16.12.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993, 11 వ భాగాన్ని చదువుకుందాము
16.08.1993 శుక్రవారము
నిన్న రాత్రి కలలో శ్రీ సాయి ఫకీరు రూపములో సముద్రపు ఒడ్దున నిలబడి యున్నారు. నేను వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించినాను. వారు నన్ను చూసి అన్న మాటలు "జీవితము సముద్రపు ఒడ్డువంటిది. సముద్ర కెరటాలు సుఖాలు వంటివి. సముద్రపు పోటు మీద ఉన్న సమయములో సుఖాలు అనే కెరటము ఒడ్డుకు వస్తుంది. ఆ నీటిలో అహంకారము అనే పాములు, కష్ఠాలు అనే చేపలు, దైవ చింతన అనే ముత్యపు చిప్పలు హాయిగా ఈత కొడతాయి. సముద్రమునకు ఆటు వచ్చినపుడు ఆ కెరటము తిరిగి సముద్రములోనికి వెళ్ళిపోతుంది. ఆ సమయములో నీలోని అహంకాము అనే పాములు, కష్ఠాలు అనే చేపలు సముద్రపు ఒడ్డున గిలగిల లాడుతాయి. సముద్రపు ఒడ్డున ఉన్నరాళ్ళమధ్య నిలిచిన నీరులో దైవ చింతన అనే ముత్యపు చిప్పలు ప్రశాంతముగా ఉంటాయి. అందుచేత నీ జీవితము అన్ని కాలాల్లోను దైవ చింతన అనే ముత్యపు చిప్పలాగ బ్రతకటము నేర్చుకో" కల చెదిరి పోయినది. మెలుకువ వచ్చినది. ఆ కలలోని అర్థము గురించి వెతక సాయినాను. శ్రీ సాయి సత్ చరిత్ర 16,17 అధ్యాయములలో శ్రీ సాయి అన్నమాటలు "జీవితములో అసూయ, అహంభావము అనే మొసళ్ళతో నిండియున్నాయి" మరొక్కసారి నిజము అని గుర్తించినాను. 51 వ. అధ్యాయములో హేమాద్రిపంతు అంటారు జీవితములో కోపము, అసూయ మొసళ్ళువంటివి. పరనింద, అసూయ, ఓర్వలేని తనము చేపలు వంటివి. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికి శ్రీ సాయి సద్గురువుదానికి అగస్త్యునివంటివాడు (నాశనము చేయువాడు). సాయి భక్తులకు దానివలన భయమేమి యుండదు. శ్రీ హేమాద్రిపంతు మాటలతో నేను ఏకీభవించుతాను.
12.08.1993 గురువారము
నిన్నటి రాత్రి మనసులో కుటుంబ వ్యవహారాలపై చాలా చికాకు కలిగినది. మనసుకు ప్రశాంతత కరువు అయినది. నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ప్రశాంతత ప్రసాదించమని వేడుకొన్నాను. రాత్రి కలలో యిద్దరు పెద్ద మనుషులు కారులో నాయింటికి వచ్చి తమతో గోవాకు వచ్చి చక్కగా ఓ వారము రోజులు కాలక్షేపము చేసి వెళ్ళండి. మీ మానసిక బాధలు పోతాయి అన్నారు. నేను కట్టు బట్టలతో వారితో కారులో బయలుదేరినాను. కారు కొంచము దూరము వెళ్ళిన తర్వాత నిత్య పారాయణ చేయటానికి కావలసిన శ్రీ సాయి సత్ చరిత్ర యింటిలో మర్చిపోయినాను అని ఆ డ్రైవరుకు చెబుతాను. కారును వెనక్కి తిప్పమని చెబుతాను. మెలుకువ వచ్చినది. ఉదయము చాలా సేపు ఈ కల గురించి ఆలోచించసాగినాను. 8 గంటలకు ఆఫీసుకు బయలుదేరటానికి సిధ్ధ పడుతుంటే రోజు నాకు మార్నింగ్ వాక్ లో కలిసే పద్ద మనిషి శ్రీ హఫీజ్ బాబా నా యింటిముందునుండి వెళుతూ నా యింటికి వచ్చినారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. తెల్లని గెడ్డము నెత్తిమీద తెల్లని బట్టతో శ్రీ సాయినాధుని పోలియుంటారు. ఆయనను నా యింటిలోనికి `తీసుకుని వచ్చి నేను, నా భార్య, పిల్లలము ఆయన పాదాలకు నమస్కరించి శ్రీ సాయి పాదాలకు నమస్కరించిన అనుభూతిని పొందినాము. ఆయనకు గోరువెచ్చని పాలు త్రాగటానికి యిచ్చినపుడు ఆయన సంతోషముతో స్వీకరించి త్రాగి నన్ను నా కుటుంబ సభ్యులను ఆశీర్వదించి వెళ్ళినారు. ఆయన వెళ్ళిన వెంటనే నా భార్య అన్న మాటలు "ఈ రోజు గురువారము శ్రీ సాయి హఫీజ్ బాబా రూపం లో వచ్చి మన యింట పాలు త్రాగి వెళ్ళినారు". ఆ మాటలు నన్ను చాలా సంతోషము కలిగించినాయి. మరి రాత్రి కలలో యిద్దరు పెద్ద మనుషులు నన్ను గోవా ఎందుకు తీసుకొని వెళ్ళినారు అని ఆలోచించినాను. శ్రీ సాయి సత్ చరిత్ర 36 వ. అధ్యాయములో గోవాలోని యిద్దరు పెద్ద మనుషులలో ఒకరు 30,000/- రూపాయలు పోగుట్టుకొని మానసిక బాధ పడుతున్న సమయములో దారి వెంట పోతున్న ఒక ఫకీరు అతని దగ్గరకు వచ్చి ఓదార్చి అతని కష్ఠములు దూరము చేయుటకు షిరిడీకి వెళ్ళి శ్రీ సాయి దర్శనము చేయమని చెప్పిరి. నిన్నటిరోజున కుటుంబ వ్యవహారాలలో మానసిక బాధలో ఉండగా శ్రీ సాయి హఫీజ్ బాబా రూపములో ఈనాడు నా యింటికి వచ్చి నా మానసిక బాధలు దూరము చేయటానికి నన్ను ఆశీర్వదించినారు అని నమ్ముతాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment