24.09.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు బాబాతో బాయిజాబాయి
అనుభవాలను గూర్చి మనకు తెలియని మరికొన్ని విషయాలను తెలుసుకుందాము. ఇది షిరిడీసాయి సేవా ట్రస్ట్.ఆర్గ్ నుంది గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
శ్రీ సాయిబాబాతో బాయిజాబాయి అనుభవాలు
శ్రీ షిరిడీ సాయిబాబా
దైవాంశ సంభూతుడని, ఆయనలో దైవత్వం నిండి ఉన్నదని మొట్టమొదటిసారిగా అర్ధం చేసుకున్నవారు
షిరిడీ నివాసస్థులయిన గణపతిరావు కోతె పాటిల్, ఆయన భార్య బాయిజాబాయి కోతె పాటిల్. ఈ యిద్దరు దంపతులు ఎంతో భక్తివిశ్వాసాలు వున్నవాళ్ళు.
ఆధ్యాత్మికంగా దర్మపరాయణులు అంతే కాక అందరికీ సహాయం చేసే గుణం కలిగినవారు. షిరిడీని దర్శించడానికి వచ్చే మహాపురుషులను ఎంతో
గౌరవభావంతో చూచేవారు. వారి పాదాలకు భక్తితొ
నమస్కరించి వారి అవసరాలన్నీ స్వయంగా చూసేవారు.
ప్రాపంచిక సుఖాలన్నిటినీ
త్యజించి, మంచి తేజస్సుతో వెలుగొందుతున్న ఈ బాలుడు ఎవరా అని షిరిడీ గ్రామస్థులందరూ
ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉండేవారు. పాటిల్ దంపతుల
దృష్టి కూడా ఈ బాలుని మీద సహజంగానే పడింది.
వారిద్దరూ ఆబాలుని మీద పుత్ర వాత్సల్యాన్ని, ప్రేమను కనబరిచారు. బాయిజాబాయికి ఆ బాలుని మీద మమకారం ఏర్పడింది. గ్రామంలోని ప్రముఖులయినవారందరూ బాబా మీద తీవ్రమయిన
వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న రోజులు. అటువంటి
పరిస్థితులలో కూడా పాటిల్ దంపతులు తమ మొట్టమొదటి దర్శనంతోనే బాబాయందు ఎంతో భక్తిని
కనబరుస్తూ ఆయన మహాసమాధి చెందే వరకు అదే విధమయిన భక్తి ప్రపత్తులతో మెలిగారు. వారు బాబాని తమ స్వంత కుమారునిగా ప్రేమించారు. గ్రామస్థులలో చాలామంది బాబాని ఒక పిచ్చివానిగా భావించినప్పటికీ
బాయిజాబాయి మాత్రం బాబా మీద ఎంతో ప్రేమను అభిమానాన్ని కురిపించింది.
కోతె పాటిల్ దంపతులిద్దరూ
మొట్టమొదటిసారిగా బాబాను దర్శించుకున్నప్పటి సంఘటనలను శ్రీ పాండురంగ బి. కావడే గారు
తను రచించిన శ్రీ సాయి మహరాజ్ యాంఛే చరిత్ర (Life of Sri Sai Maharaj) అనే పుస్తకంలో
చాలా విపులంగా మనకందరికీ తెలియచేసారు.
బాయిజాబాయి సాయిమహరాజ్
ను దర్శించుకోవడానికి రాగానే ఆయన వెంటనే లేచి నుంచున్నారు. ఆవుదూడ తన తల్లికోసం ఎంతగా నిరీక్షిస్తూ ఉంటుందో
అంతగా ఆయన ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా కన్పించారు. తామిద్దరి మధ్య ఉన్న గత జన్మల సంబంధం ఈ జన్మలో కూడా
కొనసాగుతూ వస్తూ ఉన్నదని ఆ విషయాన్ని రూఢి పరుస్తున్నట్లుగా కనిపించింది ఆ దృశ్యం. కొంత సమయం వరకు వారిద్దరు అదే స్థితిలో ఉన్నారు. అపుడు సాయి మహరాజ్ అప్రయత్నంగా తనంత తానే “మామీ’
(పిన్నీ) అని సంబోధించారు. బాలుని వయసులో ఉన్న
సాయిమహరాజ్ నోటివెంట ఆ ప్రేమామృతమయిన మాట వినగానే బాయిజాబాయి హృదయంలో సంతోష తరంగాలు
ఉత్పన్నమయ్యాయి. ఆమెలో మాతృత్వ భావం పెల్లుబికింది. ఈ సంఘటన జరిగిన సమయంనుండి బాయిజాబాయి జీవించి ఉన్నంతవరకు
సాయి మహరాజ్ ఆమెను తన తల్లిగానే భావించారు.
శ్రీ కావడే యింకా ఈ విధంగా
వివరిస్తున్నారు.
మొట్టమొదటి కలయికలోనే
తన వద్దకు వచిన బాయిజాబాయి ఎవరో సాయి మహరాజ్ కి మాత్రమే తెలుసు. కారణమేమిటంటే అప్పటి వరకు ఆయన మనుష్యమాత్రులెవరితోనూ
ఎటువంటి సంబంధ బాంధవ్యాలను పెట్టుకోకుండా అన్నిటిని త్యజించి అందరినీ సమభావంతోనే చూసారు. ఆవిధంగా ఆయన తనకు తానె బాస చేసుకున్నట్లుగా ఉండేవారు. కాని బాయిజా బాయి విషయంలో మాత్రం తన నియమాన్ని అతిక్రమించారు. ఆ మహాపురుషుడిని ఆమె తన మాతృప్రేమతో బంధించి వేసింది.
శ్రీ కావడే గారి అభిప్రాయం
---
శ్రీ సాయిబాబా షిరిడీనే
తన శాశ్వత నివాసంగా చేసుకోవడానికి స్పష్టమయిన కారణాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటిలోకి అతి ముఖ్యమయిన కారణం బాయిజాబాయి యందు
మాతృప్రేమ, బాయిజాబాయికి సాయిమహారాజ్ మీద పుత్రప్రేమ అయి ఉండవచ్చు. ఇద్దరిదీ తల్లి కొడుకుల అనుబంధం.
ఏదేమయినప్పటికీ బాబా,
బాయిజాబాయికి తన తల్లిగా స్థానమిచ్చారు. ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా కాదని చెప్పడానికి, అవునని ఒప్పించడానికి ఎవ్వరికీ శక్తి లేదు. బాబా తన వ్యక్తిత్వాన్ని కూడా ప్రక్కన పెట్టి బాయిజాబాయితో
కబుర్లు చెబుతూ ఉండేవారు. ఆమె అడిగే ప్రశ్నలకి
ప్రేమపూర్వకంగా సమాధానాలు చెబుతూ ఉండేవారు.
మొట్టమొదటినుంచే బాయిజాబాయి
బాబాకు రొట్టెలను (భక్రి) పంపిస్తూ ఉండేది.
బాబా ఎక్కడున్నారో కనుకొనడానికి అడవులలో అనేక దారులలో అన్వేషిస్తూ ఉండేది. ఆయన కనిపించగానే ప్రేమతో తనే స్వయంగా తినిపిస్తూ
ఉండేది.
బాయిజాబాయి జీవించి ఉన్నంత వరకు ఆతరువాత
కూడా కోతె పాటిల్ గృహంనుండి పంపబడె రొట్టెలను బాబా భుజించకుండా ఏఒక్క రోజు గడవలేదు. ఆమె మరణానంతరం ఆమె కొడుకు అదే సాంప్రదాయాన్ని కొనసాగించాడు.
బాయిజాబాయి కుమారుడు,
బాబాకు ప్రియ భక్తుడు అయిన తాత్యా కోతే పాటిల్ వ్రాత పూర్వకంగా ఇచ్చిన వివరణే మనకు
సాక్ష్యం. అతను 25.12.1915 న రాసి యిచ్చిన
పత్రం.
"షిరిడీ గ్రామ నివాసస్థుడయిన
తాత్యా కోతే పాటిల్ అనే నేను, నన్ను కోరిన మీదట, దివాన్ బహదూర్ శ్రీసాయి అబద్
సంస్థాన్ వారి సమక్షంలో ఈ క్రింద సమాచారాన్ని తెలియచేస్తున్నాను.
నేను పుట్టినప్పటినుంచి
షిరిడీలోనే నివాసం ఉంటున్నాను. శ్రీ సమర్ధ
సాయిబాబా నన్ను పెంచి పెద్ద చేసారు. నా తల్లిదండ్రులు
నిరంతరం శ్రీసాయిమహరాజ్ సేవలోనే తమ జీవితాన్ని గడిపారు. మేమందరం శ్రీసాయి సమర్ధుని మా కుటుంబ పెద్దగా, మా
కులదైవంగా ఎంతో పూజ్య భావంతో గౌరవించాము. 12
సంవత్సరాల క్రితం వరకు శ్రీ సమర్ధ సాయిబాబా ఎవరినుంచి భిక్షను గాని, దక్షిణను గాని స్వీకరించేవారు
కాదు. ఆయన కొన్ని ఇండ్లనుంచి మాత్రమే భిక్షను
స్వీకరించి జీవితాన్ని గడిపేవారు.
నేను బాల్యంలో ఉన్నప్పటి వరకు నా తల్లిదండ్రులు ఎప్పుడు అవసరమయితే అప్పుడు ఆయనకు కావలసిన అవసరాలన్నిటినీ
చూసేవారు. నాకు యుక్తవయసు వచ్చిన తరువాత నాతండ్రి
మరణానంతరం నేను కూడా వారిలాగానే బాబా సేవ చేసుకునేవాడిని. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సాధన మరింత తీవ్రంగా
చేస్తూ ఉండేవాడిని. దానికి తగ్గట్లుగానే భక్తుల
సంఖ్య కూడా రాను రాను పెరగసాగింది. ఎప్పటికప్పుడు అవసరమయిన ఖర్చుల నిమిత్తం నేను ధన
సహాయం చేస్తూ ఉండేవాడిని నేను శ్రీసాయి మహరాజ్
కు పుత్రుడిని అనే భావంతోనే ఆ ఖర్చులన్నిటినీ సంతోషంగా భరిస్తూ ఉండేవాడిని. రోజు రోజుకీ ఖర్చులు పెరుగుతూ వస్తున్నాయి. ఇపుడా ఖర్చులు ప్రతిరోజు రూ.75/- నుంచి రూ.125/-
దాకా పెరిగాయి. నేను ఈ ఖర్చులన్నిటినీ శ్రీ
సాయి సమర్ధకు దక్షిణగా లభించిన ధనంతో భరిస్తూ ఆ పై ఖర్చులన్నిటికీ నా స్వంత డబ్బును
పెట్టుకునేవాడిని. అంతకు ముందుకన్నా యిప్పుడు
నా స్థితి వంద రెట్లు మెరుగ్గా ఉంది. నేను
ఇంత ఉన్నత స్థితిలో ఉన్నానంటే అదంతా శ్రీసాయి సమర్ధుల అనుగ్రహమే."
(తాత్యా కోతే పాటిల్)
తాత్యా కోతే పాటిల్ వ్రాత
పూర్వకంగా యిచ్చిన ఈ పత్రం మీద, షిరిడీలో ప్రముఖ వ్యక్తులయినటువంటి రామచంద్ర దాదా కోతే
పాటిల్, బాయిజాబాయి అప్పా కోతే పాండురంగ భికాజి షెల్కె, మరియు సఖారామ్ మహదు కోతె పాటిల్
లు సాక్షులుగా తమ సంతకాలు చేసారు. ఈ సందర్భంగా
తాత్యా కోతె పాటిల్ వివరణ యిస్తున్న సమయంలో రావు బహదూర్ హరివినాయక సాఠె, డా.పిళ్ళే,
చించణికర్ యింకా గౌరవనీయులయిన మరికొందరు సాయి భక్తులు కూడా ఉన్నారు.
(డా. పిళ్ళే)
ఆ తరువాత బాబా మసీదులో
తన స్థిరనివాసం ఏర్పరచుకున్న తరువాత ఆయన భిక్షకు వెళ్ళడం ప్రారంభించారు. కొన్ని రోజులు ఆయన బాయిజాబాయి యింటికి నాలుగయిదు
సార్లు భిక్షకు వెడుతూ ఉండేవారు. ఆయినాగాని
బాయిజాబాయి ఆయననెప్పుడూ రిక్త హస్తాలతో పంపించేది కాదు. అంతేకాదు, బాబాని ఆమె తన యింటిలోకి రమ్మని ఆహ్వానిస్తూ
ఉండేది. చాలా అరుదుగా బాబా ఆమె యింటిలోకి వెడుతూ
ఉండేవారు. బాయిజాబాయి బాబాని బ్రతిమాలుతూ తన
యింటిలో భోజనం చేయమని ఆయనని ఒప్పిస్తూ ఉండేది.
అటువంటి సందర్భాలలో రంభాబాయి (తాత్యా భార్య, అనగా బాయిజాబాయి కోడలు) బాబాకు
భోజనం వడ్డించేది. బాబా భోజనం చేస్తున్నపుడు,
బాబా , బాయిజాబాయి ఇద్దరి మధ్య జరిగే సంభాషణలని ఆమె ఒక మూలగా నుంచుని వింటూ ఉండేది. రంభాబాయి ఆ సందర్భంగా తను విన్న విషయాలను ఈ విధంగా
వివరించింది.
వారిద్దరి మధ్య జరిగే
సంభాషణలలో ప్రేమాభిమానాలు ద్యోతకమవుతూ ఉండేవి.
తల్లి కొడుకుల మధ్య జరిగే సంభాషణలలా ఉండేవి. భోజనం ప్రారంభించే ముందు బాబా మాంసాహారం ఏమన్న
వండారా అని అడిగేవారు. కారణమేమంటే 40 సంవత్సరాలుగా
బాబా అసలు మాంసాహారాన్నే ముట్టలేదు. బాయిజాబాయి
కూడా తను శాఖాహారం వండినపుడు మాత్రమే బాబాని తన యింటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ
ఉండేది.
బాబా, భక్రీ (రొట్టెలు) పిట్లా, ఉల్లిపాయలు,
మిరపకాయలు, పచ్చళ్ళు, మొదలైనవాటిని భుజించేవారు.
బాయిజాబాయి ప్రేమతో ఇంకేది వడ్డించినా ఏదీ తీసుకునేవారు కాదు. కొన్ని సందర్భాలలో ఆయన కాస్త పాలు త్రాగేవారు.
(పిట్లా)
బాయిజాబాయికి బాబా గత
చరిత్ర గురించి తెలుసుకోవాలని ఎంతో కోరికగా ఉండేది. ఆమె బాబాని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేది. కాని బాబా ఆమె అడిగే ప్రశ్నలకి సమాధానంగా ఎటువంటి
సూచనలు ఇచ్చేవారు దాదు. మీకుటుంబ సభ్యులను
కూడా తీసుకునిరా, లేకపోతే కనీసం వారంతా ఎక్కడ ఉన్నారో చెప్పు నేను తీసుకుని వస్తాను
అని మాటిమాటికి బాయిజాబాయి బాబాను అడుగుతూ ఉండేది. కాని బాబా తనది ఏప్రాంతమో, తన మతమేమిటో తన తల్లిదండ్రులు
ఎవరో తనకు సన్నిహితులెవరో మొదలయిన విషయాలు ఏమీ చెప్పలేదు. “నువ్వు ఎక్కడినుంచి వచ్చావు?” అని అడిగిన ప్రశ్నకు
సమాధానంగా “చాలా దూరంనుంచి” అని చెప్పేవారు.
ఈ విధంగా వారిద్దరి మధ్య జరిగే సంభాషణలను నేను అనేక సందర్భాలలో విన్నాను.
రంభాబాయి ఇంకా యిలా చెప్పింది.
సాయిబాబా మహాసమాధి చెందిన
తరువాత కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆయనకు నైవేద్యంగా రొట్టెలను మాయింటినుంచే పంపించేవారం. పుణ్యతిధులలో కూడా ఆయనకు రొట్టెలనే నైవేద్యంగా పంపిస్తూ
ఉండేవాళ్ళము. బాబా వాటిని ఎప్పుడూ తినకుండా
ఉండలేదు. కాస్త భాగాన్నయినా ఆయన రుచి చూసేవారు.
నేటికీ బాయిజాబాయి యింటిలోనివారు.
బాబాకు మొదటగా నైవేద్యం పెట్టకుండా ఎటువంటి ఆహారాన్ని తీసుకోరు.
ఇక తన జీవిత చరమాంకంలో
బాయిజాబాయి మంచం పట్టింది. ఆ సమయంలో ఒకటి రెండు
సందర్భాలలో బాబా వారింటికి వచ్చి కొన్ని సలహాలనిచ్చారు.
బాయిజాబాయి మరణించేనాటికి
ఆమె వయస్సు 75 సంవత్సరాలు ఆమె అంతిమయాత్ర మామూలుగా
వెళ్ళే దారిలో సాగుతూ ఉంది. అపుడు బాబా ఆమెను
ద్వారకామాయికి తీసుకుని రమ్మని కబురు పంపించారు.
ఆమె శవయాత్ర ద్వారకామాయి వద్దనుంచి సాగుతుండగా బాబా, ద్వారకామాయి గట్టుమీద నిలబడి
బాగా బిగ్గరగా “ఓ ! నా కోతే తల్లి వెళ్ళిపోతూ ఉంది.
నా పినతల్లి వెళ్ళిపోయింది” అని నలుదిక్కులా ప్రతిద్వనించేలా రోదించారు.
బాబా ఆవిధంగా బిగ్గరగా
రోదిస్తూ ఉంటే షిరిడీ గ్రామమంతా వణికిపోయినట్లుగా అయింది.
బాయిజాబాయి కుటుంబంలోని
ఎన్నో తరాలు బాగా స్థితిపరులు. అందువల్ల
13వ.రోజు కార్యక్రమాలని భారీ ఎత్తున జరిపించమని బాబా ఆమె కుటుంబ సభ్యులకి చెప్పారు. ఆరోజున వేలాదిమంది బీదలకి అన్నదానం చేసారు.
బాబా తన అంకిత భక్తుడయిన
మేఘాని గాయత్రి మంత్ర జపం చేయమన్నారు. జనవరి
3వ.తారీకు 1912 లో కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత కొంతమంది బ్రాహ్మలకి భోజనాలు పెట్టారు. అదేరోజు సాయంత్రం గణపతిరావు కోతె పాటిల్ (బాయిజాబాయి
భర్త తాత్యా తండ్రి మరణించాడు).
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment