19.01.2021
మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 30 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
శివనేశన్ స్వామి చెబుతున్న వివరాలు…
(గణేష్ చూర్య చెప్పిన వివరాలను తుకారామ్ గారు అనువదించి చెప్పారు)
ప్రశ్న --- మీపేరేమిటి?
జవాబు --- గణేష్ చూర్య
ప్రశ్న --- మీరు ఇక్కడె ఉంటున్నారా?
తుకారామ్ జవాబు (దుబాసీ) --- నేను షిరిడీలో అయిదు సంవత్సరాలు ఉన్నాను. నేను సెప్టెంబర్, 1, 1978 వ.సం.లో షిరిడీ వచ్చారు. అప్పట్లో నాకు బాబా గురించి ఏమీ తెలియదు. అందరూ షిరిడీ చక్కటి ప్రదేశమని చెబితే ఒక్కరోజు ఉండి అదేరోజు సాయంత్రం తిరిగి వెళ్ళిపోదామని షిరిడికి వచ్చాను.
కాని ఇక్కడికి వచ్చిన తరువాత నాకు ఈ ప్రదేశం నాకు
ఎంతగానో నచ్చింది. మొట్టమొదటగా గమనించదగ్గ విషయం మీకు తెలుసా? ఇక్కడికి వచ్చినంతనే ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు నివసిస్తున్న చోట మీకు ఎటువంటి ఆందోళనలు,
వ్యాకులతలు, సమస్యలు ఏమి ఉన్నాసరే షిరిడికి చేరుకున్నంతనే అవన్నీ మటుమాయమయిపోతాయి. మీజీవితంలో ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించని మానసిక ప్రశాంతత ఇక్కడ లబిస్తుంది. అందువల్లనే ప్రతివారికి షిరిడీ అంటె ఎంతో ఇష్టం. ఆ ఇష్టం వల్లనే వారు తరచుగా షిరిడి వచ్చి ఇక్కడ ఈ
ప్రశాంతతని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తు ఉంటారు. ఈ విధంగా బాబాతో సాన్నిహిత్యం ఏర్పడి, దానివల్లనే ఇన్నిసంవత్సరాలుగా తనకు రక్షణగా ఉన్నది బాబా తప్ప మరెవరూ కాదనే విషయాన్ని గ్రహిస్తారు. అర్ధమయిందా మీకు?
ప్రశ్న --- అందువల్లనే మీరు ఇక్కడ ఉన్నారా?
తుకారామ్ --- నేను ఇక్కడ ఒక్కరోజు మాత్రమే ఉండి వెళ్ళిపోదామని వచ్చాను. అటువంటిది ఇక్కడే అయిదు సంవత్సరాలు ఉండిపోయాను. ఇక నేను చేసే వృత్తిని శాశ్వతంగా వదిలిపెట్టి ఇక్కడే షిరిడిలో ఫకీరులు నివస్తిస్తున్నట్లుగానే ఒక ఫకీరుగా అనేకంటే ఒక బిక్షువుగా జీవించాను. ఇదంతా బాబా కరుణ. ఆయన తన కరుణను తన భక్తులందరిమీదా ప్రసరిస్తారు. ఆ
కరుణే నన్ను ఇక్కడే ఉండిపోయేలా ప్రేరేపించింది. అప్పటినుండి నేను ఆధ్యాత్మిక జీవితానికి ఆకర్షితుడినయ్యాను. బాబా గురించి ఏపుస్తకాలు దొరికితే వాటిని చదవడం మొదలుపెట్టాను. ఆయన రూపాన్నే ధ్యానం చేయడం ప్రారంభించాను. అపుడు బాబా రెండుసార్లు దర్శనమిచ్చారు. ఆవిధంగా షిరిడిలో నేను తాత్కాలికంగా నివాసం ఉన్నందుకు నాకెన్నోవిధాలుగా ఫలితం కనిపించిందని చెప్పగలను. నేను బొంబాయిలో ఉన్నపుడు నాజీవితం వేరుగా ఉండేది. మానవజన్మ ఎందుకు లబిస్తుందో దాని ప్రాముఖ్యత, మానవశరీరం ప్రాప్తించిన తరువాత మానవ జీవిత లక్ష్యం ఇవన్నీ కుడా షిరిడికి వచ్చినతరవాతనే నాకు బాగా అర్ధమయ్యాయి. ఆలక్ష్యాన్ని చేరుకోవడానికి ఇపుడు నేను నాశాయశక్తులా కృషి చేస్తాను. జన్మజన్మలకు తాను తోడుగా ఉంటానని మనకు మార్గదర్శిగా ఉంటానని జీవిత లక్ష్యమయిన మోక్షాన్ని చేరుకోవడానికి సహాయపడి తద్వారా భగవంతునిలో ఐక్యమవడానికి సహాయపడతానని బాబా తన భక్తులకు మాట ఇచ్చారు.
ప్రశ్న --- ధన్యవాదాలు. మీ అనుభవాన్ని బ్రహ్మండంగా వివరించారు. ఇపుడు మీరు బొంబాయిలో ఉంటున్నారా?
తుకారామ్ (దుబాసీ) --- అవును, నేను బొంబాయికి తిరిగి వెళ్ళిపోయాను. కారణం ఏమిటంటే బాబా ఎవ్వరికీ అధికమయిన పని అప్పచెప్పరు. నాకు సరిగా గుర్తున్నంతవరకు షిరిడిలో జోగ్ అనే ఆయన ఉండేవారు. ఆయన బాబాకు ఎప్పుడూ ఆరతిని ఇస్తూ ఉండేవారు. ఆయన సన్యాసం తీసుకుందామనుకున్నారు. కాని బాబా ఆయనతో “దానికి సమయం వస్తుంది. నువ్వు ఓపికపట్టు” అన్నారు. దానికి యోగ్యత కూడా ఉండాలని బాబా చెబుతూ ఉండేవారు. అందుచేత నాలాంటి, మనలాంటి వాళ్ళం పూర్వజన్మలలో చేసుకున్న కర్మఫలితాలకు బధ్ధులమై ఉన్నాము. మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి వాటి ఫలాలను మనం అనుభవించవలసిందే. ఉదాహరణకి శాస్త్రాలలో చెప్పబడినట్లుగా భగవన్నామాన్ని స్మరించుకుంటూ ఈ కర్మలు సమసిపోయేలా చేసుకోనట్లయితే ఆధ్యాత్మిక పరిపక్వత లేని కారణంగా ఎవరూ సన్యాసజీవితంలోకి అడుగుపెట్టలేరు. కర్మయోగంలో ఉన్నంతవరకు మనం జీవితంలో సమస్థితికి చేరుకోలేము. సన్యాసాశ్రమం స్వీకరించే సమయమూ రాదు.
నేను (ఆంటోనియో) --- సాయిబాబా గురించి పుస్తకాలను చదివాను. బాబా గారి బోధనలు అన్నీ నేటికాలానికి తగినట్లుగా సమాజానికి మేలుచేసేలా ఉన్నాయి. ఆబోధనలు తరతమ భేదాలు లేకుండా అందరినీ ఉద్దేశించి బోధించినవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఐహికజీవితంలో ఉన్న గృహస్థులను ఉద్దేశించి బోధించినవిగా ఉన్నాయని నాకు అర్ధమయింది. భార్యా, పిల్లలు ఉద్యోగం అన్నీ ఉన్న సంసారులు ఎవరికయిన సరే ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలనుకునేవారికి ఆయన బోధనలు గొప్ప అవకాశాన్ని ప్రసాదిస్తాయి. ఇది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాబాగారి బోధనలు సన్యాసులకు మాత్రమే పరిమితం చేయబడి ఉన్నట్లయితే అతి కొద్దిమంది మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ఆశించి ఉండేవారు.
మీరు ఎక్కడున్నా సరే నామస్మరణ సాధన చేయమని బాబా చెప్పిన బోధ ఆయన తన భక్తులకు ప్రసాదించిన గొప్పవరమని నేను భావిస్తున్నాను.
(ఇంకా
ఉంది)
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment