01.01.2012 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
మనము కూడా బాబావారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెపుదాము.
శ్రీ షిరిడీ సాయి బాబా సాయి బంధువులమైన మేమంతా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మమ్ములనెప్పుడు మీరు చల్లగా చూడవలసిందిగాను, మీ రక్షణలో మమ్ములను ఉంచి కాపాడవలసినదిగాను ప్రార్ధిస్తున్నాము.
రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
ఈ రోజు నూతన సంవత్సరము. ష్రీ షిరిడీ సాయి బాబా సత్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని (9 వ. అధ్యాయము) ఒక సారి మననం చేసుకుందాము.
బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు?
ఒకప్పుడు ఆత్మారాం తార్ఖడ్ భార్య షిరిడీలో ఒక యింటియందు దిగారు. మధ్యాహ్ న్న భోజనము తయారయింది. అందరికీ వడ్డించారు. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొఱగసాగింది. వెంటనే తార్ఖడ్ భార్య లేచి ఒక రొట్టెముక్కను విసిరింది. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆరొట్టెముక్కని తింది. ఆనాడుసాయంకాలము ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు బాబా ఆమెతో " తల్లీ నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు యిలాగే చేస్తూ ఉండు. యిది నీకు సద్గతి కలుగచేస్తుంది. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడు అసత్యమాడను. నాయందు యిలాగే దయ ఉంచు. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుచుకొనుము" అని అనేటప్పటికి తార్ఖడ్ గారి భార్యకు ఏమీ అర్ధం కాలేదు. అపుడామె "బాబా నేను నీకెట్లా భోజనము పెట్టగలను" నేనే నా భోజనానికి యితరుల మీద ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేస్తున్నాను" అంది. అప్పుడు బాబా యిలా జవాబిచ్చారు. "నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన యా రొట్టెముక్కను తిని యిప్పటికీ త్రేనుపులు వస్తున్నాయి. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను చూచి నువ్వు రొట్టె పెట్టావో అదియు నేను ఒక్కటే. అలాగే , పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలైనవన్నీ కూడా నా అంశములే. ఎవరయితే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. అందుచేత నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అనే ద్వంద్వ భావమును, భేదమును విడిచి నన్ను సేవింపుము" ఈ విధముగా బాబా చెప్పిన అమృతవాక్కులు ఆమె హృదయాన్ని కదిలించాయి. ఆమె నేత్రములు అశ్రువులతో నిడిపోయాయి. గొంతు గద్గదమయింది. ఆమె ఆనందానికి అంతు లేదు.
సాయి భక్తులారా ! చదివారుకదా ! యిక్కడ బాబాగారు చెప్పినది మనం తూ.చా. తప్పకుండా ఆచరిస్తే ఆయన అనుగ్రహానికి మనం పాత్రులమవుతాము. ఆకలితో ఉన్న జీవిని తృప్తి పరుస్తే బాబాని సంతుష్టిని చేసినట్లే. ఆకలితో ఉన్న జీవి అంటే జంతుజాలాలే కాదు, మానవుడిని కూడా. యిక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనం సాధారణంగా మనయింటిలో మనం ఎంగిలి చేసినవి, మనం తినడానికి పనికిరాకుండా పాడయిన పదార్ధాలను సామాన్యంగా పిల్లులకు, కాకులకు, బిచ్చగాళ్ళకు, లేక మనయింటిలో పనిమనుషులకు వేస్తూ ఉంటాము.
కాని వాటిని ఏజీవికి పిలిచి మాత్రం పెట్టకండి. వాటిని యితర జంతుజాలాలు యిష్టమయితే తింటాయి లేకపోతే వాసన చూసి వదలివేస్తాయి. మనం అనుకుంటాము. బిచ్చగాడే కదా వాడు ఏది పెట్టినా తింటాడులే అని. కాని ఒకటి గుర్తు ఉంచుకోండి. బిచ్చగాడు ప్రతీ రోజు అటువంటి ఎంగిలి పదార్ధాలను, పాడయిపోయిన పదార్ధాలను తింటూ ఉండవచ్చు. ఒక్కసారి మీరు కనక శుభ్రమైన ఆహారాన్ని అతనికి పెట్టారనుకోండి. అతను తన జీవితంలో మొదటిసారిగా తిన్నప్పుడు ఎంత తృప్తిపడతాడొ ఊహించుకోండి. అవునంటారా కాదంటారా? మీరు పండగనాడు, బూరెలు, పులిహార చేసుకున్నారు. వాటిని కొంచెం పెట్టిచూడండి. ఎంత తృప్తిగా ఆరగిస్తారో? సాధారణంగా మనము ఏమి చేస్తాము? ఆరోజు తిన్నంత తిని, మిగిలినవి మరుసటిరోజు బాగుంటే తింటాము బాగుండకపోతే బిచ్చగాడికి వేస్తాము? అవునా? మరి? ఒక రెండో లేక నాలుగో ఆరోజే దానం చేసేయండి. దానివల్ల మనకున్నదానిలో ఏమీ తరిగిపోదుకదా? ప్రతీరోజు భోజనానికి కూర్చునేముందు మొదటగా అన్నం కొంచెం తీసి బయట పెట్టండి. ఆకలితో ఉన్న ఏ పక్షి అయినా దానిని తింటుంది. బయటపెట్టిన తరువాత మీరు భోజనం చేయండి.
బాబాని సంతుష్టుడిని చేయడానికి,ఆయన అనుగ్రహానికి పాత్రులవడానికి మనము ఉపవాసాలు చేయనక్కరలేదు. బాబాకు పెద్ద పెద్ద దండలువేసి అలంకరించనక్కరలేదు. ప్రతీ జీవిలోను ఆయనని చూడాలి. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాలి. బాబా సంతుష్టి చెందుతారు. అప్పుడే బాబాకు మీరు మీఇష్టమైనదీ మీశక్తికొలదీ సమర్పించండి. బాబా మీద మీప్రేమను, భక్తిని తెలుపుకొనండి.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment