07.04.2014 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఈ రోజు సాయితో మధురక్షణాలలోని మరొక మధుర క్షణం గురించి తెలుసుకుందాము.
శ్రీసాయితో మధురక్షణాలు - 36
దేవుడు లేడా? యోగిపుంగవులు లేరా? మంత్రాలు లేవా?
కష్టాలలో ఉన్న ప్రతివారు అవితీరే మార్గం కోసం అన్ని దారులు వెతకడంలోనే ఉంటుంది వారి దృష్టి అంతా. వారికి తమ కష్టాలు తీరే మార్గం కావాలి. భగవంతుడు లేడా? యోగి పుంగవులు లేరా? మంత్రాలు లేవా? నన్నీ కష్టాలనుండి బయటపడేసేవారు ఎవరూ లేరా? ఈ విధంగా పరిపరి విధాల పోతూ ఉంటుంది వాళ్ళ మనస్సు. అటువంటి సమయంలో పొరుగున ఉన్నవారికి సాయిబాబాతో అనుబంధం ఉంటే వారు బాబాను నమ్ముకోమని సలహా యిస్తారు. ఆవిధంగా వ్యాకులతో ఉన్న ఆ వ్యక్తి వెంటనే సాయిబాబా తప్ప తనకు సహాయం చేసేవారెవరూ లేరనీ ఆయన తప్ప తననీ కష్టాన్నించి గట్టెక్కించేవారు ఎవరూ లేరనీ, ఆయన దయ కోసం ఆర్తితో ప్రార్ధిస్తాడు. అవసరం ఎంతగా ఉంటుందో నమ్మకం కూడా అంతే బలీయంగా ఉంటుంది. కలకత్తాలోని ఎస్.ఎం.బెనర్జీ బాబాతో తనకు కలిగిన అనుభవాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు.
పైన చెప్పిన దానికి బాబా మాకు చూపించిన అనుభవానికి నాభార్యే ప్రత్యక్ష సాక్షి. 1949వ.సంవత్సరం వర్షాకాలపు రోజులలో బొంబాయి యింకా చుట్టుప్రక్కల ప్రాంతాలలో పోలియో అంటువ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తూ ఉంది. అప్పుడు మా అబ్బాయి వయస్సు ఒకటిన్నర సంవత్సరాలు. వాడికి పోలియో సోకింది. రెండు రోజులలోనే రెండు కాళ్ళూ కూడా నడుము వరకు చచ్చుపడిపోయాయి. దానివల్ల కూర్చోలేడు నుంచోలేడు. బొంబాయి జె.జె.ఆస్పత్రిలో బొంబాయి మునిసిపాలిటీవారు ప్రత్యేకంగా పోలియోబారిన పడినవారికి ఐసొలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారు. మా అబ్బాయిని అందులో చేర్పించాము. పోలియో బాగా తొందరగా అందరికీ అంటుకొని వ్యాపిస్తూ ఉండటంతో పోలియోబారిన పడ్డవారినెవరినీ యింటిలో ఉంచనివ్వటల్లేదు. ఆ వార్డును పర్యవేక్షిస్తున్న డాక్టరు కోహెల్లో బొంబాయిలోని పిల్లల ప్రత్యేక వైద్యనిపుణుడు వచ్చి మా అబ్బాయిని పరీక్షించారు. ఆ డాక్టరుకు కూడా చిన్నప్పుడే పోలియో వచ్చి రెండు కాళ్ళు కూడా చచ్చుపడిపోయాయి. ఆయన క్రచెస్ సహాయంతోనే నడుస్తారు. ఆయన వచ్చి " మీ అబ్బాయికి వైద్యం చేయడానికి నావద్ద మందులేమీ లేవు. ఏమన్నా చేయగలిగితే భగవంతుడే చేయాలి. భగవంతుడిని ప్రార్ధించు" అని చెప్పారు.
ఆస్పత్రి వాతావరణమంతా పోలియోబారిన పడ్డ పిల్లలతో నిండిపోయి చాలా దయనీయంగాను, బాధాకరంగాను ఉంది. ఈ వ్యాధి పైకి వ్యాపించే పోలియో జబ్బు అంటారు. ఇది కాళ్ళవద్దనుండి ప్రారంభమయి చాలా వేగంగా శరీరానికి వ్యాపిస్తుంది. చాతీ వద్దకు వ్యాపించిన వెంటనె ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది, నోటినుండి నురుగు వస్తుంది. ఆదశలో కొంతమందికి కృత్రిమ శ్వాస కల్పించడానికి ఐరన్ లంగ్స్ పెడతారు. కాని మెడవరకు చచ్చుపడిపోతే మరణం సంభవిస్తుంది. వైద్యం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. డాక్టర్స్ స్పైనల్ కార్డ్ నుండి స్పైనల్ ఫ్లూయిడ్ తీసి, బాగా వేడిగా స్పైనల్ కార్డ్స్ మీద కాపడం పెడతారు. ఆబాధ తట్టుకోలేక రోగి బాధగా గట్టిగా అరవడం జరుగుతుంది.
ఆస్పత్రిలో పిల్లలకు మాత్రమే బెడ్స్ ఇస్తారు. పిల్లలతో కూడా వచ్చిన తల్లులు రోజంతా ఒక చిన్న బల్లమీద కూర్చోవాలి. రాత్రిళ్ళు నేల మీద పడుకోవలసిందే.
ఆరోజుల్లో నేను సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నాను. నా ట్రైనింగ్ పూర్తయిన తరువాత పనిలో అనుభవం రావడానికి నన్ను లీవ్ రిజర్వ్ గా పోస్ట్ చేశారు. ఇటువంటి కష్ట సమయంలో, మన్మాడ్ లో ఉన్న యింజనీర్-యిన్-చార్జ్ సెలవులో వెళ్ళడంతో నన్ను అక్కడకు వెళ్ళమని ఉత్తర్వులు యివ్వడం వల్ల నాకు సెలవు దొరకలేదు.
అందుచేత, రూల్స్ పాటించి నాభార్యను, కొడుకుని ఆస్పత్రిలో వదలి నేను మన్మాడ్ వెళ్ళవలసి వచ్చింది. పై అధికారుల అనుమతి లేకుండా నేను ప్రధాన కార్యాలయం నుండి గాని, సెక్ షన్ నుండి గాని వెళ్ళడానికి వీలులేదు. నేను ఆస్పత్రిలో ఉన్న నాభార్యను కొడుకును చూడాలంటే ఒక్క ఆదివారం మాత్రమే బొంబాయికి రావాల్సి ఉంటుంది. అంటే దానర్ధం ఒక్క ఆదివారమునాడు తప్ప నేను ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చూడటానికి ఏమాత్రం అవకాశం లేదు.
నేను మన్మాడ్ కి రాగానే ట్రాలీ నడిపే మనుషులలో ఒకతను నాదగ్గరకు వచ్చి నా సమస్య గురించి అడిగాడు. నేను చెప్పిన విషయాలన్నీ విని అతను, దగ్గరలోనే ఉన్న షిరిడీలో ఒక మహా సిధ్ధపురుషుడైన సాయి బాబా వారి సమాధి ఉన్నదనీ ఆయనను ప్రార్ధిస్తే పిల్లవాడు ఆరోగ్యవంతుడవుతాడని చెప్పాడు. అతను నాకు సాయిబాబా వారి చిన్న ఫొటో ఒకటి యిచ్చాడు. నేను దానిని నేను ఉంటున్న రెస్ట్ హౌస్ గదిలో నా మంచం ప్రక్కనే ఉన్న బల్లమీద పెట్టుకున్నాను. ప్రతీరోజు రాత్రి పడుకోబోయేముందు ఆయనను ప్రార్ధిస్తూ ఉండేవాడిని. ప్రతీ ఆదివారం బొంబాయి వెళ్ళి మా అబ్బాయిని చూసి వస్తూ ఉండేవాడిని.
ఆస్పత్రిలో నాభార్య మా అబ్బాయి ప్రక్కనే ఒక చిన్న బల్లమీద రాత్రంతా కూర్చునే ఉండేది. ప్రొద్దున్న 10 గంటలకు డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిన తరువాత ప్రక్కనే ఉన్న తన స్నేహితుల ఫ్లాట్ కి వెళ్ళి అక్కడే స్నానం చేసి భోజనం చేస్తూ ఉండేది. తరువాత కొద్ది గంటలు సాయంత్రం 4 గంటల వరకు నిద్రపోయేది. ఆ సమయంలో మా అత్తగారు మా అబ్బాయిని కనిపెట్టుకుని ఉండేది. ఈ విధంగా మూడు వారాలపాటు జరిగింది. మా అబ్బాయి పరిస్థితి ఏమాత్రం మెరుగు పడలేదు అంతకన్న క్షీణించలేదు.
21వ.రోజునాడు రాత్రి నాభార్య బాగా అలసిపోవడం చేత మా అబ్బాయి మంచం ప్రక్కనే నేల మీద గాఢ నిద్రలో కి జారుకుంది. అర్ధరాత్రివేళ మా అబ్బాయికి మెలకువ వచ్చి లేచాడు. అమ్మ కనపడకపోవడం వల్ల మంచం మీద లేచి కూర్చుని కిందకి దిగాడు. నుంచుని వాళ్ళఅమ్మ దగ్గరకి నడవ సాగాడు. ఇది చూసి నర్సులు అందరూ వచ్చి వాడిని పట్టుకున్నారు. కాని తరువాతనించి యిక వెనుకకు తిరిగి చూడలేదు. పోలియో వార్డ్ లో చేర్పించిన 6 వారాల తరువాత మా అబ్బాయే మొట్టమొదటగా నడిచాడు. ఇది చాలా అధ్బుతమని డా.కొహెల్లో గారు కూడా అన్నారు. తరువాత మేము షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాము. ఆయనకు మేము ఎప్పటికీ ఋణపడి ఉన్నాము. మా అబ్బాయి యిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. 1969వ.సంవత్సరం ఐ.ఐ.టీ.ఖర్గపూర్ లో క్రికెట్ టీంకి కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ఇప్పుడు మా అబ్బాయి అమెరికాలో కెమికల్ యింజనీరుగా ఉన్నాడు. మా జీవితం లో కష్టకాలాలలో ఉన్నప్పుడు మాకెన్నో అనుభవాలను చూపించారు బాబా. మేము ఆయనకెప్పటికీ ఋణపడి ఉన్నాము.
సాయిలీల పత్రిక
ఆగస్టు 1985
ఎస్.ఎం.బెనర్జీ
కలకత్తా
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment