22.12.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 13 వ.భాగమ్
31. శ్రీ సాయి దినచర్య
శ్రీ సాయిబాబా షిరిడీలో ద్వారకామాయిలో తన దినచర్యను ఏవిధముగా చేసేవారు అనే విషయాన్ని శ్రీ సాయి సత్ చరిత్ర మరాఠీభాషలో శ్రీహేమాద్రిపంతు వ్రాసారు. అందులో ముఖ్యముగా బాబా అంకిత భక్తుడు శ్రీహరి సీతారామ్ దీక్షిత్ తన ఉపోధ్ఘాతములో వివరముగా వ్రాసారు.
ఉపోద్ఘాతములో :
శ్రీసాయి తెల్లవారుజామున ద్వారకామాయిలో నిద్రనుండి లేచి ద్వారకామాయిలోని నిర్దేశించబడిన స్థలములో మలమూత్రవిసర్జన చేసి, తన కాళ్ళు చేతులు శుభ్రము చేసుకొని ధునిముందు కూర్చుని ధ్యానము చేసేవారు. సూర్యోదయము కాగానే బాబా తన స్వహస్థాలతో తన మలమూత్రాలను తీసి ద్వారకామాయి అవతల పారవేసేవారు. ఆతరువాత భాగోజీ షిండే వచ్చి బాబా కాలిన చేతికి నేతితో మర్ధనా చేసి ఆకుతో కట్టుకట్టేవాడు.
ఆతరువాత బాబా తన భక్త బృందముతో కలిసి లెండీబాగ్ కు వెళ్ళి అక్కడ దైవప్రార్ధనలు చేసి ఆ తరువాత ఐదు ఇళ్ళకు భిక్షకు వెళ్ళి వచ్చేవారు.
తాను తెచ్చిన భిక్షలోనుండి ద్వారకామాయిలో పని చేసే స్త్రీకి కొన్ని రొట్టెలు ఇచ్చేవారు. కొన్ని రొట్టెలను కాకులకు, పిల్లులకు పెట్టేవారు. ఆ తర్వాత మిగిలిన రొట్టెలను తాను తినేవారు. మధ్యాహ్న సమయములో తనవద్దనున్న రాగినాణాలను తీసికొని వాటిని తన భక్తుల పేర్లను ఉచ్చరించుతూ తన చేతిబొటనవ్రేలితో రుద్దేవారు.
తన చినిగిన కఫనీని తనే స్వయంగా సూదీదారముతో కుట్టుకొనేవారు. మిగతా సమయాలలో తన భక్తులతో కలిసి దర్బారును నిర్వహించేవారు. ఆయనకు దినచర్యలో మహల్సాపతి, భాగోజీషిండే, మాధవరావు దేశ్ పాండేలు ఎక్కువ సహాయము చేసేవారు.
ఈవ్యాసములో తెలిపిన వివరాలు అన్నీ తెలుగుభాషలో శ్రీసాయి సత్ చరిత్ర హేమాద్రిపంత్ మరాఠీ భాషలో వ్రాసిన విషయాలను, శ్రీమతి మణెమ్మగారు 1995 లో హైదరాబాద్ లోని కిషన్ బాగ్ సాయి మందిరము ఆధ్వర్యములో తెలుగులో అనువాదము చేసారు. నేను ఆపుస్తకమునుండి శ్రీసాయి దినచర్య వివరాలను సేకరించి ఇక్కడ ప్రచురిస్తున్నాను. (ఉపోద్ఘాతము పేజీ నంబరు.. 12) … త్యాగరాజు
32. గౌరి కళ్యాణం
శ్రీ సాయి సత్ చరిత్రలోని వీరభద్రప్ప – చెన్నబసప్పల కధలో బాబా అన్నమాటలు మరియు ద్వారకామాయిలో బాబా దర్బారులో ఉండగా ఒక భక్తుడు వచ్చి తాను మతం మార్చుకొని వచ్చానని అన్నప్పుడు బాబా అన్నమాటలను ఈ వ్యాసంలో ఒక సారి గుర్తు చేసుకొందాము.
మతము మార్చుకొన్న ఒక భక్తుడిని బాబా అందరిసమక్షములో నీతండ్రిని మార్చినావా నీవు చేసినది తప్పు అని చెప్పారు. దీనితో బాబా మత మార్పిడికి వ్యతిరేకము అని తెలుస్తోంది.
బాబా పూజారి కుమార్తె గౌరిని వీరభద్రప్పకు ఇచ్చి వివాహము చేసిన సంఘటనలో మనకు బాబా తెలియచేసిన విషయాలు గుర్తు చేసుకొందాము.
వివాహానికి ముందు వధూవరుల కులగోత్రాలు, జాతకములను చూసి అన్నీ సవ్యముగా ఉన్నట్లయితేనే మంచి ముహూర్తములో వివాహము జరిపించవలెను అని చెప్పారు.
బాబా ఇదేపద్ధతిలో పూజారి కుమార్తె అయిన గౌరిని వీరభద్రప్పకి ఇచ్చి వివాహము జరిపించారు.
శ్రీసాయి సత్ చరిత్ర ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏమిటంటే పరధర్మము ఎంత గొప్పదయినా స్వధర్మమునే పాటించాలి. ఇదే విషయము భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి ఉపదేశించారు. బాబా జ్యోతిష్యశాస్త్రానికి వ్యతిరేకంకాదు. వధూవరులు పెండ్లి నిశ్చయము జరిగిన తర్వాత మంచి ముహూర్తములో ఆపెండ్లి జర్పించవలసినదని చెప్పారు.
(క్రిందటి గురువారమునుండి సాయిబానిస గారి రచనలు కొన్ని హిందీ భాషలో కూడా ప్రచురిస్తున్నాను... హిందీ భాషలోకి అనువాదము చేస్తున్న సాయి భక్తురాలు శ్రీమతి మాధవి, భువనేశ్వర్)
(రేపటి సంచికలో హైదరాబాద్ లో జరిగిన విశ్వశాంతి గాయత్రి శాంతి హోమం విషయాలను శ్రీమతి మాధవిగారు వివరిస్తారు...)
(మరికొన్ని వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment