21.01.2021
గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 31 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
శివనేశన్ స్వామి చెబుతున్న వివరాలు…
తుకారామ్ --- మీకొక విషయం తెలిసే ఉంటుంది. ఏ యుగానికి తగినవిధంగా ఆయుగానికి సంబంధించిన ఆధ్యాత్మిక సాధనలు ఏవిధంగా ఆచరించాలో మన వేదాలలో వ్రాయబడి ఉంది. ఈ కలియుగంలో ముఖ్యంగా చేయతగిన ఆధ్యాత్మిక సాధన నామస్మరణ అని వ్రాయబడి ఉంది. కలియుగంలో మానవులందరూ ప్రాపంచిక వ్యవహారాలు, ఇంకా ఎన్నో విషయాలలో మునిగి ఉంటారని తెలుసును కాబట్టే వేదాలలో ఆవిధంగా ముందుగానే చెప్పబడింది.
అందువల్ల ఈ
కలియుగంలో సంక్లిష్టమయిన సాధనలు నేటి మానవులకు సాధ్యం కాదు. అందుచేత అతి సులభమయిన సాధన భగవంతుని స్మరించుకోవడం, అదే నామస్మరణ. బాబావంటి సమర్ధ సద్గురువులు తమ భక్తులను ఉత్తమమయిన విధానాలలో ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు. అదే వారి లక్ష్యం. అందుచేత ఈ సమర్ధ సద్గురువులందరూ నిర్దిష్టమయిన కాలాలకు అనుగుణంగా తమ పధ్ధతులను మార్చుకుంటూ తమ లక్ష్యాలను కొనసాగిస్తూ ఉంటారు. అందువల్ల బాబాగారు ఉన్నకాలంలో భగవంతుడు సాయిబాబాగా అవతారమెత్తి ఈ నామస్మరణ విధానానికి విశేషమయిన ప్రాముఖ్యతనిచ్చారు. నేడు షిరిడీకి వస్తున్న ప్రజలగుంపును గమనించినట్లయితే సమాజంలో ఆదునికంగా పెద్దపెద్ద హోదాలలో ఉన్నవారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇంతకుముందు ప్రజలు ఆచరించిన విధంగా వారు తెల్లవారుజాము మూడు గంటలకే నిద్రనుండి మేలుకోలేరు, నదిలో స్నానం చేయలేరు, ధ్యానం చేసుకోలేరు. నేడు ఇటువంటివన్నీ ఆచరించడానికి మనకు సమయాలు అనుకూలంగా లేవు. అంతేకాదు, బాబా మరొక విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అదేమిటంటే అన్ని మతాలు సమానమే, ఒక మతానికి మరొక మతానికి భేదం లేదని, ఒకరి దేవుడికి మరొకరి దేవుడికి భేదం లేదని బోధించారు. దేవుడు ఒక్కడే ఒకటే శక్తి. వేరువేరు పేర్లతో, వేరు వేరు ఆకారాలలో ఎప్పటికప్పుడు ప్రకటిమవుతూ ఉంటుంది. ఈ కారణం వల్లనే హిందూ మతానికి,
ఇస్లాంకి భేదం ఉన్నదని, హిందూ మతం వేరు, క్రైస్తవమతం వేరు అని మనం భావించకూడదు. ప్రస్తుతం మన గ్రహణశక్తి చాలా ప్రతికూలంగా ఉంది. మనం ఒకరితో ఒకరం విరోధాన్ని పెంచుకుంటూ మితిమీరిన ప్రతికూలవాతావరణాన్ని సృష్టించుకుంటున్నాము. మనమందరం మానవులం. కాని మనలోనే వేరొకమతంవారు అనుసరించే విధానాలు, పధ్ధతులు మనం ఆచరించేవాటికన్నా భిన్నంగా ఉండటంవల్ల వారిని మన శతృవులుగా భావిస్తున్నాము. ఆ శతృత్వభావం పోవాలని స్పష్టత రావాలని బాబా కోరుకొన్నారు. ఈ కారణం వల్లనే ఆయన ఇతరులకి తన మతమేమిటో జాతి ఏమిటో మొదలయిన వివరాలన్నీటినీ చాలా గోప్యంగా ఉంచారు. ముస్లిమ్స్ ఆయన వద్దకు వచ్చినపుడు వారితో “రామ్, రామ్” లేక కృష్ణ, కృష్ణ” అనమని, అల్లా మిమ్మల్ని దీవిస్తాడు అనేవారు. ఇది చాలా విభిన్నమయిన బోధన అని మీరు గమనించారా? ముస్లిమ్స్ ని “రామ” అని స్మరించమని చెప్పడం,
దాని పర్యవసానంగా “అల్లా దీవిస్తాడని” చెప్పడం అంటే ఏనామాన్ని స్మరించినా ఒకటే అని ఆయన భావం. అదేవిధంగా హిందువులతో బాబా “అల్లామాలిక్” అని అల్లాను స్మరించమని చెప్పేవారు. “అల్లా పేరులో ఏముంది? పండరిపూర్ విఠల్ వేరు అల్లా వేరు రాముడు వేరు అనుకుంటున్నావా, అంతా ఒకరే” అని బాబా అనడం చాలామంది విన్నారు. ఆవిధంగా బాబా బోధించారు. నామస్మరణ విధానం ద్వారా బాబా ఈనాడు మనమందరం ఆధ్యాత్మిక జీవితం గడపడానికి సులభమయిన తరుణోపాయాన్ని చూపించారు. సమర్ధ సద్గురువులు ఉన్న కాలాలలో కూడా ఈ
విధానాన్నే అవలంబించారు. సర్వశ్యశరణాగతి చేసినవారికి మోక్షాన్ని ప్రసాదించడమే వారియొక్క అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసమే వారు ఎప్పటికప్పుడు వేర్వేరు పధ్ధతులను అనుసరించమని సలహాలను ఇస్తూ ఉంటారు. ఇది నా అభిప్రాయం.
ప్రశ్న --- మొట్టమొదటగా షిరిడీ రావడంలోని ఆయన ఉద్దేశ్యమేమిటో శివనేశన్ స్వామిని అడిగి చెబుతారా? 30 సంవత్సరాలపాటు చాలా ఏళ్ళు ఇక్కడే ఉండిపోదామనుకున్నారా లేక ఒక పవిత్రక్షేత్రాన్ని దర్శించుకుందామనే ఉద్దేశ్యంతో వచ్చారా? బాబాతో ఆయనకు కలిగిన అనుభవాలు ఏమిటి?
తుకారామ్ --- స్వామీజీ నాకు చెప్పిన వివరాలను మీకు చెబుతాను. స్వామీజీ తమ స్వంత నివాసస్థలమయిన కాముతి ని తన 15 సంవత్సరాల వయసులోనే వదిలి వచ్చేశారు. ఆయనలో స్వభావసిధ్ధంగానే ఆధ్యాత్మిక భావాలు నిండిఉన్నాయి. ఆకారణంగానే 15 సంవత్సరాల వయసులోనే ఈ ప్రాపంచిక విషయాలమీద బంధాన్ని తెంచుకున్నారు. ఆవయసునుండే సంచారం మొదలు పెట్టారు.
ప్రశ్న --- క్షమించండి, ఆయన ఏ
ఊరునుండి వచ్చారని చెప్పారు?
జవాబు --- తమిళనాడులో ఉన్న కాముతి నుండి వచ్చారు దక్షిణాదిలో ఉన్న పట్టణం అది. ఆయన ఎంతోమంది సాధువులతోను సన్యాసులతోను కలిసి జీవించారు. చివరికి ఆయన ప్రఖ్యాతిగాంచిన స్వామి నిత్యానంద ఉన్న గణేష్ పురికి చేరుకొన్నారు. ఆరోజుల్లో ఆయన దగ్గరకు ఎంతోమంది వస్తూ ఉండేవారు. స్వామీజీ నిత్యానందతో రెండు సంవత్సరాలున్నారు. ఆతరువాత సన్యాసిగా సాధనలు అభ్యాసం చేయడానికి హిమాలయాలకు వెడదామనుకున్నారు. బదరీకి గాని కేదార్ కు గాని కూడా వెడదామని ఆలొచించారు. కాని, స్వామి నిత్యానందని అంతర్యామి అని కుడా అంటారు. ఆయనకు ప్రతివ్యక్తిలో అంతర్గతంగా ఉన్న కోరికలు, మనసులోని ఆలోచనలు అన్నీ గ్రహించుకునే శక్తి ఉంది. అందువల్లనే ఆయన ఒకరోజు స్వామీజీని పిలిచి షిరిడికి వెళ్లమని ఆదేశించారు. ఆయన స్వామీజీతో “ఈ జన్మలో నీవు కోరుకొనేది నీకు షిరిడిలో మాత్రమే లభిస్తుంది” అన్నారు. ఆయన కోరుకునేదంతా షిరిడీలోనే లభ్యమవుతుందని చెప్పారు. విచిత్రమేమిటంటే దాదాపు ఎప్పుడూ జరుగుతున్నట్లుగానే ఆరోజుల్లో స్వామీజీకి షిరిడీ సాయిబాబా గురించి అసలేమాత్రం తెలియదు. ఆయన పేరుకూడా ఎప్పుడూ విని ఉండలేదు. నిత్యానందస్వామి ఆయనను షిరిడీ వెళ్లమని ఆదేశం ఇవ్వగానే ఇక గణేష్ పురిలో ఆయనతో కలిసి ఉండలేకపోయాడు. అందువల్లనే అక్కడినుండి బొంబాయికి చేరుకొని బాబా గురించి, షిరిడీ గురించి అన్ని వివరాలు తెలుసుకోవడానికి వాకబు చేయడం మొదలుపెట్టారు.
(స్వామి నిత్యానంద , గణేష్ పురి)
(స్వామి నిత్యానంద (1896 – 1961) మహారాష్ట్రలో ప్రసిధ్ధిగాంచిన గొప్ప సాధువు అధ్బుతాలను కూడా చేయగలిగిన సిధ్ధపురుషులు. ఆయన శిష్యులయిన స్వామి ముక్తానందగారు 1947 లో ఆయనను దర్శించుకున్నారు. 1936 వ.సంవత్సరంలో స్వామి నిత్యానందగారు బొంబాయి దగ్గర ఉన్న గణేష్ పురిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవితమంతా అక్కడే గడిపారు. ఈ సమాచారాన్ని ఆంటోనియోగారు తన వ్యాసం చివరలో ఇచ్చారు.)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment