15.08.2014 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 2వ.భాగం
ఈ రోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు గారు చెపుతున్న ఉపన్యాసం తరువాయి భాగం వినండి.
మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీసాయి సత్ చరిత్ర 26వ.అధ్యాయంలో గోపాలనారాయణ అంబడేకర్ జీవితంలో బాధ్యతా రహితంగా ఉండేవాడు. ఇక ముందు ముందు ఎటువంటి కష్టాలనెదుర్కొనవలసి వస్తుందోననే భయంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
ఏడు సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాడు. ఆతరువాత అతను బాబాను ఆశ్రయించి ఆయన సలహా కోరాడు. "పూర్వ జన్మలో చేసిన చెడు కర్మలనుండి ఎవరూ తప్పించుకోలేరని కర్మననుభవించవలసినదేనని" చెప్పారు బాబా. అందుచేత అతను నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నాడు. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదని, బాబా అతనిని రక్షించారు. జీవితంలో ఎదురయే కష్టనష్టాలను ధైర్యంతో ఎదుర్కోవాలనే సందేశాన్నిచ్చారు బాబా.
శ్రీసాయి సత్ చరిత్ర 27వ.అధ్యాయంలో శ్యామాతో ఎల్లప్పుడూ 'విష్ణుసహస్రనామం' చదువుతూ ఉండమని, అది ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకించి చెప్పారు. ఆవిధంగా చెప్పి రామదాసికి సంబంధించిన పుస్తకాన్ని శ్యామాకు కానుకగా యిచ్చారు. తరువాత రామదాసి వచ్చి తన పుస్తకం తీసుకున్నందుకు శ్యామాతో గొడవ పడ్డాడు. అప్పుడు బాబా "డబ్బుతో ఎన్ని పుస్తకాలనయినా కొనుక్కోవచ్చు, కాని ధనంతో మనుషులను కొనలేమని" ముఖ్యమయిన సందేశాన్నిచ్చి రామదాసిని శాంతింపచేశారు.
శ్రీసాయి సత్ చరిత్ర 28వ.అధ్యాయంలో బాబా, పండుగలు జరుపుకునేందుకు గాని, యాత్రలు చేయడానికి గాని అప్పులు చేయవద్దని తన భక్తులకు చక్కటి సందేశాన్నిచ్చారు. ఈ సందేశాన్ని కనక మనం ఆచరించకపోతే భగవంతుని అనుగ్రహానికి బదులు అప్పిచ్చినవాడి ఆగ్రహానికి గురవుతాము.
డబ్బు లేని కారణంగా నేను హరిద్వార్ యాత్రకు వెళ్ళలేకపోయానని బాధ పడుతూ ఉండేవాడిని. బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి "నీమనోనేత్రాన్ని తెఱచి చూడు, నీకు హరి దర్శనమవుతుంది. అంతేకాని హరిద్వార్ వెళ్ళలేదనే బాధ పడవద్దు" అని చెప్పారు. బాబా ఆదరణతో చెప్పిన ఈ మాటలకి నాకెంతో సంతోషం కలిగింది.
ఇంతవరకు నేను మీకు శ్రీసాయి సత్ చరిత్రలో బాబా చెప్పిన స్పష్టమయిన సందేశాలను, సూటిగా చెప్పిన మాటలను మీముందుంచాను. శ్రీసాయి సత్ చరిత్రలోని భావాన్ని అంతరార్ధాన్ని అర్ధం చేసుకోవడానికి నేను ఎన్నోసార్లు క్షుణ్ణంగా పారాయణ చేశాను. బాబా అన్యాపదేశంగా ఎన్నోసందేశాలను తన భక్తులకు ప్రసాదించారు. నేను అర్ధం చేసుకొన్న వాటినన్నిటినీ తోటి సాయి భక్తులందరితోను పంచుకోవాలనె ఉత్సాహంతో తపనతో ఉపన్యాసాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. ఈనాప్రయత్నంలో బాబా యిచ్చిన సందేశాలను మీకు అర్ధమయేటట్లుగా నేను వివరింపగలిగితే అందులో నేను విజయాన్ని సాధించినట్లే. ఈ అవకాశం సాయి నాకు ప్రసాదించిన ఆశీర్వాదమని, అనుగ్రహమని భావిస్తాను.
మొట్టమొదటిసారిగా నేను శ్రీసాయి సత్ చరిత్ర చదువుతున్నపుడు నన్ను అమితంగా ఆకర్షించిన చక్కటి సందేశాన్ని మీకు వివరిస్తాను.
"జీవితం తెల్లకాగితంవంటిది. దాని మీద మంచి మాటలు వ్రాస్తే ప్రజలు దానిని నెత్తిమీద పెట్టుకొని ఎంతో గౌరవాన్ని చూపిస్తారు. అలాకాక దాని మీద చెడుమాటలు వ్రాస్తే ఆకాగితాన్ని ముక్కలుగా చింపి చెత్తబుట్టలో పారవేస్తారు".
(ఈసంధర్భంగా మరొక మంచి మాటను మీకందిస్తున్నాను
భగవద్గీత ఉవాచ: దాచితే పెరిగేది ధనం
పంచితే పెరిగేది పుణ్యం
(త్యాగరాజు)
దీనికి సంబంధించిన గొప్ప ఉదాహరణ మనకు శ్రీసాయి సత్ చరిత్ర 2వ.అధ్యాయంలో కనిపిస్తుంది. అన్నాసాహెబ్ ధబోల్కర్ శ్రీసాయి సత్ చరిత్రను వ్రాయదలచినపుడు బాబా శ్యామాతో అన్నమాటలు "అతడు తన అహంకారాన్ని విడిచిపెట్టి, దానిని నాపాదాలముందు పెట్టాలి".
ఈవిధంగా బాబా అన్నాసాహెబ్ లోని అహంకారాన్ని మొగ్గలోనే త్రుంచివేశారు. అన్నాసాహెబ్ బాబా ఆదేశానుసారం శ్రీసాయి సత్ చరిత్ర రచనకు ఉపక్రమించాడు. నేడు కోటానుకోట్లమంది సాయి భక్తులందరి మదిలోను అన్నాసాహెబ్ వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్ర చిరస్థాయిగా నిలచి ఉంది.
సత్ చరిత్రను వ్రాసే దశలో బాబా అన్నాసాహెబ్ కు హేమాద్రిపంత్ అనే బిరుదునిచ్చారు. క్రమం తప్పకుండా ప్రతిరోజూ శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేస్తున్న భక్తులు ఎన్నో సత్ఫలితాలను పొందుతున్నారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment