Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, October 24, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 43వ, భాగమ్ (2)

Posted by tyagaraju on 5:33 AM

 




24.10.2022 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

దీపావళి శుభాకాంక్షలు


శ్రీ సాయి దయా సాగరమ్ 43వ, భాగమ్ (2)

అధ్యాయమ్ – 41 (2)

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

సముద్రాలు దాటుకుని రా బాబా! - 2

(నిన్నటి భాగమ్ తరువాయి)

నాలుగయిదు రోజుల దాకా అంతా సవ్యంగానే జరిగింది.  అకస్మాత్తుగా లాప్రోస్కోపీ జరిగిన చోట చీము రావడం మొదలయింది.  విదేశాల్లో మనకి చిన్న క్లినిక్ లు కొద్దిపాటి దూరాలలో ఏమీ ఉండవు.  అరోగ్యపరంగా ఎటువంటి సమస్య వచ్చినా నేషనల్ హెల్త్ సర్వీసెస్ కి వెళ్లవలసిందే.  అక్కడికి అమ్మాయిని తీసుకువెళ్ళాను.  అక్కడి వైద్యుడు పుండు ఉన్న చోట నొక్కాడు.  అంతే ఇక చీము ఆగకుండా రావడం మొదలయింది.  నాకు చాలా భయం వేసింది.  కాని అంతకన్న మార్గం ఏమీ లేదు.  


మేము ఆస్పత్రికి వెళ్ళి అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించాము.  అక్కడి వైద్యులు పరీక్షించి ప్రక్కన ఇంకా చీము ఉండిపోవడం వల్ల ఆవిధంగా వస్తోందనే అభిప్రాయానికి వచ్చారు.  అక్కడి సీనియర్ నర్సు డ్రెస్సింగ్ ఎలా చేయాలో నాకు నేర్పి, ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పింది.  మేము ఇంటికి చేరుకున్నాక నేనే అమ్మాయికి ప్రతిరోజు కట్టుకట్టడం చేసాను.

అమ్మాయి రోజురోజుకు మెల్లగా కోలుకోసాగింది.  జూన్ నెల గడిచిపోయింది.  జూలై  ప్రవేశించింది.  మంచి వేసవికాలం రోజులు

ఒకరోజు అర్ధరాత్రివేళ నాకు మెలకువ వచ్చి చూస్తే మా అమ్మాయి అమృత మంచం మీద కూర్చుని ఉంది.  “ఏం జరిగింది, అలా కూర్చున్నావు?” అని అడిగాను.  “నాకు వెంట వెంటనే వాంతులు అవుతున్నాయి” అంది.  నాకు భయంవేసింది.  త్రాగడానికి చల్లటి మంచినీళ్ళు ఇచ్చాను.  తాగాక అవికూడా వాంతి అయిపోయాయి.  రాత్రంతా వాంతులు అవుతూ ఉండటంతో నిద్ర పోలేకపోయింది.  వారాంతపు రోజుల కారణంగా నేషనల్ హెల్త్ సర్వీసెస్ లో వైద్యసేవలు కూడా ఏమీ ఉండవు.  రోజంతా ఎలాగయితేనేమి అతి కష్టం మీద మంచినీళ్ళు మాత్రమే త్రాగుతూ గడిపింది.  అమ్మాయి ఆరోగ్యం కోసం సాయిని ప్రార్ధిస్తూ కూర్చున్నాను.

సోమవారం ఉదయమే అమ్మాయిని నేషనల్ హెల్త్ సర్వీసెస్ కి తీసుకు వెళ్లాను.  అదృష్టం  కొద్దీ అమ్మాయికి వైద్యం చేసిన వైద్యుడే ఉన్నాడు.  మళ్ళీ అన్ని పరీక్షలు చేసిన తరువాత వైద్యం చేయడానికి రైల్స్ ట్యూబ్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.  ఇక దాని ద్వారా వైద్యం మొదలుపెట్టారు.  ఇటువంటి అన్ని వైద్య విధానాలవల్ల అమృత చాలా బలహీనురాలయింది.  నాకు మనస్సు దుర్బలమయి చాలా దిగులు ఆవహించింది.  ఏమి జరుగుతోందో, ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇది భారతదేశం కాదు.  వైద్యులందరూ చర్చించుకునేదేమిటో నాకేమీ అర్ధం కావటంలేదు.  పరిస్థితిని గమనిస్తూ ఉంటే మరుసటి రోజు సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించుకున్నట్లుగా నాకు అర్ధమయింది.  నాకు భాగా భయంవేసి సాయిని ప్రార్ధిస్తూ సాయినామస్మరణ చేస్తూ ఉన్నాను.  నేను సాయితో “బాబా సముద్రాలు దాటుకుని ఇక్కడికి వచ్చి మా అమ్మాయిని కాపాడు” అని వేడుకున్నాను.

బాబా ఎటువంటి అడ్డంకులు లేకుండా తిన్నగా ఆస్పత్రి గది గుమ్మంలోనుండి లోపలికి వచ్చి అమృత నుదుటి  మీద తన అమృత హస్తాన్ని ఉంచినట్లుగా కనిపించింది నాకు.  అదే సమయంలో నేను, అమృత ఇద్దరం కళ్ళు తెరిచాము.  మా ఇద్దరికీ మా శరీరాలలో ఒక్క కుదుపు కలిగినట్లుగా భావన.  అప్పుడు నేను అమృతతో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇపుడు నీకు నయమవుతుంది.  ఎటువంటి బెంగ పెట్టుకోకు అన్నాను.  అపుడు మధ్యాహ్నం 3 – 3.30 అయింది.  నాలుగు గంటలకి గదిలోకి ఒక వ్యక్తి వచ్చాడు. అయన సర్జన్.  ఆయన మరాఠీలో మాట్లాడటం మాకు కాస్త ఉపశమనాన్ని కల్గించింది..

ఆయన మా అమ్మాయి పరిస్థితి గురించి వివరించారు.  తను ద్రవరూపంలో ఉన్న మందును అమ్మాయికి ముక్కులో పెట్టిన గొట్టం ద్వారా ఇస్తానని అన్నారు.  ఫలితం కోసం కాస్త వేచి చూడమని అన్నారు.  ఆయన చెప్పినట్లుగానే మందును ముక్కుకి ఉన్న గొట్టంద్వారా ఇచ్చారు.  రాత్రి 8 గంటలకు అమృత వాష్ రూం కి వెళ్ళాలంది. అమ్మాయిని వాష్ రూమ్ కి తీసుకువెళ్లాను.  మోషన్ అవగానే ఆతరువాత తనకి బాగా నెమ్మదించినట్లు చెప్పింది.

ఇక ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఉందామని అంది.  మరునాడు తను క్రిందటి  రోజుకన్నా మంచి ఆరోగ్యంగా ఉంది.  ఆమెకు చేయవలసిన సర్జరీని కూడా ఆపేశారు.  మేము ఇంటికి వచ్చి హాయిగా ఊపిరి పీల్చుకున్నాము.  బాబా తప్ప మరెవరూ మా అమ్మాయిని కాపాడల్లేదనే విషయం మాకు బాగా తెలుసు.  బాబా సముద్రాలు దాటుకుని వచ్చి మా అమ్మాయిని రక్షించారు.

నీలం వరద్కార్

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List