02.09.2014 మంగళవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులకు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు గారు శ్రీసాయి సత్ చరిత్రపై అందించిన పరిశోధన వ్యాసాలను మీకు అందిస్తూ ఉన్నాను. ఆ క్రమంలో ఈ రోజునుండీ కలలలో శ్రీసాయి పై ఆయన చేసిన పరిశోధనా వ్యాస సంపుటిని మీకందిస్తున్నాను.
ప్రతివారికీ కలలు వస్తాయి. కొన్ని కలలకు అర్ధం ఉంటుంది. కలలో వచ్చిన కొన్ని సంఘటనలు మన దైనందిన జీవితాలలో జరిగే సంఘటనలకి కొంతలో కొంత సారూప్యం గాను, కొన్ని కలలు నిజజీవితంలో ఉన్నదున్నట్లుగా ప్రతిబింబించేవాటిగాను ఉంటాయి. ఒక్కొక్కసారి అర్ధం పర్ధం లేని కలలుకూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు అనుభవమే. శ్రీసాయి సత్ చరిత్రలో కూడా మనకు కలల గురంచి ప్రస్తావన కూడా ఉంది. సాయి.బా.ని.స. గారి వ్యాసాలను చదువుతూ సాయి భక్తులందరూ కూడా మరొకసారి శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేయండి. సాయి.బా.ని.స. గారు ఎంతగా పరిశోధన చేసి మనకందించారో మీరు గ్రహిస్తారు. ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసాలలోని కొన్ని సంఘటనలు ఇంతకు ముందు మీరు చదివే ఉంటారు. ఈ వ్యాసాలు కలల గురించి కనుక మరలా వాటి ప్రస్తావన కూడా మీకు ఇందులో కనపడుతుంది. ఇక ఈ వ్యాసాలను ఆస్వాదించండి.
(సాయిభక్తులెవరికయినా కలల ద్వారాగాని, మరేవిధంగానయినా గాని బాబా వారు ఇచ్చిన సందేశాలను, కలల వృత్తాంతాలను పంపిస్తే వాటిని కూడా ప్రచురిస్తాను. సాయి భక్తులయిన పాఠకులందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయి)
కలలలో శ్రీసాయి - 1వ.భాగం
ఆంగ్లమూలం : సాయి.బా.ని.స. రావాడ గోపాలరావు
తెలుగుఅనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
ఓం శ్రీ గణేశాయనమః, ఓం శ్రీసరస్వత్యైనమః,ఓం శ్రీసమర్ధ సద్గురు శ్రీసాయినాధాయనమః
నేను యిప్పుడు మీకు చెప్పబోయే విషయం కలలలో సాయి. ఈ రోజు నా ఉపన్యాసం ప్రారంభించే ముందు మీకందరికీ నాప్రణామములు. శ్రీసాయి సత్ చరిత్ర నిత్యం పారాయణ చేసేవారికి ఈరోజు నేను చెప్పబోయే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. జీవితంలో జరుగుతున్న సంఘటనలే కలలలో ప్రతిబింబిస్తాయయని చాలామంది చెబుతారు. కాని సాయి భక్తుల విషయంలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాయి తన భక్తుల భవిష్యత్తుని కూడా వారి కలల ద్వారా వారికి తెలియపరుస్తూ ఉంటారు.
ముందుగా మనం కలలయొక్క పుట్టుక, మరియు కలలయొక్క ప్రాధమిక సమాచారాన్ని గురించి తెలుసుకొందాము. మన భారతీయ ఋషులు చాలామంది అష్టాదశ పురాణాలు, యింకా యితర శాస్త్ర గ్రంధాలలోను స్వప్నాలయొక్క పుట్టుక, ప్రక్రియల గురించి చర్చించారు. ఈ కలలపరిణామ క్రమంలో మానవశరీరానికి కలలతో జతచేయబడి ఒక ప్రత్యేకత ఉంది. మన శరీరంలో ఎన్నో అద్భుత శక్తులు అంతర్లీనంగా దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి స్వప్నాలు.
మనకి నిత్య జీవితంలో కలిగే మంచి చెడులు మనం నిద్రించే సమయంలో స్వప్నాలలో ముందుగానె ప్రతిబింబిస్తాయి. కలత నిద్రలోను, చెదరిన నిద్రలోను వచ్చిన స్వప్నాలకు అర్ధం లేదని కొంతమంది చెబుతారు. అయితే ఈ విషయంలో నాఅభిప్రాయం వేరు. జీవితంలో వాస్తవంగా జరగబోయే సంఘటనలు ఎంతో ముందుగానే స్వప్నాలలో సూచించబడతాయనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. బుధకౌశిక ముని తాను స్వప్నంలో పొందిన రామరక్షాస్తోత్రాన్ని తన శిష్యులకు తెలియచేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన భారతీయులకే కాదు. పాశ్చ్యాత్యులకు కూడా స్వప్నాలలో నమ్మకం ఉంది. చరిత్రకారులు చెప్పిన ప్రకారం, భారతీయ చక్రవర్తి అశొకుడు, గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్, మధ్య ఆసియా చక్రవరి చంఘిజ్ ఖాన్ వీరందరిపైనా కూడా కలలయొక్క ప్రభావం చాలా ఉంది. ప్రముఖ యూరోపీన్ రచయిత షేక్సిపియర్ తన రచనలలో స్వప్నాల గురించి చాలా చోట్ల పేర్కొన్నారు. రామయణంలోని అయోధ్యకాండ,సుందరకాండ, యుధ్ధకాండలలలో స్వప్నాలను గురించి ప్రస్తావనలు చాలా ఉన్నాయి.
అయోధ్య కాండలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తాడన్నదానికి సూచనగా దశరధ మహారాజుకు దుస్స్వప్నం వచ్చింది.
తన తాతగారింటిలో ఉన్న భరతుడికి అయోధ్యలో దశరధ మహారాజు మరణించినట్లుగా కల వచ్చింది. సుందరకాండలో సీతాదేకి కాపలాగా ఉన్న 'త్రిజట' అనే రాక్షస స్త్రీకి కలలో శ్రీరామచంద్రుడు లంకకు వచ్చి రాక్షసులందరినీ సం హరించినట్లుగాను, ఆతరువాత సీతాదేవిని పుష్పకవిమానంలో అయోధ్యకు తీసుకొని వెళ్ళినట్లుగా స్వప్నం వచ్చింది. అశోకవనంలో సీతాదేవికి కాపలాగా ఉన్న తనతోటి రాక్షస స్త్రీలందరికీ తనకు వచ్చిన స్వప్న వృత్తాంతం చెప్పింది.
యుధ్ధకాండలో రావణుని భార్య మండోదరికి రాముడు రావణుడిని చంపినట్లుగా కల వచ్చింది. అపుడు మండోదరి, రామునితో యుధ్ధం వద్దని అతనితో స్నేహం చేసుకొమ్మని భర్తకు సలహా యిచ్చింది.
గౌతమ బుధ్ధుడు జన్మించడానికి ముందు మాయాదేవికి తన గర్భంలోనికి తెల్లటి ఏనుగు ప్రవేశించినట్లుగా కలవచ్చింది. ఆమె తన స్వప్న వృత్తాంతాన్ని తనప్రక్కనున్నవారికి వివరించి చెప్పింది.
మనం గాఢనిద్రలో ఉన్నపుడు ఏదయితే చూస్తామో అదే స్వప్నం. ఆ స్వప్నం కూడా మనకి ఒక జీవితంలాగే కనపడుతుంది. నిద్రలో మన పంచేంద్రియాలన్నీ కూడా విశ్రాంతిగా ఉంటాయి. కాని, మన మెదడు మాత్రం పని చేస్తూనే ఉంటుంది. మనం స్వప్నంలో గాంచిన దృశ్యాలను తిరిగి మనకు కాస్త మెలకువ వచ్చినపుడు మన మెదడు గుర్తుకొచ్చేలా చేస్తుంది. ఇంతవరకు మనం కలల గురించి విశ్లేషించాము. ఇపుడు మనం మరికాస్త ముందుకు వెళ్ళి తన భక్తుల స్వప్నాల విషయంలో శ్రీషిరిడీసాయినాధుని పాత్ర ఏమిటో తెలుసుకొందాము.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment