24.12.2022 శనివారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర –6 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
(సాయిభక్తులు తరువాతి భాగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు. కాని ప్రచురించిన వాటిని బాగా చదివి జీర్ణించుకునేందుకు తగిన సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వారానికి రెండు మూడు సార్లు ప్రచురిస్తూ ఉన్నాను. మిగతా రోజులలో శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేస్తూ ఇందులోని విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకుంటే బాబా తత్త్వం పూర్తిగా గ్రహించుకోగలరు....త్యాగరాజు)
శీమద్భగవద్గీత – అధ్యాయమ్ 4 శ్లోకమ్
34
జ్ణాన – కర్మ – సన్న్యాస యోగము
తద్విధ్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ణానం జ్ణానినస్తత్త్వ
దర్శినః
నీవు తత్త్వమును దర్శించిన జ్ణానులకడకేగి,
ఆ జ్ణానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామముల
నాచరించుటవలనను, సేవలొనర్చుట వలనను, కపటము లేకుండా భక్తిశ్రధ్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట
వలనను పరమాత్మ తత్త్వమును చక్కగా నెఱింగిన జ్ణానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్త్వమును
ఉపదేశించెదరు.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 39
పైన ఇవ్వబడిన శ్లోకానికి బాబా చెప్పిన
అర్ధము.
బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని
అర్ధమును నానా సాహెబ్ చందోర్కర్ కు బోధించి ఆశ్చర్యమును కలుగజేశారు. నానా సాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగుగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున
తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకు
ఈ విషయము గాని, సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. ఒకరోజు నానా సాహెబ్ చందోర్కర్ బాబా కాళ్ళను ఒత్తుచూ
తనలో తాను పై శ్లోకాన్ని మననము చేసుకొంటున్నాడు.
బాబా అతనిని ఏమి గొణుగుచున్నావు అని అడుగగా తాను చదువుతున్న శ్లోకాన్ని చెప్పాడు. కాని అతను ఆ శ్లోకానికి తగ్గ అర్ధాన్ని చెప్పడంలో
విపలమయ్యాడు.
(నేను ఇక్కడ పూర్తి సమాచారాన్ని, అనగా
ఇద్దరిమధ్య జరిగిన సంభాషణను ఇవ్వడంలేదు. కారణం
శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేసిన సాయిభక్తులందరికీ తెలిసినదే కనుక)
ఇక్కడ బాబా చెప్పిన శ్లోకానికి వ్యాఖ్యానము.
1.
జ్ణానుల ముందు ఉత్త సాషాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువుకు సర్వశ్య శరణాగతి చేయవలెను.
2. ఊరికే ప్రశ్నించుట చాలదు. దుర్భుధ్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకు గాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికిమాలిన ఆసక్తితో గాని అడుగకూడదు. నిజముగా తెలిసికొని దానిచే మోక్షమును పొందుటకు గాని, ఆధ్యాత్మాకాభివృధ్ధికి గాని అడుగవలెను.
3.
సేవయనగా
ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు
శరీరము గురువుగారిదనియు, వారి సేవకొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ణానమును
బోధించును.
ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తాను.
పై శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ
జ్ణానులకడకేగి ఆ జ్ణానమును గ్రహింపుము అన్నారు.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్
30 ఒక సారి గుర్తుకు తెచ్చుకుందాము.
నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలయ్యి మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యాడు. ఆ పరిస్థితులలో ఒకరోజు సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళననుండి కాపాడుమని హృదయపూర్వకముగా దేవతను వేడుకొన్నాడు. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నములో దర్శనమిచ్చి,
“బాబా వద్దకు పొమ్ము. నీ మనస్సు శాంతి వహించును” అనెను. ఈ బాబా ఎవరో దేవతను అడిగి తెలుసుకోవాలనుకునేలోపునే మెలకువ వచ్చేసింది. ఈ బాబా ఎవరా అని యోచించి బహుశ త్ర్యంబకేశ్వరుడు (శివుడు) అని భావించుకుని పుణ్యస్థలమయిన త్ర్యంబకమునకు వెళ్ళాడు. అక్కడ పదిరోజులు ఉన్నాడు. అక్కడున్నంతకాలము వేకువ ఝామున స్నానము చేసి, రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించాడు. అయినప్పటికి అతనికి అశాంతి తొలగలేదు. మరలా స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను మరలా వేడుకొన్నాడు. ఆరాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఈ విధంగా చెప్పింది. “అనవసరముగా త్ర్యంబకేశ్వరమునకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడి సాయిబాబా” అని నా అభిప్రాయము అని తెలిపింది.
(దేవతే స్వయంగా కాకాజీ వైద్యను బాబా దగ్గరకు వెళ్లమనడంలో ఆంతర్యమేమిటి?
భగవద్గీత పై శ్లోకానికి దీనికి ఉన్న సంబంధం తరువాయి భాగంలో)
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment