30.10.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయే తప్ప మరొక దైవాన్ని తలచకుండా ఆయన నామస్మరణలోనే జీవితాన్నంతా గడిపిన సాయి అంకితభక్తురాలయిన శ్రీమతి శివమ్మ తాయి గురించి రెండవభాగాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
సాయి
అమృతాధారనుండి
సేకరణ.
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్... & వాట్స్ ఆప్ ... 9440375411
8143626744
శివమ్మ తాయి – 2 వ.భాగమ్
(శివమ్మ తాయి చెప్పిన మరికొన్ని వివరాలు తరువాయి భాగమ్)
నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటూనే ఉన్నాను. ఆవిధంగా ఎన్నోసార్లు వెళ్ళాను. బాబా నన్ను తన స్వంత కూతురిలా చూసుకునేవారు. ఆయన నన్ను ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఆయన చేసే అధ్బుతమయిన చర్యలకి నేనొక్కదానినే
ఏకైక సాక్షిని. బాబా చేసేటటువంటి ఖండయోగలాంటి
యోగసాధనను నేనొక్కదానినే ప్రత్యక్షంగా చూసాను. (శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా ఖండయోగం
చేసారన్న ప్రస్తావన ఉంది) బాబా పాము, కప్పల పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తున్న సమయంలో శివమ్మ తాయి అక్కడే ఉన్నానని చెప్పారు. (శ్రీ సాయి సత్ చరిత్రలో ఈ అధ్యాయం గురించి వివరంగ
ఉంది)
ఆమెకు 24 సంవత్సరాల వయసు ఉన్నపుడు 1915 వ.సంవత్సరంలో జరిగిన
సంఘటన…. అప్పుడు రాత్రి గం.1.30 ని. అయింది.
ఆ సమయంలో బాబా ద్వారకామాయిలో ఖండయోగం చేస్తున్నారు. ద్వారకామాయి బయట ఆయన శరీరభాగాలు చేతులు, కాళ్ళు, విడివిడిగా
పడి ఉన్నాయి. అదే సమయంలో ఖండాలుగా పడిఉన్న
బాబా గారి శరీర భాగాలపై తాను అడుగు వేసినట్లుగా శివమ్మ తాయి వివరించారు. మసీదు బయట ఉన్న బావి దగ్గర బాబా ధౌతీ చేస్తుండగా
తాను చూశానని చెప్పారు. బాబా ఆమెను షిరిడీ
బయట ఉన్న బావివద్దకు తీసుకుని వెడుతూ తాను చేసే యోగాభ్యాసాలను చూపిస్తూ ఉండేవారు.
ఇక ఆమెతొ విసిగిపోయిన ఆమె భర్త ఆమెను విడిచిపెట్టేసి మరొక స్త్రీని
వివాహం చేసుకొన్నారు. శివమ్మతాయి తన పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారు. ఆమె కుమారుడు మణిరాజ్ కి సబ్ ఇస్న్పె క్టర్ గా ఉద్యోగం
వచ్చింది. కాని ఆతరువాత విధివశాత్తు అతను,
అతని భార్య ఇద్దరూ ఒక ప్రమాదంలో మరణించారు.
భర్త వదిలేసిన తరువాత శివమ్మ తాయిని ఆమె తండ్రి షిరిడీకి తీసుకొని వెళ్ళారు. బాబా ఆమెను దీవించడమే కాక, తన భక్తులు నిర్మించిన
సత్రవులో ఆమెను నివశించమని చెప్పారు. తన నామస్మరణ
చేసుకొంటూ కాలం గడపమని చెప్పారు.
బాబా 1918వ.సంవత్సరం అక్టోబరు 15 వ.తారీకు మధ్యాహ్నం గం.2.30ని.
మహాసమాధి చెందారు. షిరిడీ సాయిబాబా శివుని
అవతారమని ఆమె చెప్పేవారు. ఆయన దత్తాత్రేయుని
అవతారం. 1917వ.సంవత్సరంలో బాబా నాపేరును శివమ్మ
తాయిగా (శివుని తల్లి) మార్చారు. “ఈరోజునుండి
నీవు ‘శివమ్మతాయి’ గా పిలవబడతావు నువ్వు బెంగుళూరు
వెళ్ళు నీకు నా దీవెనలు ఉంటాయి. నాపేరుతో నువ్వు
ఒక ఆశ్రమాన్ని స్థాపించు…అల్లామాలిక్…” అన్నారు బాబా.
ఆశ్రమం/దేవాలయ నిర్మాణం
బాబా ఆజ్ఞలను ఆమె అక్షరాలా పాటించింది. ధ్యానం చేసుకుంటూ నిరంతరం సాయినామ స్మరణలోనే కాలం
గడిపేది. ఆయన నామస్మరణ చేసుకుంటూ బెంగళూరులో
భిక్షమెత్తుకుంటూ తిరిగేది. ఆవిధంగా భిక్షాటనమీదనే చాలా సంవత్సరాలు జీవించింది. ఒకానొక పుణ్యాత్ముడు
శ్రీనారాయణ రెడ్ది ఆయన భార్య శారదమ్మలకు బెంగుళూరులో
మడివాడ దగ్గర రూపేన్ అగ్రహారంలో స్థలం ఉంది.
అందులో కొంతభాగాన్ని 1944వ.సంవత్సరంలో ఆమె నివసించడానికి ఇచ్చారు. ఆమె అక్కడ ఆహారం ఏమీ తీసుకోకుండ 12 సంవత్సరాలు తపస్సు
చేసింది. ఏకంగా 12 సంవత్సరాలపాటు కదలకుండా
తపస్సులోనే ఉండటంతో ఆమె చుట్టూ చీమలు పుట్ట పెట్టాయి. ఆమె జుట్టు జడలు కట్టింది. ఆమె పూర్తిగా ఆచీమలపుట్టలోనే పూర్తిగా మునిగిపోయింది. ఆమె తపమాచరిస్తున్న కాలంలో ఒక పాము కూడా ఆమె తలపైనే
కూర్చుని ఉండేది.
ఒకరోజు బెంగుళూరు నుండి భక్తులందరూ అక్కడికి వచ్చి సమావేశమయ్యారు. అందరూ బాబా నామస్మరణ చేస్తూ ఎంతో చాకచక్యంగా శివమ్మతాయి
జటాజూటంలో ఉన్న సర్పాన్ని పారద్రోలారు. వారందరూ
ఆమెని ఇక తపస్సు చాలించమని కోరారు. ఆమె వారి
కోరికను మన్నించి 12 సంవత్సరాలుగా చేస్తున్న తపస్సును చాలించి శేష జీవితాన్ని బాబా
నామస్మరణలోనే గడిపింది.
ఆమె ఒక బాబా మందిరాన్ని నిర్మించింది. 1973 వ.సంవత్సరంలో బీద పిల్లలకోసం ఒక ప్రాధమిక పాఠశాలను
కూడా నిర్మించింది. 1991వ.సంవత్సరంలో ఆపాఠశాల ఉన్నత పాఠశాలగా అభివృధ్ధి చెందింది. ఎంతోమంది సాయిభక్తులు ఎక్కడేక్కడినుంచో ఆమెను దర్సించుకోవడానికి
వస్తూ ఉండేవారు. ఆమె కుటుంబీకులు, మనవలు, మనవరాళ్ళు
కూడా వచ్చి ఆమెను దర్శించుకునేవారు. ఆమె బందువులు
ఆర్ధికంగా ఉన్నతస్థాయిలో ఉండటంచేత వారంతా ఆమెను తమతో కూడా వచ్చి సుఖంగా ఉండమని చెప్పారు. కాని ఆమె తనకు ఆ ఆశ్రమాన్ని విడిచి సుఖంగా ఉందామనే
ఆశ ఏమాత్రం లేదని, ఈ ఆశ్రమంలోనే నాకు నా గురువయిన శ్రీసాయిబాబావారి దీవెనలు, అనంతమయిన
ప్రేమలో మునిగితేలుతున్నానని అన్నారు. వారి
కోరికను తిరస్కరించి ఆమె ఆశ్రమంలోనే ఉండిపోయారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment