21.10.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు నానాసాహెబ్ గురించి ఆసక్తికరమయిన అంశం 4వ.భాగాన్ని ప్రచురిస్తున్నాను. శ్రీసాయిలీల ద్వైమాసపత్రిక 2012 వ.సంవత్సరం మే – జూన్ పత్రికలో ‘సాయిబాబా గురించి మనమింకా తెలుసుకోవలసినది భగవంతుని దివ్య దర్శనం’ శీర్షికతో ప్రచురింపబడింది. ఆంగ్లంమూల రచయిత…శ్రీ నవేందు సాయిదాస్ మరాఠే.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
సాయిబాబా
గురించి
మనమింకా తెలుసుకోవలసినది – 4 వ.భాగమ్
(నానా సాహెబ్)
ఇంతవరకు మనం చదివినదానిని బట్టి ఈ కధనం, మనం ఇంతకుముందెన్నడూ చూడని గమనించని సాయిబాబా వ్యక్తిత్వం ఎటువంటిదో తెలియచేస్తుంది. మనకు తెలిసిన సాయిబాబా అధ్బుతాలను చేస్తారని తన భక్తులకు అనుభూతులను ప్రసాదిస్తారని మాత్రమే తెలుసు.
కాని ఇపుడు మనం చదివిన కధనంలో క్రమశిక్షణను నేర్పించే
ఒక మాతృమూర్తిని చూస్తాము. కొడుకు ఏదయినా తప్పు
చేస్తే తల్లి మాట్లాడటం మానివేస్తుంది. తల్లి
తనతో మాట్లాడకపోతే కొడుకు మనసులో చాలా బాధపడతాడు.
కొడుకు ఎంత బతిమిలాడినా తల్లి మాత్రం మాట్లాడదు. కోపంగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అపుడు కొడుకు తనతల్లి చేతులు పట్టుకుని ఆమెని కౌగలించుకొని,
“అమ్మా! నాతో మాట్లాడమ్మా! ఇంకెప్పుడూ ఇటువంటి తప్పు చేయను” అని బ్రతిమాలుతూ ఉంటాడు. ఇక చివరికి సాయంకాలమయ్యేసరికి ఎంతయినా తల్లే కదా!
కొడుకు కన్నీళ్ళకి ఆమె కోపం మంచులా కరిగిపోతుంది.
ఇపుడు అదే దృశ్యాన్ని ఊహించుకోండి. ద్వారకామాయిలో సరిగ్గా అటువంటిదే తటస్థించింది. ఈ ఒక్క కధనంలో బాబా మనకు ఎన్నో విషయాలను బోధించారు. వాటిని వివరించడానికి మాటలు చాలవు.
“నువ్వు వేరే ప్రక్కదారి గుండా ఎందుకు వచ్చావు? నువ్వు పూజారికి
డబ్బు తీసుకురాలేదని నిజం చెబితే అతనేమన్నా నిన్ను తినేస్తాడా? కొడతాడా?” అన్నారు బాబా. మనలో ఏచిన్నపాటి వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నా వాటిని
ఇంకా పెంపొందించగలిగే శక్తి బాబా అన్న మాటలకు ఉంది. మనలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుంది. మన జీవితాలను కూడా మనం గమనించినట్లయితే అటువంటి
సంఘటనలు ఎన్నోసార్లు జరిగే ఉంటాయి. ఏకారణం
లేకుండానే కొన్ని కొన్ని విషయాలలో వాటిని ఎదుర్కోవడానికి మనం భయపడుతూ ఉంటాము. అవతలివాళ్ళు ఏమనుకుంటారో అనే సందేహం చాలామందిలో
ఉంటుంది.
పూర్తిగా స్పష్టంగా చెప్పడానికి మనం ధైర్యం చేయము. మూడువందల రూపాయలు ధన సహాయం చేస్తానని నానాసాహెబ్
మహంతాకు మాట ఇచ్చాడు. అతనికి మనఃస్ఫూర్తిగా
సహాయం చేయాలనే ఉంది. కాని అనుకోకుండా ఆసంగతి
మర్చిపోయి షిరిడికి బయలుదేరాడు. ఉద్దేశ్యపూర్వకంగా
చేసినది కాదు. కోపర్ గావ్ కి వచ్చిన తరవాతనే
అతనికావిషయం గుర్తుకు వచ్చింది. ఒకవేళ తాను
దత్తమందిరానికి వెళ్లినట్లయితే మహంతా డబ్బు గురించి అడిగితే తానేమని సమాధానం చెప్పాలి
అని ఆలోచించాడు. అయ్యో! డబ్బు తీసుకురావడం
మర్చిపోయానని చెబితే అప్పుడు మహంతా ఏమంటారు?
మర్చిపోయానని చెప్పడం ఇలాంటిసాకులు మీవంటి ధనవంతులకు తగదు అని అంటాడు. అది ఎంత అవమానకరమయిన విషయం? అనవసరంగా నాగురించి
మహంతా తప్పుగా అర్ధం చేసుకొంటాడు. ఎవరయినా
ఇతరుల వద్దనుంచి అప్పుతీసుకుని తిరిగి చెల్లించుదామని నిశ్చయించుకున్నా, అనుకోని పరిస్థితులలో
చెల్లించలేకపోయినట్లయితే అప్పు ఇచ్చిన వ్యక్తినుంచి ఏవిధంగా భయపడుతూ తప్పించుకుని తిరుగుతాడో
అదే విధమయిన భయం నానాలో ప్రవేశించింది. మహంతా
ఏమంటాడో తనగురించి చెడుగా అనుకుంటాడెమో అనే భయం వల్లనే ప్రక్కదారిలోనుండి షిరిడీకి
బయలుదేరాడు. “నీ ఆలోచనలు స్వచ్చమయినవే అయితె,
నీకు మనఃస్ఫూర్తిగా సహాయం చేద్దామనే ఉన్నట్లయితే డబ్బు తీసుకురావడం మర్చిపోవడం అదేమంత పెద్ద నేరం కాదు అన్నారు బాబా. నానా డబ్బు తీసుకురావలసిందే
కాని తేలేదు. అయితే అదేమంత పెద్ద సమస్య కాదు. అటువంటపుడు మహంతాతో “నేను తీసుకురావడం మర్చిపోయాను. ఈసారి వచ్చినపుడు తప్పకుండా డబ్బు తీసుకువస్తాను”
అని చెబితే నష్టమేమీ లేదు కదా. మనలో మోసం
చేసే ఆలోచనే లేనప్పుడు అవతలివారినుంచి తప్పించుకుని తిరగడం దేనికి?
నానా సాహెబ్ ప్రక్కదారిలోనుంచి వెళ్ళిపోయాడని ఒకవేళ మహంతాకు
తెలిసినట్లయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? రేవు
నిర్మించడానికి ధన సహాయం చేయడం నానాకు ఇష్టంలేదు కాబోలు అందుకనే నన్ను కలవకుండా ప్రక్కదారి
వెంట వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకునే అవకాశం ఉంది.
దాని పర్యవసానంగా తన ఉద్దేశ్యం స్వచ్చమయినదే అయినా మహంతా మనసులో తన గురించి
అంతకు ముందు ఉన్న మంచి అభిప్రాయమంతా తుడిచిపెట్టుకుని పోతుంది.
ఈ విధంగా నానా తన మనసులో మహంతాను కలిస్తే ఏమవుతుందోననే ఒక విధమయిన
భయాన్ని ఊహించుకున్నాడు. అతనిలో ఆభయం తొలగిపోవకపోవడం
చేత మహంతానుంచి తప్పించుకోవడం కోసమే ప్రక్కదారినుంచి వెళ్లాడు. బాబాకు అతను ఈవిధంగా నిర్జన ప్రాంతంనుండి రావడం
ఇష్టంలేకపోయింది. మొహం చాటేసి తప్పించుకుని
తిరగడం చాలా ప్రమాదకరమయిన విషయం. అందువల్లనే
బాబా సరైన సమయంలో నానాకు గట్టిగా బుధ్ధి చెప్పారు. తప్పు చేస్తే ఒప్పుకోవాలి. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఇదే ఈ కధనంలో గ్రహించుకోవలసిన గొప్ప సందేశం. ఈ కధనంలో ప్రత్యేకంగా ఒక సంఘటన గురించె ప్రస్తావింపబడినా
ఇందులో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఇబ్బందికర
పరిస్థితులలో మనం చాలామట్టుకు మంచి పనులు చేయం.
అపుడు ప్రజలు మన గురించి ఏమనుకుంటారు?
అనవసరంగా మనకు మనమే అవతలి వ్యక్తులలో ఒక విధమయిన దురభిప్రాయాన్ని కలుగజేసినవాళ్ళమవుతాము. వారితో సన్నిహితంగా మెలగలేము. సిగ్గు, భయం వల్ల మనం మంచి పేరుప్రఖ్యాతులు ఉన్న
వ్యక్తులను కూడా కలవడంలో విఫలం అవుతాము.
ఈ కారణం చేతనే ఎన్నోసార్లు మనకు మనమే మనకు వచ్చిన మంచిమంచి అవకాశాలను
చేజేతులారా పోగొట్టుకొంటున్నాము. అందువల్ల
మనం జాగ్రదావస్థలోనే ఉన్నా, నిజానికి నిద్రాణస్థితిలోనే ఉన్నామని చెప్పాలి. విసుగు, సోమరితనం , అర్ధంపర్ధం లేని సంకోచాలు వీటివల్లనే
మనకు మనమే నష్టపరచుకొంటున్నాము. ఎందుకిదంతా? అనవసరం కాదా?
ఇతరులకు సలహాలు ఇచ్చే వాళ్ళకు కూడా ఈ కధ అమూల్యమయిన సందేశాన్నిస్తుంది. ఇతరులకు ఊరికే సలహాలు ఇవ్వడం కాదు, మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అని మనం కూడా గమనుంచుకోవాలి. ఎదుటివానికి సలహా ఇచ్చేశాక మనపని అయిపోయినట్లు కాదు.
నిష్కర్షగా
మంచి క్రమశిక్షణను నేర్పిస్తూ, పాఠాలను శ్రధ్ధతో బోధించే ఉపాధ్యాయులు నేర్పించడంతోనే
ఆగిపోరు. తాము బోధించిన పాఠాలను విద్యార్ధులు
ఎంతవరకూ ఆకళింపు చేసుకొన్నారు, అర్ధం చేసుకొన్నారు అని కూడా తిరిగి పరీక్షిస్తూ ఉంటారు. ఇపుడు బాబా చేసినది కూడా అదే. ఈ కారణం చేతనే సాయిబాబా మనకు పరమ సద్గురువు అయ్యారు. ఆయన మనకు బోధించినవాటిని, మనం అచరిస్తున్నామా లేదా
అని ఎప్పుడు ఏవిధంగా పరీక్షపెడతారో మనం ఎప్పుడూ గ్రహించుకోలేము.
ఈ కధలో మరొక్క విషయం గ్రహించాలి. ‘సర్కార్ దర్శనం’. కొంతమంది దేవాలయానికి గాని, మందిరానికి గాని తాము
వెళ్ళే దారిలో ఉంది కాబట్టి, ఒకసారి దేవుడికి దణ్ణం పెట్టుకొని వెడదాము అని అనుకుని
వెడుతూ ఉంటారు. మరికొంతమంది కేవలం భగవంతుని
దర్శించుకోవడానికి వెడుతూ ఉంటారు. సరిగా ఇపుడు
మనం చదివిన కధలో సర్కార్ దర్శనం (దత్తదేవుని దర్శనం) పైన చెప్పిన దానికి సరిపోతుంది. మహంతాను తప్పించుకుని వెళిపోదామనే గందరగోళ పరిస్థితిలో
తాను దత్తదేవుని దర్శించుకోకుండా వెళ్ళిపోతున్నాననే విషయాన్ని నానా గ్రహించుకోలేకపోయాడు. బాబా అతనికి ఆసంగతి గుర్తుచేసి అర్ధం చేసుకునేలా
బోధించారు.
(ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూసిన వాటిని చెబుతాను. నేను ఒక సారి ఆఫీసు పనిమీద ఒక పల్లెటూరికి వెళ్ళాను. అక్కడ చిన్న గుడిఉంటే అక్కడ నుంచుని ఒక వ్యక్తి
కోసం నిరీక్షిస్తూ ఉన్నాను. రోడ్డంతా ఖాళీగా
ఉంది. బస్సులుకూడా అంతగా రావు. కొంతమంది ఆడవాళ్ళు నలుగురైదుగురు రోడ్డమ్మట వెడుతూ
అందులో ముగ్గురు దేవుడికి దణ్ణం పెట్టుకుందాము అని గుడి అరుగుమీదకు వచ్చారు. ఒకామె మాత్రం నా దణ్ణం కూడా మీరే పెట్టండి అని ముందుకు
సాగిపోయింది. మరొక సంఘటనలో బాబా మందిరంలో ఉత్సవాల
సందర్భంగా అనుకుంటాను, బాబాకు క్షీరాభిషేకం చేయడానికి భక్తులు అందరూ చిన్న చిన్న పాత్రలలో
పాలు తెచ్చి వరుసలో నిలబడ్డారు. అందులో ఒకామె
కాసేపు నుంచుని తను తెచ్చిన పాలను తనకు తెలుసున్నామెకు
ఇచ్చి, నేను తీసుకొచ్చిన పాలు కూడా నువ్వే అభిషేకం చేసేయి, నాకు పని ఉంది అని వెళ్ళిపోయింది.
పైన దేవుని దర్శించుకోవడం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చూసిన సంఘటనలను
వివరించడం జరిగింది. మనలో అసలయిన భక్తి ఏ విధంగా
ఉందో మనమే గ్రహించుకోవచ్చు. తాము చేయవలసిన కార్యాన్ని ఎదటివారికి అప్పచెప్పడం వల్ల భగవంతుడు కూడా వారికి ఇవ్వబోయే అదృష్టాన్ని ఎదటివారికి
ఇస్తాడేమో… త్యాగరాజు)
వాస్తవానికి ఇది మనకి బోధించేది ఏమిటి? భగవంతుని చూసినంతనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలనే
భావాన్ని సూచిస్తోంది. షిరిడీకి వెళ్ళేదారిలొ
దత్తదేవుని మందిరం ఉంది కాబట్టి, నానా వెడుతూ ఉండేవాడు. అతను ప్రత్యేకంగా దర్సించుకోవడానికి మాత్రం కాదు. అలా కాకుండా నానాకు దత్తదేవుని మీదే కనక భక్తి ఉన్నట్లయితే
తప్పకుండా మందిరానికి వెళ్ళి ఉండేవాడు. అతని
గౌరవానికి భంగం వాటిల్లేలా ఇంత రాధ్ధాంతం జరిగి ఉండేదే కాదు. అతను డబ్బు తీసుకురావడం మర్చిపోయినందువల్లనే సిగ్గుతో
మహంతాకు మొహంచాటేయవలసి వచ్చింది. ఎటూపాలుపోని
స్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేక దత్తదేవుడినే విస్మరించాడు. నానా ప్రవర్తన బాబాకు కోపాన్ని కలిగించింది.
దానివల్లనే బాబా ఎంతో ఆదరంతో అన్నమాటలు, “సర్కార్ దర్శనం చేసుకోకుండా
తప్పించుకుని వచ్చావా?” బాబా దత్తగురుని సర్కార్ అని పిలుస్తారు. బాబాలో ఉన్న ఈ ఆదరం, ఈ దయ ఆయన హృదయంలో దత్తగురుకు
ఎంతటి ప్రముఖ స్థానమిచ్చారో తెలియచేస్తుంది.
నానా తనను దర్సించుకోవదానికి వచ్చాడన్న సంతోషం కన్నా దత్తదేవుడిని దర్శించుకోకుండా
వచ్చాడన్నదే బాబాకు చాలా కోపాన్ని తెప్పించింది.
ఏమహాత్మునిలోనయితే దేవుళ్ళందరూ నివసిస్తునారో, ఎవరిపాదాల వద్ద
గంగా యమునలు ప్రవహిస్తున్నాయో, పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉంటాయో అటువంటి మహాత్ముడే దత్తప్రభువుని
‘సర్కార్’ అని సంబోధించారు. ఎంతటి వినయం…మనం
బాబా గురించి రవ్వంత కూడా తెలుసుకోలేదు. ఉత్తమంలో
ఉత్తమమయిన విషయం, లోతును కనుగొనడానికి ప్రయత్నించివారు కూడా ‘నేతి, నేతి’ (అనగా అంతం లేదు, అంతం
లేదు) అని చెప్పి అలసిపోయారు. అటువంటప్పుడు
మనం ఆయన ‘సర్కార్’ ను ఎపుడు అర్ధం చేసుకొంటాము?
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment