27.09.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబా
వారి శుభాశీస్సులు
షిర్డీ సాయి సేవా ట్రస్ట్.ఆర్గ్
లో ప్రచురింపబడిన యోగి దర్శనమ్ ఈ రోజు ప్రచురిస్తున్నాను.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
యోగి దర్శనమ్
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి
విశ్వరూప సందర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆవిధంగా
తనలోనే దైవత్వం ఉన్నదనే విషయాన్ని అర్జునునికి ఎటువంటి సందేహంగా తెలియచేసాడు. ఈ సృష్టిలోని సౌదర్యమంతా భగవంతుని రూపమేనని అదంతా
తను సృష్టించినదేనని వివరించాడు. నిష్కళంకమయిన
ఆధ్యాత్మిక సేవలో తరించినవారెవరికయినా సరే ఇటువంటి మహధ్బాగ్యం కలుగుతుంది. భగవద్గీత . అ.11
అర్జునుడు కృష్ణునికి
తన తనువు, మనస్సు, సంపద (తన్, మన్, ధన్) అర్పించినట్లుగానే మనము కూడా భగవంతునికి అర్పించినట్లయితే
మన జీవితంలో కూడ ప్రతిఒక్కరికి ఆ భగవంతుడు ఏదోరూపంలో దర్శనమిస్తాడు.
మనకు ఆ విధంగా భగవంతునియొక్క దర్శనం కలిగినపుడు జీవితాంతం
ఆ సంఘటనని మన మనసులో పదిలపర్చుకుని ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఉంటాము కూడా. భగవంతుడు ఆవిధంగా మనకు తన అనుగ్రహాన్ని మనమీద ప్రసరింపచేసినందుకు
మనకు అంతులేని బ్రహ్మానందం కలుగుతుంది. అదే
మనకి ఆధ్యాత్మిక సాధన అవుతుంది. దానిద్వారా
ఆత్మసాక్షాత్కారం కలిగి భగవంతునితో ఏకమవుతాము.
జనన మరణ చక్రాలబంధం తొలగిపోతుంది.
1983 సంవత్సర ప్రాంతంలో గురుపూర్ణిమ
పర్వదినంనాడు సాయిబాబా నాకు అటువంటి దర్శనమిచ్చి నన్ను ఏవిధంగా ఆశీర్వదించారో ఇపుడు
మీకు వివరిస్తాను.
నేను మరికొంతమంది భక్తులతో
కలిసి గురుపూర్ణిమకు ముందురోజు షిరిడీ చేరుకున్నాను. షిరిడీలోని ‘మంగళ కార్యాలయంలో’ బస చేసాము. అక్కడ నాసోదరుడు శ్రీ సుబ్రహ్మణ్యం మరికొంతమంది
భక్తులతో కలిసి మద్రాసునుంచి వచ్చాడు. వారు
కూడా మాతోపాటే ఉన్నారు. రాత్రి ప్రతి ఒక్కరూ
సాయిబాబా తమకు యిచ్చిన అనుభవాలను చెప్పసాగారు.
ఆ విధంగా అందరూ ఎవరికి వారు తమతమ స్వంత అనుభవాలను వివరిస్తూ ఉంటె వాటిని ఆలకిస్తూ
ఆ రాత్రి గడుపుతూ ఉన్నాము. అకస్మాత్తుగా రాత్రి
11 గంటలవేళ నాకడుపులో గుడగుడ మొదలయి డిసెంట్రీ పట్టుకుంది. మధ్యమధ్యలో బాత్ రూముకి వెళ్ళాల్సి వచ్చింది. శారీరికంగా శక్తి నశించి పూర్తిగా నీరసం ఆవహించింది. మంచంమీద నిస్త్రాణగా పడుకుండిపోయాను. మనసులో బాబా నామస్మరణ చేసుకుంటున్నాను.
తెల్లవారుఝామున నాలుగు
గంటలకి లేచి అందరూ గురుపూర్ణిమ రోజున కాకడ ఆరతి చూడటానికి బయలుదేరడానికి సిధ్ధమయ్యారు. దీక్షిత్ వాడా దగ్గర క్యూలో నిలబడి అక్కడినుంచి
మందిరంలోకి వెళ్ళి సరిగ్గ 5-15 కల్లా కాకడ ఆరతి చూడవచ్చనుకున్నారు. కాని నన్నుఒంటరిగా గదిలోనే వదిలి వెళ్లడానికిష్టపడలేదు. వారందరిలో ఒకతను నన్ను ఉద్దేశించి “అతను (అనగా నేను)
గొప్ప సాయి భక్తుడు. అతనికి ఏమీ అవదు. ఈ గురుపూర్ణిమనాడు మనం కాకడ ఆరతి చూడటానికి వెడదాము
రండి” అని అందరినీ బయలుదేరదీశాడు. విచిత్రాలలోకెల్లా
విచిత్రం – అందరూ ఆవిధంగా బయటకు వెళ్ళిపోగానే బాబా మెరుపులా స్వప్నంలో ప్రత్యక్షమయ్యి,
“ఈ రోజు నీకు పరిచయం లేని ఒక యోగిని కలుసుకో, ఆయనని గురుస్థాన్ వద్ద దర్శించుకో” అని
చెప్పారు. బాబా ఈవిధంగా నాకు దర్శనమిచ్చిన
తరువాత నా శరీరంలో మంచి శక్తి వచ్చింది. వెంటనే
స్నానం చేసి కాకడ ఆరతికి పరుగెత్తాను. అంతకు
ముందు కాకడఆరతికి వెళ్ళినవారు అక్కడ మందిరంలో నన్ను చూసి ఆశ్చర్యపోయారు. వారంతా నన్ను బాబా దగ్గరకు తీసుకుని వెళ్ళారు. వారందరికీ బాబా నాకు దర్శనమివ్వడం గురించి చెప్పాను. వారంతా ఎంతగానో సంతోషించి బాబా ‘భక్తపరాధీన’ (తనకు
విధేయులయిన భక్తులకి ఆయన బానిస) అన్నారు. వేకువఝాముననే
బాబా “నువ్వు గురుపూర్ణిమనాడు ఒక అపరిచిత యోగిని కలుసుకుంటావు” అని చెప్పినట్లుగానే
ఆయనను నేను కలుసుకోబోయేముందు మీకు కొన్ని విషయాలను చెప్పాలి.
నేను ప్రతిరోజు శ్రీసాయి
సత్ చరిత్రలోని రెండు అధ్యాయాలను పారాయణ చెస్తూ ఉంటాను. శ్రీసాయి సత్ చరిత్ర 23వ.అధ్యాయంలో “ఒక అపరిచిత
యోగి గురించిన ప్రస్థావన వస్తుంది. అందులో
యోగము – ఉల్లిపాయ గురించిన వివరణ మనం గమనించవచ్చు. ఒకసారి యోగాభ్యాసము చేసే సాధకుడు నానా సాహెబ్ చందోర్కర్
తో కలిసి షిరిడీకి వచ్చాడు. అతడు యోగశాస్త్రానికి
సంబంధించిన గ్రంధాలన్నిటినీ చదివాడు. పతంజలి
యోగసూత్రములు కూడా చదివాడు. కాని అనుభవం ఏమాత్రం
లేదు. మనస్సును స్థిరంగా ఉంచుకుని కొంచెం సేపయినా
సమాధి స్థితిలో ఉండలేకపోయేవాడు. సాయిబాబా తనయందు
ప్రసన్నులయితే తనకు చాలాసేపు సమాధిలో ఉండటమెలాగో నేర్పిస్తారనే భావంతో వచ్చాడు. అతడు మసీదుకు వెళ్ళి చూసినపుడు ఆ సమయంలో బాబా రొట్టెలో
ఉల్లిపాయను నంచుకుని తింటున్నారు. ఆ దృశ్యం
చూడగానే ఆ యోగి “రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నాకష్టములను ఎట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉధ్ధరించగలడు?” అని భావించాడు. సాయిబాబా అతని మనస్సులో మెదిలిన ఆలోచనను గ్రహించి
నానా సాహెబ్ తో ఈ విధంగా అన్నారు. “నానా! ఎవరికయితే
ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను”
ఆమాటలు వినగానే ఆ యోగి
ఆశ్చర్యపడి వెంటనే బాబా పాదాలపై బడి సర్వశ్యశరణాగతి చేసాడు. స్వఛ్చమయిన మనసుతో తన కష్టములన్నిటినీ చెప్పుకొని
వాటికి సమాధానములను బాబానడిగి తెలుసుకున్నాడు.
ఆ విధంగా సంతుష్టి చెంది, ఆనందంతో బాబా ఊదీ, ప్రసాదంతో ఆయన ఆశీర్వాదములతో షిరిడీనుంచి
బయలుదేరాడు.
ఈ యోగియొక్క పేరు యితర
వివరములను తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉండేది. ఈరోజు ఇటువంటి పుణ్యదినమయిన గురుపూర్ణిమనాడు కరుణాసముద్రుడయిన
మన బాబా నా చిరకాల వాంఛను తీర్చారు. ఒక యోగిని
నేనేవిధంగా కలుసుకున్నానో మీకందరికీ యిప్పుడువివరిస్తాను.
కాకడ ఆరతి అయిన తరువాత మేమందరం సమాధిమందిరం దగ్గర
ఉన్న గణపతి, శనీశ్వరుడు, శివుని మందిరాలకు వెళ్ళి అందరినీ దర్శించుకున్న తరువాత బాబా
గారి చావడి, ద్వారకామాయికి వెళ్ళి ఆఖరికి 9.30 అవుతున్న సమయానికి గురుస్థానంలోకి ప్రవేశించాము. ఆశ్చర్యం – నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నాకెదురుగా ఒక అపరిచిత యోగిపుంగవుడు దర్శనమిచ్చాడు. ఆయన మంచి శరీర సౌష్టవంతో అయిదడుగుల ఆరంగుళాలు పొడవు ఉన్నాడు. మంచి ప్రకాశవంతమయిన నేత్రాలు. వెనకాల ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన తన పాదాలకు దగ్గరగా ఎవరినీ నమస్కారం చేసుకోనివ్వరు. అందువల్ల ఆయన పాదాలకు కాస్త దూరంగా సాష్టాంగ నమస్కారం
చేసుకున్నాను. ఆయనలో నేను ప్రత్యక్షంగా బాబాని
చూసాను. (ఆయన రూపంలో బాబాయే దర్శనమిచ్చారు.)
ఆయన నన్ను దీవించి, వెంటనే
తన శిష్యులతో కలిసి గురుస్థానం దారి గుండా తిన్నగా సమాధిమందిరంలోకి వెళ్ళిపోయారు. (గురుస్థానం నుండి నేరుగా సమాధి మందిరానికి వెళ్ళే
దారినుంచి సంస్థాన ట్రస్టీలోని సభ్యులకు, ప్రముఖ వ్యక్తులను మాత్రమే వెళ్లడానికి అనుమతిస్తారు). దైవాంశ సంభూతుడయిన ఒక అపరిచిత యోగి యొక్క దర్శనం
నాకు లభిస్తుందని వేకువఝాముననే బాబా స్వప్నంలో చెప్పిన మాట ఈ విధంగా నిజమయింది. అపుడు నేను ఆ యొగియొక్క వ్యక్తిగత సహాయకుడయిన (పి . ఎ) శ్రీ బి.సామంత్ గారిని వివరాలడిగాను. ఆ
యోగిపేరు ‘రామ్ బాబా’ అని చెప్పాడు. శ్రీసమర్ధ
సద్గురు సాయిబాబాను దర్శించుకోవడానికి ఆయన ప్రతిసంవత్సరం గురుపూర్ణిమనాడు షిరిడి వస్తారని
చెప్పాడు. ఆయన చాలా నిరాడంబరంగాను, ఎటువంటి
అహంభావం లేకుండా పేరుప్రఖ్యాతులయందు విముఖంగాను ఉంటారని, బాబానుంచి ముందస్తు అనుమతి
లేకుండా భక్తులనుండి ఎటువంటి విరాళాలను, బహుమతులను స్వీకరించరని చెప్పాడు. ఆయన విదేశాలలో కూడా బాబా జీవితం, ఆయన బోధనలు, తత్వం
అన్ని చోట్లా ప్రచారం చేశారని చెప్పాడు. ఆయన
ఎవరినీ తన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకోనివ్వరని, ఎటువంటి వార్తా పత్రికలలో గాని,
సచిత్ర పత్రికలలో గాని, తన గురించి గాని తన పేరుగురించి గాని ప్రచురించడానికి అనుమతించరని
చెప్పాడు. అందువల్ల చెప్పేదేమిటంటే ఆయన తనకు ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా బాబా
గురించి, ఆయన లీలలను గురించి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పాడు. ఆయన వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వేర్వేరు
భక్తులు సాయిభక్తులుగా మారారు. ఆయన చేస్తున్న
నిస్వార్ధమయిన సాయిసేవ ఎంత గొప్పది?
ఈ ప్రపంచంలో అటువంటి
వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆయన
114 సంవత్సరాల పైగా జీవించారు. కాకాసాహెబ్
దీక్షిత్ లాగానే ఆయన కూడా బాబాను మాత్రమే స్మరిస్తూ బాబాలోనే ఐక్యమయ్యారు.
గొప్ప సాయిభక్తుడయిన
పూనా నివాసి అయిన స్వర్గీయ శ్రీ నింబాల్కర్, ఆయన కూడా ఆ రోజు అక్కడే ఉన్నారు. ఆయన చెప్పిన విషయమేమిటంటే ఆ యోగి ఆహారాన్ని గాని,
దుస్తులను గాని ఎప్పుడూ ఆశించలేదు. కొంతమంది భక్తులు సమయానుసారం ఆయన వద్దకు వెళ్ళి
ఆహారాన్ని దుస్తులను సమర్పిస్తూ ఉండేవారు.
కొంతమంది ధనికులయిన మహాదాతలు ఆయనను సాయి ప్రచారం కోసం విదేశాలకు తీసుకుని వెళ్ళేవారు. అన్ని విషయాలలోను బాబా పూర్తిగా ఆయన యోగక్షేమాల
బాధ్యతను తీసుకున్నారు. ఆయన బాబాకు సర్వశ్య
శరణాగతి (తన్, మన్, ధన్) చేసినందువల్లనే ఆయన సంపూర్ణ బాధ్యతలను బాబా తీసుకున్నారనడంలో
ఎటువంటి ఆశ్చర్యం లేదు. బాబా తన హృదయంలోనే
ఉండి, అన్ని కార్యాలు నిర్వహిస్తున్నారని, తను కేవలం ఆయన చేతిలో ఒక సాధనం మాత్రమేనని
ఆయన ప్రగాఢమయిన విశ్వాసం, నమ్మకం. అది నూటికి
నూరు పాళ్ళు యదార్ధం. శ్రీసమర్ధ సద్గురు బాబా
అనుగ్రహం, దయ ఆశీర్వాదాలు మనకు కూడా లభించాలంటే సాయిభక్తులమయిన మనమందరం జీవితంలో దానిని
అర్ధం చేసుకుని దానికనుగుణంగా ప్రవర్తించాలి.
ఇక ముగించేముందుగా చెప్పేదేమిటంటె,
ఏవ్యక్తీ ‘రామ్ బాబా’ కాలేడు. ఆ విధంగా కాలేకపోయినా
గాని, కనీసం ప్రతిక్షణం బాబా నామాన్ని స్మరించుకుంటూ, ఆయననే ధ్యానం చేసుకుంటూ ఆయన లీలలను
చదువుతూ ఆయన తారక మంత్రమయిన ‘ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి’ ని నిరంతరం జపిస్తూ ఉంటే
అదే ముక్తికి సులభమయిన మార్గం.
ఓమ్ తత్ సత్, ఓమ్ శాంతి,
శాంతి శాంతిః
ఆర్. రాధాకృష్ణన్ (సాయిజీవి)
సర్వశ్య శరణాగతి
: సర్వశ్య శరణాగతి అనగా పాదాల వద్ద సాష్టాంగ
పడి నమస్కారం చేసుకోవడం కాదు. మన శరీరం, మనస్సు,
వాక్కు, సంపద అంతా ఆ భగవంతునికే అర్పించి అంతా ఆయనదే అనే భావంతో మెలగడం. మన శరీరాన్ని భగవంతునికి అనగా బాబాకు ఇచ్చినపుడు
ఆయన మన హృదయంలోనే ఉంటాడు. అటువంటపుడు మన శరీరం
మనది కాదు. భగవంతునిది. వాక్కు కూడా ఆయనకే ఇచ్చివేయడం. మనం ఏ కార్యాన్ని చేస్తున్నా అంతా ఆయనే చేస్తున్నాడు,
మనం ఆయన చేతిలో ఒక సాధనం మాత్రమే అనే భావంతో మెలుగుతూ ఉండాలి. మన సంపద కూడా ఆయనదే అనే భావంతో ఉండాలి. ఆవిధంగా మెలుగుతూ నిరంతరం బాబా నామాన్నే స్మరిస్తూ
ఉంటే బాబా పూర్తిగా మన యోగ క్షేమాలను చూస్తూ మన శరీరంలోనే నిరంతరం నివసిస్తూ ఉంటారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment