06.08.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు మరొక అత్యధ్బుతమైన
సాయి లీల, భివపురి సాయి మందిరం నిర్మాణం వెనుక గల కధ తెలుసుకుందాము. ఈ సంఘటన ద్వారా బాబా నాస్తికులని కూడా ఆస్తికులుగా
ఏవిధంగా మారుస్తారో గ్రహించుకోవచ్చు.
ఈ రోజు ప్రచురిస్తున్న
లీల శ్రీ సాయిలీల ద్వై మాసపత్రిక జనవరి – ఫిబ్రవరి, 2005 సంచిక, మరియు సాయి లీల.ఆర్గ్
నుండి గ్రహింపబడింది. భివపురి సాయి మందిరం గురించి గూగుల్ లో చూసినప్పుడు మరింత సమాచారం
సాయిలీల.ఆర్గ్ లో కనిపించింది. రెండింటినుంచి మరింత సేకరించి పూర్తి సమాచారాన్ని మీముందుంచుతున్నాను. భివపురి సాయిబాబా మందిరం ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా మందిరమ్.
(ఇది అనువాదమ్ చేసిన తరువాత గుర్తుకు వచ్చింది. 03.04.2011 ఆదివారమునాడు దీని గురించిన సమాచారమ్ బ్లాగులో పెట్టాను. కాని అప్పట్లో అనువాదం చేయకుండా సాయిపథంలో ప్రచురించిన పేజీలనే బ్లాగులో పెట్టాను.)
భివపురి శ్రీసాయిబాబా
మందిరమ్
బొంబాయినుండి పూనా వెళ్ళే
సెంట్రల్ రైల్వే దారిలో ‘భివపురి రోడ్’ స్టేషన్ వస్తుంది. బొంబాయికి వెళ్ళే దారిలో కజ్రత్ స్టేషన్ కి 5 మైళ్ళ
దూరంలో ఉన్న చిన్న స్టేషన్ భివపురి. ఈ స్టేషన్
లో దిగి తూర్పువైపుగా చూస్తే సాయిబాబా మందిరం కనిపిస్తుంది. పొలాల మధ్యలో ఉన్న దారి గుండా
వెడితే మందిరానికి 5 లేక 7 నిమిషాలలోనే చేరుకోవచ్చు.
ఈ మందిరం వెనుక ఉన్న
చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాయిభక్తులందరికీ
శ్రీసాయిబాబా నాస్తికులను కూడా ఆస్తికులుగా మార్చి తనవైపుకు ఏవిధంగా ఆకర్షించుకుంటారొ
బాగా తెలుసు. అటువంటి బాబా లీలలను విన్న భక్తుల
మనసులు సంతోషంతో నిండిపోతాయి.
ఈ మందిరాన్ని స్వర్గీయ శ్రీ కేశవ రామచంద్ర ప్రధాన్ నిర్మించారు. మొట్టమొదట్లో ఆయన నాస్తికుడు. అటువంటిది ఆయన బాబాకు ప్రగాఢమయిన భక్తునిగా మారాడంటే ఎవరూ నమ్మలేకపోయారు.
ఇప్పుడు మనం చదవబోయే
సంఘటనలు జరిగి 70 సంవత్సరాలు పైగానే అయింది.
భివపురి రైల్వే స్టేషన్ కి తూర్పుగా ఉన్న ఉక్రూల్ గ్రామంలో ప్రధాన్ గారు తన
పొలంలో స్వంతంగా యిల్లు కట్టుకున్నారు.
ప్రధాన్ బొంబాయిలో ఒక
పార్సీ పెద్దమనిషి వద్ద పేథీగా పనిచేస్తూ ఉండేవారు. (పేథీ అనగా తన యజమాని తరపఫున బాకీలు వసూలు చేసే ఉద్యోగం) తన యజమాని వద్ద అప్పులు తీసుకున్నవాళ్ళనుండి వడ్డీ బాపతు బాకీలు వసూలు చేస్తూ ఉండేవారు. ఆవిధంగా ఆయన
మన్మాడ్, నాసిక్, కోపర్ గావ్ మొదలయిన గ్రామాలకు వెడుతూ ఉండేవారు. ప్రధాన్ గారి ఆప్తమిత్రుడు బాబా భక్తుడు. అతను చాలా తరచుగా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటూ
ఉండేవాడు. అతను కూడా ప్రధాన్ ని తనతో కూడా
షిరిడీ వచ్చి బాబాను దర్శించుకోమని చెబుతూ ఉండేవాడు. ప్రధాన్ గారికి దేవుడు అన్నా సాధువులు అన్నా నమ్మకం
ఉండేది కాదు. అందుచేత తన స్నేహితుడు ఎన్ని
సార్లు షిరిడీకి రమ్మని పిలిచినా తిరస్కరిస్తూ ఉండేవారు. ఆఖరికి అలా అడగ్గా అడగ్గా ఒకరోజున తను కూడా షిరిడీకి
తను పెట్టే షరతుకి ఒప్పుకుంటేనే వస్తానని చెప్పారు. ఆ షరతు ఏమిటంటే తను షిరిడీకి వచ్చినా మసీదులోకి
అడుగు పెట్టనని అధి హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకమని చెప్పారు. అతని స్నేహితుడు ఆ షరతుకి ఒప్పుకున్నాడు. ఇద్దరూ షిరిడీకి బయలుదేరారు.
షిరిడీకి చేరుకున్నతరువాత
ఇద్దరూ వాడాలో ఒక గది తీసుకుని అందులో బస చేశారు.
బాబాకు ఆరతి యిచ్చే సమయం అవడంతో ఆయన స్నేహితుడు బాబాను దర్శించుకోవడానికి మసీదుకు
వెళ్ళాడు. ప్రధాన్ గారు మాత్రం గదిలోనుంచి
బయటకు కదలలేదు. మసీదంతా బాబా భక్తులతో కిటకిటలాడుతూ
ఉంది. సరిగా మధ్యాహ్నం 12 గంటలకి ఆరతికి గంటలు
మ్రోగసాగాయి. భక్తులందరూ ఆరతిని వీక్షించడంలో
నిమగ్నమయ్యారు. అందరూ పూర్తిగా భక్తిసాగరంలో లీనమయిపోయి తన్మయత్వంలో ఉన్నారు. ప్రధాన్ గారికి ఆరతి చూడడానికి మసీదుకు వెళ్ళకూడదనే
కృతనిశ్చయంతో ఉన్నారు. మసీదులోనుంచి గంటల శబ్దం యింకా యింకా ఎక్కువగా వినిపించడం మొదలయింది. మసీదులోనుంచి వినపడే ఆ గంటల శబ్దానికి చుట్టుప్రక్కలంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రధాన్ గారికి అశాంతిగా ఉంది. గదిలో
నిలకడగా కూర్చోలేకపోయారు. ఆఖరికి ఆయన అశాంతి
ఎంతవరకు పెరిగిపోయిందంటే, తను ఏమిచేస్తున్నాడో తనకే తెలియనంత స్థితిలో మసీదుకు బయలుదేరాడు. తను తన స్నేహితునికి చెప్పిన షరతుని పక్కన పెట్టేశారు. ఆయనలో ఏ శక్తి ప్రవేశించిందో తెలియదు. మసీదుకు వెళ్ళి అందరితోపాటు ఆరతిలో పాల్గొన్నారు. ఆరతి పూర్తయింది. భక్తులందరూ ఒకరి తరువాత ఒకరుగా మండపంలోకి వెళ్ళి
శ్రీసాయిబాబా వారు స్వయంగా యిస్తున్న ఊదీని, ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళసాగారు. కాని, శ్రీప్రధాన్ గారు మాత్రం మండపంలో ఒకచోట కూర్చొని బాబావైపే చూస్తూ ఒక విధమయిన భావపారవశ్యంలో ఉన్నారు. మండపంలోనించి భక్తులందరూ వెళ్ళిపోయినా
ఆయనకేమీ తెలియటంలేదు. ఆయన దృష్టంతా శ్రీసాయిబాబా
మీదే ఉంది. తదేకంగా ఆయననే చూస్తూ ఉన్నారు. బాబాలోని ఆకర్షణ శక్తికి ఆయన లొంగిపోయారు. కొంతసేపటి తరువాత సాయిబాబా ప్రధాన్ ని దగ్గరకు పిలిచి,
ఆయన ఊహించని విధంగా ఆయనని దక్షిణ అడిగారు.
అదృష్టం కొద్దీ ప్రధాన్ గారి జేబులో 2,500/ రూపాయలున్నాయి. తనేమి చేస్తున్నాడో ఏమీ తెలియని స్థితిలో ఒక విధమయిన
తన్మయత్వంలో తన జేబులో ఉన్న డబ్బునంతా బాబా చేతిలో పెట్టేశారు. ఆయన యింకా ఆ తన్మయత్వంలోనించి బయటపడలేదు. అదే స్థితిలో గదికి తిరిగి వచ్చేశారు. కొంతసేపటి తరువాత తెలివి తెచ్చుకుని స్పృహలోకి వచ్చారు. ఆయనకి తను బాకీలుగా వసూలు చేసిన డబ్బునంతా దక్షిణగా సమర్పించేసినట్లు అప్పుడు గుర్తుకు
వచ్చింది. ఆసొమ్మంతా తన యజమానికి సంబంధించిన సొమ్ము. ఆసొమ్మునంతా తిరిగి ఏవిధంగా యివ్వాలో, ఏమి చేయాలో పాలుపోలేదు
ఆయనకి. బొంబాయి తిరిగి వెళ్ళిన తరువాత వెంటనే
ఆ డబ్బు వెంటనే ఇచ్చేయాలి. తన దగ్గర తన స్వంత డబ్బుకూడా అంత లేదు. ఆ కష్టంనుండి ఏవిధంగా బయటపడాలో
అర్ధం కాలేదు ఆయనకి. జరిగిన విషయమంతా తన స్నేహితునికి
వివరంగా చెప్పారు. అపుడతను “శ్రీసాయిబాబా దయ
నీమీద ఉన్నప్పుడు ఇంక నీకేమి కావాలి? నీకిక కష్టాలేమీ ఉండవు. నీఅవసరాలన్ని బాబాయే చూసుకుంటారని ధైర్యం చెప్పాడు.” అతను బొంబాయికి తిరిగి వెళ్ళిపోయాడు.
ప్రధాన్ గారు టాంగాలో
కోపర్ గావ్ స్టేషన్ కి బయలుదేరారు. ఆయన వద్ద
టాంగాకి డబ్బులివ్వడానికి కూడా పైసా లేదు.
కాని అదృష్టం కొద్దీ ఆయన వేలుకి బంగారు ఉంగరం ఉంది. టాంగా స్టేషన్ కి చేరగానే ఆయన తన వేలికి ఉన్న ఉంగరాన్ని
తీసి టాంగా వానికిచ్చి, ఆ ఉంగరాన్ని అమ్మి
టాంగా కిరాయి తీసుకుని మిగిలిన సొమ్ము ఇమ్మని చెప్పారు. ఇంతలో మంచి ఖరీదయిన దుస్తులు ధరించిన ఒక అపరిచిత వ్యక్తి వచ్చి
ప్రధాన గారికి వచ్చిన కష్టం తెలుసుకుని టాంగాకి ఇవ్వవలసిని కిరాయి తనే ఇచ్చేశాడు. తరువాత ప్రధాన్ గారికి తనే రైలు టిక్కెట్టు కొని
అన్ని ఏర్పాట్లు చేసి బొంబాయి రైలు ఎక్కించాడు. ఆవ్యక్తి ఎంత అకస్మాత్తుగా వచ్చాడో అంతే అకస్మాత్తుగా మాయమయిపోయాడు.
ఆ వ్యక్తి చేసిన ఏర్పాట్ల
వల్ల ప్రధాన్ గారు భివపురి చేరుకున్నారు. కాని తన యజమానికి ఏవిధంగా డబ్బు సర్దుబాటు చేయాలా అని చాలా వ్యాకుల పడుతూ ఉన్నారు. తన యజమాని వద్దకు వెళ్ళగానే డబ్బేదీ అని అడిగితే ఏమని సమాధానం
చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ విధంగా
ఆలోచిస్తూ తన యజమానికి వర్తమానం పంపించారు.
తనకి ఒంట్లో బాగుండలేదని, వెంటనే ఆఫీసుకు రాలేనని అందువల్ల కొద్దిరోజులు సెలవు
కావాలని వర్తమానం పంపించారు. ఆవర్తమానం అందుకున్న
వెంటనే ఆయన యజమాని తిరిగి ఆయనకు వర్తమానం పంపించారు. రావలసిన బాకీలకంటే రెట్టింపు సొమ్ము తనకు అందిందని, వసూలు చేసినదానికన్నా రెట్టింపు సొమ్ము ఎందుకని పంపించాడొ అర్ధం కాలేదని కూడా యజమాని తెలియచేశాడు. అందుచేత వెంటనే ఆఫీసుకు రావలసిన అవసరం లేదనీ, ఆరోగ్యం కుదుటపడిన తరవాతే రావచ్చని యజమాని
ఆయనకు తిరిగి వర్తమానం పంపించాడు. అది చూడగానే
ప్రధాన్ గారు సాయిబాబా యొక్క అధ్భుత శక్తికి, ఆయన లీలకి అప్రతిభులయ్యారు. బాబా తనపై చూపిన కరుణకు కరిగిపోయాడు. మొట్టమొదటిసారిగా షిరిడీకి వెళ్ళినంతనే బాబా చూపిన
ఈ అద్భుతాన్ని ఏవిధంగా వర్ణించాలో ఆయన మాటలకందలేదు. ప్రధాన్ గారి మనసులో ఉన్న నాస్తికత్వం పటాపంచలయింది. ఆక్షణంనుంచి బాబాకు విధేయుడయిన భక్తునిగా మారిపోయారు. తన యజమాని నుంచి వచ్చిన వర్తమానం చదివిన వెంటనే,
“బాబా, నేను పాపాత్ముడిని. నా మిత్రుడు ఎన్నిసార్లు
చెప్పినా షిరిడీ వచ్చి నీ చరణ కమలాలను దర్శించుకోకుండా నీకు దూరంగా ఉన్నాను. కాని ఇపుడు నాకు సహాయం చేసి నన్ను నీవానిగా చేసుకున్నావు. నీదయను నామీద కురిపించావు. ఇపుడు నాపాపాలన్నీ ప్రక్షాళనమయ్యాయి.” అని బాబాకు విన్నవించుకున్నాడు.
ఆ సంఘటన తరువాత ప్రధాన్
గారు ఎపుడు వీలయితే అప్పుడు షిరిడీకి వెళ్ళివస్తూ ఉండేవారు. వెళ్ళిన ప్రతిసారీ భివపురికి రమ్మని బాబాను వేడుకొంటూ
ఉండేవారు. 1916 సంవత్సరంలో ఆయన షిరిడీకి వెళ్ళారు. బాబా తన ప్రతిమను ఒకదాన్ని ప్రధాన్ గారికి
యిస్తూ,
“భివపురికి తిరిగి వెళ్ళు. అక్కడ ఒక
మందిరాన్ని నిర్మించి అందులో ఈ ప్రతిమను ప్రతిష్టించి పూజించుకో. అక్కడే అన్ని ఉత్సవాలను జరిపించు. మళ్ళీ యిక్కడకు రాకు” అన్నారు.
బాబా అన్న మాటలు ప్రధాన్ గారిని సంతృప్తి పరచలేకపోయాయి. కొద్దిరోజుల తరువాత తన యింటిదగ్గరే చిన్న మందిరాన్ని నిర్మించి అందులో బాబా తనకు యిచ్చిన చిత్రానికి ప్రాణప్రతిష్ట చేయించి ప్రతిష్టించారు.
ఆ మందిరంలో ప్రతిరోజూ బాబాకు పూజలు నిర్వహిస్తూ తరచూ కొన్ని ఉత్సవాలనుకూడా జరిపిస్తూ ఉండేవారు.
(మందిరంలో ఆ తరువాత ఏమిజరిగింది? రేపటి సంచికలో)
(ఇంకా ఉంది)
0 comments:
Post a Comment