26.09.2020 శనివారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
“ఆరతి సాయిబాబా” అని బాబా ఆరతిని రచించిన శ్రీ మాధవరావు అడ్కర్ గురించిన వ్రుత్తాంతాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను. మూడవభాగం
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబరు 2011 వ.సంవత్సరంలో ప్రచురితమయింది.
శ్రీమతి ముగ్ధా సుధీర్ దివాద్కర్
61, హిందూ కాలనీ, మొదటి లేన్
దాదర్ (ఈస్ట్), ముంబాయి
మారాఠీనుండి ఆంగ్లానువాదం - సుధీర్
మాధవరావు
అడ్కర్ -
4 వ.భాగం
తెలుగు అనువాదం -
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
బలీయమైన
కోరిక
మాధవరావుకి
షిరిడీ వెళ్ళకపోతె మనసంతా అస్థిమితంగా ఉండేది.
అతని మనస్సు షిరిడీలో ఉండాలని తహతహలాడుతూ ఉండేది. రామనవమి ఉత్సవాలు తొందరలోనే జరగబోతున్న సమయం. ఆసందర్భంగా ఎంత వీలయితే అంత తొందరగా షిరిడీకి వెళ్ళానిపించింది
అతనికి. కాని అపుడు అతనికి ఆరోగ్యం సరిగా లేదు. షిరిడీకి ఎలా వెళ్ళడమా అని చాలా మధన పడుతూ ఉన్నాడు. సరిగా ఆసమయంలోనే ఇద్దరు స్నేహితులు వచ్చారు. వారు మాధవరావుని అతి జాగ్రత్తగా షిరిడీకి తీసుకుని
వెళ్ళారు.
ఆ విధంగా బాబాగారు తన భక్తుల అంతరంగంలోని బలీయమైన కోరికలను తెలుసుకుని వాటిని నెరవేరుస్తారని మనం గ్రహించుకోవచ్చు.
మాధవరావు షిరిడీలో ఉన్నప్పుడెల్లా ప్రతిక్షణం బాబా తనని కనిపెట్టుకుని ఉంటూ తన యోగక్షేమాలను చూస్తూనే ఉన్నారనే అనుభూతికి లోనవుతూ ఉండేవాడు. ఒకసారి యధాప్రకారంగా మసీదు లోపలికి వెడదామనుకున్నాడు. కాని అప్పటికే మసీదు ముందర ఎంతోమంది భక్తులు లోపలికి వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. భక్తుల సమూహం బాగా ఎక్కువగానే ఉంది. అందుచేత మసీదు ముందర ఉన్న కావలివారు మాధవరావుని మొట్టమొదటగా మసీదులోకి వెడతానంటే వెళ్ళనివ్వడంలేదు.. అప్పుడె బాబా “మాధవరావుని లోపలికి రావివ్వండి.” అని సందేశం పంపించారు.
బాబా
ఆవిధంగా సందేశం పంపించారని తెలియగానే మాధవరావుకి ఎంత ఆనందం కలిగిందో ఆయన మనసులో కలిగిన
భావాలు ఎంతగా ఉన్నాయో ఊహించుకోండి.
మాధవరావు
గురించి పూర్తి అవగాహన…
మాధవరావు
గత జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్లనే అతనికి శ్రీసాయిబాబాలాంటి సద్గురువు లభించారు. కాని షిరిడీయే కాకుండా ఇతర పుణ్యక్షేత్రాలయిన కాశీ,
రామేశ్వరం, బాలాజీ, గాణుగాపూర్, నర్శోబావాడి, మాహుర్, తుల్జాపూర్, పండరీపూర్, ఇంకా
మరికొన్ని క్షేత్రాలకి మాటిమాటికీ వెడుతూ ఉండేవారు. ఆవిధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన సందర్భాలలో మహాపురుషులయిన
గజానన్ మహరాజ్, అక్కల్ కోటస్వామి, బాలభీం మహరాజ్, సాఖ్యస్వామి దెహుకర్, వసకర్, వ్యంకట్
స్వామి, వినాయకబువా, దాదా మహరాజ్ లాంటి ఇంకా ఎందరో మహిమాన్వితులయినవారిని దర్శించుకుని
వారి ఆశీస్సులను కూడా పొందారు.
మాధవరావు
చాలా శ్రావ్యంగా పాడేవాడు. అతను అన్ని రకాలయిన
మతగ్రంధాలను, చారిత్రక పురాణాలను, ఇతిహాసాలను బాగా అధ్యయనం చేసాడు. అందువల్లనే అతను తన శ్రావ్యమయిన కంఠంతో పాడే పాటలను,
కీర్తనలను, భజనలను, అతను చెప్పే ప్రవచనాలను ప్రజలు ఎంతో ఆసక్తితో ఆలకించేవారు.
మాధవరావు
ఆశువుగా పద్యాలు చెప్పగలిగేవాడు. అయినప్పటికి
ఎటువంటి అహంకారం లేకుండా అతను గొప్ప కవిలాంటి
దాసగణుగారికి ఎప్పుడూ శిరసు వంచి నమస్కారం చేసుకునేవాడు. దాసగణు ఎప్పుడు కీర్తనలు పాడినా వాటికి తప్పకుండా
హాజరవుతూ శ్రధ్ధగా వినేవాడు. దాసగణు పాడే కీర్తనలు,
పద్యాలు అతనికి కంఠతా వచ్చు. ఒకసారి మాధవరావు
షిరిడీలో ఉన్నపుడు అతను శ్రీ ఏకనాధమహరాజ్ గారి
మీద దాసగణు వ్రాసిన కీర్తనను చాలా శ్రావ్యంగా
పాడాడు.
దాసగణుకి ప్రతిరోజు విష్ణుసహస్రనామాన్ని 12 సార్లు చదువుతూ ఉండటం అలవాటు. అతను ఆవిధంగా చదవడం చూసి మాధవరావు కూడా అదేవిధంగా
చదవడం మొదలుపెట్టాడు. ఈవిధంగా అతను తను మరణించేవరకు
ఇదే పధ్ధతిని కొనసాగించాడు. ఇప్పటికీ అతని
కుటుంబంలోని కొంతమంది ఇదే పధ్ధతిని అనుసరిస్తూ ఉన్నారు.
షిరిడీలో
జరిగే రామనవమి ఉత్సవాలకి దాసగణుతో పాటుగా మాధవరావు క్రమం తప్పకుండా వెడుతూ ఉండేవాడు. ఈవిధంగా 1952 వ.సంవత్సరం వరకు కొనసాగింది.
మాధవరావుకి
జ్యోతిష్యంలో మంచి నైపుణ్యం ఉంది. ఖాళీ సమయాలలో
అతను తన వద్దకు వచ్చే ఎంతో మందికి జాతక చక్రాలు వేస్తూ ఉండేవాడు.
ఉత్తరాలు
రాయడంలో ఆసక్తి …
అతనికి
ఉత్తరాలు రాయడమంటె మహా ఇష్టం. అతను రాసే ఉత్తరాలలో
కుటుంబం గురించిన విషయాలు అతి తక్కువగా ఉండేవి.
ఎక్కువభాగం ఆధ్యాత్మిక విషయాలు, సలహాల గురించి ఉత్తరాలలో ఎక్కువగా ప్రస్తావిస్తూ
రాసేవారు. చాలా తరచుగా వాటిలో ఎంతో పూజ్యభావంతో
దాసగణు గురించి రాస్తూ ఉండేవాడు.
ఉత్తరం
ప్రారంభించేముందుగా పైన ‘శ్రీ శంకర్’ అని రాసి ప్రారంభించేవాడు. దాసగణుకు కూడా ఇదే అలవాటు. తను రాసే ఉత్తరాలకి మరొక నకలును తన కుమారుడయిన శ్రీరామచంద్ర
పంత్ కి కూడా పంపిస్తూ ఉండేవాడు.
అతను
తనతండ్రి పంపించే ఉత్తరాలని ఎంతో భక్తిభావంతో జాగ్రత్తగా భద్రపరిచేవాడు.
మాధవరావు,
దాసగణులమధ్య ఉత్తరప్రత్యుత్తరాలు చాలా ఎక్కువగా చెప్పుకోదగినంత స్థాయిలోనే జరుగుతూ
ఉండేవి. అతను దాసగణుకే కాక ఇంకా ఇతర భక్తులయిన
శ్రీసాయి శరణానంద్, నానాసాహెబ్ చందోర్కర్, జి.టి.కామికి, రావుబహద్దూర్ సాఠే, త్రిపాఠి,
ఇంకా మరికొందరికి కూడా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు.
ఉత్తరాలను ఎక్కువగా మరాఠీలోగాని, సంస్క్రుతంలో గాని రాసేవారు. ఆతరువాత ఆంగ్లంలోను, ఉర్దూలో కూడా రాస్తూ ఉండేవారు.
చక్కటి
దస్తూరీ --- ఎన్నో భాషలలో ప్రావీణ్యం
మాధవరావుకు
సంస్క్రుతం, మోదీ, ఆంగ్లం ఉర్దూ, పార్శి, మరాఠీ, తెలుగు, కన్నడ, గుజరాతీ, హిందీ భాషలలో
మంచి ప్రావీణ్యం ఉంది. ఆభాషలలో అతను వ్రాసిన
ఉత్తరాలు అతని వారసుల వద్ధ భద్రంగా ఉన్నాయి.
అతను వ్రాసిన ఉత్తరాలలోని పద్యాలను గమనిస్తే పైన ఉదహరించిన భాషలలో కొన్నింటిలో
అతనికి ఎంత పట్టు ఉందో అర్ధమవుతుంది.
సమకాలీకుడయిన
గుజరాత్ సాధువయిన శ్రీ రంగాచార్యస్వామి మహరాజ్ పై
1948 వ.సంవత్సరంలో ఒక పోతీని సంస్క్రుతంలో రాసాడు. అతను చక్కటి దస్తూరీతో ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్ది
వ్రాసిన ఆపోతీ ఒక అధ్భుతమయిన కళాఖండం. మాధవరావు దస్తూరీ అంత అందంగా ఉండేది. చూసేవాళ్ళకి అది చేతితో రాసినది కాదని, అది ముద్రించిన
ప్రతి అనే భావం కలిగించేది.
అలాగే
అతను తన స్వదస్తూరీతో మొత్తం విష్ణుసహస్ర నామాన్ని రాసారు. దాసగణు దానిని చూసి చాలా ముగ్ధుడయి ఎంతో సంతోషంగా
మనిఆర్డర్ ద్వారా మూడు రూపాయలు లోని గ్రామంలో ఉంటున్న మాధవరావుకి పంపించాడు. ఆతరువాత ఇద్దరూ కలుసుకున్నపుడు ఇద్దరి కళ్ళనుండి
ఆనందభాష్పాలు కారాయి.
ఒకసారి
మాధవరావు చిన్న గ్రామంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా నియమింపబడ్డాడు. ఒకసారి పాఠశాలను తనిఖీ చేయడానికి ఒక బ్రిటిష ఆఫీసర్
వచ్చాడు. ఆఫీసరు మాధవరావుతో ఆంగ్లంలో సంభాషిస్తున్నపుడు
మాధవరావుకు ఆంగ్లభాషలో ఉన్న నైపుణ్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. అంతటి ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని ఇటువంటి మారుమూల ఉన్న చిన్న గ్రామంలో ఉద్యోగం ఎలా ఇచ్చారని చాలా ఘాటుగా పై అధికారులకి ఉత్తరం వ్రాసాడు.
అపుడు
విద్యాశాఖవారు “మీరు అన్నది నిజమే. కాని వచ్చిన
ఇబ్బంది ఏమిటంటె అతను ఎక్కడా ఒక్కచోట స్థిరంగా ఎక్కువకాలం ఉద్యోగం చేసే వ్యక్తికాదు”
అని సమాధానమిచ్చారు.
(ప్రస్తుతానికి ఇంతవరకే లభ్యమయింది. కాని ఇంకా ఉందని అనిపించింది. ఎంత వెదకినా దొరకలేదు. ఒకవేళ ఇంకా సమాచారం లభిస్తే అప్పుడు ప్రచురిస్తాను. )
(ప్రస్తుతానికి సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment