20.10.2020
మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు నానాసాహెబ్ గురించి ఒక ఆసక్తికరమయిన ఆంశం మూడవ భాగాన్ని ప్రచురిస్తున్నాను. శ్రీసాయిలీల ద్వైమాసపత్రిక 2012 వ.సంవత్సరం మే – జూన్ పత్రికలో ‘సాయిబాబా గురించి మనమింకా తెలుసుకోవలసినది భగవంతుని దివ్య దర్శనం’ శీర్షికతో ప్రచురింపబడింది. ఆంగ్లంమూల రచయిత…శ్రీ నవేందు సాయిదాస్ మరాఠే.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
సాయిబాబా
గురించి
మనమింకా తెలుసుకోవలసినది – 3 వ.భాగమ్
(నానా సాహెబ్)
అరణ్యాన్ని తలపించే ముళ్ళచెట్లు, గుబురు పొదలలోనుండి దారి చేసుకుంటూ రక్తం కారుతున్న శరీరాలతో నానాసాహెబ్, బినివాలేలు ఇద్దరూ ఎలాగయితేనేమి అతికష్టం మీద రహదారి దగ్గరకు చేరుకొన్నారు. అక్కడినుండి టాంగాలో షిరిడీ చేరుకొన్నారు. ఇద్దరూ దుస్తులను సరిచేసుకొని ఎపుడూ బసచేసే ప్రదేశానికి వెళ్లకుండా మొట్టమొదటగా బాబా దర్శనం చేసుకునేందుకు ద్వారకామాయికి వెళ్ళారు. బాబా కట్టడా ప్రక్కనే కూర్చుని ఉన్నారు.
ఆయన తదేకంగా ధునివైపే చూపును నిల్పి దీక్షగా చూస్తూ ఉన్నారు. తాత్యాపాటిల్ అదేసమయంలో ఎక్కడికో వెళ్లడానికి బయలుదేరబోతున్నాడు.
నానా సాహెబ్ ని చూడగానే నమస్కరించి కుశలప్రశ్నలు వేసాడు.
“నమస్కారమండి” అని పలకరిస్తూ
ఆహ్వానం పలికాడు తాత్యా.
“పంటలు ఎలా పండాయి?” నానా
సాహెబ్ ప్రశ్నించాడు
“అంతా బాగుంది. మీ పంటల సంగతేమిటీ?” అని అడిగాడు తాత్యా.
“బాబా దయవల్ల అంతా బాగుంది” సమాధానమిచ్చాడు నానాసాహెబ్.
“సరే, నేనలా తాలూకా దాకా
వెళ్ళి తిరిగి వస్తాను, మీరు లోపలికి రండి” అని తాత్యా వెళ్ళిపోయాడు.
నానాసాహెబ్, బినివాలే ఇద్దరూ మసీదు మెట్లు ఎక్కి పైకి వెళ్ళారు. నానా బాబాముందు మోకరిల్లి నమస్కారం చేసుకొన్నాడు. కొంత సమయం గదిచింది.. అంతా నిశ్శబ్దం… బాబా ఏమీ మాట్లాడటంలేదు. ఆయన దృష్టంతా ఎదురుగా మండుతున్న ధుని మీదనే ఉంది. నానా సాహెబ్, బినివాలే ఇద్దరూ తలవంచుకుని కూర్చున్నారు. ఈవిధంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. తను బాబా దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా బాబా “ఎలా ఉన్నావు, అందరూ ఎలా ఉన్నారు? ఇంటి వద్ద పిల్లలు ఎలా ఉన్నారు? ఎవరెవరు వచ్చారు?” అని అడుగుతూ ఉండేవారు. కాని ఈ రోజు ఆవిధంగా జరగటంలేదు. బాబా చాలా మౌనంగా ఉన్నారు. తమవైపే చూడటంలేదు.
అసలేమి జరుగుతోందో నానాకేమీ అర్ధం
కావడంలేదు. ఉపాధ్యాయుడు
పిల్లలని మంచి క్రమశిక్షణలో పెట్టడానికి తరగతి గదిలో మౌనంగా ఉండమని శాసిస్తూ ఉంటాడు. ఆసమయంలో తరగతి గది అంతా పిల్లలు ఉన్నా
ఎంతో నిశ్శబ్దంగా ఉంటుంది. అదేవిధంగా ఇపుడు మసీదులో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మధ్యమధ్యలో ధునిలో ప్రజ్వరిల్లుతున్న
మంటలనుండి చిటపటమని చిన్నగా శబ్దం చేస్తూ నిప్పురవ్వలు పైకి ఎగురుతున్నాయి. మసీదు ఆవరణలో సాధారణంగా ఎప్పుడూ అల్లరి
చేస్తూ ఉండె కొంటె పిల్లల జాడ ఈ రోజు ఎక్కడా కనిపించడంలేదు. ఎప్పుడూ
బాబానే నీడలా అంటిపెట్టుకొని ఉండే భగత్ మహల్సాపతి కూడా ఈ రోజు కనిపించడంలేదు. వెళ్ళిపోయాడా? ఏమో ఆ దేవుడికే తెలుసు.
నానా మధ్యమధ్యలో బాబావంక చూస్తున్నాడు. బాబా తనవైపు చూడటంలేదని, నానా, బినివాలే వైపు చూస్తున్నాడు. ఇదంతా బినివాలేకి కొత్తగా ఉంది. ఈ పరిస్థితి ఏమిటో అతనికేమీ అంతుపట్టడం
లేదు. నానా ఏదో అపరాధం
చేసినట్లు ఒక దొంగలా తనను తానే భావించుకుంటున్నాడు. తను ఎపుడు వచ్చినా బాబా ఎంతో ప్రేమతో
పలకరిస్తూ అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. అటువంటిదీ రోజు బాబా తనతో అసలు మాట్లాడకపోవడంతో
నానాకు మనసులో చాలా బాధనిపించింది.
నానాకు కాస్తంత అలసటగా అనిపించింది. ఇక ఓపిక పట్టలేక చివరికి ధైర్యాన్ని కూడదీసుకొని “బాబా”
అని పిలిచాడు.
కాని, బాబా దృష్టి అంతా మండుతున్న
ధునిమీదనే ఉంది. నానాసాహెబ్
బినివాలె వైపు చూసాడు. అతను మాత్రం ఏమిచేస్తాడు. అతనికిదంతా కొత్తగా ఉంటంతో, అమాయక చక్రవర్తిలా కూర్చుని
చూస్తూ ఉన్నాడు. ముళ్లదారిలో
వచ్చేసమయంలో శరీరంలో గుచ్చుకున్న ముళ్ళు ఇంకా అతనిని బాధిస్తూనే ఉన్నాయి. ఆ బాధవల్ల అతని మనసంతా ఇంకా అస్థిరంగానే
ఉంది. అంతే కాదు అతనికి
బాబా గురించి కూడా అస్సలేమీ తెలియదు.
అతనికి తెలుసున్న వ్యక్తి నానా ఒక్కడె. బాబా మౌనం బినివాలేకన్నా నానానే ఎక్కువ
బాధిస్తూ ఉంది. నానా
తిరిగి ధైర్యం తెచ్చుకొని, “బాబా” అని పిలిచాడు.
“ఏంజరిగింది?” బాబా ప్రశ్నించిన
మాటలలో కోపం ధ్వనించింది. కాని కోపంతో ప్రశ్నించిన ఆస్వరం ఎవరో తెలియని వ్యక్తిది కాదు. కాని ఆస్వరంలో కాస్తంత కరుణ కూడా
ఉంది. అందువల్ల నానాసాహెబ్
కి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. అసలు మాట్లాడకుండా కోపంతో ఉన్న బాబా చివరికి రెండు మాటలతోనయినా తన కోపాన్ని
కాస్త తగ్గించుకున్నారనిపించింది. బాబా మాట్లాడారు అంతే చాలు అనుకున్నాడు నానా.
“బాబా, నేనెక్కడయినా తప్పు
చేసానా” అని, “బాబా, నేను తప్పు చేస్తే నన్ను కొట్టండి, ఇంకా కావాలంటే గట్టిగా
దెబ్బలు కొట్టండి. అంతే
కాని నాతో మాట్లాడకుండా మాత్రం ఉండద్దు” అని వేడుకొన్నాడు.
“ఏది తప్పు ఏది ఒప్పు, నువ్వు
‘కిట్టా’ లో (మంచి దస్తూరీ
అలవాటు కావడానికి రాసే కాపీ పుస్తకం) బాగా చూసి నేను చెప్పినట్లుగా
రాయగలవు కదా.
“కిట్టా?” నానాకి ఏమీ అర్ధం
కాలేదు. “బాబా మీరన్నది
నాకేమీ అర్ధం కావటంలేదు” అన్నాడు నానా.
“విషయం ఏమిటో చెప్పనా? బోర్లించిన కుండమీద నీళ్ళు పోయడం
వంటిది. నేను ఇక్కడ ఏది
చెప్పినా నువ్వు కూర్చుని వింటూ అన్నింటికీ తల ఊపుతూ అలాగే అలాగే అంటావు. ఇక్కడినుంచి వెళ్ళిపోగానే నీకు తోచినట్లు
నీవు చేస్తావు” అన్నారు బాబా.
బాబా అన్నదేమిటో నానాకు అర్ధం కాలేదు. బాబాకు నానాకు మధ్య జరుగుతున్న సంభాషణ
బినేవాలేకి క్రొత్తగా అనిపించి చాలా శ్రధ్ధగా వింటున్నాడు.
“నాలుగు నెలల క్రితం నేను నీకేమి చెప్పాను? అంతా మర్చిపోయావా?” అన్నారు బాబా.
నానాకు ఏమీ గుర్తుకు రాకపోవడంతో ఏమీ
అర్ధం చేసుకోలేకపోయాడు. కాని
తాను ఏదో పెద్ద తప్పే చేసినట్లుగా మాత్రం గ్రహించుకొన్నాడు.
“నది ఒడ్దున ఉన్న మందిరంలో ఉన్న పూజారి మూడువందల
రూపాయలు అడుగుతారని దత్తదేవుని దర్శనం చేసుకోకుండా నిర్జనంగా ఉన్న దారినుంచి వచ్చావా? నేను నీకు ఉపదేశించిన బోధనలను ఏవిధంగా
ఆచరిస్తున్నావు? నువ్వు
మూడువందల రూపాయలను తీసుకురాలేదని ఆపూజారికి చెప్పినట్లయితే ఆయన నిన్నేమన్నా కొడతాడా?”
అన్నారు బాబా.
నానా ఒక్క మాటకూడా మాట్లాడలేదు. నిజానికి తను డబ్బు తేలేకపోయానని
మహంతాకు ఎక్కడ చెప్పవలసివస్తుందోనని ఆయనకు తన మొహం చూపించలేకే మరొక దారిలో షిరిడీకి
చేరుకొని బాబా దర్శనం చేసుకొన్నాడు.
వాస్తవానికి బాబా అంతరదృష్టి ద్వారా అంతా తెలుసుకున్నారు. కాని, బాబాకు
నానా ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు.
"ఈసారికి నేను డబ్బు సర్ధుబాటు చేయలేను. మరలా వచ్చినపుడు తప్పకుండా ఇస్తాను అని నువ్వు ఆపూజారికి చెప్పలేవా?
అలా చెప్పినట్లయితే ఆపూజారి నిన్నేమన్నా తినేస్తాడా? ఆమాత్రం దానికి నువ్వు ముఖం చాటేయడం దేనికి? పూజారికి విషయమంతా వివరించడానికి
బదులు దత్తదేవుని దర్శనం కూడా చేసుకోకుండా వచ్చావా? వేరే దారిలో వచ్చినందువల్ల నువ్వు
ఏమి సాధించావు? నీ కాళ్ళలోను,
శరీరంలోను ముళ్ళు గుచ్చుకున్నాయి. అవునా? నీతో ఉన్న ఈ బుధ్ధిశాలిని చూడు. పాపం అతని పరిస్థితి ఎలా ఉందో గమనించు. దత్తదర్శనం చేసుకోకుండా వచ్చినందుకు
ఇది నీకు శిక్ష. నీవంటివారితో
నేనేమి మాట్లాడగలను?” అన్నారు బాబా.
ఇపుడు నానాకు ప్రతీ విషయం గుర్తుకు వచ్చింది.
“ఎవరయినా సామాజిక సేవలకోసం డబ్బు అడిగినపుడు మనం వారికి ఇవ్వగలిగినంత వరకు ధన సహాయం చేయాలి.
ఒకవేళ
మనం ఆవిధంగా సాయంచేయలేని పరిస్థితిలో ఉన్నా, లేక సహాయపడటానికి మనకు ఇష్టంలేకపోయినా ఆవిషయం మృదువుగా చెప్పాలి.
అంతేకాని,
సహాయం కోరివచ్చిన వ్యక్తిని మనం నిందించరాదు.
తిట్లుతిట్టి
పంపించరాదు”.
బాబా చెప్పిన హితోక్తులు ఇపుడు నానాకు పూర్తిగా గుర్తుకు వచ్చాయి.
బాబా
చెప్పిన సలహాకి నానా, అలాగే గుర్తుపెట్తుకుంటాను బాబా అని, ఆచరణలో పెడతానని కూడా బాబాకు చెప్పాడు.
కాని
తాను ఆవిధంగా ఆచరిస్తున్నానా లేదా అని బాబా ఈవిధంగా పరీక్ష పెడతారని అతనెప్పుడూ ఆలోచించలేదు.
“బాబా నన్ను క్షమించండి.
నేను
తప్పు చేసాను.
మరొకసారి
ఇటువంటి తప్పు ఇంకెప్పుడూ చేయను” అన్నాడు నానా పశ్చాత్తాపంతో.
బాబా
కూడా అతనిని క్షమించారు.
దీనికి
సంబంధించిన కధ ఇంతటితో సమాప్తం.
(రేపటి సంచికలో విశ్లేషణతో ముగింపు)
0 comments:
Post a Comment