30.11.2011 బుధవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 రెండవభాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ 1993 రెండవ భాగము
02.02.1993 మంగళవారము
నిన్న రాత్రి కలలో శ్రీ సాయి వృధ్ధ వైద్యుని రూపములో రోగుల సేవ చేస్తున్న దృశ్యము ప్రసాదించినారు. ఆయన దగ్గర నర్సులు రోగుల బొటన వ్రేలికి యింజక్షన్ ఇస్తున్నారు. నా భార్యకూడ ఆ నర్సులతో చేరి అనారోగ్యముతో ఉన్న వారి బొటన వ్రేలికి యింజక్షన్ ఇస్తున్నది. నేను ఒక గదిలో కూర్చుని సాయి సందేశాలు పుస్తక రూపములో వ్రాస్తున్నాను. నా చేతి వేళ్ళకు కన్నాలు పడిపోయినాయి. రక్తము కారటము లేదు. ఆ ముసలి డాక్టరు నా చేతులు పట్టుకొని నిమురుతున్నారు. నేను ఆయన పాదాలకు నమస్కరించుతున్నాను. ఆయన నాపాదాలు మాలీషు చేస్థున్నారు. నేను అలాగ చేయవద్దు అన్నాను. ఆయన పరవాలేదు అన్నారు. యింతలో మెలుకువవచ్చినది. ఈ విధమైన కలరావటము శ్రీ సాయి సత్ చరిత్రలో 7 వ. అధ్యాయములో "తొలి దినములలో బాబా తెల్లపాగ, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించువారు. మొదట గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేవారు. వారి చేతితో నిచ్చిన మందులు పని చేయుచుండెడివి.. మంచి హస్త వాసిగల డాక్టరని పేరు వచ్చెను." అనే మాటలు మరియు 27 వ. అధ్యాయములో శ్రీ దాదా సాహేబు ఖాపర్డే భార్య శ్రీ సాయి పాదాలను తోముచున్నపుడు శ్రీ సాయి ఆమె చేతులను తోముట ప్రారంచించటము గురు శిష్యులు ఒకరికొకరు సేవ చేసుకొనుచున్నారు అని శ్యామ అనటము జ్ఞాపకానికి వచ్చినవి.
04.02.1993 గురువారము
నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయి ఏకాలము నాటివారు? వారి అసలు రూపము ఏమిటి? అనే పరి పరి ఆలోచనలతో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. రాత్రి కలలో నేను చూసిన దృశ్యము - అది నిర్మలమైన ఆకాశము అక్కడ మేఘాలు లేవు, నక్షత్రాలు లేవు. సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. అంతా కాంతివంతమైన విశ్వము. నా కన్నులతో ఆకాంతిని చూడలేకపోతున్నాను. ఒక్కసారి ఉలిక్కిపడి లేచినాను. శ్రీ సాయి అసలు రూపాన్ని నేను చూడలేని స్థితిలో ఉన్నాను అనే బాధ నన్ను వేధించసాగినది. తిరిగి శ్రీ సాయి పటానికి నమస్కరించి సాయినాధా నేను అర్థము చేసుకోగల స్థితిలో నీ అసలు రూపాన్ని చూపించు తండ్రీ అని వేడుకొని నిద్రపోయినాను. ఈ సారి శ్రీ సాయి చూపిన దృశ్యము నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినది. శ్రీ సాయి నాకు జన్మ యిచ్చిన నా తల్లి రూపములో దర్శనము యిచ్చినారు. నా తల్లి రూపములో ఉన్న శ్రీ సాయి పాదాలకు నమస్కారము చేసినాను. నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఈ కలలోని దృశ్యాలను తలచుకొంటుయుంటే 28 వ. అధ్యాయములో శ్రీ సాయి మేఘశ్యాముని ఉద్దేశించి అన్న మాటలు " ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరములేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను." గుర్తుకు వచ్చినవి. కాంతివంతమైన ఈ విశ్వము అంత శ్రీ సాయి రూపము అని నేను గట్టిగా నమ్ముతాను. మరి శ్రీ సాయి నా తల్లి రూపములో దర్శనము యిచ్చి నీకు జన్మ యిచ్చిన మాతృమూర్తిని నేను" అని అన్నారు. అది నా అదృష్టము.
20.02.1993 శనివారము
నిన్నటి రోజున నా గత జీవితములో నాతో శారీరిక సంబంధము కలిగిన పర స్త్రీలు తమతో స్నేహము కొనసాగించమని ఆహ్వానము పంపినారు. మనసు చలించినది. శ్రీ సాయి తత్వములో పరస్త్రీ వ్యామోహము మహాపాపము. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి యిటువంటి పాపపు ఆలోచనలనుండి నన్ను దూరముగా ఉంచమని నా తప్పులను క్షమించమని వేడుకొన్నాను. శ్రీ సాయి దయామయుడు. నాలోని పరస్త్రీ వ్యామోహము ఎంతటి ఘోర పరిణామాలకు దారి తీస్తుంది చూపించి, నాలో మార్పు కలిగించినారు. వాటి వివరాలు. నేను మా ఫ్యాక్టరీలోని పెద్ద కొలిమి దగ్గర నిలబడినాను. ఆ కొలిమిలో 1100 డిగ్రీల సెంటీ గ్రేడ్ వేడి ఉంది. భయంకరమైన మంటలు యున్నాయి. ఆ మంటలు నీలి రంగులో అందముగా యున్నాయి.
ఆ అందమును చూచి ఆ నీలి రంగు మంటలో చేయి పెట్టినాను. చేయి కాలిన బాధతో ఆ కొలిమి (ఫర్నేసు) దగ్గర మలమూత్ర విసర్జన చేసినాను. యింతలో శ్రీ సాయి శ్రీ సాంబశివరావు అనే కార్మికుడు రూపములో వచ్చి మీరు పెద్దవారు ఆన్నీ తెలిసినవారు, మంటలో చేయి పెట్టవచ్చా అని అడిగి నా చేతికి ఓ చీపురు కట్ట ఇచ్చి మీరు విసర్జించిన మలమూత్రాలను శుభ్రముగా కడిగి వాటిని దూరముగా పారవేయండి అన్నారు. ఈ విధమైన దృశ్యము కలలో చూసి ఉలిక్కిపడి నిద్రనుండి లేచినాను పరస్త్రీ వ్యామోహము భయంకరమైన వేడి కలిగిన కొలిమిలాంటిది. ఆ కొలిమి (ఫర్నేసు) లో చేయి పెట్టితే చేయి కాలినది. చేయికాలిన తర్వాత పరస్త్రీ వ్యామోహము మల, మూత్రముల రూపములో విసర్జించబడినది. వాటిని శుభ్రము చేసుకొని జీవితములో తిరిగి పరస్త్రీ వ్యామోహము గురించి ఆలోచించరాదని నిశ్చయించుకొన్నాను. శ్రీ సాయి సత్ చరిత్రలో 14 వ. అధ్యాయములో "మనపారమార్ధికమునకు ఆటంకములు రెండు గలవు. మొదటిది పరస్త్రీ. రెండవది ధనము. పరస్త్రీ వ్యామోహము ఉన్నది లేనిది తెలుసుకొనేందుకు శ్రీ సాయి తమ భక్తులను "బడికి" (రాధాకృష్ణమాయి గృహమునకు) పంపేవారు. ధనముపై వ్యామోహము ఉన్నది లేనిది తెలుసుకొనేందుకు దక్షిణగా ధనమును అడిగి పుచ్చుకొనేవారు. అనేది నిజము అని నమ్ముతాను.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment