16.04.2021
శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 69 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – బొంబాయి
బొంబాయి ---
ఆదివారమ్, అక్టోబరు, 27, 1985
స్వామి రామ్ బాబా గారి అపార్ట్ మెంట్ లో ఇంకా మరికొందరు ఉన్నారు. వారంతా స్వామి రామ్ బాబా గారి భక్తులని
నేను భావించాను. ఆయన గదిలో
గోడమీద షిరిడీసాయి ఇంకా అలాగే జీసస్ మరికొందరు యోగుల అనేక చిత్రపటాలు ఉన్నాయి.
ఆయన మాట్లాడే మాటలలో విశ్వవ్యాప్తమయిన దృష్టికోణం కనిపించింది. తత్త్వం అన్నది నిత్య సత్యం. దానికి మనం వివిధరకాలయిన,
వేర్వేరు పేర్లు, విభిన్నమయిన వివరణలు ఇస్తాము. వాస్తవానికి ఇది ఒక్కటే.
షిరిడీసాయి కూడా అందరి అవతారాలలాగానే అన్నిటినీ త్యజించినవారిలో ఒకరు. ఆయన తనలోని అహంకారాన్ని నిర్మూలింపచేసుకున్నారు. ఆకారణంగానే ఆయన అహంకార రహితునిగా పూర్తిస్థాయిలో జీవించారు.
“ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఆయన ఎక్కడికీ వెళ్లిపోలేదు. ఆయన మనతో కలిసి నిరంతరం మనతోపాటే
ఉన్నారు. నాతో ఉన్నారు. ఆయన గురించి మాట్లాడటమంటే ఆయన ఇక్కడే
ఉన్నారన్న యదార్ధాన్ని మరిచి తక్కువచేసి మాట్లాడటమే” అని అన్నారు.
స్వామిరామ్ బాబా గారి ఫోటోలను ఏమీ తీయలేకపోయాను. కనీసం ఒక్క ఫోటోనయినా తీసుకోమంటారా
అని అడిగాను. “దానికన్నా
నీహృదయంలోనే నారూపాన్ని ముద్రించుకో, అదే సరైన స్థానం”
అని సమాధానమిచ్చారు.
ఈ చిన్న సంఘటన నాకు, బి.వి.నరసింహస్వామిగారి పుస్తకం Sri Saibaba’s
Charters and Sayings, P.275 (Photographing
Baba) లో ప్రస్తావింపబడిన విషయం గుర్తుకు వచ్చింది. అందులో కొంతమంది యువకులు బాబాను ఫోటో
తీయదలచుకున్నపుడు సాయిబాబా కూడా అదేవిధమయిన సమాధానం ఇచ్చారు.
నాతోకూడా వచ్చిన హెచ్.జె. అగర్వాల్ గారు తను,
తన కుటుంబమంతా సత్యసాయిబాబాకు భక్తులమని చెప్పటంవల్ల స్వామిరామ్ బాబా
గారు భగవాన్ సత్యసాయిబాబా గురించి కూడా మాట్లాడారు. సత్యసాయిబాబాకు భక్తులనే విషయం తెలియడం
రామ్ బాబా గారికి సంతోషం కలిగించినట్లుంది. భగవాన్ సత్యసాయిబాబాను తాను ఒక అవతారపురుషునిగా
భావిస్తున్నానని అన్నారు. ఆయన నెలకొల్పిన సంస్థలు తననెంతగానో ముగ్ధుడిని చేసాయని అన్నారు. “సత్యసాయిబాబా పేదలకు తిండిపెట్టి
పాఠశాలలను స్థాపించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దారని అన్నారు. షిరిడీ సాయిబాబా మాదిరిగా ఇతర యోగులు
చెప్పినట్లుగానే సత్యసాయిబాబా చెప్పే విషయాలను కూడా శ్రధ్ధగా ఆయనముందు కూర్చుని ఆలకించాలి. వాటిని అర్ధం చేసుకోవాలి.”
ఇక మేము ఆయన వద్ద శలవు తీసుకుని వెళ్ళబోయేముందు “నేను నిన్ను దీవిస్తున్నాను.
నువ్వు పుట్టపర్తి వెడుతున్నావు కనుక స్వామిని అత్యంత సమీపంగా
ఉండి ఆ అనుభూతిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించు” అన్నారు.
సాయిబాబాతో అనుభవాలు అనిర్విచనీయమని, ఆయన దయవల్లనే ఆయన యొక్క దీవెనలు, బోధనలు, జ్ఞానం మనకు లభిస్తాయని అన్నారు.
ఎవరయినా సరే తన గురువుకు గాని, తను కొలిచే భగవంతునికి గాని అంకితమవాలనే ముఖ్యమయిన విషయాన్ని వివరించారు. మనలోనే ఉండే సద్గురువుయొక్క అంతర్వాణిని
మౌనంగా కూర్చుని ఏవిధంగా ఆలకించాలో నేర్చుకోవాలని అన్నారు.
అక్కడ సమావేశమయిన భక్తులలో ఒక భక్తుడు, ఎవరయినా తాను ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నట్లుగా ఏవిధంగా తెలుసుకోగలడని స్వామి
రామ్ బాబా గారిని ప్రశ్నించాడు. అపుడు రామ్ బాబాగారు , “నువ్వు ఆకలిగా ఎందుకని ఉన్నావని
ఒక వ్యక్తిని ప్రశ్నించడంలాంటిది” అన్నారు. ఆకలిగా ఉన్న వ్యక్తి తన ఆకలి తీర్చుకోవడానికి
తిండి తింటాడు. అది సహజం. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న
వ్యక్తికి కూడా ఆ ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవాలనే ఆతృత ఉంటుంది. అహంకారాన్ని తొలగించుకొని భగవంతునితో
ఏకమవ్వాలని ఆత్మసాక్షాత్కారం పొందాలని తహతహలాడుతూ ఉంటాడు. అపుడు ఆ పురుషునికి లేక స్త్రీకి భగవంతుని
గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస అనుకోకుండానే సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఈ కోరిక అనేది ఒక అరుదయిన పారితోషికమని
స్వామి రామ్ బాబా గారు అభివర్ణించారు.
బలదేవ్ గ్రిమే, అతని భార్య, షిరిడిలోని
పిల్ గ్రిమ్ ఇన్ హోటల్ మేనేజర్ వీరంతా తమ నమస్కారాలతో పంపించిన ఫోటోలను, ప్రసాదాన్ని స్వామి రామ్ బాబా గారికి అందజేసాను. వారు పంపించిన భహుమతి పాకేట్
ను ఇవ్వగానే ఆయన దానిని ముద్దుపెట్టుకుని ఎంతో భక్తితో తన హృదయానికి తాకించుకొన్నారు.
స్వామి రామ్ బాబాగారితో సమావేశం, ఆయనతో సంభాషణ ఈ అనుభూతి నాకు ఇచ్చిన ఒక గొప్ప ఆధ్యాత్మిక బహుమానం. నేను 1962 వ.సం.లో జన్మించినప్పటికి స్వామి రామ్ బాబాగారి వయస్సు దాదాపు వంద సంవత్సరాలు. ఆయనను కలుసుకోవడం మాట్లాడటం అంతా ఒక కలలాగా అనిపించింది. ఊహకందనిది. ఆయనతో మాట్లాడటం నాకు ఒక జ్ఞానబోదలాంటిది. ఒక యువకుని వదనంలా కనిపిస్తున్న ఈ వృధ్దుడిని నేనెప్పటికీ మర్చిపోలేను. ఆయన జ్ఞానానికి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా నేను మర్చిపోలేను.
( ఆ తరువాత ఆంటోనియో రిగో పౌలస్ గారు పట్టపర్తి వెళ్లిన విషయాలను,
భగవాన్ సత్యసాయిబాబా గురించిన వివరాలను అప్రస్తుతం కాబట్టి నేను ప్రస్తావించడం లేదు. త్యాగరాజు)
ఈ పరిశోధనా వ్యాసగ్రంధాన్ని సాయిభక్తులందరికీ నాచేత అందింపచేసిన మన సద్గురువు శ్రీ షిరిడీ సాయిబాబావారికి, అడిగిన వెంటనే తన సమ్మతిని తెలిపిన శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ (ఇటలీ) గారికి నా కృతజ్ఞతలను తెలుపుకొంటున్నాను.)
(సమాప్తం)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment