Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, August 14, 2018

నాస్తికుడు కూడా ఆస్తికుడిగా మారగలడు...బాబా ఊదీ మహిమ

Posted by tyagaraju on 6:46 PM

         Image result for images of shirdi sai baba
                Image result for images of rose hd

14.08.2018  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అత్యద్భుతమయిన బాబా లీలను ప్రచురిస్తున్నాను.  బాబా ఊదీ ప్రభావంతో దేవుడు లేడు అని వాదించేవాడు కూడా దేవుడు ఉన్నాడు అని ప్రగాఢంగా విశ్వసించే సంఘటనలు జరుగుతాయి.  అటువంటి సంఘటన ఏ విధంగా జరిగిందో ఈ రోజు మనమందరం తెలుసుకుందాము.  మన సాయి భక్తులందరికీ ఇది మరొక మధురామృతమ్.
సాయిలీల మాసపత్రిక డిసెంబరు 1983 వ.సంచికలో ప్రచురింపబడింది.  సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్  :  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆట్లాంటా  (అమెరికా)  :  ఫోన్  :  1571 594 7354

నాస్తికుడు కూడా ఆస్తికుడిగా మారగలడు...బాబా ఊదీ మహిమ

1972 వ.సంవత్సరం జనవరి నెలలో నేను, నాభార్య ఇద్దరం కాలినడకన యాత్రకు బయలుదేరాము.  మా యాత్రలో మాకు ఒక అధ్భుతమయిన అనుభవం కలిగింది.  జనవరి 16వ.తారీకున అమరావతి నుండి చందూర్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకొన్నాము.  అలసిపోయిన కారణంగా అక్కడ కొంతసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాము. 


ఇంతలో ఇద్దరు యువకులు మాదగ్గరకు వచ్చారు.  వారిద్దరూ తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు.  వారు మాతో “మహరాజ్, మీరిక్కడ ఎందుకని కూర్చున్నారు?  నింభోరాలో మహారాష్ట్రనుంచి వచ్చిన సాధువుల సమ్మేళనం జరుగుతూ ఉంది.  వారందరూ అక్కడ సమావేశమయ్యారు.  మీరు కూడా అక్కడికి రావాల్సిన అవసరం ఉంది.  మాతో కూడా రండి” అన్నారు.  వారి మాటలు విన్న మాకు చాలా ఆశ్చర్యం కలిగింది.  ఎందుకంటే నింభోరా గ్రామం గురించి మాకసలు ఏమీ తెలీదు.  మా సందిగ్ధావస్థను చూసి ఆయువకులలో ఒకతను, “మీరేమీ కంగారుపడద్దు, సందేహించద్దు, మేము మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకుని వెడతాము” అన్నాడు.  ఇక మా నిర్ణయం కోసం ఎదురు చూడకుండానే నా చేతిలో తలని రైల్వే స్టేషన్ కి తీసుకున్న రెండు టిక్కెట్లను ఉంచాడు.  నింభోరా గ్రామం తలనీ రైల్వేస్టేషన్ కి దగ్గరలోనే ఉంది.  మాతోపాటుగా వారిద్దరూ తలనీ రైల్వే స్టేషన్ లో దిగి ఇక తాము వచ్చిన పని పూర్తయిపోయిందని చెప్పి వెళ్ళిపోయారు.  

వారు వెళ్ళిపోగానే మేము నుంచున్న చోటకి అయిదుగురు వ్యక్తులు మాదగ్గరకు వచ్చారు.  వారు మమ్మల్నిద్దర్నీ సాధువులందరూ బస చేసిన శ్యాంబాబా గారింటికి తీసుకొని వెళ్ళారు.  మాకు వారు భోజనం పెట్టి మా ఆకలిని శాంతింపచేశారు.  ఆ తరువాత శ్యాంబాబాగారు మమ్మల్ని భజన జరుగుతున్న వేదిక దగ్గరకు తీసుకొని వెళ్ళారు.  అక్కడ చాలామంది ఉన్నారు.  ఆకార్యక్రమంలో మేము కూడా ఒక గంటసేపు భజనలు చేశాము.

అక్కడ ఆసాధువుల సమ్మేళనం 1972, జవరి 16 న మొదలయి 21 వ.తారీకుతో పూర్తయింది.  21వ.తారీకున దహి - కాలా కార్యక్రమం ఏర్పాటు చేసారు.  సాధువులయిన శ్రీ పన్ హ్లె గావోంకర్, శ్రీ గులాబ్ బాబా, శ్రీ హరిహర్ మహరాజ్, శ్రీ గోత్యామహరాజ్, శ్రీ పుండరీక బాబా, వీరందరూ కూడా సమ్మేళనానికి వచ్చారు.  మమ్మల్ని చూసి మా రాకకు వారు ఎంతో సంతోషించారు.  భజన పూర్తయిన తరువాత మాకు ఈ సమ్మేళనానికి ఆహ్వానం ఏవిధంగా లభించిందో వివరంగా చెప్పాము.  అపుడు శ్రీహరిహర మహరాజ్ గారు “మీరిద్దరూ చాలా అదృష్టవంతులు.  శ్రీసాయిబాబాయే స్వయంగా మిమ్మల్ని ఈ సమ్మేళనానికి అహ్వానించారు.  ఆ ఇద్దరు యువకులు సాయిబాబా తప్ప మరెవరూ కాదు” అన్నారు.

ఇపుడు అక్కడ జరిగిన ఊదీ మహత్యం గురించి వివరిస్తాను.  

నింభోరా గ్రామంలోని ఒక ప్రాధమిక పాఠశాలలో తుకారాం అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు.  అతను శుధ్ధనాస్తిక వాది.  దైవిక శక్తులను అస్సలు నమ్మడు.  గ్రామంలోనివారందరూ అతనిని ఒక విచిత్రమయిన వ్యక్తి అని భావిస్తారు.  మేము ఆ నింభారు గ్రామంలో ఉండగా ఆయనతో పరిచయం కలిగింది.  మొట్టమొదట్లో ఆయన మాతో బాగా వితండ వాదం పెట్టుకున్నాడు.  తరవాత తరవాత మాయందు నమ్మకం ఏర్పడింది.  సాధువుల సమ్మేళనం ముగిసింది.  కాని శ్యాంబాబాగారు, గ్రామ ప్రజలు మమ్మల్ని నెలరోజుల వరకు వదలలేదు.  ఈ సమయంలో తుకారాం మాష్టారు గారికి మామీద పూర్తి నమ్మకం కలిగింది.  మేము నింభోరానుంచి తిరిగి వెళ్ళేటపుడు తుకారాం గారికి సాయిబాబా ఊదీనిచ్చి, దానిని ఎపుడయినా అత్యవసర సమయాలలో ఉపయోగించమని చెప్పాము.   శ్రీసాయిబాబా సహాయాన్ని ప్రత్యక్షంగా అనుభవించవచ్చని చెప్పి తిరుగు ప్రయణమయ్యాము.

చాలా కాలం తరువాత మేము తుకారాం మాష్టారుగారిని కలుసుకున్నపుడు ఆయన తనకు కలిగిన అధ్భుతమయిన అనుభవాన్ని వివరించారు.

అది 1975 వ.సంవత్సరం దీపావళి పండుగ రోజులు.  గ్రామస్థులందరూ దీపావళి పండుగ ఏర్పాట్లలో మునిగిఉన్నారు.  తుకారాం మాష్టారుగారి భార్య కూడా పండుగ ఏర్పాట్లు చేసుకోవడంలో తలమునకలై ఉంది.  ఆమె అప్పుడు గర్భవతి.  తొమ్మిదవ నెల. రోజులు గడుస్తున్నాయి.  పండుగ సందర్భంగా ఒకరోజున ఆమె గోడకు నిచ్చెన వేసుకొని నిచ్చెన పైమెట్టుమీద నుంచుని గోడను శుభ్రంచేస్తూ అలుకుతూ ఉంది.  అకస్మాత్తుగా ఆమె నిచ్చెన పైమెట్టు మీదనుంచి పట్టుతప్పి క్రిందపడి స్పృహ కోల్పోయింది.  వెంటనే ఆమెను వార్ధా తీసుకువెళ్ళి ఆస్పత్రిలో చేర్చారు.  వైద్యులు పరీక్షించి ఒక కాలికి ఫ్రాక్చర్ అయిఉండవచ్చని చెప్పారు.  ఆ కాలుకు కట్టు కట్టాల్సి ఉంటుందని చెప్పి కాలుకి పట్టీవేసి కట్టుకట్టారు.  ఈ లోపుగా ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.  కేసు చాలా సీరియస్ అయింది.  నిచ్చెన మీదనుంచి పడటం వల్ల శరీరం లోపల కూడా ఏమయిన ప్రమాదకరమయిన దెబ్బలు, గాయాలు అయి ఉండవచ్చన్నాడు వైద్యుడు.  ఇటువంటి సమయంలో సుఖప్రసవం జరగడం కూడా కష్టమే, అది కూడా చాలా చాలా అరుదుగా జరుగుతుందని చెప్పాడు.  వెంటనే ఆమెను ఆపరేషన్ ధియేటర్ లోకి తీసుకు వెళ్ళారు.

ఆ సమయంలో తుకారాం మాష్టారుగారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.  ఏమి జరుగుతుందోననే ఆందోళనతో ఉన్నారు.  పిల్లలు ఒక్కళ్ళు నింభోరాలోనే ఉన్నారు.  ఆయన ఆర్ధిక స్థోమత కూడా అంతంత మాత్రమే.  ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.  భార్య ఆపరేషన్ ధియేటర్ లో చావుబ్రతుకుల మధ్య పోరాడుతూ ఉంది  ఆపరేషన్ బల్లమీద అచేతనంగా పడి ఉంది. డాక్టర్ బయటకు వచ్చి “ఇద్దరిలో శిశువును గాని, తల్లిని గాని ఎవరో ఒక్కరినే మేము బ్రతికించగలం” అని చెప్పాడు.  మాష్టారుగారు తన భార్యను ఎలాగైనా బ్రతికించమని డాక్టర్ ను వేడుకొన్నాడు.

ఆసమయంలో తుకారాం గారికి నేనిచ్చిన సాయిబాబా ఊదీ జ్ఞప్తికి వచ్చింది. బాబా దయ వల్ల ఆఊదీ ఆసమయంలో ఆయన జేబులోనే ఉంది.  నేను చెప్పిన మాటలలో నిజమెంతో పరీక్షిద్దామనే ఆలోచన ఆయనలో కలిగింది.  ఆయన వెంటనే ఆపరేషన్ ధియేటర్ లోకి పరుగెత్తుకుని వెళ్ళి తన భార్యను ఒక్కసారి చూస్తానని ఆమె దగ్గరకు పంపించమని డ్యూటీలో ఉన్న నర్సుని ప్రాధేయపడ్డాడు. లోపలికి వెళ్ళి  బాబాని ప్రార్ధిస్తూ కొంత ఊదీని భార్య నోటిలో వేసి, మరికొంత ఊదీని ఆమె నుదిటిమీద రాసాడు.  మరికొంత ఊదీని కట్టు కట్టిన కాలుకు రాసాడు.  ఇక భారమంతా సాయిబాబా మీదే వేసి ఆపరేషన్ ధియేటర్ నుంచి బయటకు వచ్చాడు.
                          Image result for images of shirdi sai baba
15 నిమిషాలలో ఆపరేషన్ ధియేటర్ నుండి నర్సు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి “డాక్టర్, డాక్టర్, లోపల ఉన్నామెకు మగబిడ్డ పుట్టాడు.  తల్లి, పిల్లవాడు ఇద్దరూ క్షేమం” అంటూ అరిచి చెప్పింది.  ఆపరేషన్ ధియేట లోనుండి పిల్లవాడి ఏడుపు కేర్ కేర్ మని వినిపించింది.  డాక్టర్ వెంటనే ఆపరేషన్ ధియేటర్ లోకి వెళ్ళి 5 నిమిషాల తరువాత బయటకు వచ్చాడు. “తుకారాం గారూ, అంతా సవ్యంగా జరిగింది.  మీభార్య ప్రమాదంనుండి క్షేమంగా బయటపడింది.  ఆమెకు ఇక ఎటువంటి ప్రమాదం లేదు”. అని చెప్పాడు.  తుకారాం మనఃస్ఫూర్తిగా సాయిబాబాను ప్రార్ధించుకుని మనసులోనే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.  డాక్టర్ కు సాయిబాబా ఊదీ గురించి వివరంగా చెప్పగానే డాక్టర్ తో పాటు అక్కడున్నవారందరూ చాలా ఆశ్చర్యపోయారు.
సాయంత్రం డాక్టర్ ఆమెను చాలా నిశితంగా పరీక్షించి ఆమె కాలుకి ఏవిధమయిన ఫ్రాక్చర్ లేదని చెప్పాడు.  అదేరోజు ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చని చెప్పాడు.  ఆరోజు గురువారమ్.  ఆయనకు నేను ఊదీ ఇచ్చిన కారణంగా తన కొడుకుకి “సంజయ్” అని నాపేరు పెట్టుకున్నాడు.  ఇపుడు సంజయ్ కి 8 సంవత్సరాలు.  చాలా తెలివైనవాడు.

దీనికి సంబంధించిన గొప్పతనమంతా శ్రీసాయిబాబాది, ఆయన ఊదీది అని చెప్పనవసరం లేదు.
                                                                                         స్వామి సంజయానంద్
                                                                                        బదరీనాధ్,  హిమాలయ

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment