24.12.2011 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స.డైరీ 1993 16 వ.భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1993
23.09.1993
నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి హాస్య ధోరణిలో సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము ఆ దృశ్యానికి సందేశము. నేను నా ఆఫీసులో పెద్ద ఆఫీసరుని. నేను నిక్కరు రంగుల చొక్కాతో ఒక జోకరులాగ తయారు అయి ఆఫీసుకు వెళతాను. నేను ఆఫీసరుగా నా పదవికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగము చేసి నా బంధువులకు ఉద్యోగములు వేయించుతాను. నా బంధువులు కూడా నాలాగే నిక్కరులు రంగుల చొక్కలు ధరించి ఆఫీసులో నవ్వులు పాలు అగుతారు. ఆఫీసులో మిగతావారు నన్ను నాబంధువులను చూసి నవ్వుతారు. ఆఫీసులో ఒక పెద్ద మనిషి (శ్రీ సాయి) అంటారు. అధికార దుర్వినియోగము చేస్తే నవ్వులపాలు అవక తప్పదు". నాకు తెలివి వచ్చినది.
25.09.1993
నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి జీవితములో తెలుసుకోవలసిన సందేశములు ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సందేశాలు.
1) నీ జీవితము అనే పడవను తయారు చేసుకోవటానికి నీ బంధు మితృల సహాయము తీసుకోవచ్చును. ఆ విధముగా తయారు కాబడిన పడవను కాలము అనే నదిలో నడపటానికి గురువు యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటము మర్చిపోవద్దు.
2) కుక్క పిల్లలను కనిన వెంటనే తన పిల్లలపై సమానమైన ప్రేమను పంచిపెడుతుంది. ఆ కుక్క తన పిల్లల భవిష్యత్ మరియు అదృష్ఠము గురించి ఆలోచించదు. కొన్ని పిల్లలు ధనవంతుల యింటిలో చేరి రాజ భోగాలు అనుభవించుతాయి. కొన్ని అనారోగ్యముతో రోడ్డు ప్రక్కనే పడియుంటాయి. మానవుల విషయమునకు వచ్చేసరికి తల్లి తండ్రులు తమ పిల్లలమీద పక్షపాత వైఖరి చూపించుతారు. నా విషయములో నేను నా భక్తులను అందరిమీద సమాన ప్రేమను పంచి, వారి యోగ్యత బట్టి వారి అవసరాలు తీర్చుతాను. - శ్రీ సాయి
27.09.1993
నిన్న రాత్రి నా జీవితము గురించి చాలా ఆలోచించినాను. శ్రీ సాయికి నమస్కరించి ప్రశాంత జీవితానికి మార్గము చూపించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చక్కని దృశ్యము చూపించి కనువిప్పు కలిగించినారు. వాటి వివరాలు. టీ.వీ. లో బబూల్ గం టూత్ పేస్టు అడ్వర్టైజ్ మెంట్ (ప్రకటన) వస్తున్నది. ఒక చక్కటి కుటుంబము చిరునవ్వులతో జీవించుతున్నామని చెబుతారు. నిజానికి వారు అందరు ఒక కుటుంబము వారు కాదు.వారు అందరు కిరాయి నటులు. అలాగ ఈ జన్మలో మనకు తోడుగా యుండే భార్యా పిల్లలు ఋణానుబంధము (కిరాయి) ద్వారా వచ్చిన నటీనటులు అని గుర్తు ఉంచుకో.
28.09.1993
నిన్న రాత్రి శ్రీ సాయి నా మనసుకు ప్రశాంతత కలిగించే దృశ్యము చూపించినారు. అది ఒక విశాలమైన పాఠశాల (బడి). ఆ పాఠశాలకు తలుపులు, కిటికీలు లేవు. రహస్యము అనే మాట ఆ బడిలో వినిపంచదు. సర్వ వేళలలో ఆ బడి తెరచి యుంటుంది. అక్కడి విద్యార్ధులకు, విద్యార్థినిలకు వయసుతో సంబంధము లేదు. అందరు చిరునవ్వుతో ఆ బడిలో ఆధ్యాత్మిక రంగములో అధ్యయనము చేస్తున్నారు. గురువు కంటికి కనిపించరు. అయినా అందరి కళ్ళలో తృప్తి కనిపించుతుంది. ఈవిధమైన దృశ్యము ద్వారా శ్రీ సాయి యిచ్చిన సందేశము - "కాలము అనే బడిలో శ్రీ సాయి అనే గురువుగారి క్లాసులో చేరటానికి విద్యార్ధి, విద్యార్ధినులకు వయస్సు అనే నిబంధన లేదు. ఈ దృశ్యము తర్వాత శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో యిచ్చిన సందేశాలు.
1) అవసరాలకు మించి ధనము సంపాదించిన అది నీ మానసిక ఆందోళనకు దారి తీస్తుంది. అక్రమ మార్గములో ధనము సంపాదించితే అది సంఘ వినాశనానికి దారి తీస్తుంది. అందుచేత మానసిక ఆందోళనకు గురి కాని విధముగాను, సంఘములో గౌరవానికి భంగము కాని విధముగాను డబ్బు సంపాదించటములో తప్పు లేదు.
2) ఓ మంచి వ్యక్తి చావు భోజనం - భగవంతుని ప్రసాదముకంటె గొప్పది అని గ్రహించు.
3) జీవితములో జననము - మరణము అనేవి జంట ప్రక్రియ అని భావించి సంతోషముగా జీవించినవాడు చాలా అదృష్ఠవంతుడు.
03.10.1993
నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి జీవితములో ధైర్యముగా బ్రతకటానికి మార్గము చూపమని కోరినాను. శ్రీ సాయి చూపిన దృశ్యము కనువిప్పు కలిగించినది. మనము భోజనము చేస్తున్నపుడు ఒక్కొక్కసారి ఆ భోజనముతోపాటు చిన్న చిన్న రాళ్ళు వగైరాలు మన జీర్ణకోశములో చేరి అక్కడ అడ్డుకొని పోతాయి. అటువంటి రాళ్ళు మన శరీరములో ఉన్నాయి అని కత్తితో మన పొట్ట కోసుకోము కదా. మన శరీరము అటువంటి రాళ్ళపై ఓ దళసరి పాటి పొరను ఏర్పరుచుతుంది మరియు ఆహార జీర్ణ ప్రక్రియకు అడ్డులేకుండ చూసుకొంటుంది. అదే విధముగా మానవుని జీవితములో సుఖాలు అనే భోజనము చేస్తున్నపుదు చిన్న చిన్న కష్ఠాలు అనే రాళ్ళు మనలో చేరుతాయి. ఆ కష్ఠాలను మనలో దాచుకొని సంతోషముగా జీవించాలి.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment