29.09.2020 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అద్భుతమయిన సాయి లీల ప్రచురిస్తున్నాను. సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన ఈ లీలను తెలుగులోకి
అనువాదం చేసి భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించారు.
నాకోసం
పాదయాత్ర చేసి చూడు….
2009
వ.సంవత్సరం జనవరి 30 వ.తారీకున తొమ్మిదిమందిమి సాయిభక్తులం బరోడానుంచి షిరిడీకి
400 కి.మీ.పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరాము.
నేను ప్రతిరోజు 35 కి.మీ. దాకా నడుస్తూ ఉండేవాడిని. రెండురోజులలో 70 కి.మీ. నడచుకుంటూ వెళ్ళడం నాజీవితంలో
ఇదే మొదటిసారి. బాబాయే నాకు అంతలా నడిచే శక్తినిచ్చారు. 60 సంవత్సరాల వయసున్న నేను అంతదూరం అలసట లేకుండా
నడవగలిగానంటే అది కేవలం బాబా దయ. అలా పాదయాత్ర
చేసుకుంటూ మేమందరం ఆరు రోజులలో సటాకా గ్రామానికి రాత్రివేళకి చేరుకొన్నాము.
రాత్రి 10 గంటలకు అందరం భోజనాలు చేసి పడుకున్నాము. ఆసమయంలో నా గుండెలో మెల్లగా నొప్పి మొదలయింది. దానివల్ల నిద్రపోలేకపోయాను. ఛాతీకి బాబా ఊదీ రాసుకుని పడుకున్నాను. కాని నొప్పి భరించలేనంతగా ఎక్కువయింది. అయినప్పటికి నాతోటివారిని ఎవరినీ లేపలేదు. రెండుగంటలు ప్రాణం పోయేటంతగా నొప్పితో బాధపడ్డాను. ఆగకుండా సాయినామస్మరణ చేసుకుంటూనే ఉన్నాను. దేవీదేవతలు అందరూ, గురుదేవులు నాబంధువులు అందరూ గుర్తుకు వస్తున్నారు. ఈరోజు నాకొడుకు కోడలు బరోడానుండి నాసిక్ వెడుతూ ఉంటారన్న విషయం అకస్మాత్తుగా నాకు గుర్తుకు వచ్చింది. అవసరమయితే వాళ్ళు వస్తారని అనుకున్నాను. అపుడు నాకాళ్ళవద్ద ఒక కుక్క కనిపించింది. ఒకవేళ నేను చనిపోయేటట్లు ఉంటే ఈ కుక్క అరవాలి దదా? అలా కాకుండా నిశ్శబ్దంగా పడుకుని ఉంది అని అనుకుంటూ దానినే చూస్తూ నిద్రలోకి జారుకున్నాను. అపుడు కలలో బాబా నానుదుటున ఊదీ పెట్టారు. “రేపు ఇదే సమయానికి వస్తాను" అన్నారు. వెంటనే నాకు నొప్పి తగ్గిపోయి మామూలు మనిషినయ్యాను. తెల్లవారుజామున నాలుగు గంటలకు మెలకువ వచ్చింది. అందరము బాబా ముందు అగరువత్తులు వెలిగించి బాబా ధ్వజం చేతపట్టుకొని పాదయాత్రకు బయలుదేరాము.
అపుడు నాస్నేహితుడు ఇంద్రవదన్ నావద్దకు వచ్చాడు. అతను ప్రతిరోజు మూడు నాలుగు గంటలు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అతను నాకు ఒక ఆశ్చర్యకరమయిన విషయం చెప్పాడు. “గోండ్ కర్ భాయ్, నిన్న రాత్రి ధ్యానంలో ఉండగా “గోండ్ కర్ ఆయువును 12 సంవత్సరాలు పెంచాను అని బాబా నాతో చెప్పారు” అన్నాడు. అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. బాబా ఇచ్చిన ఈ ఆయుష్షును నేను బాబా సేవకే వినియోగిస్తాను అని మనసులో నిర్ణయించుకున్నాను. పాదయాత్ర చేసుకుంటూ షిరిడికి చేరుకొన్నాము. ఆ తరవాతనుంఛి నేను ‘బాబా ఓమ్ సాయి మిత్ర భజన మండలి’ అనే సంస్థను ఏర్పాటు చేసాను. రోజు రాత్రి గంట గంటన్నర వరకు భజన చేస్తూ ఉంటాము. ఇరవై ఒక్క మందితో ‘సాయిలీల ద్వైమాసిక’ పత్రికను ప్రారంభించాను. అందువల్లనే నాకు ‘సాయిభక్త ప్రచారభూషణ’ పదవినిచ్చి సాయిచరిత్ర, విభూతి నాకు పోస్టుద్వారా పంపుతారు. ఇదికాకుండా అన్ని సాయిబాబా మందిర పూజార్లకు సాయిఆరతులు నేర్పించటం కోసం, బరోడా, గుజరాత్ అన్ని సాయిమందిరాల పూజార్లను షిరిడీకి తీసుకువెళ్ళే బాధ్యత కూడా షిరిడీ సంస్థానం వారు నాకు అప్పచెప్పారు. ఈవిధంగా బాబా సేవ చేసుకుంటూ బాబాలోనే విలీనం కావాలని నా అంతిమ కోరిక.
సాయిరామ్
బాల చంద్ర శ్రీధర్ గోండ్ కర్
బరోడా, గుజరాత్
(
ఈ సందర్భంగా బాబా నాచేత ప్రచురింపచేసిన ‘సాయిప్రేరణ’ అనే చిన్న పుస్తకంలోని కొన్ని
విషయాలను మీకు తెలియచేస్తున్నాను. సాయిప్రేరణ
ఎవరో భక్తులు ప్రచురించగా సుమారు 5 సంవత్సరాల క్రితం నెల్లూరునుండి సాయిభక్తురాలు సుకన్య గారు నాకు పంపించడం జరిగింది. బాబా నాచేత మరలా దానిని ప్రచురింపచేసి సాయిభక్తులందరికీ
ఉచితంగా పంపిణీ చేయించారు. … త్యాగరాజు)
1. ఒక్కసారి
భక్తితో పవిత్రమైన నా పాదయాత్రలో నాతో నడిచి చూడు, నాయొక్క పాదయాత్రలన్నిటికి నిన్ను
తప్పక పిలుస్తాను.
2. ఒక్కసారి
ప్రేమతో నా పాదయాత్రలో యాత్రచేయువారికి సేవచేసి చూడు, నీ సేవా కార్యక్రమాలన్నిటిలో
నీకు తప్పక తోడుంటాను.
3. ఒక్కసారి
భక్తితో షిరిడీ వరకు పాదయాత్ర చేసి చూడు, నీతో ఈ ధరణిలో ఉన్న అన్ని పుణ్యతీర్ధముల యొక్క
యాత్ర దగ్గరుండి చేయించెదను.
4. ఒక్కసారి
భక్తితో, ప్రేమతో నా పాదయాత్ర చేసి చూడు, రాబోవు డెబ్బదిఒక్క జన్మముల వరకు నీకు తోడుగా
ఉంటాను.
5. ఒక్కసారి
భక్తితో, ప్రేమతో పవిత్రమైన తొమ్మిది రోజులు నా పాదయాత్ర చేసి చూడు, నేను నీ ప్రతి
శ్వాసలో ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను.
6. ఒక్కసారి
భక్తితో, నా పాదయాత్రలో పవిత్రమైన నా పల్లకిని నీ భుజాలపై మోసి చూడు, నీ జీవితంలో రాబోవు అన్ని బరువు బాధ్యతలని అత్యంత
సున్నితంగాను, తేలికగాను ఉండేటట్లు చేస్తాను.
7. ఒక్కసారి
భక్తితో నాపాదయాత్రలో శ్రీసాయి శ్రీసాయి అని పవిత్రమైన నా పాదుకల్ని స్మరించి చూడు,
నువ్వు నడిచే మార్గాన్ని అత్యంత పవిత్రంగాను, పూజనీయంగాను మారుస్తాను.
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment