02.08.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు అధ్భుతమైన సాయి లీలలు కొన్నింటిని మనమందరం పంచుకుందాము.
విశాఖపట్నంలో ఉండే శ్రీరామకృష్ణ
గారు (ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు) వారం రోజుల క్రితం నాకు వాట్స్ అప్ కాల్ ద్వారా
వివరించిన బాబా లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను. ఆయనకు ఈ లీల చీరాల వద్ద ఈపూరుపాలెంలో ఉంటున్న శ్రీ మన్నవ సత్యంగారు వాయిస్ కాల్ ద్వారా వివరించారు.
శ్రీ మన్నవ సత్యంగారికి
ఫోన్ చేద్దామని నా దగ్గర అంతకు ముందు వున్న లాండ్ లైన్ నెంబర్ కి ఫోన్ చేసాను. కాని నంబరు సరి చూసుకోమని వచ్చింది. ఇంటిలో ఉన్న పుస్తాకాలను వెతకగా ఎలాగయితేనేం ఆయన
సెల్ నంబరు దొరికింది. ఆయనకు ఈ లీల వాట్స్
ఆప్ లో పంపించాను. ఈ రోజు ఆయన ఫోన్ చేసి తను
కూడా ఈ లీల ఒక సాయి భక్తుని ద్వారా విన్నానని బ్లాగులో ప్రచురించమని చెప్పారు.
ఈ అధ్బుతమయిన లీల ఈ రోజు
మన సాయిభక్తులందరితోను పంచుకుంటున్నాను. ఈ
లీల ద్వారా ఎన్ని కష్టాలలో ఉన్నా బాబామీద భక్తిని వీడకుండా శ్రధ్ధ సబూరీతో ఉండాలనే
విషయాన్ని గ్రహించుకోవచ్చు.
విశాఖపట్నంలో ఉన్న మామరదలికి
కొన్ని నెలల క్రితం సాయిబానిస గారిచే ప్రచురింపబడ్డ ఆయన పుస్తకాలు ఇచ్చాను. కొన్ని పుస్తకాలను కూడా రామకృష్ణగారికి ఇమ్మని చెప్పాను. కాని సమయం దొరకక ఆయనకి పుస్తకాలను అందచేయలేకపోయారు. ఒకరోజు ఎందుకనో ఆయనకి పుస్తకాలను అందచేద్దామని ఆయన
ఇంటికి వెళ్ళినపుడు ఆయన అమెరికా వెళ్ళాడానికి సిధ్ధంగా ఉన్నారు. ఆసమయంలో ఆయనకి ఈ పుస్తకాలు అందాయి. ఆయన ఎంతగానో సంతోషించి ఈ క్రింద వివరించిన లీలను
చెప్పారు. ఆవిషయం మా మరదలు నాకు ఫోన్ లో వివరించారు. నేను మళ్ళీ ఆయనను వాట్స్ ఆప్ ద్వారా అడిగి ఆయన చెప్పినలీలను
ఆయన మాటలలోనే వివరిస్తున్నాను (త్యాగరాజు)
శ్రీరామకృష్ణ గారు అబ్బాయికి ఉద్యోగం ఇంకా రాలేదని ఎంతో బాధపడుతూ ఉన్నారు. వారి అబ్బాయి అమెరికాలో ఉంటాడు. పీ హెచ్ డి అయింది. ఇంకా ఉద్యోగం లేకపోవడం వల్ల చాలా బెంగ పెట్టుకున్నాడు.
శ్రీరామకృష్ణ గారికి శ్రీమన్నవ సత్యంగారితో పరిచయం ఉంది. కాని గత మూడు సంవత్సరాలుగా ఆయనతో ఫోన్ ద్వారా కూడా మాట్లాడుకోవడం జరగలేదు. ఆయన తన కుమారుని ఉద్యోగం కోసం బెంగపెట్టుకుని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఒక రోజు రాత్రి 11 గంటల సమయంలో అనుకోకుండా శ్రీమన్నవ సత్యంగారినుంచి అందులో ఈ క్రింద వివరించిన లీల వాయిస్ కాల్ లో వచ్చింది.
శ్రీరామకృష్ణగారు చెప్పినది యధాతధంగా మీముందు ఉంచుతున్నాను.
పేలాలు
"ఇది బహుశా ఒంగోలులో జరిగిందనుకుంటాను. వారి పేరు సరిగా గుర్తు లేదు. ఇంటిపేరు శ్రీరంగంవారు అని గుర్తు. ఆయన పేరు గుర్తు లేదు. వారి కుటుంబం భర్త, భార్య, ఇద్దరు అమ్మాయిలు. వారు పాపం చాలా బీదరికం అనుభవిస్తున్నారు. పెద్దమ్మాయి ప్రైవేట్ గా చిన్న ఉధ్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి 10వ. తరగతి పాసయి ఇంట్లోనే ఖాళీగా ఉంటోంది. ఇంటి పెద్ద యాయవారం తెస్తే తప్ప తినడానికి కూడా
ఏమీ లేని పరిస్థితి. ఆ యింట్లోనివారందరూ బాబా
భక్తులే. వారి యింటిలో కనీసం బాబా విగ్రహం
కూడా లేదు. బాబా కాలండరు మాత్రమే ఉంది. ఆ కాలండరుకే ప్రతిరోజు పూజ చేసుకుంటు ఉంటారు. వారు ఏది తిన్నా ముందుగా కొంత తీసి బాబాకు పెట్టి
మిగిలినది తినేవారు. ఆవిధంగా తీసిన కొద్ది
ఆహారాన్ని ఆవుకు గాని మరేయితర ప్రాణికి గాని బయట పెడుతూ ఉంటారు. వారందరికి బాబా మీద బాగా గురి, నమ్మకం.
ఒకరోజు వారి యింటిలో
మరునాడు వండుకోవడానికి కూడా బియ్యం లేని పరిస్థితి. ఆరోజు రాత్రి వారింటికి ఒకావిడ వచ్చి, మా యింటికి
రోజూ వచ్చే ఆవిడ రాలేదు, ఒక బస్తాడు పేలాలు చేసి పెట్టాలి, మీరు ఎంత యిమ్మంటే అంత యిస్తానని
చెప్పింది. ఈవిడ మీ దయ అని చెప్పింది.
మరుసటిరోజు ఆవిడ యింటికి
వెళ్ళి బస్తాడు పేలాలు చేసి యిచ్చింది. ఆ యింటి
యజమానురాలు 10 కేజీల పేలాలు వేయి రూపాయలు కూలీగా యిచ్చింది. భర్త బయటకు వెళ్ళి ఎంత ప్రయత్నించినా ఏమీ సంపాదించుకుని
రాలేకపోయాడు. ఈవిడకు లభించిన పది కేజీల పేలాలను
పిండి చేసుకుని నలుగురూ పది రోజులపాటు తిన్నారు.
పదవరోజున ముందు వచ్చినావిడే
మాయింట్లో వంట చేస్తారా అని అడిగింది. ఎంతకావాలని అడిగితే మీదయ అని చెప్పింది. అప్పుడావిడ నెలకు మూడువేల రూపాయలను ఇస్తానని వంటకు కుదుర్చుకుంది.
శ్రీరంగం ఆవిడ రాత్రికి యింటికి తిరిగి వచ్చింది.
ఆ రోజు భర్త ఒక బియ్యం మిల్లుకు
వెళ్ళి కాసిని బియ్యం కావాలని అడిగాడు. మిల్లు
యజమాని ఉద్యోగం ఏమీ చేసుకోకూడదా అలా బియ్యం అడుక్కోకపోతే అని అన్నాడు. ఉద్యోగం ఎక్కడా దొరకలేదని చెపితే , మిల్లు యజమాని
అయితే మా మిల్లులో పద్దులు రాయగలవా నెలకి ఒక బస్తా బియ్యం, రెండువేల రూపాయలు ఇస్తానని
చెప్పాడు. భర్త ఆనందంగా ఒప్పుకుని ఇంటికి తిరిగి
వచ్చాడు.
భార్యా భర్తలిద్దరూ ఇంటికి
వచ్చి ఆనందంగా పిల్లలిద్దరికీ ఈ విషయాలన్నీ చెప్పారు. ఆరోజు పెద్దమ్మాయి ఉద్యోగానికి వెళ్ళింది. చిన్నమ్మాయి ఇంటిలోనే ఉంది. అప్పుడు చిన్నమ్మాయి ఆరోజు జరిగిన సంఘటన తల్లికి
ఈ విధంగా చెప్పింది.
“ అమ్మా, నువ్వు ఒకాయనకు
పది కేజీల పేలాలు ఇచ్చావుట. ఇప్పుడు ఆయన వద్ద
మనకు తిరిగి పేలాలు ఇవ్వడానికి లేవని చెప్పి పది కేజీల బియ్యం ఇచ్చి వెళ్ళారు” అని చెప్పింది. అప్పుడు తల్లి నేనెవరికీ పేలాలు ఇవ్వలేదు అని చెప్పింది.
వచ్చినానయన ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పింది. అప్పుడావిడకు అర్ధమయింది. పది కేజీల బియ్యాన్ని తన చిన్నమ్మాయికి ఇచ్చినది
ఎవరో కాదు బాబా అని అర్ధమయింది. అప్పుడు తన
కుమార్తెతో “ఎంత అదృష్టవంతురాలివే, స్వయంగా బాబాని చూసావు. ఎంత పుణ్యం చేసుకున్నావు అని బాబాకి దణ్ణం పెట్టుకుంది.
ఇంకా విచిత్రమేమిటంటే
వారు ఒక అద్దె యింటిలో ఉంటున్నారు. ఆ యింటి
యజమాని కూడా సాయి భక్తుడే. ఆయన సాయిబాబా మందిరాన్ని
కూడా నిర్మించారట. వీరికి జరిగిన ఈ అనుభవాన్ని
విని ఆయన వారినుంచి ఇంటి అద్దె కూడా తీసుకోవడం మానేసారట.
శ్రీ రామకృష్ణగారు చెప్పిన తమ స్వంత అనుభవాలు :
బాబా నన్ను తన భక్తునిగా చేసుకొన్న సంఘటన
“నేను సివిల్ యింజనీరుగా పనిచేసేవాడిని. మొదట్లో నేను బాబా భక్తుడిని కాదు. బాబాని కూడా పూజించేవాడిని కాదు. నా భార్యకు మాత్రం బాబా అంటే భక్తి. ఒక రోజు నా స్నేహితుడు తను కొత్తగా నిర్మించుకున్న యింటిలో మార్కింగ్ చేయటానికి (ఇంటిలోపల కప్ బోర్డ్స్ ఏ విధంగా అమర్చుకోవాలి వాటి గురించి మార్కింగ్) నన్ను స్టీల్ ప్లాంట్ దగ్గర అచ్యుతాపురానికి తీసుకుని వెళ్ళాడు. పని పూర్తయిన తరువాత మేము కారులో బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తరువాత మైన్ రోడ్డుకు రావడానికి కుడివయిపు ఉన్న సందులోనుంచి తిరగాలి.
మేము బయటకు స్టీల్ ప్లాంటుకు సంబంధించిన గేటులోనుంచి బయటకు వచ్చాము. అక్కడ గేటు బయట ఉన్న దారిలో ఎడమవయిపు ఒక వ్యక్తి బాబా ఫోటోలు అమ్ముతూ కనిపించాడు. అతని వద్ద బాబా ఫోటో ఒక్కటి మాత్రమే ఉంది. నాకు బాబా అంటే ఇష్టం లేకపోయినా భార్య కోసం కొందామని కారును ఎడమ ప్రక్కకు తిప్పాను. ఎడమప్రక్కనుంచి మైన్ రోడ్డుకు వెళ్ళడానికి దారి లేదు. ఫొటో కొందామని ఎడమ ప్రక్కకు కారు తిప్పగానే కుడివయిపు ఉన్న రోడ్డునించి ఒక లారీ వచ్చి రోడ్డుప్రక్కన ఎడమవైపున ఉన్న కరెంటు స్థంభాన్ని ఢీకొంది. కరెంటుతీగలనుంచి మంటలు వచ్చాయి. మేము మైన్ రోడ్డుకు వెళ్ళడానికి కుడివయిపు తిరిగి ఆదారిలోనే వెళ్ళి ఉంటే ఆ లారీకి కరెంటు స్థంభానికి మధ్య మా కారు నలిగి ఉండేది. తరువాత ఫోటొ అమ్మే అతని వద్దకు వెడదామని చూస్తే అక్కడ అతను లేడు. ఫోటో లేదు. అతను ఎక్కడికో వెళ్ళిపోవడానికి మరొక దారి లేదు. అతను గేటు బయట ఒక పక్కగా ఉన్నాడు . గేటులోనుండి లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఆస్కారం లేదు. అతను వెళ్లవలసి వస్తే కుడివయిపు ఉన్న రోడ్డు మీదుగానే మేమున్న దారిలోనుంచే వెళ్లాలి. ఇంతలో అతను మాయమవ్వడానికి ఎటువంటి దారి లేదు.
అప్పుడు నేను అనుకున్నాను బాబాయే ఆరూపంలో వచ్చి మమ్మల్ని ఆ ప్రమాదం బారినుంచి కాపాడారని. ఆరోజునుండి నేను బాబా భక్తునిగా మారిపోయాను.
ఆయన చెప్పిన మరొక లీలః
మీ బాధ్యతలన్నీ నావే
“10 సంవత్సరాల క్రితం నేను మా అబ్బాయిని తీసుకురావడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. మా అబ్బాయి చెన్నై నుండి విశాఖపట్నం వచ్చే రైలులో వస్తున్నాడు. రైలు కోసం ఎదురు చూస్తూ బెంచీమీద కూర్చుని ఉన్నాను.
ఇంతలో ఒకాయన పరిగుత్తుకుంటూ వచ్చి ఏమండి హౌరా చెన్నై మైల్ వెళ్ళిపోయిందా అని అడిగాడు. నేను చెన్నై వెళ్ళి మా అమ్మాయిని తీసుకురావాలి అని చెప్పాడు. హౌరా చెన్నై మైల్ వెళ్ళిపోయిందని చెప్పాను. అప్పుడాయన కళ్ళనీళ్ళ పర్యంతమయాడు. మా అల్లుడు పనిమీద ఇంకొక ఊరు వెళ్ళవలసి వచ్చింది. నన్ను చెన్నై వచ్చి అమ్మాయిని తీసుకువెళ్లమని చెప్పాడు. ఇప్పుడు నేనేమి చేయాలో నాకు అర్ధం కావటం లేదు అని బాధపడుతూ కూర్చున్నాడు. అప్పుడు నేను మీరేమీ బాధ పడకండి. అన్నిటికి బాబాయే ఉన్నాడు. బాబా తనని నమ్ముకున్నవాళ్ళని మోసం చేయడు. స్థిమితంగా బాబాను స్మరిస్తూ కూర్చోండి అని ఆయనకు ధైర్యం చెప్పాను. కాని పాపం ఆయన చెన్నై వెళ్ళి అమ్మాయిని ఎలా తీసుకురావాలా అని దిగాలు పడుతూ కూర్చున్నాడు. ఇంతలో చెన్నైనుండి హౌరా మైల్ వచ్చింది. అందులోనుంచి మా అబ్బాయి దిగుతూ ఉంటే నేను చేయి ఊపాను. నాప్రక్కనే ఉన్నాయన కూడా చేయి ఊపసాగాడు. నేను ఆశ్చర్యంగా మీకు మా అబ్బాయి తెలుసా అన్నాను. మీ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. అక్కడ ఒకతని వెనకాల మా అమ్మాయి ఉంది. మా అమ్మాయిని చూస్తూ చేయి ఊపాను అన్నాడు. ఇంతలో మా అబ్బాయి నా దగ్గరకు రావడం మా అబ్బాయి వెనకాలే వాళ్ళమ్మాయి రావడం జరిగింది. అసలు విషయమేమిటంటే ఆయన అల్లుడు స్టేషన్ లో అమ్మాయిని దిగబెట్టి రైలులో విశాఖపట్నం వచ్చే వారు ఎవరో తెలుసుకుని మా అబ్బాయికి అప్పచెప్పాడట. అప్పుడు నేనాయనతో అన్నాను చూసారా బాబా తనని నమ్ముకున్నవారిని మోసం చేయడని. ఆయన కృతజ్ఞతతో బాబాకు అనేక నమస్కారాలను తెలియచేసుకున్నారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment