Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, August 23, 2018

శ్రీ అనంత్ జయదేవ్ చితంబర్ – అహ్మద్ నగర్

Posted by tyagaraju on 6:41 PM
      Image result for images of atlanta shirdi sai baba
                    Image result for images of rose hd


24.08.2018  గురువారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయిభక్తులందరికీ బాబా వారి శుభాశీస్సులు

              శ్రావణశుక్రవార శుభాకాంక్షలు

    Image result for images of sravana sukravaram

బాబా గారు జీవించి ఉన్న రోజులలో ఆయనను ప్రత్యక్షంగా దర్శించుకుని ఆయన ద్వారా అనుభూతులను పొందినవారు ఎందరో ఉన్నారుఆనాటి బాబా అంకిత భక్తులెందరో తమ తమ అనుభవాలను సామాన్య ప్రజానీకానికి అందించారుతమ అనుభవాలను వెల్లడించనివారు, ప్రచురణకి ఇవ్వనివారు కూడా ఉండి ఉండవచ్చును రోజుల్లో చిన్న పిల్లలు కూడా బాబాను ప్రత్యక్షంగా చూసి ఆయనతో ఆటలాడుకున్నవారు కూడా ఉన్నారుకాని బ్మాబాతో తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నవారు ఎందరు ఉన్నారో మనకు తెలియదుకాని రోజు ప్రచురిస్తున్న వ్యాసం శ్రీ అనంత్ జయదేవ్ చితంబర్ గారు తమ చిన్నతనంలో బాబాను ప్రత్యక్షంగా చూసి రోజుల్లో జరిగిన సంఘటనలను కూడా పూర్తిగా జ్ఞప్తియందుంచుకొని సాయి భక్తులందరికీ అందించారుఆయన మరాఠీలో వ్రాసిన వ్యాసం శ్రీసాయి లీల మాసపత్రిక మార్చ్, 1978 .సంవత్సరంలో ప్రచురింపబడిందిదానికి ఆంగ్లానువాదమ్ చేసినవారు శ్రీ పర్ణకిషోర్ గారు.



సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది 

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

అట్లాంటా ,  (అమెరికా)  ఫోన్ : 1571 594 7354



శ్రీ అనంత్ జయదేవ్ చితంబర్ – అహ్మద్ నగర్

అహ్మద్ నగర్ నివాసి శ్రీ అనంత్ జయదేవ్ చితంబర్ గారు తన చిన్న తనంలోనే బాబాను దర్శించుకున్న భాగ్యశాలి. ఆయన తండ్రి శ్రీ జయదేవ్ చితంబర్ గారు షిరిడీలోని ప్రాధమిక పాఠశాలకు హెడ్ మాస్టర్ గా 1912 నుంచి 1927 వరకు పనిచేసారు.  ఈ పాఠశాలలోనే శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) ఉపాధ్యాయునిగా పనిచేసారు.  ఆవిధంగా శ్రీ అనంత్ చితంబర్ గారి బాల్యం శ్రీసాయిబాబావారి సమక్షంలో గడిచింది.  శ్రీ అనంతచితంబర్ గారి తీపి గురుతులను బట్టి చిన్నపిల్లలయందు కూడా శ్రీసాయిబాబాగారి దైవాంశసంభూతమయిన ప్రభావం ఎంతగా ఉన్నదో మనం గ్రహించుకోగలం.  1975 వ.సంవత్సరం సాయిలీల మాసపత్రికలో మరాఠీలో ప్రచురింపబడిన ఆయన జ్ఞాపకాల దొంతరలయొక్క అనువాదమ్  …..  ఎడిటర్


1912 వ.సంవత్సరంలో మా నాన్నగారికి షిరిడీలో ఉన్న ప్రాధమికపాఠశాలకు హెడ్ మాస్టర్ గా బదిలీ అయింది.  అప్పుడు నేను 15 నెలల పిల్లవాడిని.  మా నాన్నగారు షిరిడీలో 1927 వ.సంవత్సరం వరకు అనగా రమారమి 14 సంవత్సరాలు పనిచేసారు.  పాఠశాల, మారుతి దేవాలయానికి దగ్గరగా ఉంది.  ఆవిధంగా నాబాల్యమంతా  షిరిడీలోనే గడిచింది.  1918 లో శ్రీసాయిబాబా మహాసమాధి చెందేనాటికి నావయస్సు 8 సంవత్సరాలు.  అందుచేత బాబా గురించి నాకు పూర్తిగా తెలియకపోవటానికి నేనంత చిన్న పిల్లవాడిని ఏమీ కాదు.  శ్రీసాయినాధ్ మహరాజు వద్ద నేను గడిపిన మధురక్షణాలు ఇప్పటికి నామదిలో పదిలంగా ఉన్నాయి.  నేను ప్రతిరోజూ ద్వారకామాయికి వెళ్ళి సాయిపాదాలవద్ద నా శిరసునుంచి నమస్కరించుకుంటూ ఉండేవాడిని.  బాబాకు ఆరతి ఇచ్చేటప్పుడు కూడా అందరితోపాటుగా నేనుకూడా పాడుతూఉండేవాడిని.  బాబా గ్రామంలోకి భిక్షకు వెళ్ళడం, లెండీతోటకి వెళ్ళి వస్తు తన భక్తులకు దర్శనమివ్వడం అంతా నేను ప్రత్యక్షంగా చూసాను.  ఆయన మసీదులో తన భక్తులతో కూర్చొని చిలుము పీలుస్తూ ఉన్న దృశ్యం నామనోనేత్రంతో ఇప్పటికీ చూడగలను.  
Image result for images of sai baba chilam

శ్రీదాసగణు మహారాజ్ గారి ఆధ్వర్యంలో శ్రీసాయినాధ్ మహరాజ్ గారి సమక్షంలో శ్రీతుకారాం బువా అజ్ గావ్ కర్ గారు పాడిన కీర్తనలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.  అప్పుడు శ్రీ బువాకి ఏడు లేక ఎనిమిది సంవత్సరాల వయసుంటుంది.  (శ్రీ తుకారాం గారి మనుమడు శ్రీ ధర్మాధికారి ప్రస్తుతం శ్రీసాయిబాబా సంస్థాన్ లో పూజారిగా పనిచేస్తున్నారు --- ఎడిటర్).  నా బాల్యంలో నేను శ్రీసాయిబాబా వారి అంకిత భక్తులందరినీ చూసాను.  కాకా సాహెబ్ దీక్షిత్, జోగ్, మాధవరావు దేశ్ పాండే, తాత్యాకోతే పాటిల్, గోపాలరావు బూటీ, అబ్దుల్ బాబా, ధబోల్కర్, పురందరే, దాసగణు వీరందరినీ చూసిన భాగ్యం కలిగింది నాకు.  ఆ భక్తులందరూ శ్రీసాయిబాబాతో కలిసి ద్వారకామాయిలో సమావేశమవుతూ ఉండటం, చావడిలో జరిగే శేజ్ ఆరతికి హాజరవడం అన్నీ నాకిప్పటికీ గుర్తున్నాయి.  నా బాల్యంలో నేను చూసినవన్నీ ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయంటే అది ఎలా సాధ్యం?  ఎన్నో జన్మలనుంచి నేను చేసుకున్న పుణ్యఫలితంగా శ్రీసాయిబాబా అది నాకిచ్చిన వరం.  నావయసు అపుడు 8 సంవత్సరాలు మాత్రమే.  కాని శ్రీసాయిబాబావారి దర్శనభాగ్యం వల్ల ఆయన అనుగ్రహం వల్ల ఆనాటి జ్ఞాపకాలు నేటికీ నామనసులో చెరగని ముద్ర వేసాయి.  ఆనాటి సంఘటనలను నేనెప్పటికీ మర్చిపోలేను.  వాటిని నేనెపుడు మర్చిపోకుండా నామదిలో పదిలంగా దాచుకోమని బాబావారి అభిమతంగా నేను భావిస్తూ ఉంటాను.  అందువల్లనే ఆ తీపి జ్ఞాపకాలు బాబా అనుగ్రహంతో నాహృదయంలో ఒక ఆరని జ్యోతిలా వెలిగించి ఉంచారు.  ప్రపంచ మానవాళిని ఉధ్ధరించి ప్రజలను ముక్తిమార్గంవైపు నడిపించడానికే బాబా షిరిడీలో అవతరించారు.  బాబా తన భక్తుల కోర్కెలను తీరుస్తూ, వారి కష్టాలను కడతేర్చి వారికి సుఖశాంతులను ప్రసాదిస్తున్నారు.  షిరిడీలో ఆయన తన సమాధినుంచే తన భక్తులకు ఇప్పటికీ సహాయపడుతూనే ఉన్నారు.  సకల ప్రాణుల హృదయాలు ఆయన నివాస స్థానమే.  తన భక్తులందరి మీద ఆయన తన అనుగ్రహాన్ని చూపించి వారిని ఒక విధమయిన దివ్యానుభూతిలోకి తీసుకొని వెడతారు.  ఆయన మహాసమాధి చెంది 57 సంవత్సరాలయినా, షిరిడీలో ఆయన ఇప్పటికీ సమాధి రూపంలో సజీవంగానే ఉన్నారు.  ఇది ఎవ్వరూ కాదనలేని, ఎటువంటి సందేహానికి తావులేని యదార్ధం.  ఆయన కాలాతీతులు.  మనలనందరినీ వదలి ఆయన ఎక్కడికి వెడతారు,?  తన భక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే సహాయం కోసం అర్ధించిన మరుక్షణం, తన బిడ్డల పిలుపుకు స్పంచించిన కన్నతల్లిలాగ ఆయన పరుగున వస్తారు.  ఆసమయంలో బాబా తమతోనే ఉన్నారనే భావన ఆయన భక్తుల మనసులో వెంటనే అనుభవమవుతుంది.  బాబాపై మనం చూపించిన ప్రేమకి, భక్తికి ఆవిధంగా మనకు ప్రతిఫలం దక్కుతుంది.

ప్రతిరోజు మా అమ్మగారు సాయిబాబాగారి దర్శనం చేసుకునేవారు.  ఆవిడ సాయిబాబా పాదాలకు పసుపు, కుంకుమ రాసి భక్తితో నమస్కరించుకునేది.  ఒకసారి ఆవిడ బాబాని, “బాబా, నేను మీపాదాలకు పసుపు, కుంకుమ రాసినట్లయితే అది మీకు ఇష్టమేనా?” అని అడిగింది.  దానికి బాబా “నువ్వు ప్రేమతో, భక్తితో ఏది చేసినా అది నాకిష్టమే” అని సమాధానమిచ్చారు.  అప్పుడప్పుడు బాబా మా అమ్మగార్ని దక్షిణ అడుగుతూ ఉండేవారు.  ఆవిడ మానాన్నగార్ని ఒక పావలా అడిగి తీసుకుని బాబాకు దక్షిణగా సమర్పిస్తూ ఉండేది.  బాబాకు ఆవిడ చేసిన సేవాఫలంగా బాబా ఆవిడకు అనాయాస మరణాన్ని ప్రసాదించారు.  మరణసమయంలో ఆవిడ స్పృహలోనే ఉంది.  ఆసమయంలో ఆవిడ ఇంద్రియాలన్నీ స్థంభించిపోయాయి.  ఆఖరి క్షణంలో పవిత్రమయిన రామనామాన్ని ఉఛ్చరిస్తూ అనాయాస మరణం పొందింది.  మానాన్నగారికి కూడా బాబా మీద ఎంతో ప్రేమ, భక్తి.  ఆయన బాబాని పరబ్రహ్మ స్వరూపంగా భావించేవారు.  ఒకరోజు ఉదయం ఆరతి అయిన తరువాత బాబా చావడినుంచి మసీదుకు వెళ్ళారు.  మానాన్నగారు బాబా దగ్గర నుంచుని ఉన్నారు.  బాబా వెడుతూ వెడుతూ మానాన్నగారి తలమీద తన సటకాతో కొట్టారు.  మానాన్నగారికి తలమీద చిన్న గాయమయింది.  గాయంమీద ఊదీ రాయగానే తొందరలోనే తగ్గిపోయింది.  తన తలమీద తగిలిన గాయాన్ని మా నాన్నగారు బాబా ఇచ్చిన ప్రసాదంగా భావించారు.  15 రోజులలోనే మానాన్నగారికి నెలకు 15 రూపాయల చొప్పున జీతం పెరిగింది.  ఆరోజుల్లో 15 రూపాయలంటే ఎంతో అధిక మొత్తం.  రాజాలా బ్రతకవచ్చు.  బాబా తన భక్తులమీద ఎపుడయినా ఆగ్రహం ప్రదర్శిస్తే అది బాబా తమకు ఇచ్చిన గొప్ప వరమని, బహుమానమనీ భక్తులు భావించేవారు.  బాబా తన భక్తుల మీద చూపించే ఆగ్రహం వారిలో ఉన్నటువంటి చెడు లక్షణాలమీద సూటిగా ప్రసరింపచేసి వాటిని నిర్మూలించడానికే.  ఇది అక్షరసత్యం.  బాబా అయోనిజ సంభవుడు.  దివినుంచి భువికి ఏతెంచిన ప్రత్యక్ష అవతారమూర్తి.  ఆయన సమాధి చెందినా కూడా ఇప్పటికి తన భక్తులందరి మీద తన ప్రకాశవంతమయిన కరుణాదృష్టిని ప్రసరింప చేస్తూనే ఉన్నారు. 
                              Image result for images of sai baba chilam

బాబా తన భక్తులకు ఎన్నో అనుభవాలను కలుగజేస్తూ ఉన్నారు.  ఆయన సంపూర్ణ పరబ్రహ్మ.  శ్రీమద్భగవద్గీతలో అత్యంత శక్టిమంతుడిని గురించి, పరబ్రహ్మం గురించి వర్ణించినవన్నీ సరిగా బాబాకు పూర్తిగా సరిపోలతాయనే విషయం చాలామంది భక్తులకు అనుభవమే.       

                         
                             (బ్రహ్మన్ , పరబ్రహ్మన్  గురించిన వివరణ వినండి)

నా బాల్యంలో నేను చూసిన ఆయన రూపాన్ని గుర్తు చేసుకున్నపుడెల్లా పరమానందంలో మునిగిపోతూ ఉంటాను.  బాబా చెప్పిన బోధనలను, ఆయన సంప్రదాయాన్ని నేను పూర్తిగా జీర్ణించుకొని ఆయన సూచించిన మార్గంలో ముందుకు పయనించేటట్లుగా నన్ననుగ్రహించమని ఆయనను ప్రార్ధించుకుంటూ ఉంటాను.  ఆరతిలో “జయమని జైసె భావ, తయా తైసా అనుభవ” (ఎవరు ఏభావంతో నన్ను కొలిస్తే వారికి అటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తాను) అని పాడేపాటలోని చరణాలు యదార్ధమని భక్తులకు అనుభవ పూర్వకంగా తెలుసు.  బాబా తాను *సర్వదేవతాస్వరూపుడిననడానికి సాక్ష్యంగా తన భక్తులు ఏదేవుని రూపంలో పూజిస్తే వారికి ఆరూపంలోనే సాక్షాత్కరించారు.  ఆవిధంగా దర్శనానుభూతిని పొందిన భక్తులెందరో చెప్పగా విన్నాను.  దీనికి నిదర్శనంగా నాకు కూడా ప్రత్యక్ష అనుభవం కలిగింది.  ఇటువంటి అనుభవాలు మనకు   జ్ఞానాన్ని ప్రసాదించి ఆధ్యాత్మిక కృషిలో మనకి మార్గదర్శకత్వం చూపుతుంది.  మనం ఒక్కసారి ఆయనకు శరణాగతి చేసుకుంటే చాలు,  మనకిక ఎటువంటి యోగా అవసరం లేదు.  కారణం ఆయనే సర్వాంతర్యామి ఆయన సంపూర్ణ పరబ్రహ్మ కాబట్టి.  శ్రీసాయిబాబా అనుగ్రహం వల్ల నేను, మాకుటుంబం పొందిన అనుభవాలను వర్ణించాలంటే ఎన్నో పేజీలు అవసరమవుతాయి.  అన్ని మతాలవారు శ్రీసాయిబాబా దర్శనం కోసం రావడం నేను కళ్ళారా చూసాను.  నేటికీ వారు ఆయన దర్శనం కోసం వస్తూ ఉన్నారు.  ఆయన దివ్యచరణాల వద్దకు ఏతెంచడానికి కుల, మత జాతి వివక్షణలు ఏమీ లేవు.  ఆయన దృష్టిలో అందరూ సమానులే.  ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలనే చిన్న ఉత్సుకతతో ఎవరయినా ఆయన దర్శనానికి వచ్చినవారికి వారిలో ఉన్నటువంటి పూర్వపు అహంభావం మాయమయిపోయి ఆయనయందు అమితమయిన భక్తి ఏర్పడేది.  ఆయన రూపం ఎంతో దివ్యంగాను. మహోన్నతంగాను, ఉండేది.  ఆయన సమక్షంలో ఉన్నపుడు పరబ్రహ్మానంద స్థితి కలుగుతూ ఉండేది.  ఆయన ఉదారమయిన స్వభావం, ఆయన వైఖరి ఆయన గొప్పతనం గురించి వర్ణించడానికి నాకు మాటలు చాలవు. ముస్లిమ్ ఫకీరులయినా, హిందూ సన్యాసులయినా, బాబాను దర్శించుకున్న మరుక్షణం తమను తాము మర్చిపోయేవారు.  ఎల్లపుడూ పరబ్రహ్మానంద స్థితిలోనే మునిగి ఉండే బాబా దివ్యత్వానికి ఆకర్షితులయి తమకు తెలియకుండానే ఆయన దివ్య చరణాలకు శరణాగతి వేడుకొనేవారు.  శ్రీ సాయిబాబా వారి సన్నిధిలో వారిలో పూర్వంనుంచీ ఉన్న మూఢత్వం, దురభిమానం అన్నీ పటాపంచలయిపోయేవి. 

ఒకవేళ సాయిబాబా ముస్లిమ్ అనుకుంటే హిందువులాగ ఆయన నుదిటి మీద అడ్డంగా విభూది గీతలు ఉండేవి.  మసీదులో ఆయన ఎదుట అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండేది.  ఆయన భక్తులందరినీ “అల్లా అఛ్చా కరేగా” అని దీవిస్తూ ఉండేవారు.  బాబాకు భక్తులు గౌరవభావంతో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆరతులు ఇస్తూ ఉండేవారు.  ఆ సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతూ ఉంది.  నేటికీ ఆయన ముస్లిమా లేక హిందువా అన్నది ఎవరికీ తెలియదు.  ఆయన ముందు ముస్లిమ్ లు నమాజ్ చేసేవారు.  హిందూ పండితులు వేదాలు చదివేవారు.  ఇదంతా నేను నాకళ్లతో ప్రత్యక్షంగా చూసాను.  ఇది ఎవరో చెప్పిన విషయం ఎంతమాత్రం కాదు.  సాయిబాబా రూపంలో ఈ భువిపై అవతరించిన ఆ నిరాకార పరబ్రహ్మ యొక్క దర్శనభాగ్యం నాకు కలిగినందుకు నేనెంతో అదృష్టవంతుడిని.  ఎవరయినా ఖచ్చితంగా బ్రహ్మం గురించి వర్ణించగలరా?  శరీరంలో మోక్షం పొందడానికి సిధ్ధంగా ఉన్న బ్రహం యొక్క స్థితిని, శరీరాన్ని వీడిన తరువాత స్థితి ఏవిధంగా ఉంటుందో ఎవరయినా ఖచ్చితంగా చెప్పగలరా?  ఈ ప్రశ్నకు సమాధానం శ్రీసాయిబాబా దర్శనంతో లభించింది.  నిరంతరం ఆయనని ధ్యానించడం ద్వారా  అసామాన్యమయిన ఆ మహాపురుషుని యొక్క స్వభావాన్ని గ్రహించగలరు.  అది ఆయన ఆడే జగన్నాటకం.  అందువల్లనే దాసగణు మహరాజ్ ఆయనను “శిరిడీ మాఝె పండరిపుర సాయిబాబా రమావర” (షిరిడీయే నా పండరీపురం) అని స్తుతించడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.  శ్రీసాయిబాబా మహావిష్ణు, శ్రిసాయిబాబా అవధూత.  షిరిడీ ఆరతిలో “దత్తావధూత, సాయి అవధూత” అన్న వాక్యాలు యదార్ధమయినవి.  శ్రీదత్తుడే శ్రీసాయిగా అవతారమెత్తి షిరిడీలో నివసించారు. 
                     Image result for images of sai baba baba chilam with devotees
శ్రీసాయిబాబా మానవాళికి ముక్తిని ప్రసాదించడమే కాదు, తన వద్దకు తీసుకొని వచ్చిన పులికి కూడా మోక్షాన్ని ప్రసాదించారు.  ద్వారకామాయిలో ఆ పులి చనిపోవడం నాకళ్ళారా చూసాను.  శ్రీసాయిబాబా వారి అపారకరుణ, అనుగ్రహంతో దాని  ఆత్మ అనంత విశ్వంలో లీనమయిపోవడం ఆసంఘటన ద్వారా దర్శించగలిగి ఉండేవాడిని.

ఆ సంఘటన గురించి వివరిస్తాను.
          Image result for images of sai baba baba chilam with devotees
ఒకరోజు మధ్యాహ్న ఆరతికి ముందు బాబా ద్వారకామాయిలో కట్టడాపై చేయి ఆనించి కూర్చొని ఉన్నారు.  ఆసమయంలో ఒక ఎద్దుబండి మీద ఒక పులిని తీసుకొని వచ్చారు.  దాని యజమాని ఆ పులిని చుట్టూ త్రిప్పుతూ సాయిబాబాముందు అది చేసే విన్యాసాలను ప్రదర్శింపచేయడం మొదలుపెట్టాడు.  అక్కడ ఉన్న భక్తులు ఆపులిని మెట్లెక్కించి సాయిబాబా పాదాల వద్ద దానిని తీసుకొని వెళ్ళి ఆయన ఆశీర్వాదాన్ని దానికి అందించమని బాబాను అడగమని దాని యజమానికి చెప్పారు.  ఆ యజమాని ఆ పులిని ద్వారకామాయి మెట్లెక్కించి బాబా వద్దకు తీసుకొని వెళ్ళాడు.  భక్తులందరూ చేసేటట్లుగానే ఆపులి ద్వారకామాయి మొదటి మెట్టుమీద తన తలను ఆనించింది.  ఆపులి ఎటువంటి బాధ లేకుండా వెంటనే మరణించింది.  బాబా ఆ పులికి మోక్షాన్ని ప్రసాదించారు.  దాని యజమాని తన జీవనాధారం పోయిందని విలపించాడు.  అక్కడ ఉన్నవారందరూ “ఏడవద్దు నీపులి ఎంతో అదృష్టం చేసుకొని బాబా వద్ద మోక్షాన్ని పొందింది” అని ఊరడించారు.  ఆ సమయంలో ఈ సంఘటన గురించి శ్రీసాయిబాబాని ఎవరూ అడగలేకపోయారు.  ముల్లోకాలలోను అటువంటి మహత్యం, కరుణ ఎందెందు వెదకినా కానరావు.  ఆయన రూపం మీదనే దృష్టినిలిపి ఆయననే తదేకంగా చూస్తూ ఉన్నవారు అనుభవించే అనుభూతి వర్ణించనలవిగానిది.  ఆసమయంలో నేను చాలా చిన్నపిల్లవాడిని.  అందువల్ల అపుడు జరిగిన సంఘటన యొక్క పూర్తి సమాచారం నేనర్ధం చేసుకోలేకపోయాను.
శ్రీ సాయిబాబా వారి మనోహరమయిన, దివ్యమయిన రూపాన్ని చూస్తూ ఆరూపాన్నే నాకనులనిండుగా నింపుకొని ఆపులికి మోక్షం కలిగినట్లుగానే నాకు కూడా కలిగితే ఎంత అదృష్టవంతుడినో కదా అని అనిపిస్తుంది నాకు.  శ్రీసాయినాధ్ మహరాజ్ మనకి మార్గాన్ని చూపే సద్గురువు.  మనందరిని చివరికి గమ్యానికి చేర్చే దైవం ఆయనే.  ఆయనే పరబ్రహ్మ, సద్గురువు.  ఈ భవసాగరాన్ని సురక్షితంగా దాటించి ఒడ్డుకు చేర్చే నావ.  అటువంటి సద్గురువు యొక్క వైభవాన్ని కీర్తిస్తూ, ఆయనకి నమస్కరించుకుంటూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.
                                                    
                                                 శ్రీ అనంత్ జయదేవ్ చితంబర్
                                            మార్చ్, 1978 శ్రీసాయి లీల మాసపత్రిక
                                                    ఆంగ్లానువాదమ్  పర్ణ కిషోర్

(* శ్రీ సాయి సత్ చరిత్ర 12 వ.అద్యాయంలో మూళే శాస్త్రికి అతని గురువయిన ఘోలప్ స్వామిగా బాబా దర్శనమిచ్చుట, డాక్టరు బ్రాహ్మణుడు రామోపాసకుడు.  ఆయనకి శ్రీరామునిగా దర్శనమిచ్చుట. 28 వ.అధ్యాయంలో మేఘా బాబాను శంకరునిగా భావించి గంగా జలముతో స్నానము చేయించుట.
29 వ.అధ్యాయంలో మద్రాసు భజన సమాజములోని స్త్రీకి బాబా రామునివలె దర్శనమిచ్చుట….. శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్న వారికి ఈ విషయాలన్నీ గుర్తుకు వస్తాయి….   త్యాగరాజు)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List