10.12.2011 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాసీస్సులు
ఈ రోజు నేటికి అనగా డిసెంబరు, 10, 2011 బాబావారి 72 గంటల సమాధి జరిగి 125 సంవత్సరములు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని, శ్రీ సాయి సత్ చ్ళరిత్రలోని 43, 44 అధ్యాయాలను మరొక్కసారి మననం చేసుకుందాము.
ఇటుకరాయి విరుగుట
బాబా భౌతికశరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకున మయ్యెను. మసీదులో ఒక పాత యిటుక యుండెను. బాబా దానిపై చేయివేసి యానుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని యాసనస్థులగు చుండిరి. అనేక సంవత్సరము లిట్లు గడచెను. ఒకనాడు, బాబా మసీదులో లేనప్పుడు, ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు, దానిని చేతితో పట్టుకొనియుండగా అది చెతినుండి జారి క్రిందపడి రెండుముక్కలయి పోయెను. ఈ సంగతి బాబాకు తెలియగనే వారు మిగుల చింతించి యిట్లని యేడ్చిరి. "ఇటుక కాదు, నా యదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయమువలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో, దానియందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడచినది." ఎవరైన ఒక ప్రశ్న నడుగవచ్చును. "బాబా నిర్జీవియగు ఇటుకకోసమింత విచారపడనేల?" అందులకు హేమడ్ పంతు ఇట్లు సమాధాన మిచ్చెను. "యోగులు బీదవారికి, నిస్సహాయులకు సహాయముచేయుటకై యవతరించెదరు. వారు ప్రజలతో కలసి మసలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధచైతన్యులయి వారి కర్తవ్యవిధుల నెరుగుదురు”.
72 గంటల సమాధి
ఇటుక విరుగుటకు 32 సంపత్సరములకు పూర్వమందు అనగా, 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిరపౌర్ణమి నాడు బాబా ఊబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి దీసికొనిపోయి సమాధిలో నుంచవలెననుకొని, భక్త మహళ్సాపతితో నిట్లనిరి. "నా శరీరమును మూడు రోజులవరకు కాపాడుము. నేను తిరిగి పచ్చినట్లయిన సరే, లేనియెడెల నా శరీరము నెదురుగా నున్న ఖాళి స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము" అని స్థలమును జూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడికూడ ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరివారందరచ్చట చేరి న్యాయవిచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహళ్సాపతి యడ్డగించెను. తన తొడపై బాబా శరీరము నుంచుకొని మూడురొజూలట్లే కాపాడుచు కూర్చుండెను.
3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు గనిపించెను. ఊపిరి ఆడ నారంభించెను. కడపు కదలెను, కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను.
దీనినిబట్టి చదువరు లాలోచించవలసిన విషయమేమన బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీర మశాశ్వతము గాని, లోనున్న యాత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధసత్తాయే బ్రహ్మము, అదియే పంచేంద్రియములను, మనస్సును స్వాధీనమందుంచుకొనునది, పరిపాలించునది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువు లన్నిటి యందు వ్యాపించి యున్నది. అది లేనిస్థలము లేదు. అది తాను సంకల్పించు కొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతికశరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట, శరీరమును విడిచెను. సాయి యెల్లప్పుడు ఉండు వారు. అట్లనే పూర్వము గాణ్గాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు. వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని, సమస్తచేతనాచేతనములందు గూడ నుండి వానిని నియమించువారును, పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్యశరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగ భక్తితో
పూజించువారికిని అనుభవనీయమయిన సంగతి.
ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికిని, మనము షిరిడీకి వెళ్ళినచో, వారి జీవిత మెత్తుపటము మసీదులో నున్నది. దీనిని శ్యామారావు జయకర్ యను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడూ నైన ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతికశరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతికశరీరము లేనప్పిటికి వారక్కడనేకాక ప్రతి చోటున నివసించుచు పూర్వమువలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబావంటి యోగులు ఎన్నడు మరణించరు. వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment