23.12.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 15 వ. భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1993
18.09.1993
నిన్న రాత్రి నిద్రకు ముందు పరిపరి ఆలోచనలతో జీవితములో ఎటువంటి సమయములో ధైర్యముగా ఉండాలి, ఎలాగ ప్రవర్తించాలి అని శ్రీ సాయినాధుని ప్రశ్నించి నిద్రపోయినాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అంటారు. 1) కన్న తల్లిని ప్రేమ, గౌరవాలతో చూడు. ఆమె చనిపోతే ధైర్యముగా నిలబడి ఆమెకు దహన సంస్కారాలు చేయి. 2) ఎవరైనా అహంకారముతో నీ దగ్గరకు వచ్చి నీ గురువును అవమానించితే ధైర్యముగా నవ్వుతూ ఎదుటివానిలోని అహంకారము తొలగించు. 3) సర్వ కాల సర్వ అవస్థలయందు నా నామస్మరణ చేయి. నీ కష్ఠాలు అనే దొంగలు నీ మనోధైర్యాన్ని సడలించకుండ నేను చూస్తాను. - శ్రీ సాయి.
19.09.1993
నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, సాయినాధ, తెల్లవారితే శ్రీ వినాయక చవితి పండగ. సందేశము ప్రసాదించమని కోరినాను. శ్రీ సాయి చక్కటి దృశ్య సందేశమును ప్రసాదించినారు. నేను నా భార్య, పిల్లలు వినాయక చవితి పండగ తర్వాత భోజనాలు చేస్తున్నాము.
గోడమీదనుండి ఒక బల్లి గాలిలో ఎగురుతూ భోజన పదార్ధాల మీద గెంతుతూ నా శిరస్సు క్రింద భాగము మెడ ప్రక్కనుండి ఎగురుతూ తిరిగి గోడమీదకు చేరి కిచ కిచ మని శబ్దము చేయసాగినది.
ఈ వింత చర్యకు నేను సంతోషముతో శ్రీ సాయి మనలను, మన కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు అని అంటు శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ సాయి చెప్పిన మాటలు "సర్వ జీవకోటిలో నన్ను చూడు" అనేది నిజము అని నమ్మినాను. యింకొక దృశ్యములో శ్రీ సాయి జీవిత రహస్యము కళ్ళకు కట్టినట్లుగా చూపించినారు. నేను రైలులో ప్రయాణము చేస్తున్నాను. నా భార్య పిల్లలు నాతో లేరు. నేను ఆ రైలులో ఆ లైనులోని ఆఖరి స్టేషన్ కు చేరుకొన్నాను. ఆ స్టేషన్ నా జీవితములో నేను రైలు ప్రయాణము ప్రారంభించిన మొదటి స్టేషన్. ఆ స్టేషన్లో చాలా మార్పులు వచ్చినవి. నేను స్టేషన్లో దిగినానే కాని, నా సామానులు దింపుకోలేకపోయినాను. తిరిగి ఆ రైలు ప్రయాణమునకు సిధ్ధముగా ఉంది. చాలా మంది కొత్తగా ఆ రైలు ఎక్కుతున్నారు. వారిదగ్గర ఏ విధమైన సామానులు లేవు. వారు సంతోషముగా రైలు ఎక్కినారు. రైలు వెళ్ళిపోయినది. నేను ఒక్కడినే స్టేషన్లో నిలబడిపోయినాను. ఆ ఫ్లాట్ ఫారం మీద తెల్లని వస్త్రాలు ధరించిన ఓ సన్యాసి అంటారు. "రైలు దిగినావు కాని నీ సామానులు దింపుకోలేకపోయినావు కదూ - ఈ రైలునుండి దిగేవారు, తిరిగి ఎక్కేవారు తమతో సామానులు తీసుకొని వెళ్ళలేరు అనేది గ్రహించినావు కదూ" - అని చెప్పి నా గమ్యము చేతిలో చూపించినారు. ఆయన చెప్పినట్లుగా ఫ్లాట్ ఫారం చివరకు వెళ్ళినాను. అక్కడ ఒక చిన్న నది ఉంది. నేను ఆ నదిలో ఈత కొడుతూ సముద్రములోనికి వెళ్ళిపోయి ఆ సముద్రగర్భములో కలసిపోయినాను. భయముతో తెలివి వచ్చినది. శ్రీ సాయి పటము ముందు నిలబడి నమస్కరించినాను. శ్రీ సాయి పటమునుండి మాటలు నా చెవిలోనికి వచ్చి వినిపించసాగినవి. "మన జీవితానికి అర్ధము వినాయక చవితి - వినాయకుడి బొమ్మను మట్టినుండి తయారుచేసుకొన్నాము. పూజలు చేసుకొన్నాము.పదిరోజుల తర్వాత తిరిగి మట్టిలో కలిపి వేసినాము."
తిరిగి మళ్ళీ సంవత్సరములో మట్టితో వినాయకుడి బొమ్మ చేసి పూజిస్తాము. యిదే శ్రీ సాయి వినాయక చవితి పండగ సందేశముగా యిచ్చినారు అని గ్రహించినాను.
22.09.1993
నిన్న రాత్రి సమాజములోని మంచి చెడ్డలు గురించి ఆలోచించుతూ శ్రీ సాయికి నమస్కరించి సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్త్రి రూపములో అంటారు
1) సంఘములో తెలివితేటలు ఉన్న తల్లితండ్రులకు తెలివితేటలతో పిల్లలు పుడతారు. తెలివితేటలు లేని తల్లి తండ్రులకు తెలివితేటలు లేని పిల్లలు పుడతారు అనేది నిజము కాదు. దాంపత్య జీవితములో పిల్లలు అదృష్ఠాను సారముగా పుడతారు అనేది గ్రహించు. 2) ఎంత తెలివైనవాడు అయిన లంచాలకు మరిగితే ఆ విషయము బట్టబయలు అయిన రోజున నిజమైన తెలివితేటలు ఆ మనిషికి వస్తాయి. 3) ఈ సమాజములో భార్య భర్తల జీవితాలు పిచుకల జీవితాల లాగ మారిపోయినాయి. వారు కాల ప్రవాహము అనే నదిలో కొట్టుకొని పోతు భార్య భర్తల సంబంధానికి చెడ్డపేరు తెస్తున్నారు.
4) ఆ అజ్ఞాత వ్యక్త్రి (శ్రీ సాయి) అంటారు నా తత్వము తెలుసుకోవటానికి నీవు పదిమంది చుట్టూ తిరగనవసరము లేదు. నేనే నీ యింటికి వచ్చి నా తత్వము నీకు తెలియ చేస్తాను. -- శ్రీ సాయి.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment