నారు. బాబా మాటలు విని మాధవరావు ఖిన్నుడయిపోయాడు. చాలా భయపడ్డాడు. కూడా వచ్చినవారందరూ చాలా ఆశ్చర్యపోయారు. మాధవరావు ఏడవడం మొదలుపెట్టాడు. మాధవరావుకి బాబా ఆవిధంగ ఎందుకలా ప్రవర్తిస్తున్నారో
ఏమీ అర్ధం కాలేదు. ప్రతిరోజూ తను ఎప్పుడు పడితే
అప్పుడు ఏసమయంలో మసీదుకు వెళ్ళినా బాబా ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. అటువంటిది, ఇపుడు తాను చావుబ్రతుకులలో ఉంటే బాబా
యిలా కఠినహృదయంతో రావద్దు పో పొమ్మని ఎందుకని అంటున్నారు? ఈవిధంగ మాధవరావు ఆలోచిస్తున్నాడు. కాని అక్కడున్నవారెవరూ మాధవరావుతో సహా బాబా హెచ్చరికలోని
ఆంతర్యాన్ని గ్రహించుకోలేకపోయారు. వాస్తవానికి
బాబా చేసిన హెచ్చరిక మాధవరావుని ఉద్దేశించినది కాదు. అతని శరీరంలో పైకి ఎక్కుతున్న పాము విషాన్ని వెంటనే
దిగిపొమ్మని చేసిన హెచ్చరిక.
మాధవరావుని మోసుకునివచ్చిన
వారందరూ అతనిని యింటికి తీసుకుని వెళ్ళారు.
బాబా ఆదేశించిన ప్రకారం మాధవరావుని రాత్రంతా నిద్రపోకుండా మెలకువగానే ఉండేటట్లు
కాపలా కాసారు. ఉదయానికల్లా మాధవరావుకి స్వస్థత
చేకూరింది. కాని, ఆతరువాత రెండు మూడు నెలల
వరకు పాము కరిచిన చోట అతని వేలు, నల్లగాను-నీలంగాను అయిపోయింది. పాము కాటు కారణంగా అతను కొంత కాలంపాటు ఎసిడిటీతో
బాధపడ్డాడు. కాని బాబా ఉఛ్ఛరించిన “పైకి ఎక్కవద్దు,
కిందకు దిగు, పో” అన్న మంత్రబలం వల్లనే అతను బ్రతికాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
chennai shirdi tour package by flight
chennai to shirdi tour package flight
Post a Comment