07.09.2018 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
అమర్ నాధ్ యాత్ర మిగిలిన భాగమ్ ఈ రోజు ప్రచురిస్తున్నాను. చదివిన తరువాత అమర్ నాధ్ ను దర్శనానుభూతిని పొందండి. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు, అట్లాంటా
అమర్ నాధ్ యాత్ర - బాబా అనుమతి - 2
నిటారుగా
ఉన్న మెట్లను ఎక్కి పైకి ఎలా వెళ్ళగలనా అని ఒక్క క్షణం ఆలోచించాను. సాయినాధుడు నా నిస్సహాయతను గమనించినట్లున్నారు. వెంటనే నాకు సహాయం చేయడానికి ఒక మనిషిని పంపించారు. 19సం.వయసుగల అమ్మాయి నాదగ్గరకి వచ్చి “భయ్యా, నీకేమయినా
సహాయం కావాలా?” అని హిందీలో అడిగింది. అవును
కావాలి అని నేను సమాధానం చెప్పే లోపుగానే ఆమె నాచేయి పట్టుకుని మెల్లగా మెట్లు ఎక్కించసాగింది. మేము మెట్లు ఎక్కుతూ ఉండగానే ఆమె నాకు త్రాగడానికి
మంచినీళ్ళు, ఫ్రూటీ జ్యూస్ ఇచ్చింది.
సగం దూరం వెళ్ళిన తరువాత పైన ఒకచోట యాత్రికులందరూ తమతమ బూట్లను వదలివేయడానికి ఒక గుడారం ఏర్పాటు చేయబడి ఉంది. చెప్పులు లేకుండా వట్టికాళ్ళతో నడిచినా మెట్లు ఏమీ అంత చల్లగా అనిపించలేదు. ఆఖరి మెట్ల వరకు ఎక్కడానికి బాగా కష్టతరమైనవిగా కన్పించాయి. అలుపు తీర్చుకోవడానికి నేనా అమ్మాయి చేతులు పట్తుకుని మెట్లమీద కూర్చోవలసివచ్చింది. ఆమె సహాయంతో ఉత్సాహం తెచ్చుకుని మరలా మెట్లు ఎక్కసాగాను.
సగం దూరం వెళ్ళిన తరువాత పైన ఒకచోట యాత్రికులందరూ తమతమ బూట్లను వదలివేయడానికి ఒక గుడారం ఏర్పాటు చేయబడి ఉంది. చెప్పులు లేకుండా వట్టికాళ్ళతో నడిచినా మెట్లు ఏమీ అంత చల్లగా అనిపించలేదు. ఆఖరి మెట్ల వరకు ఎక్కడానికి బాగా కష్టతరమైనవిగా కన్పించాయి. అలుపు తీర్చుకోవడానికి నేనా అమ్మాయి చేతులు పట్తుకుని మెట్లమీద కూర్చోవలసివచ్చింది. ఆమె సహాయంతో ఉత్సాహం తెచ్చుకుని మరలా మెట్లు ఎక్కసాగాను.
పవిత్రమయిన
గుహలోపల ఉన్న నడకదారిలోకి ప్రవేశించగానే నా
ఆనందం చెప్పనలవికాదు. అప్పుడు నాలో కలిగిన
భావోద్వేగానికి అంతకుముందు నాకు కలిగిన అలసట, బాగా ఎత్తయిన ప్రదేశంలో ఆక్సిజన్ కొరతవల్ల
శ్వాసలో ఏర్పడిని ఇబ్బంది అన్నీ ఆ ప్రదేశంయొక్క పరిపూర్ణమయిన శక్తికి అన్ని బాధలను
మర్చిపోయాను. మంచుశివలింగ దర్శనం చేసుకోవడానికి
ఇక కొద్ది మెట్లు మాత్రమే ఎక్కవలసి ఉంది. కాని
కొద్దిసేపు కూర్చుంటె తప్ప ఎక్కలేను. నేరుగా
వెళ్ళి ఆమహాశివుని చేతుల్లోకి వెళ్ళినట్లయితే అంతకన్నా మహద్భాగ్యం ఉంటుందా అని అనిపించింది. నాతో కూడా వచ్చిన అమ్మాయి నన్ను గుహలో ఒక చెక్క
బెంచీమీద కూర్చుండబెట్టింది. నా కనుచిరలనుండి
ఆనందభాష్పాలు జాలువారుతూ ఉన్నాయి. అనిర్విచనీయమయిన
ఆనందంతో కూర్చున్న నన్ను ఒక ఆర్మీ అతను నావైపే చూసుకుంటూ వెళ్ళాడు.
నేనక్కడ
దాదాపు 15 నిమిషాలు కూర్చున్నాను. ఈలోపుగా
ఆ అమ్మాయి పరమశివునికి అర్పించడానికి కొన్ని జీడిపప్పులు, కిస్ మిస్ పళ్ళు తీసుకునివచ్చింది. ఇత్తడి గేటు గుండా వెళ్ళి శివుని దర్శించుకోవడానికి
ఇక కొద్ది మెట్లు మాత్రమే ఉన్నాయి. మెల్లగా
మెట్లు ఎక్కి మంచులింగం వద్దకు చేరుకొన్నాము.
అమర్ నాధ్ యాత్ర మొదలయి రెండువారాలు మాత్రమే కావస్తున్నందువల్ల మంచుశివలింగం
కరగకుండా ఎలా ఉన్నది అలా ఉంది.
నామనసు
బ్రహ్మానందంతో నిండిపోయింది. ఆగుహలో దైవాంశసంభూతమయిన
తరంగాలే కనక ఇంకా బలంగా ఉన్నట్లయితే నేను తెలివితప్పి పడిపోయేవాడినేమోనని అనిపించింది. పరమేశ్వరునికి నైవేద్యంగా అర్పించడానికి అమ్మాయి నాకు ఇచ్చిన జీడిపప్పు,
కిస్ మిస్ పళ్లను అక్కడే ఉన్న ఒక యువ పూజారిచేతిలో ఉంచాను. నేను ఆనందంలో మునిగిపోయాను. ఇక మెట్లుదిగి క్రిందకి వెళ్ళి కాసేపు బెంచీమీద
కూర్చుని సేదతీరాలి. మెట్లుదిగి క్రిందకి వెళ్ళి
బెంచీమీద కూర్చొన్నాను. ఆనందపారవశ్యంలో మునిగిపోయిన
నేను ప్రసాదం తీసుకోవడం కూడా మర్చిపోయి వచ్చేసాను. పూజారి క్రిందకి దిగివచ్చి నాకు ప్రసాదాన్ని అందించాడు. మరొక పూజారి వచ్చి నాచేతులనిండా మరికొంత ప్రసాదం
పెట్టి నా నుదుటిమీద విభూతి రాసాడు. పోలీసతను
వచ్చి బహుశా చలిగా ఉండవచ్చని చెప్పి నాకాళ్ళకు చెక్క బూట్లను తొడిగాడు.
ఒక
వృధ్ధుడు వచ్చి పేపర్ కప్పులనిండుగా అన్నంతో చేసిన ప్రసాదం, కేసరి నాచేతుల్లో పెట్టాడు. వారంతా నామీద ఎంతో ప్రేమను, కనబర్చారు.
అమర్
నాధ్ గుహ బాగా ఎత్తుగాను, వెడల్పుగాను ఉంది.
నేననుకున్నంత లోతుగా ఏమీలేదు. అమరత్వం
పొందిన పావురాలు గుహలో ఎగురుతూ కనిపించాయి.
పరమశివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి బోధిస్తూ ఉండగా విన్న పావురాలు అవేనని
నన్ను తీసుకుని వచ్చిన అమ్మాయి చెప్పింది. నాకు కలిగిన భావోద్వేగంనుంచి ఇంకా బయటపడలేక ఆత్మానందాన్ననుభవిస్తూ
బెంచీమీద అలా కూర్చుండిపోయాను.
గుహలో
మూడు మంచులింగాలున్నాయి. పెద్దదిగా ఉన్న మంచులింగాన్ని
పరమశివునిగా భావించి పూజిస్తారని అమ్మాయి చెప్పింది. పరమశివుని లింగానికి ప్రక్కనున్న లింగాన్ని పార్వతీదేవిగాను,
దాని ప్రక్కన ఉన్న లింగాన్ని వినాయకునిగాను పూజిస్తారని చెప్పింది. మంచులింగాల వద్దనున్నవాటిని భక్తులెవరూ ముట్టుకోవడానికి
వీలు లేకుండా చుట్టూతా ఇత్తడి గేట్లను ఏర్పాటు చేసారు.
ఏకాగ్రచిత్తంతో ఆ లింగాలనే వీక్షిస్తున్న నాకు, సాయిబాబా, శ్రీనరసింహస్వామీజీ, శ్రీరాధాకృష్ణ స్వామీజీ, ఈ ముగ్గురు నన్ను దీవిస్తూ ఉన్నారనే దర్శనానుభూతిని పొందాను.
ఏకాగ్రచిత్తంతో ఆ లింగాలనే వీక్షిస్తున్న నాకు, సాయిబాబా, శ్రీనరసింహస్వామీజీ, శ్రీరాధాకృష్ణ స్వామీజీ, ఈ ముగ్గురు నన్ను దీవిస్తూ ఉన్నారనే దర్శనానుభూతిని పొందాను.
ఆసమయంలోనే
గుహలోకి చల్లకెరె సోదరులు కూడా వచ్చారు. మంచులింగం
చూడటానికి పైకి చేరుకునేందుకు వాళ్ళు కూడా చెక్కతో చేసిన బూట్లను తొడుగుకొని వచ్చారు. గుహలోకి ప్రవేశించడానికి వాటిని మాత్రమే అనుమతిస్తారు. గుహలో పూజారులు, పోలీసు సిబ్బంది. ఇంకా ఆలయ ఉద్యోగులు
ఎక్కువసేపు అక్కడే ఉండాలి కాబట్టి వారుకూడా ఈబూట్లనే ధరిస్తారు.
చల్లకెరె
సోదరులు మంచులింగాన్నే తదేకంగా చూస్తూ రుద్రం చదవసాగారు. నేను కూడా మనసులోనే ‘నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ’
అని జపించుకోసాగాను. కొంతమంది యాత్రికులు
‘అఘోరేభ్యః అధఘోరేభ్యః అఘోరఘోరేభ్యః సర్వతః సర్వః సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః’ అంటు అఘోర
మంత్రాన్ని కాసేపు జపించారు.
నాముందున్న
పూజారి ఆమంత్రం యొక్క అర్ధాన్ని స్వచ్చమయిన ఆంగ్లభాషలో నాకు వివరించాడు. “నిరంతరం అన్ని దిక్కుల ఉన్నటువంటి రుద్రావతారమయిన
అఘోర శక్తులకి ఘోర శక్తులకి, ఘోరతరి శక్తులు అన్నింటికి నేను నమస్కరిస్తున్నాను”
చల్లకెరె
సోదరులు అఘోర మంత్రార్ధాన్ని ఇంకా ఈవిధంగా వివరించారు. “ఓ పరమేశ్వరా! అన్ని రుద్రావతారాలు
నీ రూపమే. కేవలం నీవుమాత్రమే ఆవిధంగా రూపాంతరం
చెందగలవు. జ్ఞానోదయాన్ని పెంపొందించడానికై
అఘోర శక్తిగాను, మానవుని పతనావస్థలోనికి దిగజార్చడానికి కారణభూతమయినటువంటి భయంకరమయిన అజ్ఞానాంధకారానికి ఘోరతరిగాను, పైకి లేవకుండా,
క్రిందకు జారకుండా సమస్థితిలో ఉంచే ఘోర శక్తిగాను
ఈ మూడు రూపాలు రుద్రుడయిన శివునిలో
మూర్తీభవించి ఉన్నాయి. ఈ రూపాలు జ్ఞానాభిలాషికి
దోహదపడేవిగా ఉంటాయి. అటువంటి జ్ఞానసముపార్జనయందు
ఆసక్తి లేనివానికి భీతిని గొలిపి అధఃపాతాళానికి నెట్తివేస్తాయి.
ఈ
రెండు అర్ధాలను విన్న అక్కడివారు సంతోషంతో హర్షధ్వానాలు చేసారు. నాతోవచ్చిన అమ్మాయి జరిగిన చర్చ గురించి వివరాలు
అడిగింది. నేనామెకు జరిగినదంతా నాకు వచ్చీరాని
హిందీలో అర్ధాన్ని వివరించాను. తను తెలుసుకున్న
కొత్తవిషయానికి ఆమె ఎంతగానో సంతోషించింది.
గుహలోపలికి
యాత్రికులు అధిక సంఖ్యలో రావడం మొదలయింది.
అంతవరకు మాతో స్నేహంగా ఉన్న పూజారి మమ్మల్ని ఇక వెళ్లమన్నట్లుగా సైగ చేసాడు. ఆ పవిత్రమయిన గుహలోకి నేను ప్రవేశించి రెండుగంటలు
పైగా అయి ఉండవచ్చు. గత మూడు రోజులుగా కురిసిన
వర్షాలకి చాలామంది యాత్రికులు అమర్ నాధ్ కి చేరుకోలేకపోయారు. లేనట్లయ్లితే నేను రెండు
గంటలసేపు ఈ గుహలో ఉండలేకపోయేవాడిని. యాత్రికులు
అధిక సంఖ్యలో వచ్చే రోజులలో దర్శనం చేసుకోవడానికి మెట్లమీద రెండు గంటలసేపు బారులు తీరి
ఉంటారని, ఆతరువాత ఒక్క నిమిషం మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని, అది అసాధారణమేమీ
కాదని నన్ను తీసుకుని వచ్చిన అమ్మాయి చెప్పింది.
అమర్ నాధ్ యాత్ర జూలై మొదటివారంలో ప్రారంభమయి ఆగస్టు నెలలో వచ్చే పౌర్ణమినాటికి
పూర్తవుతుంది.
మేము
గుహనుండి క్రిందకి దిగుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక సాదువు చల్లకెరె సోదరులలో పెద్దవాడిని
ఆపాడు. ఆ సాధువు “ నీ మోకాళ్ళు బాగున్నట్లు
లేవు అని ఒక్క చూపుతోనే చూసి చెప్పాడు. అలా
అంటూ బాగా బలంగా అతని మోకాళ్ళని రుద్దాడు. “ఇపుడు నీమోకాళ్ళు సరిగా ఉన్నాయి” అని ఆసాధువు
వెంటనే మాయమయ్యాడు. డబ్బివ్వబోయినా ఆసాధువు తీసుకోలేదు. ఆతరువాత చల్లకెరె సోదరులలో పెద్దతను “నిజానికి నామోకాళ్ళలొ
ఎప్పటినుంచో బాధపెడుతున్న నొప్పి ఆసాధువు రుద్దడం వల్ల మటుమాయమయిపోయింది” అని చెప్పాడు. కాని నాపాదాలు వాచిపోయి ఉన్నా గాని ఆసాధువు నావైపు
ఒక్క నవ్వు నవ్వాడు అంతే గాని నాకేమీ ఆయన చేయలేదు. బహుశా నేను ఇంకా నాకర్మను అనుభవించాల్సి ఉంటుందని
ఆయన ఉద్దేశ్యం అయి ఉండచ్చు.
మధ్యాహ్నం
మీ భోజనంసంగతి ఏమిటని నన్ను తీసుకువచ్చిన అమ్మాయి అడిగింది. తప్పించుకోవడానికి నేను ఎదో సమాధానం ఇచ్చినప్పటికీ
ఆమె వెంటనే ఎక్కడికో వెళ్ళి కొన్ని చపాతీలు కూర పట్టుకొని వచ్చింది. నేనెక్కడికీ వెళ్ళి చేతులు కడుగుకొని వచ్చే శ్రమలేకుండా
, ఆమే తన చేతులు శుభ్రంగా కడుగుకొని వచ్చింది. నా చిన్నతనంలో నాకు మా అమ్మ తినిపించినట్లే
ఆమె నాకు తినిపించింది.
అమాయకమయిన
ఆ అమ్మాయిలో నిండి ఉన్న ప్రేమ, దయ నన్నెంతగానో కట్టిపడేసాయి. నేనెవరో ఆ అమ్మాయి ఎవరో. ఏపూర్వ జన్మలోని ఋణానుబంధమో. ఆమెను నా స్వయానా సోదరిగా భావించాను. ఒక అన్నగా నేను అలంకారప్రాయుణ్ణి మాత్రమే. పూర్వజన్మలో
ఎప్పుడో మేమిద్దరం అన్నా చెల్లెళ్ళమయి ఉంటాము.
నేనామెను సంతోషపెట్టడానికి కృతజ్ఞతాపూర్వకంగా కొంత డబ్బిద్దామనుకున్నాను. పల్లకీలోకి ఎక్కేముందుగా జేబులోనుంచి అయిదువందల
రూపాయలనోటు తీసి ఆమె చేతిలో పెడుతుండగా ఆమె వద్దని నాచేతిని తోసేసింది. “ఇది వాత్సల్యంతో నీ అన్నయ్య ఇస్తున్న బహుమానం తీసుకో”
అన్నాను. నామదిలో చిరకాలం నిలిచిపోయే విధంగా
ఆమె మనోహరంగా నవ్వింది.
నేనామె
పేరడిగాను. తన పేరు ‘వైష్ణవి’ అని చెప్పింది. నాకు సహాయం చేయడానికి ఆ వైష్ణవీదేవే వచ్చిందన్న
ఆనందం కలిగింది నాకు. జారుడుగా ఉన్న దారిలో
జారిపడిపోకుండా ఆమె నా చేయి పట్టుకొని నన్నెంతో జాగ్రత్తగ నడిపించింది. తనకొడుకుకు తినిపించినట్లుగా నాకు తినిపించింది. వర్షంలో తడవకుండా నాకు రెయిన్ కోటు కూడా ఏర్పాటు
చేసింది. నేను పల్లకీ ఎక్కి తిరిగి వెడుతుండగా
ఆమె చేయి ఊపి నాకు వీడ్కోలు చెప్పింది.
మేము
తిరిగి బల్తాల్ బేసి క్యాంపుకు వెడుతున్న సమయంలో దారిలో వాతావరణం చాలా వేగంగా మారిపోసాగింది. బలమైన గాలి వీచి వాన నాముఖాన్ని బలంగా తాకింది. కాని ఆచల్లదనం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. కాని ఎక్కడా తొట్రుపడకుండా మట్టిరోడ్డు మీద మంచులో
నడుస్తూ నలుగురు యువకులూ పల్లకీలో నన్ను మోసుకుంటూ రాత్రయేసరికి బల్తాల్ బేస్ క్యాంపుకు
చేర్చారు.
బేస్
క్యాంప్ కి చేరుకున్న తరువాత నాకు జ్వరం, విపరీతమయిన కీళ్ళనొప్పులు ప్రారంభమయ్యాయి. పాదాలు కూడా బాగా వాచిపోయాయి. మరుసటిరోజు ఉదయాన్నే జమ్మూకి బయలుదేరాము. వ్యానులో ప్రయాణిస్తుండగా దారికి రెండు వైపులా పెద్దపెద్ద
పర్వతశిఖరాలు పరమశివుని వైభవాన్ని ఎలుగెత్తి చాటున్నట్లుగా దర్శనమిచ్చాయి. అత్యధ్భుతమైన ఆ ప్రకృతి అందాలు ఎంతో ఆహ్లాదాన్ని
కలిగించాయి. శాశ్వతంగా మంచులో కప్పబడిన ఆ పర్వతాలను,
నా చేతులను పెద్దవిగా ఇంకా ఇంకా పెద్దవిగా
చేసుకొని నా కౌగిలిలోకి తీసుకుని హత్తుకుందామన్నంత భావావేశం నాలో కలిగింది.
శ్రీనగర్
లో నేను ఒక హోటల్ గదిలో బస చేసాను. తిరిగి
వెళ్ళడానికి చాలా సమయం ఉంది. కాశ్మీర్ లోని
ఈ ప్రాంతంలో ముస్లిమ్స్ ఎక్కువ. అమర్నాధ్ లో హిందూ ముస్లిమ్ ల మధ్య నేను గమనించిన స్నేహభావం
మొత్తం కాశ్మీర్ అంతటా కనిపించడం సాధ్యపడేవిషయమేనా అని అనిపించింది.
కాశ్మీర్
లో శాంతిని నెలకొల్పేలా చేయమని సాయినాధుడిని, శ్రీనరసింహస్వామీజీని, శ్రీరాధాకృష్ణస్వామీజీ
లకు మనసులోనే ప్రార్ధించుకున్నాను.
ఓమ్
సద్గురు సాయినాధాయనమః
ఓమ్
సద్గురు నరసింహస్వామినే నమః
ఓమ్
సద్గురు రాధాకృష్ణస్వామినే నమః
ఓమ్
నమశ్శివాయ
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
Sir please share your email Id or wats app number. I will share one photo. In most of the places like vizag kakinada chirala Baba's face is clearly visible in mooon. I would like to share that photo so that everyone could see this miracle.
Post a Comment