29.08.2018 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు అమర్ నాధ్ యాత్రకు బాబా ఏవిధంగా అనుమతి ప్రసాదించారో, యాత్ర మధ్యలో ఏ
విధంగా సహాయపడ్డారో ప్రచురిస్తున్నాను. సాయి భక్తులయిన డా. విజయ కుమార్ గారు బాబా
సహాయంతో తాను ఏవిధంగా యాత్రను పూర్తి చేసారో కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఈ రోజు
ఆయన అనుభవమ్ మనందరి కోసమ్. ఆంగ్లంలో వ్రాసిన ఆయన అనుభవమ్ సాయిలీల.ఆర్గ్
2017 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా (అమెరికా) ఫోన్ : 1571 594 7354
అమర్ నాధ్ యాత్ర - బాబా అనుమతి
డా. విజయ కుమార్
అసిత – గిరి – సమంస్యాత్ కజ్జలం – సింన్ధు – పాత్రే
సుర - తరువర - శాఖాలేఖినీ పత్రముర్వీ I
లిఖిత యది గృహీత్వా శారదా
సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం నయాతి II
తదపి తవ గుణానామీశ పారం నయాతి II
శివ మహిమ్నా స్తోత్రం - 32 శ్లో.
పరమేశ్వరా
! సరస్వతీదేవి సముద్రమును సిరా పాత్రగను, కాటుక కొండను మసిగను (సిరాగాను) కల్పవృక్షము
యొక్క కొమ్మను లేఖిని (కలము) గను భూమిని పత్రముగను చేసికొని నీ గుణముల మహత్త్వములను
గూర్చి నిరంతరము సర్వకాలము (ఎంతకాలము) వ్రాసినను ఆ మహిమల అంతును పూర్తిగా కనుకొనలేము.
నా గదిలో గోడమీద చాలా సంవత్సరాలుగా అమర్ నాధ్ లోని మంచు శివలింగం ఫొటో ఉంది. నేను ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకు యాత్రలు చేసాను. భారత దేశంలో కూడా అన్నిప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుందామన్నదే నా జీవిత లక్ష్యం. నేనెప్పుడూ కాశ్మీర్ కు వెళ్లలేదు. కనీసం ఈ జన్మలోనయినా నేను అమర్ నాధ్ యాత్రకు వెళ్లగలనా, అది నాశక్తికి మించిన భారమేమో అని అనిపిస్తూ ఉండేది. అమర్ నాధ్ గుహకు కాలినడకన వెళ్ళడమంటే చాలా శ్రమతో కూడుకొన్నదని, అంతేకాకుండా కాశ్మీర్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎపుడు ఏవిధంగా ఉంటాయో చెప్పలేమని నాకు కొంతమంది చెప్పారు.
ఫిబ్రవరి,
2015 వ.సంవత్సరంలో నా గురుబంధువులయిన చిదంబర్ భట్, సుబ్రహ్మణ్య భట్, నారాయణ భట్ ఈ ముగ్గురు
భట్ లు నాకు శ్రీసాయి స్పిరిట్యువల్ సెంటర్ బెంగళూరులో కలిసారు. వారు చల్లకెరె సోదరులతో కలిసి అమర్ నాధ్ యాత్రకు
వెడుతున్నామని చెప్పారు. అప్పటికి నావయస్సు
65 సంవత్సరముల పైనే ఉండటం వల్ల అమర్ నాధ్ యాత్ర చాలా కష్టంతో కూడుకున్నదని నేను రాలేనని
నా అశక్తతను వెల్లడించాను. “మనం హెలికాప్టర్
లో వెడదాము” అని చిదంబర్ నవ్వుతూ అన్నాడు.
బహుశ సాయిబాబా ప్రేరణవల్లనే కావచ్చు నర్మద నుంచి నాకు ఆక్షణంలోనే ఫోన్ వచ్చింది. 2015 జూలై లో జరిగే అమర్ నాధ్ యాత్రకు నన్నుకూడా
రమ్మని ఆమె నన్ను ఒప్పించింది. ఆ విధంగా శ్రీసాయినాధులవారు,
శ్రీ నరసింహస్వామీజీ, శ్రీ రాధాకృష్ణ స్వామీజీ ఈ ముగ్గురివల్ల నాకు యాత్రకు వెళ్ళమన్నట్లుగా
గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఇది
నాకు ఈ జన్మలో వచ్చిన సదవకాశంగా భావించి “నేను కూడా మీతో వస్తాను” అని చెప్పాను. నేను వెంటనే తీసుకున్న నిర్ణయానికి భట్ లు ముగ్గురూ
చాలా సంతోషించారు. విమాన టిక్కెట్లు బుక్ చేయడం,
భోజనవసతులు, హెలికాప్టర్ సర్వీసుతో సహా అన్నీ తానే చూసుకుంటానని నర్మద నాకు మాట ఇచ్చింది.
కాశ్మీర్
అంటే నాదృష్టిలో అది పరమ శివునియొక్క దివ్య ధామం.
కాశ్మీర్ జ్ఞాన సముపార్జనకే కాక వేదాంతపరంగాను , కవితలకి, సంగీత సాహిత్యాలకి
నెలవు. జవహర్ లాల్ నెహ్రూ తన ఆత్మకధలో కాశ్మీర్
ను ‘భూతలస్వర్గం’ గా అభివర్ణించారు. ఆరోజు, మధ్యాహ్నం నేను సిస్టర్ నివేదిత రచించిన
పుస్తకం ‘The Master As I Saw Him’ చదివాను. అందులో
స్వామి వివేకానంద చెప్పిన మాటలు “ఈ గుహ మొట్టమొదటిసారిగా ఎలా కనుగొనబడిందో నేను ఊహించగలను. ఒక వేసవికాలంలో కొంతమంది గొఱ్ఱెలకాపరులు తమ తప్పిపోయిన
గొఱ్ఱెల మందను వెదకుతూ ఈ మంచు శివలింగం ఉన్న గుహకు అనుకోకుండా వచ్చి శతాబ్దాల తరబడి
ఆయనపై పడుతూ ఉన్నటువంటి మంచు స్పటికాలను చూసి అబ్బురపడి ఉంటారు”
(స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత వ్రాసిన 'The Master As I Saw Him' pdf మీరు గూగుల్ లో వెదకి పుస్తకం మొత్తం చదువవచ్చును.... త్యాగరాజు)
నాబాల్యస్నేహితుడు
రామస్వామి గొప్ప సంస్కృత పండితుడు. ఈ అమర్
నాధ్ గుహ వేల సంవత్సరాలనుంచి హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమని ఈ విషయం సంస్కృత
ప్రాచీన గ్రంధమయిన ‘రాజతరంగిణి’ లో కూడా ఉదహరింపబడిందని నాకు రామస్వామిగారు చెప్పారు. 400 సంవత్సరాల క్రితం మాలిక్ అనే ఒక ముస్లిమ్ గొఱ్ఱెల
కాపరి ఈ గుహను కనుగొన్నాడనే విషయాన్ని ముస్లిమ్ లు చెప్పుకుంటారని కూడా చెప్పారు. హిందూ ఇతిహాసాల ప్రకారం పూర్వకాలంలో కాశ్మీర్ లోయ
ఒక పెద్ద సరస్సు. కశ్యపమహాముని ఎన్నో నదులు,
చిన్న చిన్న కాలువల ద్వారా మొత్తం నీటినంతటిని పారింపచేసేసాడు. ఆవెంటనే భృగు మహర్షి హిమాలయాల యాత్రకు వెడుతూ
మొట్టమొదటిసారిగా అమర్ నాధ్ గుహను దర్శించుకున్నాడు. ఈ గుహకు సంబంధించి ఎన్నో గాధలున్నాయి.
పార్వతీదేవి పరమ శివుడిని, “నాధా, మీరు మెడలో ‘ముండమాల’ ను (అనగా కపాలాల దండ) ఎప్పటినుండి ధరించడం మొదలుపెట్టారు. దానిని ధరించడానికి గల కారణం ఏమిటి ?’ అని ప్రశ్నించింది. అపుడు పరమశివుడు “నీవు మరణించినపుడెల్లా నీ ఒక్కొక్క
కపాలాన్నీ ఈ మాలలో కలుపుతూ ఉంటాను” అని సమాధానమిచ్చాడు. “మీరు ఎప్పటికీ మరణమనేదే లేని అమరులు కదా, మరి నాకే
ఎందుకని ఈ జనన మరణాలు” అని పార్వతీదేవి అడిగింది.
అమరత్వం
గురించిన రహస్యం తెలుసుకోవాలంటే నువ్వు అమరకధని వినాల్సిందే అన్నాడు శివుడు. పార్వతికి ఆ అమరకధ యొక్క పరమరహస్యాన్ని వివరించడానికి
ఏప్రాణి సంచరించని నిర్జనప్రదేశాన్ని వెతుకుతూ చివరికి అమర్ నాధ్ గుహకు తీసుకొని వెళ్ళాడు
శివుడు. పరమశివుడు నందిని పహల్ గావ్ వద్ద,
తన శిరసుపైన ఉండే చంద్రవంకను, చందన్ బాడి దగ్గర విడిచిపెట్టాడు. శేష్ నాగ్ సరస్సు ఒడ్డున తాను మెడలో ధరించే సర్పాన్ని,
తన పుత్రుడయిన గణేషుడిని మహాగుణం పర్వతం వద్ద, పంచభూతాలయినటువంటి భూమి, నీరు, అగ్ని,
వాయువు, ఆకాశం వీటిని పంచతరణి వద్ద వదలిపెట్టాడు.
వీటన్నిటినీ వదలిపెట్టిన తరువాత పరమశివుడు పవిత్రమయిన అమర్ నాధ్ గుహలోకి పార్వతిని
తీసుకుని వెళ్ళి అక్కడ ఆమెకు అమరత్వం గురించిన రహస్యాన్ని వివరించాడు.
ఎన్ని
జాగ్రత్తలు తీసుకున్న దేవతలకు కూడా కొన్ని కొన్ని తప్పవు. అనుకున్నదేదీ ఖచ్చితంగా జరుగదు. పార్వతీదేవికి పరమ రహస్యాన్ని వివరించే సమయంలో దానిని
ఎవ్వరూ వినకుండా పరమశివుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కాని, యాదృచ్చికంగా ఆగుహలోనే నివాసముంటున్న పావురాల
జంట ఆరహస్యాన్ని ఆలకించి అమరత్వాన్ని పొందాయి.
ఈనాటికీ అమర్ నాధ్ గుహను దర్శించే యాత్రికులు ఆ తెల్లని పావురాల జంటను చూడవచ్చు.
ముగ్గురు
భట్ లు, చల్లకెరె సోదరులతో పాటు నేను కూడా జూలై,6, 2015 న ఢిల్లీకి వెళ్ళే విమానానికి
టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. జూలై, 9 వ.తారీకున
అమర్ నాధ్ కు వెళ్లడానికి నర్మద హెలికాప్టర్ ను కూడా బుక్ చేసింది. న్యూఢిల్లీనుంచి వైష్ణోదేవికి వెళ్ళడానికి కారును
కూడా ఏర్పాటు చేసింది.
నేను
బెంగళూరునుంచి బయలుదేరడానికి అన్ని పనులు సవ్యంగా జరిగాయి. జూలై, 4, న నాకు కాస్త జ్వరం వచ్చి, విపరీతమయిన
కీళ్లనొప్పులు పట్టుకున్నాయి. నేను సరిగా నిలబడలేని,
నడవలేని స్థితిలో ఉన్నాను. అప్పటికే టి.వి.
చానెళ్ళలోను, వార్తాపత్రికలలోను కాశ్మీర్ లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయనీ, కొండచరియలు
విరిగి పడుతున్నాయనీ ఆకారణంగా అమర్ నాధ్ యాత్రను ఆపివేయడం జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. మతకల్లోలాల సంఘటనలు అక్కడక్కడా జరుగుతూ ఉండటం వల్ల
కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూ కూడా విధించారని వార్తలలో చెప్పారు. ఏవిధంగా జరుగుతుందో ఇదమిత్ఢంగా చెప్పలేని పరిస్థితి. నేను ఢిల్లీకి వెళ్ళి అక్కడినుంచి వైష్ణోదేవికి,
మరలా అక్కడినుంచి అమర్ నాధ్ కు వెళ్ళగలనా లేదా అనే సందేహం కలిగింది.
నేను
అమర్ నాధ్ యాత్రకు వెళ్ళాలా, మానాలా అనే విషయాన్ని తెలుపమని సాయినాధునికి, నా గురువయిన
శ్రీరాధాకృష్ణస్వామీజీని ప్రార్ధించుకున్నాను.
మరునాడు వేకువజామున శ్రీసాయిబాబా దారి చూపుతుండగా నేను మంచుపర్వతాల గుండా నడుస్తూ
ఉన్నట్లుగా కల వచ్చింది. ఇక నామదిలో ఎటువంటి
సంశయం లేకుండా అమర్ నాధ్ యాత్రకు బయలుదేరమనడానికి అదే బలీయమైన సంకేతంగా భావించాను.
నా
పిల్లలు ఎంతవద్దని వారించినా నేను విమానంలో ఢిల్లీకి బయలుదేరాను. అప్పటికి నా ఆరోగ్యం కాస్త కుదుటబడి మామూలు మనిషినయ్యాను. మా యాత్రా బృందంలో నాకన్నా వయసుపైబడినవారిని చూచిన
తరువాత నాలో ఎలాగయినా సరే ఈ యాత్రను పూర్తిచేయాలనే ఉత్సాహం బలీయమయింది.
వైష్ణోదేవి
నుంచి జమ్ము వరకు కారులో ప్రయాణించి జూలై, 9 తారీకుకి బల్తాల్ బేస్ కాంపుకు చేరుకున్నాము. మేము ప్రయాణించిన దారంతా కొండలు గుట్టలతో నిండి
ఉంది. అయినప్పటికి సినిమాలలో చూసినట్లుగా గతుకుల
రోడ్డు మీద కారు రేసులు ఏవిధంగా జరుగుతాయో అదేవిధంగా మా డ్రైవరు ఎంతో చాకచక్యంగా కారు
నడిపి మమ్మల్ని బేస్ క్యాంపుకు చేర్చాడు. యాత్రికులు
ప్రయాణించే వాహనాలకి రక్షణగా మిలటరీ వాహనాలు ఒకదాని వెనుక మరొకటి వచ్చాయి. రోడ్డుమీద మిలటరీ, పారామిలటరీ సైనికులే తప్ప ప్రజలెవరూ
కనిపించలేదు. ప్రయాణిస్తున్న దారిలో ప్రతి
అర కిలోమీటరుకు జమ్ములో నివసించే స్థానికులు చిన్న చిన్న గుడారాలను ఏర్పాటు చేసి, కులమత
లింగ వివక్షత ఏమీ లేకుండా యాత్రికులందరికీ ఉచితంగా ఆహారపదార్ధాలనందించారు. యాత్రికులకు అవసరమయితే వైద్యసేవలు అందించడానికి
జమ్ము, కాశ్మీర్ ప్రభుత్వం వారు అన్ని ఏర్పాట్లు చేసారు. అది హిందూ ముస్లిమ్ ల మధ్య సోదరభావానికి నిజమయిన
ఉదాహరణ.
కాశ్మీర్
లోని ఎత్తయిన పర్వతాలు, నదులు, ప్రవాహాలతో నిండి ఉన్న ప్రకృతిరమణీయతకు ఎంతో పులకించిపోయాము. మేము బల్తాల్ బేస్ కాంపుకు చేరుకొన్నాము. అక్కడ వందలకొద్దీ గుడారాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. వచ్చే పోయే యాత్రికులతో చాలా సందడిగా ఉంది. సైన్యం, యాత్రికులని వారు ప్రయాణం చేసే వాహనాలని
ఒక క్రమపధ్ధతిలో నియంత్రిస్తూ ఉన్నారు. బేస్
క్యాంప్ దేశం నలుమూలలనుండీ వచ్చిన యాత్రికులతో ఒక చిన్న భారతదేశంలా ఉంది. మేము బల్తాల్ చేరుకునేటప్పటికి వాతావరణం చాలా బాగుంది. మరుసటిరోజు మేము పవిత్రస్థలమయిన అమర్ నాధ్ కు బయలుదేరాల్సి
ఉంది.
అర్ధరాత్రి
అయేటప్పటికి పరమశివుడు తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఎడతెరిపిలేని వర్షం, ఉరుములు మెరుపుల వల్ల మేము
గుడారాలనుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉండిపోయాము. మేము చేసేదేమీ లేదు. అమర్ నాధ్ గుహకి వెళ్లడానికి అడ్డంకులు ఏర్పడ్డాయనీ
అక్కడికి వెళ్ళేపరిస్థితి లేదని మాటి మాటికి యాత్రికులందరినీ ప్రకటనల ద్వారా తెలియచేస్తూ
ఉన్నారు. మాకు తినడానికి తిండి, త్రాగడానికి
నీరు ఇంకా కొన్ని అవసరమయినవాటిని సమకూర్చడం వల్ల మేము గుడారాల్లో ఉండగలిగాము. మూడురోజులయినా గాని వర్షం తగ్గలేదు. బయటిప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల భారీ విధ్వంసం జరిగిందని,
నల్లని మేఘాలు దట్టంగా అలుముకుని చీకట్లు కమ్ముకోవడం ఈ విధమయిన కారణాలవల్ల కాశ్మీర్
లోయలో చాలా ప్రాణనష్టం జరిగిందని బెంగళూరు మరియు ఇతర ప్రాంతాలకి టివి.చానెళ్ళు, వార్తాపత్రికల
ద్వారా ప్రజలకు సమాచారం చేరింది. అందరూ మాక్షేమం
గురించి ఆందోళన పడసాగారు. మేము ఎవ్వరితోను
మాట్లాడటానికి అవకాశం లేకపోయింది.
ప్రకృతి
చేసే విలయతాండవానికి మేము గుడారాలకే పరిమితమయిపోయాము. అందరం విష్ణుసహస్రనామ పారాయణ, భజనలు చేస్తూ కూర్చున్నాము. చల్లకెరె సోదరులు ఎన్నోసార్లు రుద్రమ్, చమకం పారాయణ
చేసారు. మాబృందంలో ఒక యొగాచార్యుడు ఉన్నారు. ఆయన, “మనమందరం తప్పకుండా అమర్ నాధ్ లో శివుని దర్శనం
చేసుకుంటాము” అని ప్రగాడమైన విశ్వాసంతో చెప్పారు.
ఆయన చెప్పిన మాటలు “బంధాలు, అనుబంధాలు, ముక్తి మోక్షం అన్నీ ఆపరమేశ్వరుని ఆధీనంలోనే
ఉన్నాయి. కొన్ని ఆత్మలు అజ్ఞానానికి బధ్ధులయి
కొట్టుమిట్లాడుతాయని, కొన్ని మోక్షాన్ని పొందుతాయని మనం భావిస్తూ ఉంటాము. కాని అదంతా ఆపరమేశ్వరుని లీల. ఈ విశ్వంలో ఆపరమశివుడు మాత్రమే వ్యాపించిఉన్నాడు. ఆయనను మరుగుపరచి బంధించేది మరొకటి ఏమీలేదు. నువ్వు వేరు, నేను వేరు అనే వైవిధ్యంలో మనం ఉన్నామంటే
అదంతా ఆయన చేసే మాయాజాలం. వాస్తవానికి రెండవది
ఏదీ లేదు. అంతా ఏకత్వమే. శివోహం – అనగా మనమే శివుడు. మనమెవరమో తెలుసుకోలేనంతగా మాయామోహంలో పడిపోయాము. ఇది ఆయన ఆడేనాటకం. ఆయన ఆడిచినట్లుగా మనం ఆడుతున్నాము. అంతా ఆయన లీల”
( మధురమైన ఈ 'శివోహమ్' పాటను వినండి)
అందరిలోను శివుడు కలడు అన్న ఈ బోధ నాకు ఇష్టం. ‘శివోహం’ ఈ పదం నాకు ఇష్టమవడానికి గల కారణం శ్రీ రాధాకృష్ణస్వామీజీ గారి జీవితం. ఆయనకు నలభై సంవత్సరాల వయసుఉన్న సమయంలో శ్రీనరసింహస్వామీజీ గారివద్ద శిక్షణలో ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు రాధా, కృష్ణుల దర్శనభాగ్యం కలిగింది. దానివల్ల ఆయనకు తన వాస్తవరూపం ఏమిటో తానెవరో అనేదానిమీద అవగాహన కలిగింది. ఆయనలో ఒక విధమయిన మార్పు కలిగింది. దేవాదిదేవుడు తనలోనే ఉన్నాడనే భావంతో రోజులతరబడి ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. కృష్ణునియందు రాధకు గల ప్రేమను అర్ధం చేసుకున్న అదృష్టవంతులు ఆయన. ఆయనకు ప్రతీదీ రాధాకృష్ణుల ప్రేమమయంగానే కనిపించింది. ఆప్రేమతత్వాన్ని తన జీవిత లక్ష్యంగా ఎంచుకొన్నారు.
(నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు వినండి)
నాలుగవ
రోజుకి వర్షం తగ్గింది. అమర్ నాధ్ గుహను తిరిగి
తెరిచారు. బాగా మంచు పడుతూ దారి సరిగా కనపడకపోవడం
వల్ల హెలికాప్టర్ సర్వీసులు ఇంకా మొదలుకాలేదు.
కొండదారి బాగా ఏటవాలుగా ఉండటం వల్ల కాలినడక ప్రయాణం చాలా ప్రమాదకరమని రానుపోను
దూరం 48 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు.
భట్
లు ముగ్గురు, నేను తలొక పల్లకీని అద్దెకు తీసుకుందామని నిర్ణయించుకున్నాము. దాని అద్దె మనిషి ఒక్కింటికి పన్నెండువేల రూపాయలు. అమర్ నాధ్ ష్రైన్ బోర్డువారి ఉద్దేశ్యం ప్రకారం
అది సరియైన ధర. ఇక్కడ హిందూ యాత్రికులని డోలీలలో
మోసుకుంటూ తీసుకువెళ్ళేవారంతా ముస్లిములే.
యాత్రలు జరిగే కాలంలో వారు ఆవిధంగా డబ్బు సంపాదించుకొని విపరీతమయిన చలికాలంలో
పనులు లేనపుడు ఆవిధంగా సంపాదించిన దానితోనే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
మేము
రక్షణవలయం దాటుకొని వెళ్ళాలి. మూడురోజులనుంచి
కురిసిన వర్షానికి దారంతా బురద బురదగా తయారయి నడుస్తుంటే నాకాలి బూట్లకు అంటుకుపోతూ
ఉంది. నేనెక్కబోయే పల్లకీని చూసాను. అది బలహీనంగా ఉన్నట్లుగా కనిపించింది. దానిని మోసే
నలుగురు యువకులు సన్నగా ఉన్నారు. నేనక్కడికి
వెళ్ళి పల్లకీలోకి ఎలా ఎక్కాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. దగ్గరకు వెళ్ళి ఎంతో నేర్పుగా పల్లకీలోకి ఎక్కి కూర్చొన్నాను. కుర్చీ రెండు చేతులమీద ఆనించి కూర్చున్నాను. నలుగురు యువకులు పల్లకీని తమ భుజాలమిదకెత్తుకుని
ఆబురద మట్టిలో స్థిరంగా ఎంతో నేర్పుగా కొండదారంబట మోసుకుంటూ నడవసాగారు. ఆనలుగురు శివునిగణంలోని వారిగా భావిస్తూ మనస్సులోనే
“ఓమ్ నమశ్శివాయ” అని జపించుకోసాగాను.
అమర్
నాధ్ కి వెళ్ళే దారిలో చాలా కొద్దిమంది యాత్రికులే కనపడుతున్నారు. కాషాయం దుస్తులు ధరించి ఉన్న ఒక బాల సాధువు కాళ్ళకు
చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నాడు. అతను తనతోపాటుగా
సాయినాధులవారి చిత్రపటాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. అతనికి ఒక కాలు సరిగా లేని కారణంగా కుంటుతూ నడుస్తున్నాడు. కాని ఎక్కడా ఆగకుండా వేగంగా నడుస్తున్నాడు. ఆ బాలుడు ‘సమర్ధ సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై’
అంటూ నన్ను పలకరించాడు. నేను కూడా వినయంగా
ఆబాలుడిని పలకరించాను. యాత్రికులు తమ యాత్ర ముగించుకుని తిరిగి వస్తూ అప్పుడప్పుడు కనిపిస్తూ
ఉన్నారు. వారు నావైపు స్నేహపూర్వకంగా చూస్తూ
‘జై భోలే’, ‘హరహర మహదేవ్’ అంటూ పలకరించేవారు. కుర్తాలు ధరించి మధ్యవయసులో ఉన్న స్త్రీలు
కొందరు ఎగశ్వాస తీసుకొంటున్నారు. అయినా వారు
తమ నడకను ఆపకుండా తాము వేసే ప్రతి అడుగుకి ‘జై శివా’ అంటూ శివనామస్మరణ చేసుకొంటూ నడక సాగిస్తున్నారు. కొంతమంది మొహాలలో నవ్వు, మరికొంతమందిలో అలసట గమనించాను. దారిలో ప్రతి మలుపు వద్ద సైనికులు కూర్చుని గాని
నుంచుని గాని ఉండి అందరినీ జాగ్రత్తగా గమనిస్తున్నారు.
మేము
వెళ్ళే దారి నిటారుగా ఉంది. క్రిందకి చూసాను. దాదాపు 1000 అడుగుల క్రిందగా ఒక నది పారుతూ ఉంది. నీళ్ళు నీలంగా ఉన్నాయి. నేను కూర్చున్న పల్లకీని ఎంతోధైర్యంగా మోస్తున్నారు. కొండదారి వెంట వారు మోస్తున్న తీరును బట్టి నేను
పడిపోతానేమోననే భయం నాకెంతమాత్రం కలగలేదు.
మనసులోనే నేనా కుఱ్ఱవాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకొన్నాను. ఈ యువకులు నన్ను మహాశివుని సన్నిధికి తీసుకుని వెడుతున్నారు. నేను వారి పేర్లను గుర్తుంచుకోవాలి. వీళ్ళు నాకు ఆత్మీయులయ్యారు.
మేము
సంగం వద్దకు చేరుకొన్నాము. అక్కడ జమ్ము, కాశ్మీర్
పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని ఆపాడు. “మీరిక్కడ పల్లకీలోంచి
దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి” అని నాతో స్వచ్చమయిన ఇంగ్లీషులో చెప్పాడు. అక్కడినుంచి గుహకు రెండు మైళ్ళ దూరం ఉంటుంది. దారంతా మంచుతో కప్పబడి అడుగువేస్తే జారిపోతూ ఉంటుంది. కాస్త దూరం పల్లకీలోనే వెడతానని ఆఫీసర్ ని బ్రతిమిలాడాను. కాని ఆ పోలీసాఫీసర్ చాలా కఠినంగా ఉన్నాడు. “అలా కుదరదు.
అందరూ ఇక్కడ దిగి నడిచి వెళ్ళాల్సిందే” అన్నాడు.
నేను మనసులోనే సాయినాధుడిని ప్రార్ధించుకున్నాను. ఎలా ఎప్పుడు ఎక్కడినుంచి వచ్చాడో తెలీదు. అకస్మాతుగా ఒక ఆర్మీ అతను వచ్చి పోలీస్ ఆఫీసర్ తో
వాదించడం మొదలుపెట్టాడు. “ఆయన సీనియర్ సిటిజన్.
పైగా ఆయనకు ఆరోగ్యం కూడా అంతగా బాగున్నట్లు లేదు. ఆయన కాళ్ళు వాచిపోయి ఉన్నాయి చూడు” అన్నాడు. చివరికి ఆ పోలీస్ ఆఫీసర్ నేను పల్లకీలోనే గుహ దాకా
వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. నేను ఆ పల్లకీలోనే
ముందుకు వెళ్ళాను.
మంచుతో
బాగా దట్టంగా కప్పబడి ఉన్న రోడ్డు గుండా పల్లకీని జాగ్రత్తగా మోసుకుంటూ వెడుతున్నారు. దారిలో మధ్య మధ్య మంచులో ఉన్న గోతులను తప్పించుకుంటూ
నడుస్తున్నారు. కొన్ని గోతులు చాలా పెద్దవిగా
ఉన్నాయి. వాటిక్రింద నది పారుతూ ఉంది. నదికి ప్రక్కనే ఉన్న పెద్ద కొండ దగ్గరకు వచ్చాము. గుహలోకి ప్రవేశించేముందుగా యాత్రికులందరూ అక్కడ
స్నానాలు చేస్తున్నారు. ఆవెంటనే యాత్రికులు, అలాగే ఆర్మీవాళ్ళు, పోలీసువారు తాము అద్దెకు తీసుకున్న రకరకాల రంగులతో ఉన్న గుడారాలను ఒక
వరుసలో ఏర్పాటు చేసారు.
ఒక గుడారం దగ్గర ఒకతను నన్నాపి నాదగ్గర మొబైల్, కెమెరా ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. నేను ఆరెండిటినీ తీసుకురాకపోవడం మంచిదయింది. గుహలోకి ప్రవేశించడానికి వెళ్ళే మెట్లవద్దకు చేరుకొన్నాము. నేను పల్లకీలోనించి దిగడానికి పల్లకీ మోసుకొచ్చినవారు సాయం చేసారు. “అంకుల్, మీరు తిరిగి వచ్చేంతవరకు మేమిక్కడే ఉంటాము” అన్నారు. కొన్ని మెట్లు ఎక్కిన తరువాత బాగా ఎత్తయిన ప్రదేశం కాబట్టి ఊపిరి ఆడలేదు. కాసేపు ఆగి, కాస్త ఊపిరి పీల్చుకుని మరికొన్ని మెట్లు ఎక్కాను. శ్వాస తీసుకోవడానికి ఆగినది నేనొక్కడినే కాదని నాకన్నా చిన్నవాళ్ళు కూడా ఆగారని చూసిన తరువాత కాస్త సంతోషం కలిగింది. వాళ్ళు కూడా
మధ్య మధ్యలో కాసేపు ఆగుతున్నారు.
ఒక గుడారం దగ్గర ఒకతను నన్నాపి నాదగ్గర మొబైల్, కెమెరా ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. నేను ఆరెండిటినీ తీసుకురాకపోవడం మంచిదయింది. గుహలోకి ప్రవేశించడానికి వెళ్ళే మెట్లవద్దకు చేరుకొన్నాము. నేను పల్లకీలోనించి దిగడానికి పల్లకీ మోసుకొచ్చినవారు సాయం చేసారు. “అంకుల్, మీరు తిరిగి వచ్చేంతవరకు మేమిక్కడే ఉంటాము” అన్నారు. కొన్ని మెట్లు ఎక్కిన తరువాత బాగా ఎత్తయిన ప్రదేశం కాబట్టి ఊపిరి ఆడలేదు. కాసేపు ఆగి, కాస్త ఊపిరి పీల్చుకుని మరికొన్ని మెట్లు ఎక్కాను. శ్వాస తీసుకోవడానికి ఆగినది నేనొక్కడినే కాదని నాకన్నా చిన్నవాళ్ళు కూడా ఆగారని చూసిన తరువాత కాస్త సంతోషం కలిగింది. వాళ్ళు కూడా
మధ్య మధ్యలో కాసేపు ఆగుతున్నారు.
నిటారుగా ఉన్న మెట్లు ఎక్కి గుహకి ఏలా చేరుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాను...
(అప్పుడు బాబా ఆయన నిస్సహాయతను గుర్తించారా?)
(మిగిలినది తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment