13.04.2021
మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 68 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – బొంబాయి
బొంబాయి ---
ఆదివారమ్, అక్టోబరు, 27, 1985
నా డైరీలోని ముఖ్యాంశాలు…
ఉదయం గం. 11.30 --- నిన్న రాత్రి బొంబాయి చేరుకునేటప్పటికి గం.9.45 అయింది. బస్సుప్రయాణం షిరిడీనుంచి బొంబాయికి చాలా దూరం. రోడ్డు కూడా గతుకులుగా ఉండటం వల్ల చాలా అలసట కలిగింది. దారిలో మేము సాకూరీలోను, నాసిక్ లోను ఆగాము. కాస్తంత ఆధునికంగా ఉన్న ఆలయం ఒకటి కనిపించింది. బొంబాయి చేరుకున్న తరువాత టాక్సీలో మెరైన్ డైవ్ లో ఉన్న అగర్వాల్ గారి ఇంటికి పది గంటలకు చేరుకొన్నాను. ఆయన చేసే గౌరవమర్యాదలు ఎప్పుడూ అధ్భుతంగానే ఉంటాయి.
నా పాశ్చాత్య
అలవాట్లను ఇక్కడ మానుకుని వారి పధ్ధతుల ప్రకారం నడచుకోవాలి. షిరిడీలో నేను చేసిన పరిశోధనా కార్యక్రమం
పూర్తి అయిన ఇన్ని రోజులకి ఇక్కడ కొద్ది రోజులు ఉండి విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది.
బొంబాయిలో స్వామి రామ్ బాబాగారిని ఆయన ఇంటివద్ద కలుసుకోవాలి. మళ్ళీ ఒకసారి నారాయణబాబాను కలుసుకుందామనే
ఆలోచన లేదు. ఒకవేళ కలుసుకున్నా
ఇప్పటికే నాకు తెలుసున్న విషయాలు చెబుతారు తప్ప నా పరిశోధనకు ఉపయోగపడే విషయాలేమీ ఉండవని
అనుకుంటున్నాను.
ఇక్కడ బొంబాయిలో బాబా విలక్షణంగా కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న
చిత్రాలు అన్ని దుకాణాలలోను, కారుల మీద, గోడలమీద,
ఇంకా ఆయన మందిరాలు చిన్న చిన్నవి ఎన్నో నన్నెంతగానో ఆకట్టుకున్నాయి.
రాత్రి గం. 7.30. ఈ రోజు మధ్యాహ్నం స్వామి రామ్ బాబా గారిని కలుసుకోవడానికి వెళ్ళాము. కాని దురదృష్టవశాత్తు ఆయనతో మాట్లాడే
అవకాశం కలగలేదు. ఏమయినా
గాని రేపు రాత్రి గం. 7.30 కి ఆయనతో మాట్లాడటానికి సమయాన్ని
కేటాయించుకున్నాము.
(హెచ్.జె. అగర్వాల్ గారి
అన్నగారు ఎన్.జె. అగర్వాల్ గారు సత్యసాయిబాబా
గారికి భక్తుడు)
బొంబాయి, సోమవారం, అక్టోబరు,
28, 1985
నా డైరీలోని ముఖ్యాంశాలు …
ఉదయం గం. 11.15 నిన్నరాత్రి భోజనం చేసిన తరువాత మంచి నిద్రపట్టింది.
ఈ రోజు వంద డాలర్లను మార్చుకున్నాను. ఈ రోజు మధ్యాహ్నం స్వామి
రామ్ బాబా గారిని కలుసుకొవాలి. ఆయనను ఎప్పుడు కలుసుకుందామా
అనే ఆతృతతో ఉన్నాను.
రాత్రి గం. 10.00 … ఈ రోజు రాత్రి 8 గంటలకు బాంద్రాలో ఉన్న పూజనీయులయిన స్వామి రామ్ బాబాగారిని కలుసుకున్నాము. షిరిడీలో నేను కొనసాగించిన పరిశోధనకు
నాకు కలిగే ఆధ్యాత్మికానుభూతే ఒక విధంగా కిరీటంలాంటిది. ఆయన ఒక గొప్ప యోగిపుంగవులు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయనయొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని
నేను అనుభూతి చెందాను. అది మాటలకు అందనిది. చివరిగా ఆయన నాకు ప్రసాదం ఇచ్చారు. ఆయన మాట్లాడే మాటలను నేను రికార్డు
చేయలేకపోయాను. ఆయన ఫోటొలను
కూడా తీయలేకపోయాను. ఫోటో
తీసుకుంటానంటే ఆయన తన ఫోటోను నా హృదయంలోనే ముద్రించుకోమని అన్నారు. మా సమావేశం ముగిసిన వెంటనే ఆయన మాట్లాడిన మాటలను,
బోధనలను, ఆయనమీద నాకు కలిగిన భావాలను అన్నీటినీ
క్రోడీకరించి టేపులో రికార్దు చేసుకున్నాను. (ఇది నా మినీ క్యాసెట్ లలో ఏడవది). ఈ రోజు కలిగిన అనుభవాలకు,
అనుగ్రహానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక నిద్రకుపక్రమించాలి.
బొంబాయి, స్వామి రామ్ బాబా గారి ఇంటిలో రాత్రి గం.
8.00
బొంబాయి మార్కో నోఎల్స్ రూఫ్ గార్డేన్ వెనుక బాంద్రాలో శేష్
మహల్ భవనం, 9, పాలీహిల్ 5-A, స్వామి రామ్ బాబాగారి అపార్ట్
మెంటులో ఆయనతో జరిపిన సంభాషణ…
(స్వామి రామ్ బాబా గారి విజిటింగ్ కార్డ్)
మా సమావేశం ముగిసిన వెంటనే ఆయన చెప్పిన ఈ వివరాలన్నిటినీ రికార్డ్
చేసాను.
ఇది ఒక అసాధారణమయిన అనుభూతి.
ఆయన యదార్ధమయిన యోగిపుంగవులు. ఆయన తను చెప్పే మాటలను రికార్డు చేసుకొవడానికి
అనుమతించలేదు. ఆందువల్ల
ఆయన మాట్లాడుతుండగా నేను రికార్డు చేయలేదు. ఆవిధంగా చేసినట్లయితే ఆధ్యాత్మిక
వాతావరణం దెబ్బతింటుందని నేను భావించాను.
ఏమయినప్పటికి అది ఒక గొప్ప ఆధ్యాత్మికానుభూతి. స్వామి రామ్ బాబా గారు చాలాసేపు మాట్లాడారు.
తాను 1860వ. సం. లో జన్మించానని ఇపుడు తన వయస్సు 125 సంవత్సరాలని స్వామి
రామ్ బాబాగారు చెప్పారు. కాని ఆయన చెప్పిన వయస్సులో ఆయన సగం వయస్సు ఉన్నట్లుగా కనిపిస్తారు. ఆయన శరీరం ఒక యువకునికి ఉన్నంత మృదువుగా
ఉంది. ఆయన చాలా పొడవుగా
తెల్లని దేహఛ్చాయతో పొడవాటి గడ్డంతో ఉన్నారు. ఆయన జుట్టు తెల్లబడుతూ ఉంది. ఆయన కాషాయ వస్త్రాలను ధరించారు. ఆయన ఒక కుర్చీలో కుర్చుని అనర్గళంగా
ఆంగ్లంలో మాట్లాడారు. ఆయన భారతీయ భాషలు చాలా వాటిల్లో నిష్ణాతులయినట్లుగా స్పష్టమయింది. ఆధ్యాత్మికతను, మనశ్శాంతిని సాధించడమెలా, ఇంకా ఆయన చెప్పినట్లుగాగా శిరస్సు,
హృదయం, చేతులు, నాలుక ఇలాంటి
ప్రాధమిక విషయాలమీద చాలా సేపు మాట్లాడారు.
షిరిడీ సాయిబాబాతో తనకు ఉన్న వ్యక్తిగత సంబంధం గురించి వర్ణించాలంటే
మాటలు చాలవని, షిరిడి సాయిబాబావారి ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నా కూడా సాధ్యం
కాదని అన్నారు. “మాటలు చాలవు” అని ఉన్నది
ఉన్నట్లుగా చెప్పారు. షిరిడిలొని గ్రామస్థులు కూడా ఆయన చెప్పినట్లుగానే చాలామంది చెప్పారు.
భక్తునికి కావలసినది ప్రధానంగా భక్తి, సర్వశ్యశరణాగతి అని స్వామి రామ్ బాబాగారు నొక్కి వక్కాణించారు. మన గురువు పట్ల, షిరిడి సాయి పట్ల మనం తప్పక ఆచరించవలసినవి ఇవే అత్యుత్తమమైన ప్రధానమయిన అంశాలని చెప్పారు.
ఆతరువాత స్వామి రామ్ బాబాగారు మరొక రెండు ప్రాధమిక అంశాలగురించి
చెప్పారు. అవే శ్రధ్ధ, సబూరి. నమ్మకము,
ఓర్పు ఈ రెండు గుణాలు చాలా ముఖ్యమయినవని అన్నారు.
తన అనుభవం ప్రకారం సర్వం సాయిబాబా అని, ఆయనే పరిపూర్ణమయిన భగవంతుడని కూడా అన్నారు. ఈ అవతారాలు భక్తునియొక్క హృదయంలో
లెక్కలేనన్ని అనుభూతులను పెంపొదిస్తాయి.
వారియొక్క కృపాదృష్టివల్లనే వారి బోధనలయొక్క వైభవం ఎటువంటిదో
తెలుసుకునే సామర్ధ్యం సాధకునిలో వృధ్ధి చెందుతుంది అని స్వామి రామ్ బాబా గారు చెప్పారు. సాయిబాబా, సత్యసాయిబాబా
లాంటి మహాత్ముల కృపాదృష్టి వల్లనే అని అన్నారు. ఆయన ఇంకా మరికొంతమంది ఆధ్యాత్మిక
మహాపురుషులయిన రమణమహర్షి, శివానంద, వీరి
గురించి కూడా చెప్పారు. తనకు వ్యక్తిగతంగా సాయిబాబా పది సంవత్సరాలనుండి తెలుసునని చెప్పారు.
గోవింద రఘునాధ్ ధబోల్కర్ అనే హేమాడ్ పంత్ గారు వ్రాసిన శ్రీసాయి
సత్ చరిత్రలో షిరిడీ సాయిబాబా గారి పూర్తి సందేశాలు, ఉపదేశాలు ఉన్నాయని స్వామి
రామ్ బాబాగారు అన్నారు. మరాఠీలో వ్రాయబడిన మూల గ్రంధాన్ని మాత్రమే చదవాలని, కారణమేమిటంటె
ఇతర భాషలలోకి చేసిన అనువాదాలు మూలమాతృకకు సరైన న్యాయం చేయవని అన్నారు. ఈ కార్యక్రమమంతా షిరిడీ సాయి ద్వారానే
జరిగిందని, హేమాడ్ పంత్ కేవలం ఒక నిర్వాహకుడు మాత్రమేనని అన్నారు.
నేను చేస్తున్న పరిశోధనకు స్వామి రామ్ బాబా నన్ను చాలా సార్లు
దీవించారు. నాపేరు అడిగి,
నా శిరస్సును స్పృశించి నన్ను దీవించారు. నాకు ప్రసాదం ఇచ్చారు. (ఆయన నాకు రెండు యాపిల్ పళ్ళు,
మధురమయిన పంచదార బిళ్ల ఇచ్చారు. నేను తిరిగి వెళ్ళేటప్పుడు వాటిని
తిన్నాను.)
స్వామి రామ్ బాబా గారి కళ్ళు చాలా తీక్షణంగా ఉంటాయి. ఆయన సమక్షంలో ఉన్నవారికి భగవంతునితో
చాలా దగ్గరగా ఉన్నామా అనే భావం కలుగుతుంది. ఇది యదార్ధం. సాయిబాబాతో తనకు ఉన్న వ్యక్తిగత అనుభవాలను
చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. “చెప్పడానికి మాటలు చాలవు” అని మాత్రమే అన్నారు. ఆయన అలా అంటున్నపుడు కళ్ళు మూసుకుని
ఒకవిధమయిన ఆత్మానందానుభూతిలో మునిగి మరలా అవే మాటలు “చెప్పడానికి
మాటలు చాలవు” అని, పదాలు భావాన్ని, సారాంశాన్ని నిర్వీర్యం చేసి తొలగిస్తాయి అని అన్నారు. షిరిడీ వెళ్ళినవారు షిరిడీ సాయిమీదనే
తమ దృష్టిని కేంద్రీకరించాలి. మసీదులోకి ప్రవేశించినంతనే ఆయన కళ్లలోకి
చూడాలి. అంతే తప్ప తన
చుట్టూ ఉన్న ఇతరుల గురించి గాని, శబ్దాల గురించి గాని మరే ఇతర
విషయాల గురించి గాని అస్సలు పట్టించుకోకూడదు. ఇవన్నీ కూడా మన మనస్సుని చెదరగొడుతూ
అడ్డంకులను సృష్టిస్తాయి. అందువల్ల వాటిని పట్టించుకోకుండా మన దృష్టిని, మనస్సును
సాయిబాబా మీదనే కేంద్రీకరించి ఆయన కళ్ళలోకే తదేకంగా చూస్తూ ఉండాలి. ఉదయాన్నే గం. 5.15 కి ఆయన దర్శనం చేసుకుని కాకడ ఆరతిలో పాల్గొనాలి. సమాధిమీద ఉన్న ఆయన రూపాన్ని మన మనస్సులో
ముద్రించుకోవాలి. ఇదే
నిజమయిన అనుభూతి. మిగతా
విషయాలన్నీ విడిచిపెట్టేయాలి.
(రేపటితో ముగింపు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment