23.01.2021
శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 33 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
శివనేశన్ స్వామి చెబుతున్న వివరాలు…
నాసిక్ స్టేషన్ దగ్గర అర్ధరాత్రివేళ ఒక పోలీస్ జీవ్ వచ్చింది. పోలీసులు నన్ను ఆపారు. ఇన్స్ పెక్టర్ ఎక్కడికి వెడుతున్నావు అని అడిగాడు. నేను షిరిడి వెడుతున్నానని చెప్పాను. “అయితే ఎందుకు నడుస్తున్నావు?” అని ప్రశ్నించాడు. “నాదగ్గర డబ్బు లేదు. అందుకనే నడుచుకుంటూ వెడుతున్నాను” అని చెప్పాను. అపుడతను నన్ను జీపులో కూర్చోమన్నాడు.
ఆయన నాకు త్రాగడానికి టీ ఇచ్చి, కొంతడబ్బు కూడా ఇచ్చాడు. “సాయిబాబాకు నా నమస్కారాలను తెలియచేయండి” అని చెప్పాడు. ఆతరువాత నాకు ముగ్గురు లేక నలుగురు సాధువులు కలిసారు. వారు నన్ను తమతోపాటు రైలులో కాశీకి రమ్మన్నారు. నేను వారికి నా అంగీకారాన్ని తెలిపాను, కాని నేను షిరిడికి చేరుకున్నాను.
ద్వారకామాయికి వచ్చి బాబా చిత్రపటాన్ని చూసాను. బాబా నాకు హనుమంతునిలా దర్శనమిచ్చారు. ఆతరువాత కొద్దిసేపటికి ఒక అరబ్ లాగా దర్శనమిచ్చారు. నేను మసీదులోనే కూర్చుని తదేకంగా ఆయన చిత్రపటం వైపే చూస్తూ కూర్చున్నాను. కొద్ది క్షణాలలో ఆచిత్రం నాకు హనుమంతునిలా ఆతరువాత అరబ్ లాగా కనిపించింది. రోజంతా అక్కడే కూర్చుని ఈవిధంగా ఆలోచించాను. ‘ఇక్కడ ఏదో విచిత్రం ఉంది. ఇది కేవలం సామాన్యమయిన పటం మాత్రమే కాదు’. ద్వారకామాయిని మూసేంతవరకు అక్కడే కూర్చున్నాను. సంస్థానంవారు బీదలకు ఉచితంగా భోజనాలు పెడుతున్నారని మరుసటిరోజున తెలిసింది. నేనక్కడికి వెళ్ళాను. కాని వారు నాకు భోజనం పెట్టలేదు. దానికి కారణం అక్కడ సన్యాసులు లేరు. నువ్వు ఎక్కడినుంచి వచ్చావు అని నన్నడిగారు. నేను బొంబాయినుండి వచ్చానని చెప్పాను. కాని వారు నాకు ఏమీ పెట్టలేదు. ఆరోజుల్లో అక్కడ సగుణమేరు అనే ఆయన ఉన్నాడు. ఆయన బాబా జీవించి ఉన్న రోజులల్లోనే దక్షిణాదినుండి వచ్చి ఇక్కడె ఉండిపోయారు. ఆయన నన్ను పిలిచి భోజనం పెట్టారు. సగుణమేరు నాయక్ కూడా సన్యాసే. ఆయన ఇక్కడికి వచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా ఆయనను షిరిడిలోనే ఉండిపొమ్మన్నారు. ఆయన బాబా గురించిన పుస్తకాలు అమ్మారు. మొదట్లో ఆయన యాత్రికుల కోసం చిన్న హోటలు పెట్టారు. ఆయన కాంటీన్ లో ఉన్నతనితో నాకు భోజనం పెట్టమని చెప్పారు. నేనక్కడ భోజనం చేసాను. మరుసటిరోజు ద్వారకామాయికి వెళ్ళాను.
అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాను. నేను బాబా రూపాన్నే ధ్యానించాను. ఆతరువాత మూడురోజులు నేను ఎవరినీ భోజనం పెట్టమని
అడగలేదు. కొంతమంది నాకు ప్రసాదం ఇచ్చారు. అది తిని కాసిని నీళ్ళు త్రాగాను. ఆతరువాత నేను కనీసం ప్రతిరోజు ఒక్కపూటయిన
భోజనం లభించేల చేయమని బాబాతో చెప్పుకొన్నాను.
ఆయననే ధ్యానిస్తూ కూర్చున్నాను.
అదే
సమయంలో శ్యామా దేశ్ పాండే కుమారుడు ఉధ్ధవరావు ద్వారకామాయికి వచ్చాడు. అతను అక్కడ ఉన్న గంటను బాగా శబ్దం వచ్చేలా మోగించాడు. ఆశబ్దానికి నేను కళ్ళు తెరిచి చూసాను. నువ్వు ఏమయినా తిన్నావా అని నన్నడిగాడు. లేదని సమాధానం చెప్పాను. ఆరతి అయినతరువాత అతను ప్రసాదం తీసుకువచ్చి బాబాకు
నైవేద్యం పెట్టి నాకు తినమని ఇచ్చాడు. ఆ తరువాత ద్వారకామాయిలో నేనొక సాధువును కలుసుకున్నాను. ఆ సాధువు కూడా తరచూ స్వామి నిత్యానంద వద్దకు వెళ్ళి
వస్తూ ఉంటాడు. నేనాయనతో మాట్లాడాను. స్వామి నిత్యానంద ఆయనను భగవద్గీత ఎలా పఠించాలో నేర్చుకుని
చదవమని చెప్పారని అన్నాడు. ఆ సాధువు “నేను
చదువుకున్నవాడిని కాదు. కాని స్వామి నిత్యానంద
గారి అనుగ్రహం వల్ల నేను ఇపుడు భగవద్గీతలోని 18 అధ్యాయాలను చదవగలను. ఆ స్వామి అనుగ్రహానికి
నేనెంతో కృతజ్ఞుడను” అన్నారు. సాధువుకు భగవద్గీత
కంఠతా వచ్చు. ఆయన చెప్పినది సరైనదో కాదో తెలుసుకోవడానికి
నేను పుస్తకం చూడవలసివచ్చింది. ఆవిధంగా ఆయన
నాకు ద్వారకామాయిలో భోజనం పెట్టాడు. ఒకరోజు
అర్ధరాత్రి సమయంలో నేను లెండీబాగ్ లో ఉన్నాను.
ఆరోజు నిండు పౌర్ణమి. నేను ధ్యానం చేసుకోవడంలేదు. అక్కడ తోటలో కూర్చుని ఉన్నాను అంతే. ఆ సమయంలో చుట్టుప్రక్కల ఎవరూ లేరు. అపుడు బాబా ఒక రాతిమీద కూర్చొని ఉన్నట్లుగా నాకు
దర్శనమిచ్చారు.
ప్రశ్న --- సాయిబాబా
రాతిమీద కూర్చుని ఉండటం మీరు స్పష్టంగా చూసారా?
జవాబు --- అవును.
ఆయన అరగంట సేపు అక్కడే కుర్చుని ఉన్నారు. ఆ
తరువాత అదృశ్యమయ్యారు. సాయిబాబా ఇంకా ఇక్కడే
నేటికీ సజీవంగానే ఉన్నారనే విషయం అపుడే నాకర్ధమయింది. ఆయనను సజీవంగా చూసిన తరువాత షిరిడీలోనే ఉండిపోవాలని
నిర్ణయించుకున్నాను. మరొక సందర్భంలో నేను ద్వారకామాయిలో
ఉండగా నా ఆధ్యాత్మిక గురువు ముక్తియస్వామి గారు మధ్యాహ్నంవేళ నాకు దర్శనమిచ్చారు. స్వామి నిత్యానందగారు నన్ను ఆదేశించకముందే ఆయన నన్ను
షిరిడీకి వెళ్ళమని చెప్పారు. ఆయన సమాధి కన్యాకుమారిలో
ఉంది. నేనా సమయంలో ధ్యానంలో లేను. కళ్ళు తెరచుకునే
ఉన్నాను. బాబా చిత్రపటంలోనుండి ముక్తియ స్వామిగారు
వచ్చి నాకు దర్శనమిచ్చారు. ఆయన కొద్దిసేపు
నుంచుని ఆతరువాత అదృశ్యమయ్యారు. ఆతరువాత నేను
శ్రీ సాయి సత్ చరిత్ర చదివాను. అందులో మూలేశాస్త్రికి
ఎపుడో సమాధి చెందిన ఆయన గురువుగా సాయిబాబా దర్శనమిచ్చిన సంఘటన ఉంది. ఆరునెలల తరువాత నాగురువు మొట్టమొదటిసారి ఎక్కడయితే
దర్శనమిచ్చారో మరలా అక్కడె అదే స్థానంలో దర్శనమిచ్చారు. (ఆయన నవ్వుతూ). దీనిని బట్టి నాకు బాగా అర్ధమయినది ఏమిటంటే ద్వారకామాయిలో
ఉన్న బాబా చిత్రపటం ఏమాత్రం సామాన్యమయినదీ మామూలుదీ కాదు. ఆపటంలో బాబా సజీవంగా ఉన్నారు. ఇది యదార్ధం. అందులో ఎటువంటి అనుమానం లేదు. నాకు ఏది కావాల్సివచ్చినా సరే ద్వారకామాయిలో ఉన్న
బాబా దగ్గరకు వెళ్ళి ఆయనతో చెప్పుకుంటాను.
బాబా నాకు సహాయం చేస్తారు. ఉదాహరణకి
బాబా ఒకసారి నాతో “ఈవ్యక్తి నీకు సహాయం చేస్తాడు.
అతను నీకు ఇస్తాడు” అని అన్నారు. బాబా
చెప్పినట్లుగానే ఆవ్యక్తి వచ్చి పుస్తకాలు కొనుక్కోవడానికి ఇంకా కొన్నిటికి డబ్బు ఇచ్చాడు.
(ఇంకా ఉంది)
(సర్వ్ం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment