సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 32 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
శివనేశన్ స్వామి చెబుతున్న వివరాలు…
(విచిత్రమేమిటంటే దాదాపు ఎప్పుడూ జరుగుతున్నట్లుగానే ఆరోజుల్లో స్వామీజీకి షిరిడీ సాయిబాబా గురించి అసలేమాత్రం తెలియదు. ఆయన పేరుకూడా ఎప్పుడూ విని ఉండలేదు. నిత్యానందస్వామి ఆయనను షిరిడీ వెళ్లమని ఆదేశం ఇవ్వగానే ఇక గణేష్ పురిలో ఆయనతో కలిసి ఉండలేకపోయాడు. అందువల్లనే అక్కడినుండి బొంబాయికి చేరుకొని బాబా గురించి, షిరిడీ గురించి అన్ని వివరాలు తెలుసుకోవడానికి వాకబు చేయడం మొదలుపెట్టారు.) నిన్నటి తరువాయి భాగంనుండి ఈ రోజు చదవండి.
ప్రశ్న --- ఏ సంవత్సరంలో శివనేశన్ స్వామీజీ బొంబాయికి వెళ్ళారు?
తుకారామ్ --- 1951 లేక 1952 వ.సంవత్సరంలో ఆయన బాబా గురించి వాకబు చేయసాగారు. ఆవిధంగా వాకబు చేస్తుండగా ఒకరోజున ఒక వ్యాపారస్తుడు తన దుకాణంలో ఉన్న సాయిబాబా ఫొటోను చూపించాడు. బొంబాయిలో చాలా మంది బాబాను పూజిస్తారనే విషయం మీకు తెలుసు కదా.
మొట్టమొదటినుండి బాబా జీవించి ఉన్న రోజులలో ఆయనకు బొంబాయిలో బాగా పేరు ఉంది. స్వామీజీ బాబా ఫొటో చూడగానే ఈయన ఖచ్చితంగా ముస్లిమ్ లాగా కనపడుతున్నారు, ఈ ముస్లిమ్ వద్దకు వెళ్లి నేనేమి నేర్చుకోగలను, ఏమి సాధించగలను” అని భావించారు. అందువల్ల ఆయనకు షిరిడి వెళ్లడానికి ఎటువంటి ఆసక్తి కలగలేదు. ఆ కారణం వల్ల బొంబాయి శివారులో ఉన్న ఖార్ ప్రాంతంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో తలదాచుకున్నారు. ఏమి చేయాలో నిర్ణయించుకోలేక సమయాన్ని వృధా చేసుకుంటూ గుడిలోనే ఉండిపోయారు. ఏడు లేక ఎనిమిది రోజులు గడిచింది. ఆయన చుట్టుప్రక్కల ఎవరూ లేరు. ఆసమయంలో ఆయనకు ఒక స్వరం వినిపించింది. “నేను నిన్ను షిరిడీకి వెళ్లమని చెప్పాను. షిరిడీ వెళ్ళకుండా ఇక్కడే కూర్చుని సమయాన్నంతా వృధా చేసుకుంటున్నావు” ఆ
స్వరం విని స్వామీజీ చుట్టుప్రక్కల చూసారు. ఎవరూ కనపడలేదు. అది తన భ్రమ లేక ఊహ కావచ్చనుకున్నారు. ఒక ముస్లిమ్ వద్దకు వెళ్లడానికి మనసు అంగీకరించక గుడిలోనె ఉండిపోయారు. మూడు, నాలుగు రోజుల తరువాత మరలా అదే స్వరం వినిపించింది. ఈసారి ఆస్వరం కొద్దిగా గద్దిస్తున్నట్లుగా “నువ్వు వెడుతున్నావా లేదా?” అని వినిపించింది. ఆస్వరం వినగానే స్వామీజీ చాలా భయపడ్డారు. ఇక షిరిడీ వెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. ఆయన దక్షిణాదినుండి వచ్చినవారవడం వల్ల స్థానికంగా మాట్లాడే భాషలు ఏమీ ఆయనకు తెలియవు. ఆ కారణంగా షిరిడీకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళేకంటే రైలుపట్టల వెంబడి వెడితే మంచిదని భావించారు. ఆవిధంగా వెళ్లినట్లయితే తప్పకుండా షిరిడి చేరుకోవచ్చని, దారి తప్పే అవకాశం ఉండదని అనుకున్నారు. ఆవిధంగా ఆయన రైలు పట్టలవెంబడి నడక సాగించారు. ఈరోజుల్లో ఆవిధంగా నడుస్తున్నట్లయితే మైళ్ళకు మైళ్ళు మీకు స్థానికంగా ఉండే ప్రజలు కనిపిస్తారు, ఇళ్ళు కూడా కనిపిస్తాయి. ఆరోజుల్లో స్వామీజీ ఒక యాచకునిలాగా సంచరించారు. ఆయనవద్ద ధనం లేదు. రోజంతా నడవవలసిందే. ఎవరయినా దయతలచి ఏదయినా పెడితే తినడం లేకపోతే లేదు. అంటే ఆరోజుల్లో ఆయన భిక్షమెత్తుకుని జీవించారు. స్వామీజీ మూడు నాలుగు రోజులపాటు ఒంటరిగా ఆరైలు పట్టల వెంబడి తినడానికి తిండిలేక ఆకలితోనే నడక సాగించారు. ఒకరోజు అర్ధరాత్రి ఆయన నడుస్తూ ఉండగా ఒక ఆలోచన ఆయనలో మెదిలింది. “నేను గురువును వెతుకుకుంటూ వెడుతున్నాను కదా, సాంప్రదాయం ప్రకారం గురువే తన శిష్యునియొక్క యోగక్షేమాలను అన్నివేళలా కనిపెట్టుకుని ఉండాలి. గురువు తన శిష్యుడిని మరణాన్నుంచి కూడా తప్పించాలి. సమర్ధ సద్గురువయితే ఆవిధంగా ఉండాలి. అటువంటి సమర్ధ సద్గురువును ఆశ్రయించి అనుసరించాలి. ఏదో ఒక గురువుని ఆశ్రయించడం కాదని కూడా అంటారు. బాబా గురించి అసలు ఎటువంటి వివరాలు తెలియవు. అందుచేత బాబాకు ఒక పరీక్ష పెడదామనుకున్నారు. “సాయిబాబా చాలా గొప్పవాడయితే నేను నాలుగురోజులనుండీ తిండీ తిప్పలు లేకుండా ఉన్నానని తెలిసే ఉంటుంది. నేను బ్రతికి ఉండాలంటే రోజుకి ఒక పూటన్నా నాకు భోజనం కావాలి. ఆయన నా అవసరాలన్నీంటినీ తీర్చాలి.” అనుకున్నారు. ఆయన ఆవిధంగా మనసులో బాబాకు పరీక్షగా అనుకున్న క్షణంలోనే తన వెనుక రైలు వస్తున్న సబ్దం వినబడింది. పట్టాలమీద నడుస్తున్న స్వామీజీ ప్రక్కకు తప్పుకున్నారు. రైలు వెడుతుండగా క్రింద ఏదో పొట్లం పడిన శబ్దం వినిపించింది. బహుశ రైలులోనుండి ఎవరో ప్రయాణీకుడి సంచీ క్రింద పడిపోయి ఉంటుందనుకున్నారు. ఏమి పడి ఉంటుందో చూద్దామనే ఆసక్తి కలిగింది. క్రింద పడిన పొట్లం విప్పి చూసారు. ఆపొట్లంలో ఏడెనిమిది చపాతీలు,
కూర ఉన్నాయి. ఆవిధంగా బాబా ఆయనకు నిదర్శనం చూపించారు. స్వామీజీ మనసులోనే తనకు ఆహారం కావాలని కోరుకున్న మరుక్షణంలోనే ఆహారాన్ని లబింపచేసారు. తనకు సహాయం చేసినట్లయితే సర్వశ్య శరణాగతి చేస్తానని కూడా మనసులో అనుకున్నారు. అదే క్షణంలో బాబా ఆయన కోరికను తీర్చి ఇక అన్ని విషయాలలోను తనను సర్వశ్యశరణాగతి వేడుకోమని గ్రహించుకునేలా తన లీలను చూపించారు. బాబా గురించి ఏమీ తెలియకపోయినా స్వామీజీకి బాబా మీద విశ్వాసం కుదిరింది. ఇది స్వామీజీ జీవితంలో జరిగిన ముఖ్యమయిన మొట్టమొదటి సంఘటన. ఆఖరికి షిరిడీకి చేరుకున్న తరువాత ఆయనకు ఎన్నో అనుభవాలు కలిగాయి.
స్వామీజీ
గుర్తుకు తెచ్చుకుని చెబుతున్న వివరాలు…
నేను షిరిడీ వైపుగా నడచుకుంటూ వెడుతున్నాను. కాని ఒక చోట నాసిక్ వద్ద రైలు పట్టాల దారిని వదిలి త్రయంబకేశ్వర్ వైపు వెళ్లాను. అది రాత్రి సమయం. నాకు దారితెలియదు. అయినా అలాగే నడవసాగాను. నేను ఒక సాధువును కలుసుకున్నాను. ఆయన నాకు తిండి పెట్టారు. నేను ఆయనవద్దనే ఆరు నెలలపాటు ఉన్నాను. ఆరునెలల తరువాత షిరిడినుండి ఒక సాధువు వచ్చాడు. ఆయన కూడా ఆసాధువు ఉన్న చోటనే ఉండసాగారు. మేమిద్దరం ద్వారకామాయి గురించి సమాధి మందిరం గురించి మాట్లాడుకున్నాము. అదే రోజు నాకు స్వప్నంలో స్వామి నిత్యానంద దర్శనమిచ్చి,
“నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నీకు షిరిడీకి వెళ్లాలని అనిపించడంలేదా?” అన్నారు. ఆమరుసటిరోజు నేను షిరిడికి బయలుదేరుతున్నానని సాధువుతో
చెప్పాను. ఆయన నన్ను అక్కడే ఉండమని అన్నారు.
నేను ఉండటానికి నాకొక చిన్న గుడిసెను కట్టారు.
కాని నేను త్రయంబకేశ్వర్ నుండి బయలుదేరి చివరికి షిరిడికి చేరుకొన్నాను. ఆరోజుల్లో నేను రాత్రివేళల్లో పట్టాలవెంబడి నడిచాను.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment