31.05.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీస్సులు
సాయి నీకు ఋణపడిఉంటారు
ఈ రోజు మనము నవీన్ గారి బాబా లీలను తెలుసుకుందాము. ఈ లీల యింతకు ముందు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి బ్లాగులో ప్రచురింపబడినది. ఈ రోజు మనము సాయి అంటే అసలు తెలియని వ్యక్తిని బాబా తన వద్దకు యెలా రప్పించుకున్నారో, యెటువంటి అనుభవాన్ని కలిగించారో నవీన్ గారి మాటల ద్వారా తెలుసుకుందాము.
నాపేరు నవీన్. నేను నార్వే లో 40 సంవత్సరాలుగా ఉంటున్నాను. నేను భారతదేశానికి రావడం చాలా తక్కువ. అదీ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, వచ్చి ఒక వారం ఉంటాను. నాకెప్పుడూ సాయిబాబా గురించి తెలియదు యెందుకంటే నేను స్వదేశం నుంచి దూరంగా ఉన్నాను కాబట్టి. బాబా మహిమల గురించి తెలియనందుకు నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ఒకరోజున నార్వేలో నా స్నేహితుడి యింటికి రాత్రి భోజనాని కి వెళ్ళాను. నా స్నేహితుడు భారతీయుడు. అతను అతని భార్య భారతదేశం వెడదామనుకుంటున్నారు, షిరిడీ కూడా దర్శిద్దామనుకుంటున్నారు. షిరిడిలో యేముంది అదేమన్న విహార యాత్రా స్థలమా అని అడిగాను. ఆరోజున వారు సాయిబాబా గురించి, షిరిడీ గురించి చెప్పారు. నా స్నేహితుని భార్య తనకు కలిగిన 20 అనుభవాలని వివరించి చెప్పింది, అవన్ని కూడా హృదయానికి హత్తుకున్నాయి, నాకేమయిందో తెలియదు, కాని ఈసారి భారతదేశం వెళ్ళినప్పుడు మాత్రం షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నేను యింటికి వచ్చాను కాని నిద్ర పట్టలేదు. ఆమె చెప్పిన బాబా అనుభవాలన్నిటిని తిరిగి గుర్తు తెచ్చుకుంటున్నాను. అప్పుడు రాత్రి 2.30 అయింది, నిద్ర పోలేకపోయాను. వెంటనే లేచి నెట్ ముందు కూర్చుని, షిరిడీ సాయిబాబా గురించి సమాచారాన్ని వెతకడం మొదలుపెట్టాను. నాకు వందల కొద్దీ సైట్లు కనిపించాయి , బాబా గురించి పూర్తి సమాచారాన్నంతా చదవగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను సమయం చూశాను అప్పుడు ఉదయం 10.45 అయింది. ఓహ్...ఆరోజున నేను ఆఫీసుకు కూడా వెళ్ళదలచుకోలేదు. సోదరి, ప్రియాంకా సమయం యెలా గడిచిందో కూడా గమనించలేదు నేను. యేమైనప్పటికీ నేను మా ఆఫీసు వాళ్ళకి ఫోన్ చేసి నాకు వంట్లో బాగుండలేదు నాకు సెలవు కావాలని చెప్పాను. ఈ ఫోన్ చేసిన తరువాత నేను గాఢంగా నిద్ర పోయాను. నిద్రలో బాబా వారి బ్రహ్మాండమైన దర్శనం అయింది, బాబా వారు తనే నాకు షిరిడీ చూపించారు. నేను లేచిన తరువాత నా ఆనందానికి అవథులు లేవు, షిరిడీ వాళ్ళాలి అనే పిచ్చిలో పడిపోయాను. రిజర్వేషన్స్ చేసుకుని వారం తరువాత షిరిడీలో అడుగు పెట్టాను. ప్రతీదీ కూడా చాలా వేగంగా జరిగిపోయాయి. బాబా నన్ను అంత వేగంగా తనవద్దకు దగ్గరగా నన్ను లాక్కోవడం అదింకా రహస్యం. 2008 డిసెంబరు 2 న నేను షిరిడీలో ఉన్నాను. నేను షిరిడీ వెళ్ళగానే చాలా సంతోషించాను యెందుకంటే బాబా నాకు యింతకుముందే ఈ ప్రదేశాన్ని నాకు కలలో చూపించారు. నేను సమాథి మందిరంవైపు నడుస్తూండగా ఒక ఫకీర్ నావద్దకు వచ్చ్చి ఇలా అన్నాడు "బేటా నాకు ఆకలిగా ఉంది, నాకేమన్న కొంత ఆహారం ఇవ్వగలవా" నేనతనితో, "బాబా ఈ డబ్బు తీసుకో నీకేది తినాలనిపిస్తే అది తిను" అని అతనికి 500 రూపాయలు ఇచ్చాను. ఫకీర్ బాబా నన్ను మనస్ఫూర్తి గా దీవించి ఇలా అన్నాడు "మేరా సాయి తుఝే యె పైసా దోగ్నా కర్కే దేగా తూనే ఇసే ఫకీర్కా పేట్ భరా హై జీతే రహో బేటా". నాకు చాలా ఆనందం వేసి మరలా సమాథి మందిరంవైపు నడవడం మొదలుపెట్టాను. సమాథి మందిరం చేరుకున్నాను, బాబా దయ వల్ల బొంబాయిలో ఉండే నా మితృడి ద్వారా నాకు వీ ఐ పీ పాస్ లభించింది. సాయంత్రం 5.20 కి నేను సమాథి మందిరంలోకి అడుగు పెడుతున్నాను, కాని లోపలికి అడుగుపెడుతున్నప్పుడు సమాథిమందిరంలో నేలమీద 1000 రూపాయల నోటు కనపడింది. ఆ నోటు తీసుకుని యెవరైనా బీదవానికి దానం చేద్దామని నా వద్ద ఉంచుకున్నాను. తరువాత నేను శేజ్ హారతికి పూర్తిగా ఉన్నాను. బాబా దర్శనం చాలా బాగా జరిగింది నాకు చాలా తృప్తిగా ఉంది. కాని నేనింకా ఆశ్చర్యపోతూ ఉంటాను, అక్కడంతమంది భక్తులు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా ఆ 1000 రూపాయలనోటు నాకే యెందుకు కనిపించిందా అని. అవును, నేను ప్రత్యేకత పొందినవాడిగా భావించుకున్నాను. సమాథి మందిరానికి వచ్చేముందు నాకు కనపడిన ఆఫకీర్ యొక్క ఆశీర్వాదమే అని గ్రహించుకున్నాను. సాయి బాబా నేనిచ్చినదానికి రెట్టింపుచేసి తిరిగి ఇచ్చారని ఋజువయింది. నేను ఆబాబా కి 500/- ఇచ్చాను, సాయి నాకు 1000/- ఇచ్చారు... ఇది ఒక అద్భుతమైన లీల కాదూ...? మరునాడు నేను అదే ఫకీర్ బాబా మరలా కనిపిస్తాడేమోనని నా గది నుంచి బయటకి వచ్చి చూశాను, కాని యెక్కడా కనపడలేదు. బాబాయే స్వయమగా నన్ను కలిశారని గ్రహించుకున్నాను. నేను తిరిగి నార్వే వెళ్ళి నాకు బాబా ని పరిచయం చేసిన నా మితృడికి నాకు జరిగిన ఈ అనుభవాన్నంతా వివరంగా చెప్పాను. నాకు కలిగిన ఈ అనుభూతిని మిగతా భక్తులందరితోనూ పంచుకోవాలనుకున్నాను, కాని యెలా? .... తెలియదు. నిన్న నెట్ ముందు కూర్చున్నప్పుడు అనుకోకుండా అద్భుతమైన సాయి లీలలతో నిండినా మీ బ్లాగు చూడటం తటస్థించింది. ఇకముందు కూడా షిరిడీలో కలిగిన యింకా నా అనుభావాలని మీకు పంపిస్తాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment