29.06.2011 బుథవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయి నమ్మకం బాంక్ లో మీ ఖాతాని తెరవండి -- అత్యథికమైన లాభాలు ఖచ్చితం -- అమిత్
ఈ రోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి ఆంగ్ల బ్లాగునుండి అమిత్ గారు పంపిన లీలను తెలుసుకుందాము.
*********
నేను ప్రచురించే లీలన్నిటిని పాఠకులందరూ మెచ్చుకుంటున్నందుకూ వారిలో యింకా నమ్మకాన్ని పెంచుకోవడానికి దోహద పడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రచురించే ప్రతీ దాని వెనుక ఉన్న ప్రేరణ యేమిటంటే నమ్మకం సడలిపోతున్నవారిలో, ఆయన మహిమలను తెలిపి వారిలో నమ్మకాన్ని పెంపొందించడమే. యెప్పుడూ గుర్తుంచుకోండి, నమ్మకమే మీ థనం. ఈ థనాన్ని మీ హృదయమనే బాంక్ లో దాచుకోవడానికి బాగా శ్రమించండి. నమ్మండి ఈ ప్రత్యేకమైన బాంక్ మీకు అథికమైన వడ్డీనిస్తుంది.
నమ్మకం లో అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయి. మీరు నమ్మకం ఉంచుకుంటే సాయి మీకు అద్భుతాన్ని చూపిస్తారు.
ఆ అద్భుతం మీలో నమ్మకాన్ని మరింత పెరిగేలా చేస్తుంది. చివరికి ఆ నమ్మకమే మీ జీవితాన్ని అద్భుతంగా సుందరంగానూ, శక్తివంతంగానూ చేస్తుంది.
దానికి దృష్టాంతమే సోదరుడు అమిత్ ది. అతని నమ్మకం వలననే సాయి అతనికి సాయి దేవా చూపించిన యెన్నో అద్భుతమైన లీలలని చవి చూశారు. దీనిని చదవండి, నమ్మకంలోని గాఢతని శక్తిని మీరుకూడా అనుభవించండి. యిటువంటి నిజమైన అనుభూతిని మాతో పంచుకుంటున్నందుకు అమిత్ గారూ మీకు థన్యవాదాలు.
భక్తుల బాబా అనుభూతులని, లీలలని ప్రచురిస్తూ మీరు వారికి యెంతో అద్భుతమైన పని చేస్తున్నారు. ఇది మాకు బాబా యొక్క సం రక్షణని, దయని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. మాలో నమ్మకాన్ని పెంచి సరియన మార్గంలోఉంచుతుంది. దయచేసి నేను పంపే ఈ లీలని కూడా ప్రచురించండి.
సాయి బాబా వారికి కోటి కోటి ప్రణామములు. 2009 సంవత్సరం మొదటి అర్థభాగంలో, నేను నా ఉద్యోగంలో చాలా సమస్యలేనుదుర్కొంటున్నాను. నేను చాలా చురుగ్గ ఉద్యోగం కోసం చూస్తున్నాను. బాబా దయ వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది. రెసెషన్ కాలంలో సాథ్యం కాని, క్రితంసారి చేసిన ఉద్యోగంలోని జీతం కంటే 15% యెక్కువతో వచ్చింది. ఈ కష్ట కాలంలో నేను 9 గురువారాల సాయి వ్రతం చేశాను. ఇంకా నేను నెట్ లొ సాయి భక్తుల అనుభవాలని కూడా చదువుతున్నాను. అప్పుడప్పుడు బాబా ని ప్రశ్నలు/సలహాలు అడుగుతూ ఉండేవాణ్ణి. ( www.shirdi-sai-baba.com ) ఒక రోజున నేను బాబాని సలహా అడిగాను. నాకు లభించిన సమాథానం, గురుపూర్ణిమనాడు, (7 జూలై) ఒక రుపంలో బాబా దర్శనం అవుతుంది రాత్రి 9 గంటలకి గమనించు .
ప్రతీ గురువారమునాడు నేను షిరిడీ సాయి బాబా గుడికి వెడుతూ ఉంటాను. గురుపూర్ణిమనాడు ఖచ్చితంగా బాబా గుడికి వెళ్ళాలని అనుకున్నాను. ప్రతీ గురువారమునాడు, సింగపూర్ సాయి గుడిలో రాత్రి 8.30 ఆరతి ఉంటుంది. ఆరతి 8.45 కి పూర్తి అవుతుంది. తరువాత రెండవ అంతస్తులో ప్రసాదం పంచుతారు. ప్రసాదం పంచుతున్నప్పుడు సాథారణంగా నేను కూడా జాయిన్ అవుతూ ఉంటాను. రాత్రి 9 గంటలకి బాబా దర్శనం అవుతుందని సమథానం వచ్చింది. నేను చాలా ఆత్రుతగా ఉన్నాను, యెందుకంటే ప్రసాదం పంచుతున్న రెండవ అంతస్తులో బాబా ఫొటొగాని, విగ్రహం గాని లేదు. ప్రసాదం పంచడం పూర్తి అయ్యేటప్పటికి రాత్రి 9.30 అవుతుంది.
అందుచేత 9 గంటలకి యెలా సాథ్యమవుతుందా అని ఆలోచిస్తున్నాను. బాబా, కనీసం నిన్ను గుర్తించేలా చేయమని బాబాని ప్రార్థించాను.
గురుపూర్ణిమ రోజు వచ్చింది, నేను బాబా గుడికి వెళ్ళాను. ఆరతి పూర్తి అయిన తరువాత రెండవ అంతస్తులో 8.45 కి ప్రసాదాలు పంచడం మొదలయింది. రెండవ అంతస్తులో నేను అక్కడ, ఇక్కడ బాబా దర్శనం కోసం (ఫోటో/విగ్రహం) చూడ సాగాను. కానీ నాకేమీ కనపడలేదు, ఇక ఆ విషయం మరచిపోయి ప్రసాదాలు పంచడంలో నిమగ్నమయ్యాను. తరువాత నాకు మళ్ళి గుర్తుకు వచ్చి, నా వాచీలో సమయం చూసుకున్నాను. అప్పుడు రాత్రి 9 గంటలు అయింది. యేమీ జరగలేదు, తరువాత 9.05 అయింది అలా సమయం గడిచిపోయింది. హటాత్తుగా నేను నా ముందు పైజామా/కుర్తా లో ఉన్న వ్యక్తిని మెడలో బాబా లాకెట్ తో ఉండటం చూశాను. కుర్తా మెడ పెద్దది కాదు. అయినప్పటికి మెలికపడి లాకెట్ బయటికి వేళ్ళాడుతూ స్పష్టంగా కనపడుతోంది. లాకెట్లో బాబా రెండు చేతులతో దీవిస్తున్నట్లుగా ఉండటం నా కింకా గుర్తుంది. నేనా వ్యక్తికి ప్రసాదం ఇచ్చి, వెంటనే నా చేతి గడియారంలో సమయం చూసుకున్నాను. అప్పుడు 9.11 అయింది. నేను చాలా సంతోషించాను, కాని ఉత్తేజం కలగలేదు (ఇది యేదో కాకతాళీయంగా జరిగి ఉంటుందనుకున్నాను) యెందుకంటే బాబా 9 గంటలకి దర్శనం ఇస్తానన్నారు, కాని సమయం 9.11 అయింది.
తరువాత నేను గుడినించి, మా యింటికి వెళ్ళడానికి లొకల్ ట్రైన్ స్టేషన్ కి వచ్చాను. ప్లాట్ ఫారం మీద వేచి చూస్తూ రైలు వచ్చే సమయం కోసం డిస్ ప్లే బోర్డ్ వైపు చూస్తున్నాను .
ఓ మై గాడ్ చాలా ఆశ్చర్యం..నా వాచీలో సమయం 11 నిమిషాలు యెక్కువ చూపిస్తోంది. బాబా గారు సరిగా 9 గంటలకి దర్శనం ఇచ్చారు, కాని నేను గమనించలేకపోయాను. బాబా యెప్పుడూ దయతో ఉంటారు, తన మాట నిలబెట్టుకుంటారు. సచ్చరిత్రలో బాబా చెప్పిన విషయాలను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను అసత్యమాడను, మీరు నమ్మకం, ఓర్పుతో ఉండండి.
అమిత్ .. సింగపూర్.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment