24.01.2021
ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 34 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
శివనేశన్ స్వామి చెబుతున్న వివరాలు…
ప్రశ్న --- ఆవిధంగా బాబా మీకు మీజీవితకాలంతా రక్షణగా ఉంటూ మార్గదర్శకులుగా ఉన్నారన్నమాట?
జవాబు --- రెండు మూడు సార్లు నేను ఇక్కడినుండి వెళ్ళిపోదామని ప్రయత్నించాను. నేను శివానందగారికి ఆయన ఆశ్రమంలోనే శాశ్వతంగా ఉందామనుకుంటున్నానని ఉత్తరం వ్రాసాను. అపుడు శివానందగారు, “ఇక్కడికి రావద్దు. నువ్వు ఎంతో పవిత్రమయిన పుణ్యభూమిలో ఉన్నావు. మా ఆశ్రమంలో రాత్రి సమయంలో 24 కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు షిరిడిలోనే ఉండి బాగా సాధన చేసుకుంటూ ఉండు” అని జవాబిచ్చారు.
ఒకసారి ఆయన ఆశ్రమంనుండి ఆయన కార్యదర్శి కృష్ణానందగారు వచ్చి ఆరునెలలు ఇక్కడే ఉన్నారు. నేను ఇక్కడ కాలవలో స్నానం చేస్తూ ఉండేవాడిని. ఆయన కూడా స్నానానికి అదే కాలవకి వచ్చారు. ఆయన నాకు అక్కడే కలిసారు. మీరెక్కడినుంచి వచ్చారని అడిగాను. తను శివానంద ఆశ్రమంనుండి వచ్చానని, పేరు కృష్ణానంద అని చెప్పారు.
నేను శివానందగారికి ఉత్తరం వ్రాసానని చెప్పాను. అపుడాయన, “అవును నేను మీ ఉత్తరానికి సమాధానం రాసాను. ఆ ఉత్తరం మీద శివానందగారు సంతకం చేసారు”
అని చెప్పారు. స్వామీజీ తీర్చవలసిన బాకీలు చాలా ఉన్నాయనీ అందువల్లనే తాను షిరిడిలో ఉండటానకి వచ్చినట్లు చెప్పారు. ప్రతివారూ స్వామీజీని డబ్బు అడగరు. కార్యదర్శిని కాబట్టి నాదగ్గరకే వస్తారు. నన్ను హింసపెడుతూ ఉంటారు. అది భరించలేకనే నేను ఇక్కడికి వచ్చాను. నాకు మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వెళ్లాలని లేదు” అన్నారు. ఆయన ఇంకా, “నాకు హృషీకేష్ లో మనశ్శాంతి లభించలేదు. కాని ఇక్కడమాత్రం నాకు ప్రశాంతంగా ఉంది.” అన్నారు. ఆరునెలల తరువాత బాబా, కృష్ణానందగారికి స్వప్నంలో దర్శనమిచ్చి అతని గురువయిన శివానందగారి ఆశ్రమానికి వెళ్ళిపొమ్మని ఆదేశించారు. ఆయన తిరిగి వెళ్ళిపోతూ మొట్టమొదటగా నాసలహా ప్రకారం స్వామి నిత్యానందగారి దగ్గరకు వెళ్ళారు. స్వామి నిత్యానందగారు కూడా ఆయనను ఆయన గురువు వద్దకే వెళ్ళమని చెప్పారు. అందువల్ల ఆయన హృషీకేష్ కి తిరిగి వెళ్ళిపోయి ఇప్పటికీ అక్కడె ఉంటున్నారు. నేను కూడా షిరిడీనుండి వెళ్ళిపోదామని ప్రయత్నం చేసాను. (నవ్వుతూ). కాని అది సాధ్యపడలేదు. అందువల్లనే నేను ఇక్కడే ఉండిపోయాను. పూర్వపు రోజుల్లో షిరిడీలో ముగ్గురు పోలీసులు ఉండేవారు. ఒకరు గ్రామంలోను, మరొకరు సంస్థానం లోను, మరొక పోలీసు ఉండేవారు. ఒకసారి సాయిబాబా వారి వెండిసామన్లను ఎవరో దొంగిలించారు. ఆకాలంలో సాధువులను, ఇతరులను మూడురోజులకన్నా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండనిచ్చేవారు కాదు. నేను ఇక్కడే ఉన్నాను. కాని నేను ఇక్కడే నిద్రపోతానంటే ఒప్పుకోలేదు. ఎలాగయితేనేమి నేను ఆరతిలో పాల్గొన్న తరువాత, ఊరు బయట నిద్రించేవాడిని. “నువ్వు ఇంతకాలంపాటు షిరిడిలో ఎందుకని ఉన్నావు?” అని ఒక పోలీసు నన్నడిగాడు. బాబా నన్ను ఇక్కడే ఉండమన్నారు అందుకనే ఉంటున్నానని చెప్పాను. ఒకసారి నేను సమాధిమందిరంలో బాబాను ప్రార్ధించుకుంటూ ఉన్న సమయంలో మూడవ పోలీసతను వచ్చి, “నువ్వు ఈ షిరిడీ వదిలి వెళ్ళకపోతే నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకువెడతాను” అన్నాడు. నేను ఈ విషయాన్ని బాబాతో చెప్పుకున్నాను. నేను ద్వారకామాయికి వెళ్ళి, “బాబా నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకువెడతానంటున్నాడు” అని ఆయనతో చెప్పాను. నేను ద్వారకామాయిలో బాబాను ప్రార్ధించుకున్న రోజు రాత్రి షిరిడీకి సర్కస్ కంపెనీ ఒకటి వచ్చింది. ఆ సర్కస్ కంపెనీలోని వ్యక్తికి, ఆ పోలీస్ కి ఏదో గొడవ జరిగి సర్కస్ కంపెనీ వ్యక్తి పోలీసును కొట్టాడు. ఆపోలీసు వెళ్ళిపోయాడు. నేను ఇక్కడే ఉన్నాను. కాని, కొన్ని రోజుల తరువాత ఆ పోలీసు వచ్చి నన్ను చూసి, “నువ్వింకా ఇక్కడే ఉన్నావా”
అన్నాడు. “అవును ఇక్కడే ఉన్నాను. బాబా నన్ను ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించారు” అని సమాధానం చెప్పాను. మరొక సందర్భంలో నిజంగానే వెళ్లిపోదామని అనుకున్నాను. షిరిడీ గ్రామస్తులు కూడా నన్ను, నాలాగే మరికొందరిని కూడా వెళ్ళిపొమ్మన్నారు. అపుడు నేను బాబా నన్ను ఇక్కడినుండి వెళ్లవద్దని చెప్పారు అందుకనే వెళ్లనని అన్నాను. ఆతరువాత కొన్ని రోజులకు నాలో నేనే ఆలోచించుకున్నాను. “ఇక్కడ చాలా రణగొణద్వనులతోను, జనాలు గుంపులతోను ప్రశాంతత కరువయింది. మరొక చిన్న ప్రడేశానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది” అనుకున్నాను. ఈవిధంగా ఆలోచించి షిరిడీ గ్రామస్తులతో, “నేను వెళ్ళిపోతున్నాను” అని చెప్పాను. నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అన్న గ్రామస్తులే ఈసారి మాత్రం “వెళ్ళద్దు, బాబా నిన్ను వెళ్ళనివ్వరు” అన్నారు. నన్ను వెళ్ళిపో అన్నవారే ఇపుడు ఉండిపో అన్నారు. మరొక సందర్భంలో కూడా నేను వెళ్ళిపోదామనుకున్నాను. నేను వెళ్ళిపోతున్నట్లు ఎవరికీ చెప్పకుండా ఒకరోజు సాయంత్రం ఖండోబా మందిరానికి వెళ్ళి ఆయనకు నమస్కరించుకుని బయలుదేరాను. కాని హటాత్తుగా నాలో శక్తి క్షీణించింది, బలహీనమయి. నడవలేకపోయాను. శరీరమంతా వణకసాగింది. ద్వారకామాయికి వెళ్ళి అక్కడే పడుకుని బాబాను ప్రార్ధిస్తూ ఆయనతో “ఇక నేను షిరిడి విడిచి వెళ్ళను
(నవ్వుతూ). నాకు సహాయం చెయ్యి” అని చెప్పుకున్నాను. మరుసటిరోజు ఎప్పటిలాగానే నేను మామూలు మనిషినయ్యాను.
నేను (ఆంటోనియో) --- నమ్మశక్యం కాని అధ్భుతం
జవాబు (శివనేశన్ స్వామి)
ఇక్కడ రణగొణద్వనుల మధ్య ఉండలేక ఒక చిన్న గ్రామానికి వెళ్ళి భిక్షమెత్తుకుని కాలం గడుపుదామనే ఆలోచనతో మరొకసారి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాను. ఎవరికీ చెప్పకుండా రాత్రి 2 లేక 3 గంటల సమయంలో వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకున్నాను. సన్నటి రహదారి మీద నడుస్తున్నాను. ప్రక్కనే చిన్న కాలవ ఉంది. దారంబటే గంట, రెండు గంటలసేపు నడిచేటప్పటికి అలసిపోయాను. దాహం వేసింది. కాని కాలవలో నీళ్ళు లేవు. చుట్టుప్రక్కల ఎక్కడా నీరు కనిపించలేదు. ఒక వేపచెట్టుక్రింద బావి కనిపించింది. అది దిగుడు బావి. బావిలోకి దిగడానికి మెట్లు సరిగా లేవు. మెట్లు దిగి నీళ్ళు త్రాగడానికి అనువుగా లేదు, తోడుకోవడానికి చేద కూడా లేదు. చెట్టు కొమ్మలు మూడు బావిలోకి నీటిమట్టానికి దగ్గరగా వాలి ఉన్నాయి. కాని చెట్టు ఎక్కి ఆకొమ్మలను పట్టుకుని బావిలోకి వంగి నీటిని కూడా అందుకోలేను. ఈ సమస్య గురించే ఆలోచిస్తూ ఏమి చేయాలో తోచని స్థితిలో పడుకుని నిద్రపోయాను. ఆతరువాత ఒక గంట, రెండు గంటల తరువాత మెలుకువ వచ్చేటప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. “నేను ఎక్కడ నిద్రపోతున్నాను” అని ఆలోచించాను. వేపచెట్టు కింద రాతిమీద కూర్చున్న సాయిబాబా రూపం కనిపించింది.
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దీని గురించే చాలా దీర్ఘంగా ఆలోచించాను. “బావిలో నీళ్ళున్నాయి. కాని త్రాగలేను. ఇక్కడ మొదటిసారిగా వేపచెట్టు క్రింద బాబా దర్శనమిచ్చారు” నేనెక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను అని బాబా నాతో చెబుతున్నట్లుగా గ్రహించుకున్నాను. ఆయన లేకుండా నాకు ఒక్క చుక్క నీరు కూడా లభించదు, ఒకవేళ దగ్గరగా నీరు ఉన్నా గాని నేను దానిని గమనించలేను. ఇక వెనక్కి తిరిగి ద్వారకామాయిలోనే ఉండటానికి నిశ్చయించుకున్నాను. అప్పటినుండి షిరిడి వదిలి వెళ్ళిపోదామని మళ్ళీ ప్రయత్నించలేదు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment