19.12.2019 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 12 వ.భాగమ్
29. ద్వారకామాయి - ధుని
షిరిడీ ద్వారకామాయిలో శ్రీసాయి వెలిగించిన ధుని ఈనాటికీ మండుతూనే ఉంది. అనేకమంది భక్తులకు ధునినుండి వచ్చే ఊదీ ప్రసాదముగా పంచబడుతూ ఉంది. ఈ ధుని గురించి కొన్ని విషయాలు చాలామందికి తెలియవు.
శ్రీసాయి ధుని కోసం కట్టెలను కొని ద్వారకామాయిలో నిలువ చేసేవారు. షిరిడీలో ఒక సారి కలరా వ్యాధి ఉన్న సమయంలో షిరిడీ గ్రామస్థులు షిరిడీలో కట్టెలు అమ్మరాదని ఆజ్ఞాపంచారు. బాబా ఈ మూఢాచారానికి వ్యతిరేకముగా కట్టెలబండిని పిలిపించి ధునికోసం కట్టెలను కొని నిలవుంచారు.
ఒకసారి బాబా అంకిత భక్తుడు శ్రీ జి.జి.నార్కే ద్వారకామాయికి వచ్చాడు. అదే సమయంలో ఒక బండినిండా కట్టెలు అమ్మేవ్యక్తి వచ్చి బాబాను ధుని కోసం కట్టెలను కొనమని ప్రాదేయపడ్డాడు. ఆవ్యక్తిని చూసి బాబా జి.జి.నార్కేను పిలిచి ఈ కట్టెలుఅమ్మేవాడు నీకు క్రిందటి జన్మలో మంచి స్నేహితుడు. నీవు చేసుకొన్న మంచి కర్మలతో ఈజన్మలో నీవు ఉన్నత విద్యలు అభ్యసించి పూనాలోని దక్కన్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నావు. నీస్నేహితుడు తాను చేసుకొన్న పాపకర్మలను అనుభవించటానికి ఈజన్మలో కట్టెలుకొట్టుకొని తన జీవనాన్ని సాగించుతున్నాడు. నీవు వానికి రెండురూపాయలు ఇచ్చి ఈబండెడు కట్టెలను ద్వారకామాయిలోని ధుని కోసం కొనమని చెప్పారు. శ్రీ జి.జి.నార్కే కన్నీరుతో తన క్రిందటి జన్మ స్నేహితుని కౌగలించుకొని వానికి రెండు రూపాయలు ఇచ్చి ధుని కోసం కట్టెలను కొన్నాడు. శ్రీసాయి భక్తులకు ధునినుండి వచ్చే ఊదీ అనేక వ్యాధులను నిర్మూలించుతున్న గొప్ప ఔషధముగా ఈనాడు వాడుతున్నారు.
30. శ్రీషిరిడీసాయి సమాధి మందిర్ - బూటీవాడ
నేటి షిరిడీ సాయిబాబా సమాధిమందిరానికి ముందు అనగా 1915 వ.సంవత్సరము వరకు బాబా ఆస్థలములో పూలతోటను పెంచేవారు. బాబా అంకితభక్తుడు గోపాల్ ముకుంద్ బూటీ ఆస్థలాన్ని 1915 వ.సంవత్సరము డిసెంబర్ లో కొన్నాడు.
ఆ స్థలంలో తాను నివసించటానికి మరియు మురళీధరుని మందిరాన్ని నిర్మించడానికి 30.12.1915 నాడు మురళీధరుని మందిరనిర్మాణమును ప్రారంభించాడు. ఈ మందిర నిర్మాణము 1918 నాడు పూర్తయినా అనేక కారణాల వల్ల మురళీధరుని విగ్రహ ప్రతిష్ఠాపన పని జరగలేదు. 15.10.1918 నాడు బాబా తన ఆఖరి శ్వాస తీసుకొనుచున్న సమయంలో తనను బూటీ నిర్మించిన వాడాలోకి తీసుకొని వెళ్లమని కోరారు. ద్వారకామాయిలో తన తుది శ్వాసను తీసుకొన్నారు. 15.10.1918 నాడు బాబాయొక్క హిందు – ముస్లిమ్ భక్తులు బాబా పార్ధివ శరీరాన్ని ఎక్కడ సమాధి చేయాలని తర్జన భర్జనలు చేసారు. ఆఖరికి అందరూ 16.10.1918 నాడు బాబా పార్ధివ శరీరాన్ని బూటీవాడాలో మహాసమాధి చేయాలని నిర్ణయించుకొన్నారు. ఆనాడు సాయంత్రము 4 గంటలకు ఊరేగింపుగా బాబా పార్ధివశరీరాన్ని ద్వారకామాయినుండి బూటీవాడాకు తీసుకొని వచ్చి మురళీధరుని విగ్రహప్రతిష్టాపనకు నిర్ణయించిన స్థలములో అనగా బూటీవాడాలోని భూగృహములో మహాసమాధి చేసారు.
బాబా పార్ధివ శరీరాన్ని ఏడు అడుగుల పొడవుగల గోతిలో బాబాకు ఇష్టమయిన ఇటుకను రెండు ముక్కలను వెండితీగతో కట్టి ఆ ఇటుకను బాబా శిరస్సు క్రింద ఉంచారు.
బాబా చాంద్ పాటిల్ పెళ్ళివారితో వచ్చినపుడు ఆయన ధరించిన ఆకుపచ్చని జుబ్బా మరియు కఫనీతోపాటు శిరస్సుపై ధరించిన టోపీని ఒక సంచిలో పెట్టి ఆగోతిలో ఉంచారు. బాబా నిత్యము వాడే సటకాలలో ఒక సటాకాను, ఒక చిలుము గొట్టమును, ఆయన తన చినిగిన కఫనీలను కుట్టుకొనే సూది, దారము కండిని కూడా ఉంచారు. బాబా శరీరముపై అత్తరు చల్లారు. పూలరేకులతో కప్పారు. తెల్లని నూతన వస్త్రమును చుట్టారు.
ఈ విధముగా బాబా మహాసమాధి కార్యక్రమము 17.10.1918 తెల్లవారుజాము వరకు సాగింధి. బాబా మహాసమాధి అనంతరము సమాధికి 17.10.1918 ఉదయము హారతి ఇచ్చారు. ఆనాటినుండి నేటివరకు బాబాకు నిత్యము నాలుగు హారతులు ఇవ్వడం జరుగుతూ ఉంది.
1954 సంవత్సరము వరకు భూగృహముపైన ఉన్న స్థలములో బాబాపటమునకు నాలుగు హారతులు ఇవ్వసాగారు.
1954 వ.సంవత్సరములో బొంబాయి హార్బరులో ఇటలీనుండి వచ్చి పడిఉన్న పాలరాయిని కొందరు భక్తులు వేలంపాటలో కొని షిరిడీసాయి సంస్థానమువారికి అప్పగించారు. శ్రీ బాలాజి తాలిమ్ విగ్రహాన్ని చెక్కారు.
బాబా పాలరాతి విగ్రహాన్ని శ్రీ సాయి శరణానంద్ ప్రతిష్టించారు. షిరిడీ సాయి సంస్థానము బాబా మహాసమాధి చెందిన తర్వాత 17.10.1918 నాడు 15 మంది సభ్యులతో శ్రీగోపాల్ ముకుంద్ బూటీ చైర్మన్ గాను, శ్రీ హేమాద్రిపంతు సెక్రటరీగాను ఒక సంస్థానము స్థాపింపబడింది ఆనాడు స్థాపించిన షిరిడీ సంస్థాన్ నేడు షిరిడీ సాయి భక్తులకు సేవ చేస్తున్నది. కాలక్రమములో షిరిడీ సంస్థానం సభ్యులు మారుతున్నారు. షిరిడీ దినదినాభివృధ్ధి చెందుతున్నది. ప్రపంచములోని కోటానుకోట్లమంది సాయిభక్తులు నేడు షిరిడీకి వచ్చి బాబా పాలరాతి విగ్రహములో బాబా జీవకళను దర్శించుకొని తరిస్తున్నారు. ఆనాడు గోపాల్ ముకుంద్ బూటీ మహాసమాధి మందిరాన్ని నిర్మించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన ధన్యజీవి.
(మరికొన్ని వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment