14.02.2021 ఆదివారమ్.
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా
భక్తురాలి ఆహ్వానానికి స్పందించి ఏవిధంగా వచ్చారో తెలిపే అధ్భుతమయిన లీలను ప్రచురిస్తున్నాను.
చెన్నై
నుండీ శ్రీమతి కృష్ణవేణిగారు తమ అనుభవాన్ని నిన్ననే నాకు పంపించారు. ఈ లీలను చదివిన తరువాత మనకు కలిగిన అనుభూతిని మరలా
మరలా మననం చేసుకుంటే తప్ప బాబా లీల మనకు అర్ధం కాదు. బాబా మనకు ఎదురుగా వచ్చినా గ్రహించుకోలేము. ఆమె పంపించిన ఈ అనుభవాన్ని ఆమె మాటలలోనే చదవండి.
మనఃస్ఫూర్తిగా
పిలిస్తే రాకుండా ఉంటానా? రాలేదనుకున్నావా?
మా
పెద్ద పాప చి. ప్రసన్నలక్ష్మి భరత నాట్యం నేర్చుకుంటోంది. ఈ నెల 7వ.తారీకున మా పాప, ఇంకా నాట్యం నేర్చుకుంటున్న
మరొక ఎనిమిది మంది పిల్లలతో కవితాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ & మ్యూజిక్ వారు
నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేసారు.
మా
పాప ఇస్తున్న మొదటి ప్రదర్శన కారణంగా ఆహ్వాన పత్రికను ముందుగా మైలాపూర్ లో ఉన్న బాబా
మందిరంలో పెట్టి బాబాను కూడా నాట్య ప్రదర్శనకి ఆహ్వానిద్దామనుకున్నాను. మా పాప కూడా బాగా నాట్యం చేయాలని బాబాను మనసులోనే
వేడుకున్నాను. కాని ఈ మధ్య వచ్చిన కరోనా కారణంగా
మైలాపూర్ బాబా మందిరానికి ఇప్పటికీ అంత ఎక్కువమందిని పంపించడం లేదు. ఒకవేళ మందిరంలోకి
వెళ్ళినా భక్తులందరినీ బాబా విగ్రహానికి ముందునుంచి కాకుండా వెనకనుంచే వెళ్ళిపోయేలా
ఏర్పాటు చేసారు. కాని మైలాపూర్ బాబా మందిరానికి
వెడదామనుకున్నా చివరి వరకూ కూడా కుదరలేదు.
మావారు ఆఫీసునుండి ఆలస్యంగా రావడం వల్ల కుదరలేదు. మాఇంటినుంచి మైలాపూర్ లో ఉన్న బాబా మందిరం చాలా
దూరం. అందువల్ల ఒక్కత్తినీ వెళ్లలేను. అందుచేత మా ఇల్లు ఉన్న వీధిలోనే ఒక వినాయకుడి గుడి
ఉంది. అందులోనే బాబా ఫోటో కూడా ఉంది.
ఆహ్వాన పత్రికను తీసుకువెళ్ళి మా వీధిలో ఉన్న వినాయకుడు గుడికి వెళ్ళి బాబా
ఫొటో దగ్గర పెట్టి, బాబా క్షమించండి. నేను
మీ దగ్గరకు రాలేకపోయాను. మీరు ఇక్కడే ఉన్నారు అనే భావంతో ఈ ఆహ్వాన పత్రికను ఇస్తున్నాను. మీరే మమ్మల్ని ఆశీర్వదించాలి అని మనసులోనే ఆయనను
ప్రార్ధించుకున్నాను.
మేమందరం
నాట్యప్రదర్శనశాలకు వెళ్లాము. నాట్యం ప్రారంభానికి
ముందు పిల్లల తల్లదండ్రులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసారు. ఇక్కడ తమిళం వాళ్ళు ప్రతికార్యక్రమాన్ని ఒక పధ్ధతిలో
నిర్వహిస్తూ ఉంటారు. ఈ నాట్య ప్రదర్శనలో పాల్గొనే
పిల్లల మేనమామలను గాని, వారి దగ్గరి బంధువులను గాని వాళ్ళని కూడా పిలిపించి పిల్లలకు
వాళ్ళ చేత సన్మాన కార్యక్రమంలాంటివి కూడా చేయిస్తూ ఉంటారు. నేను ఒంగోలులో ఉన్న మా తల్లిదండ్రులకి, మాతమ్ముడికి
రమ్మని ఫోన్ చేసాను. కాని అక్కడ ఇప్పుడు కరోనా
వాక్సీన్ కాస్త ఎక్కువగా వేస్తూ ఉండటం వల్ల, మా తమ్ముడికి ఆఫీస్ పని వర్క్ ఫ్రమ్ హోం
ఎక్కువగా ఉండటం వల్ల రాలేనని చెప్పడం జరిగింది.
ఎవరూ రాలేమని చెప్పడంతో నాకు మనసులోనే
చాలా బాధ కలిగింది. అందరి పిల్లల బంధువులూ
వచ్చి అందరినీ సత్కరిస్తారు. మరి మా అమ్మాయిని
సత్కరించేవాళ్ళు ఎవరూ ఉండరేమో బాబా అనుకుంటూ ఉన్నాను. అంతేకాదు బాబా మీకు ఆహ్వానపత్రికను ఇచ్చాను. మీరేమన్నా వచ్చి మా పాపను సత్కరించగలరా అని మనసులో
అనిపించింది. బాబా చేత మనం సత్కరింపచేసుకోవడానికి
మనం ఎంతటివారం? కాని మనసులో నాకు అలా అనిపించింది. ఇక బాబా గారే చూసుకుంటారులే శాలువాతో సత్కారం లేకపోతే ఏముందిలే ఆయన ఆశీర్వాదం
ఉంటే చాలు అని ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వదిలేసాను. మా కుటుంబంలో మా అమ్మాయే భరతనాట్యం నేర్చుకుంటోంది. నాట్య ప్రదర్శనకి వెళ్ళినపుడు మా వాళ్ళకి అక్కడ
ఏమి చేయాలో పెద్దగా ఏమీ తెలియదు. నాట్యం చూసి వచ్చేయడమే అనుకున్నారు.
మా
వీధిలోనే ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన మా కాలనీకి
ఒక ప్రెశిడెంటు లాగ అన్ని వ్యవహారాలను చూస్తూ ఉంటారు. మా వారు కూడా కార్యదర్శిలాగా ఆయనకి సహాయం చేస్తూ
ఉంటారు. ఆయన మంచి నిష్టగా పూజలు అవీ కూడా చేసుకుంటూ
ఉంటారు. అందుచేత ఆ పెద్దయనకి కూడా ఆహ్వాన పత్రికను
ఇచ్చి మా పాప నాట్యప్రదర్శనకు రమ్మని చెప్పాను.
ఆయన తన కుటుంబంతో వస్తానని చెప్పారు.
మధ్యాహ్నం మేము బయలుదేరేముందు ఆయనకి మరలా ఒకసారి గుర్తు చేసి తొందరగా రండి, వస్తే
ముందువరసలోనే కూర్చోవచ్చు అని చెప్పాను. కాని
అనుకోకుండా వారింటికి ఆయన కూతురు,అల్లుడు వచ్చారు. ఇక వారు రారేమో అనుకున్నాను.
ఇక
మేమందరం కార్యక్రమానికి వెళ్ళిపోయాము. కార్యక్రమంలో
టీచర్ ఏమని చెప్పారంటే నాట్యప్రదర్శన అంతా
అయిపోయిన తరువాత చివరలో ఫోటో దిగేటప్పుడు ఎవరయినా వాళ్ల వాళ్ల పిల్లలకి బహుమతులు ఇవ్వాలన్నా,
సత్కరించుకోవాలనుకున్నా అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పారు. కాని మా పాప విషయంలో ఏంజరిగిందంటే మేము పిలిచిన
పెద్దాయన ఇంటికి వారి అమ్మాయి అల్లుడు వచ్చినందువల్ల అసలు రారేమో అనుకున్నాను. కార్యక్రమం ప్రారంభించేముందు పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి గురువుకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి.
ఆవిధంగా ఆశీర్వాదం తీసుకునే సమయంలో పిల్లలను వారి దగ్గరి బందువులెవరూ సాధారణంగా
సత్కరించరు. గురువుకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం
తీసుకోవడానికి మమ్మల్ని వేదిక మీదకి పిలిచారు.
ఇక్కడ జరిగిన విచిత్రం ఏమిటంటే ఇక రారేమో అనుకున్న ప్రెసిడెంట్ గారు ఆలస్యంగా
వచ్చినా సరిగ్గా మాపేర్లు పిలిచే సమయానికి రావడం
జరిగింది. మాపేర్లు వినడం, మేము వేదికమీద ఉండటం
చూసి, అక్కడే ఉన్న టీచర్ గారిని అనుమతి అడిగి వేదికమీదకి వచ్చేసారు. మా పాపకి శాలువా కప్పి, ఒక కవరులో బహుమతిగా కొంతమొత్తం
పెట్టి ఇచ్చారు. ఎవ్వరికీ కూడా ఆసమయంలో పిల్లలను సత్కరించడానికి
అనుమతి ఇవ్వరు. కార్యక్రమం పూర్తయిన తరువాతనే
అనుమతిస్తారు. ఆఖరులో పిల్లలను సత్కరించినా
ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అంత పెద్ద సభలో
అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. అందరి
పిల్లలకంటే ముందుగా మాపాపకి ఆవిధంగా సన్మానం జరగడం అది ఊహించరాని విధంగా జరిగింది. ఆయన సరిగ్గా మాపాపపేరు, మాపేర్లు పిలిచేసమయానికే
రావడం, వెంటనే వేదికఎక్కి టీచర్ అనుమతితో మా పాపకి సన్మానం చేయడం అంతా చకచకా జరిగిపోయింది. ఇంత ఆలస్యంగా వచ్చారేమిటి అని ఆయనను అడిగినప్పుడు
ఇంటికి అమ్మాయి అల్లుడు వచ్చారమ్మా, మా ఆవిడని
కూడా తీసుకువద్దామనుకున్నాను, కాని కుదరలేదు. నాకెందుకో ఆసమయానికి రావాలనిపించింది, అప్పటికప్పుడు
దారిలో శాలువా కొని తొందరగా ఇక్కడికి వచ్చాను అన్నారు. కార్యక్రమం పూర్తి అయేదాకా కూడా
ఉండలేదు. అమ్మాయికి శాలువా కప్పిన తరువాత ఒక్క డాన్స్ చూసాక మళ్ళీ వస్తానమ్మా అని వెళ్ళిపోయారు.
వాళ్ల అల్లుడు వచ్చినా కూడా ఆయన రావడం అంతా బాబా ఆశీర్వాదమనే భావించాను. ఆయన మరొక విషయం చెప్పారు…”పొద్దున్న ఇంటికి వచ్చి
పాపని ఆశీర్వదిద్దామనుకున్నాను, కాని ఎందుకనో
అలా చేయబుద్ది కాక వెంటనే వచ్చేయాలనిపించి దారిలోనే శాలువా కొని వచ్చేశాను, ఎందుకో
తెలియదు”
ఇదంతా
జరిగిన తరువాత ఇది బాబా ఇచ్చిన అనుభూతి అని అనుకోలేదు. నాకు చాలా సంతోషం వేసింది. ఇక ఆవిషయాన్ని వదిలేసాను.
ఆతరువాత
బాబాని అడిగాను. బాబా కార్యక్రమం అంతా బాగా
జరిగింది. మీ ఆశీర్వాదంతోనే జరిగింది, కాదనను,
కాకపోతే మీరు నేను ఆహ్వానించినందుకు మీరు వచ్చే ఉంటారు, కాని నేను మీ ఉనికిని నేను
గుర్తించలేకపోయానేమో, అని మనసులోనే అనుకున్నాను.
మీరు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారా అని బాబాని అడుగుతూ వెబ్ సైట్ లో బాబా
ప్రశ్నలకు సమాధానాలలో అడిగాను. అందులో నాకు
బాబా నుంచి వచ్చిన సమాధానం …”చిన్న సూక్ష్మ జీవినుంచి పెద్దపెద్దవాటి వరకు అన్నిటిలోను
నేనే నిండి ఉన్నాను. కాని నేను వచ్చినపుడు
గుర్తించడం మీవంతు. మీరు గుర్తించలేకపోయారేమో”
అన్నట్లుగా సమాధానం వచ్చింది.
అందరి
పిల్లలకు జరిగినట్లు మాపాపకి సన్మానం జరగదేమో అనుకున్నాను గాని ఇంత విచిత్రంగా సాధారణంగా
జరిగే విధంగా కాకుండా కార్యక్రమం ప్రారంభమవడానికి ముందే జరిగింది.
ఆ
తరువాత మా వీధిలోని ప్రెసిడెంట్ గారు అన్న మాటలు, …”పొద్దున్న ఇంటికి వచ్చి పాపని ఆశీర్వదిద్దామనుకున్నాను, కాని ఎందుకనో అలా చేయబుద్ది కాక వెంటనే వచ్చేయాలనిపించి
దారిలోనే శాలువా కొని వచ్చేశాను, ఎందుకో తెలియదు” గుర్తుకు వచ్చాయి.
ఆమాటలతో
నాకు జ్ఞానోదయమయింది. బాబాగారే ఆయన రూపంలో
వచ్చి మా పాపను ఆశీర్వదించారని.
మిగతా
పిల్లలందరినీ గురువులు, చీఫ్ గెస్ట్ లు లేనప్పుడు ఆఖరులో సన్మానించారు. కాని మాపాపని మాత్రం అందరిముందు సన్మానించడం జరిగింది. మా చిన్నత్తయ్యగారు కూడా వచ్చారు. వాళ్ళు ఇదివరకు రెండు మూడు కార్యక్రమాలు చూడటం
వల్ల సన్మాన కార్యక్రమం ఏవిధంగా జరుగుతుందో వాళ్లకి తెలుసు. అందుచేత వాళ్ళు కూడా శాలువా,
పూలదండ తెచ్చారు. ఆఖరులో అందరిపిల్లలకు శాలువా
కప్పినట్లే మాపాపకు కూడా కప్పారు. అందరికీ
ఎక్కువగా చేస్తారు, మా పాపకి ఎక్కువగా చెయ్యరేమో అనుకున్నాను.
ఆయనే
కనక మామూలుగా వచ్చి, ఆఖరులో పిల్లలందరితో పాటుగా మా పాపని కూడా శాలువాతో సన్మానిస్తే
బాబా లీలగా గ్రహించలేము. కాని మా పేర్లు పిలవగానే
మాపాప, నేను, మావారు ముగ్గురం వేదికమీదకు వెళ్లడం, సరిగ్గా ఆసమయంలోనే ఆయన వేదికమీదకు
వచ్చి టీచర్ అనుమతితో మాపాపకు శాలువా కప్పి సన్మానించి, కొంతమొత్తం బహుమతిగా కవరులో
పెట్టి ఇవ్వడం, ఇవన్నీ గమనించినట్లయితే బాబా ఆయన రూపంలో వచ్చి మాపాపను నాట్యప్రదర్శనకి
ముందే ఆశీర్వదించారని అర్ధమయింది. అసలు కార్యక్రమం ప్రారంభించేముందు గురువుకు తాంబూలం ఇచ్చే సమయంలో ఎవరికీ వాళ్ల వాళ్ళ పిల్లలను సన్మానించడానికి
అనుమతి లేదు. కాని ఆయన మమ్మల్ని చూడగానే గబగబ
వేదిక మీదకి వచ్చారు. ఆయన వచ్చేవరకు నేను గమనించలేదు. టీచర్ ఒక్క నిమిషం అని ఆమెని అనుమతి అడిగి మాపాపకు
శాలువా కప్పి ఆశీర్వదించారు. టీచర్ అనుమతినివ్వడం కూడా బాబా లీల కాక మరేమిటి?
బాబా! మా పాప ఈ విధంగా నాట్యం చేసే స్థితిలో ఉండటానికి కారణం మీరే. అంతదూరం మైలాపూర్ కి వచ్చి పిలవలేకపోయాను అనే బాధ
నాలో ఉండిపోయింది. ప్రతి చిన్న విషయానికి మైలాపూర్
మందిరానికి వెళ్ళి బాబా ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు. కాని ఇక్కడ మావీధిలో ఉన్న వినాయకుని గుడిలో ఉన్న
బాబా ఫోటో ముందు ఆహ్వాన పత్రికను పెట్టి మీరు వచ్చి ఆశీర్వదిస్తారా అని ఆయనకు చెప్పుకోవడం, ఆయన రావడం మా పాపను ఆశీర్వదించడం
నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇది మరొక మరపురాని అనుభూతి...
(రేపటి సంచికలో యధావిధిగా శ్రీసాయి పరిశోధనా వ్యాసగ్రంధ ప్రచురణ)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment