18.08.2014 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 5వ.ఆఖరి భాగం
ఈ రోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న సాయి సందేశాలను (ఆఖరిభాగం) వినండి.
మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు
"ఆధ్యాత్మిక రంగలోనికి ప్రవేశించిన తరువాత నీవు నీభార్యలోను, తల్లిలోను, భగవంతుని చూడగలిగిననాడు నీవు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లే".
ఈ సందేశాన్ని మనం బాబాకు అంకిత భక్తుడయిన నానా సాహెబ్ నిమోన్ కర్ విషయంలో చూడవచ్చు. అతను నిమో న్కర్ గ్రామానికి వతన్ దారు, మరియు గౌరవ మేజస్త్రేట్. ఆయన ధర్మ మార్గంలో నిరాడంబరంగా జీవితాన్ని కొనసాగించి, పదవీ విరమణ చేసిన తరువాత భార్యాభర్తలిద్దరూ షిరిడీ వచ్చి తమ శేష జీవితాన్ని బాబా సేవలో గడిపారు. నిమోన్ కర్ తన ఆఖరి రోజులలో తన భార్యను 'సాయీ అని పిలిచేవారు. అనగా తన భార్యలో సాయిని చూసిన ధన్యజీవి నిమోన్ కర్.
(శ్రీరామకృష్ణ పరమ హంస గారు కూడా తన భార్య శారదాదేవిలో అమ్మవారిని చూసి ఆవిడను కూడా అమ్మవారి ప్రతిరూపంగా భావించేవారన్న విషయాన్ని కూడా మనమిక్కడ గమనించవచ్చు)
"కష్టాలు వచ్చాయని చెప్పి దానిని సాకుగా తీసుకొని త్రాగుడుకు బానిసవవద్దు. భగవంతుని ప్రేమ పొందాలనే తపనతో ఉపవాసాలు చేయవద్దు."
శ్రీసాయి సత్ చరిత్ర 18వ.అధ్యాయంలో మనం దీనికి సంబంధించిన విషయం గమనిచవచ్చు. త్రాగుడుకు బానిసయిన ఒక భక్తునికి బాబా కలలో కనిపించి అతని చాతీమీద కూర్చొని గట్టిగా అదిమిపెట్టారు. ఇక జీవితంలో మరెప్పుడూ త్రాగనని ప్రమాణం చేసిన తరువాతనే అతనిని విడిచి పెట్టారు. తన భక్తురాలయిన రాధాబాయికి భగవంతుని ప్రేమ పొందడానికి ఉపవాసాలు చేయవద్దని హితబోధ చేశారు.
"జీవితంలో ప్రస్తుత జన్మలో ఎవ్వరితోను శతృత్వం పనికిరాదు. శతృత్వం వల్ల దానియొక్క చెడు ఫలితాలు జన్మజన్మలకూ అనుభవించవలసి ఉంటుంది. శతృత్వమనేది ఎన్నెన్నో చెప్పరాని బాధలకు, రోగాలకు మూలకారణమవుతుంది."
శ్రీసాయి సత్ చరిత్ర లోని చెన్నబసప్ప, వీరభద్రప్పల కధే దీనికి ఉదాహరణ. వారు తామిద్దరిమధ్య ఉన్న శతృత్వాన్ని జన్మ జన్మలకు కొనసాగించుకుంటూ, కప్ప, పాములుగా జన్మించారు. ఒక గ్రామంలో యిద్దరు సోదరులు ఒకరినొకరు ద్వేషించుకొంటూ శతృత్వాన్ని పెంచుకొని కత్తులతో ఒకరినొకరు చంపుకొన్నారు. తరువాతి జన్మలో వారిద్దరూ మేకలుగా జన్మించి తరువాతి జన్మలలో కూడా శతృవులుగా జన్మలనెత్తారు
"జ్ఞానమనే పంటనుండి అజ్ఞానమనే కలుపు మొక్కలను కేవలం గురువు మాత్రమే పెకలించివేయగలడు. తరువాత ఆ జ్ఞానమనే పంట ఏపుగా ఆరోగ్యంగా పెరిగి స్థిరంగా ఉండాలంటే భక్తుడు కూడా ధృఢమయిన ప్రయత్నం చేయాలి".
శ్రీసాయి సత్ చరిత్ర 39వ.అధ్యాయంలో బాబాకు, నానాసాహెబ్ చందోర్కర్ యిద్దరిమధ్య జరిగిన సంభాషణే పైన చెప్పిన దానికి తార్కాణం. "అజ్ఞానమును గుర్తించే విధంగా గురువు బోధించాలి". ఈమాటలను అర్ధం చేసుకోవడం కష్టం. బాబా దీనికి పూర్తిగా వివరణనిచ్చారు. "అజ్ఞానమును తొలగించుటే జ్ఞానమును గూర్చి తెలియచెప్పుట. అజ్ఞానమును తొలగించుటే జ్ఞానజ్యోతిని వెలిగించుట."
"సంతానంకోసం ఎదురు చూస్తున్నపుడు ఆడపిల్ల జన్మించిందని బాధపడవద్దు. మగపిల్లలను పెంచినటులే ఆడపిల్లలను కూడా వారితో సమానంగా పెంచి విద్యాబుధ్ధులు నేర్పి కన్యాదానం చేయమని " బాబా హితబోధ చేశారు.
శ్రీసాయి సత్ చరిత్రలో 47వ.అధ్యాయమే దీనికి ఉదాహరణ. క్రిందటి జన్మలో ధనికుడయిన వ్యక్తి మరుజన్మలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పగా జన్మించాడు. ఆధనికుని భార్య ఒక గుడి పూజారి కూతురు గౌరిగా జన్మించింది. బాబా సలహా ప్రకారం పూజారి తన ఒక్క కూతురిని కన్యాదానం చేసి వీరభద్రప్పకిచ్చి వివాహం చేశాడు.
ప్రతివారు, తీర్ధయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు దర్శించవలసిందే. కాని మనసంతా యింటిలో భద్రంగా దాచిపెట్టబడిన ధనము, బంగారు నగల మీదే తిరుగుతూ ఉండరాదు. దానివల్ల పుణ్యక్షేతాలను దర్శించిన ఫలితం దక్కదు. పుణ్యఫలం దక్కాలంటే దృష్టంతా భగవంతుని మీదే లగ్నం చేయాలి.
శ్రీసాయి సత్ చరిత్ర 21వ.అధ్యాయంలో పండరీపూర్ నించి వచ్చిన ప్లీడరు యొక్క షిరిడీ యాత్ర యిందుకు ఉదాహరణ. వివిధ రకాల ఆలోచనలతోను, దారిలో బాబాను గూర్చి వ్యతిరేకంగా విన్న మాటలను మనసునిండా నింపుకుని షిరిడీ వచ్చాడు. బాబా అతనితో చంచల మనస్సుతో షిరిడీకి రావద్దని హెచ్చరించారు.
ఆధ్యాత్మిక రంగ ప్రయాణంలో 'గురువు ' బస్సుడ్రైవరుగా ఉండి ముందుకు తీసుకొని వెడతాడు. కొంత మంది ప్రయాణం మధ్యలో దిగిపోయినా వారిగురించి ఏమీపట్టించుకోక మిగిలినవారిని గమ్యస్థానానికి చేరుస్తూనే ఉంటాడు.
శ్రీసాయి సత్ చరిత్ర 25వ.అధ్యాయంలో బాబా దామూ అన్నా కాసర్ తో అన్న మాటలు
"చెట్టంతా పూతతో నిండివున్న ఆమామిడి చెట్టును చూడు. పూవులన్నీ కాయలయి పండ్లుగా మారితే ఎంత అద్భుతంగా ఉంటుంది. పూత దశలోనే చాలా మట్టుకు రాలిపోతాయి. కొన్ని పిందెల దశలో రాలిపోతాయి. కొన్ని మాత్రమే పండ్లదశకు వచ్చి ఫలాలుగా మారతాయి." నేడు కోటానుకోట్లమంది షిరిడీ దర్శిస్తున్నారు. కాని కొద్ది మందికే బాబా అనుగ్రహం లభిస్తోంది.
జీవితం ఆఖరి ఘడియలలో నీపిల్లలు నీప్రక్కన లేరనే చింత వద్దు. నీపొరుగింటి వాని పిల్లలకు కూడా నీప్రేమను పంచు. నీ జీవితం ఆఖరి క్షణాలలో వారే నీకు గ్రుక్కెడు నీళ్ళు పోస్తారు.
కాకా సాహెబ్ కు ఆఖరి క్షణాలలో హేమాద్రిపంత్ గ్రుక్కెడు నీరందించాడనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. మద్రాసునుంచి వచ్చిన విజయానంద్ అనే సన్యాసికి ఆఖరి క్షణాలలో బడే బాబా నీరందించాడు. మేఘశ్యాముడు బ్రహ్మచారి. అతని ఆఖరి క్షణాలలో షిరిడీలోని సాయి భక్తులు నీరందించారు. సాయికి అంకిత భక్తుడు నిమోన్ కర్. నిమోన్ కర్ బాబా మహాసమాధి చెందడానికి ముందు ఆయన ఆఖరి క్షణాలలో గంగాజలాన్ని బాబా నోటిలో పోశాడు.
"జన్మనెత్తిన ప్రతివారు, ఆఖరికి భగవంతుని సేవలో ఉన్నవారు కూడా ఈభౌతిక శరీరాన్ని విడచి పెట్టవలసిందే".
ఈసందేశానికి ఉదాహరణ మన సద్గురువయిన శ్రీషిరిడిసాయిబాబాయే. ఆయన భగవానునికి నిజమయిన సేవకుడు. అయినాగాని ఆయన విజయదశమినాడు మహాసమాధి చెందారు.
బాబా భక్తులలో ప్రముఖులయిన మేఘశ్యాముడు. తాత్యాసాహెబ్ నూల్కర్ మరియు మహల్సాపతిలు కూడా ఒకరి తరువాత ఒకరు తమ తమ ఆయుష్షు తీరిన తరువాత సాయిసాయుజ్యాన్ని పొందారు.
"ఈజీవితంలో నువ్వు ఏమతంలో జన్మించావు అన్నది ముఖ్యం కాదు. ఏమత సాంప్రదాయాన్ని పాటిస్తున్నా ఆధ్యాత్మిక విందులో నీఆకలి తీరిందా లేదా, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగావా లేదా అన్నదే ముఖ్యం. "
శ్రీసాయి సత్ చరిత్ర 17వ.అధ్యాయంలో మనం దీనికి సంబంధించిన విషయం గమనించవచ్చు. అనేక మతాలవారు ఈనాడు శ్రీషిరిడీ సాయి అనుగ్రహానికి షిరిడీ చేరుకొంటున్నారు. బాబావారు యిచ్చే ఆధ్యాత్మిక విందులో వారందరూ తమ ఆకలిని తీర్చుకొంటున్నారు. అన్నిమతాలకు అతీతంగా 'సబ్-కా-మాలిక్ ఏక్ హై' అని అందరూ నమ్మడమే దీనికి ఉదాహరణ.
శ్రీసాయి మన అందరి హృదయాలలోను ఉన్నారు కాబట్టి 'హం సబ్ కా ఖూన్ ఏక్ హై ఔర్ సాయి ఉస్ ఖూన్ కీ తాకత్ హై' అని చెపుతూ ఈఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.
జై సాయిరాం.
(అయిపోయింది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(త్వరలో కలలలో శ్రీసాయి)
0 comments:
Post a Comment