శ్రీ సాయి స్వయంగా చేసిన నామకరణం, అక్షరాభ్యాసం
శ్రీ సాయిబాబా పన్ను భద్రపరచిన పూనాలోని శివాజీ సాయి మందిర్ నిర్మాతగా సాయి భక్తుల హృదయాలలో అమరుడైన భక్తుని నామధేయం ( దౌలత్ షా ఉరఫ్ దత్తాత్రేయ రస్నే ఉరఫ్ నానా సాహెబ్ రస్నే ) కన్న తల్లి గర్భంలోకి రాకముందే సాయి నిర్ణయించారు.
శ్రీ దామోదర సావల్రాం రస్నేకు రెండు వివాహాలు చేసుకున్నా సంతానం కలగకపోవడంతో జ్యోతిష్కులను సంప్రదించాడు. వాళ్ళు అతని జాతక చక్రం చూసి, అతనికి సంతానయోగం లేదని ఖచ్చితంగా చెప్పారు. ఆ తరువాత అతను సాయిబాబాను దర్శించి తన కోరిక విన్నవించుకున్నాడు.
బాబా అతనికి నాలుగు మామిడిపండ్లు ప్రసాదంగా ఇచ్చి "ఇవి నీ రెండవ భార్యకివ్వు! నీకు మొత్తం 8 మంది సంతానం కలుగుతారు. మొదట ఇద్దరు మగ పిల్లలు కలుగుతారు. వారిలో మొదటి పిల్లవానికి 'దౌలత్ షా' అని, రెండవవానికి 'తాన్ షా' అని పేర్లు పెట్టు" అని ఆశీర్వదించారు. దామోదర్ రస్నే బాబా చెప్పిన వివరాలు యింటికెళ్ళగానే తన డైరీలో వ్రాసుకున్నాడు. బాబా చెప్పిన విథంగానే సంవత్సరం తిరిగేసరికల్లా (1901) అతడికొక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవానికి 15 నెలల వయస్సప్పుడు షిరిడీకి తీసికెళ్ళి, బాబా దర్శనం చేసుకుని తన కొడుక్కు ఏంపేరు పెట్టమంటారని అడిగాడు. (బహుశా ఈ సారి బాబా ఏదైనా హిందూ పేరు చెప్తారేమోననే ఆశతో కావచ్చు). దానికి బాబా "నేను యెప్పుడో చెప్పాను కదా? "దౌలత్ షా' పేరు పెట్టమని. ఆ విషయం నువ్వు డైరీలో 3 వ పేజీలో రాసుకున్నావు కూడా" అన్నారు. అయితే దామోదర్ రస్నే బాబా పెట్టిన పేరు లాంఛనంగా ఉంచి, ఆ పేరుతో పాటు తన కుమారుడికి 'దత్తాత్రేయ’ అనే హిందూ పేరును కూడా జోడించి నామకరణం చేశాడు.
తరువాత 1906 లో తన కుమారుడికి అయిదేళ్ళు వచ్చాక బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. బాబా అప్పుడు ఆపిల్లవాడి చేతికి బలపం ఇచ్చి తాము స్వయంగా పిల్లవాడి చేయి పట్టుకుని పలకపైన 'హరీ ‘ అని వ్రాయించి అక్షరాభ్యాసం చేశారు. అలా బాబా దౌలత్ షా చేత హరినామం దిద్దించారు.
అయితే ఒక సాంప్రదాయ హిందూ కుటుంబంలో జన్మించిన బాలుడికి బాబా ముస్లిం పేరు యెందుకు పెట్టినట్లు? బాబా చెప్పినట్లు ఆయన చర్యలకు కారణాలు తెలుసుకోవడం సాథ్యం కాదు. అవి అనూహ్యాలు. కానీ, మన స్థాయిలో బాబా యొక్క ఈ చర్య నుండి నేర్చుకోవలసినది మాత్రం చాలా ఉంది. మత సామరశ్యము మతైక్యము, బాబా అవతార ప్రయోజనాలలో ఒకటి. ఈ నాడు సమాజంలోని వ్యక్తుల పేర్లు మత సూచకాలు, కుల మత సంకేతాలుగా ఉంటున్నాయి. ఒక మతం వారు ఒక మతంవారికి సంబంధించిన పేర్లు పెట్టుకోవడం ద్వారా ముందు బాహ్యంగానయినా మతానికీ మతానికీ మథ్య అడ్డుగోడలు నశిస్తాయి. మతైక్యానికి ఇది మొదటి మెట్టు. అప్పుడే..
"యెల్ల లోకము వొక్క యిల్లాఇ, వర్ణభేదము
లెల్ల కల్లై,,,,మతము లన్ని మాసి పో
వును, జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును"...
అన్న మహాకవి వాక్యం వాస్తవమౌతుంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment