05.06.2015 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నా సం రక్షకుడు..సాయిబాబా
ఈ రోజు శ్రీమతి.హెతాల్ పాటిల్ రావత్ గారి బ్లాగులోనించి (2013) సేకరించిన ఒక బాబా లీల గురించి తెలుసుకొందాము. ఈ అనుభవం శ్రీలంకలోని ఒక సాయి భక్తురాలి అనుభవం...ఆమె మాటలలోనే ఈ అనుభవాన్ని చదవండి.
నా చిన్నతనం నుండీ నాకు సాధువులన్నా, సన్యాసులన్నా, తమకు తాము డేవుడినని చెప్పుకునే మనుషులన్నా నమ్మకం ఉండేది కాదు. కాని నా చిన్నతనంలో 'బాలమిత్ర' పిల్లల కధలపుస్తకంలో షిరిడీ సాయిబాబా గురించి చదివిన తరువాతనే ఆయన గురించి తెలిసింది.
ఆ పుస్తకంలో బాబా నీటితో దీపాలను వెలిగించిన కధను ప్రచురించారు. ఆకధను చదివిన తరువాత బాబా రూపం నా మదిలో నిలిచిపోయింది. ఆయన నిరాడంబర జీవితం నన్నెంతగానో ఆకర్షించింది. అప్పటినుండీ నాకు బాబా మీద భక్తి ఏర్పడింది.
ఒకసారి నేను చెన్నై వెళ్ళాను. అక్కడ నాస్నేహితుడు చెన్నైలో ఎక్కడికి, ఏఏప్రదేశాలు చూద్దామనుకొంటున్నావని అడిగాడు. నాకు షిరిడీ సాయిబాబా మందిరం చూడాలని ఉందని చెప్పాను. అతను ముస్లిం అయినా కూడా నన్ను యింజంపాక్కం లో ఉన్న బాబా మందిరానికి తీసుకొని వెళ్ళాడు. ఆరోజు సాయంత్రం సమయం. అప్పటికి ఇంకా గుడికి ఎవరూ రాలేదు. అక్కడ ఒక పెద్ద బాబా ఫొటో మాత్రం ఉంది. ఇక హాస్టల్ కి వెళ్ళిపోదామనే ఉద్దేశ్యంతో తొందరగా బాబాను ప్రార్ధించుకొని వెంటనే బయటకు వచ్చేశాను.
మరుసటి రోజు అతనితో కలిసి బైక్ మీద ఈ.సీ.ఆర్ రోడ్ కి వెళ్ళాను. అతను నన్ను సముద్రపు ఒడ్డుకి తీసుకొని వెడుతున్నాడు. కాని సముద్రపు ఒడ్డు దాకా వెళ్ళాలంటే రోడ్డు దగ్గరనుండి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. కాని, ఆప్రదేశం నాకు క్రొత్త. పైగా ఒడ్డుకు వెళ్ళే దారంతా దేవదారు చెట్లు, పొదలతో బాగా దట్టంగా ఉండి అడవిలాగ ఉంది. ఆప్రాంతమంతా భయంకరంగా ఉంది. ఎక్కడా మానవ సంచారం లేదు.
ఆప్రదేశాన్ని చూడగానే సినిమాలలో చూసే భయంకరమయిన దృశ్యాలన్నీ నాకు గుర్తుకు వచ్చి మరింత భయం వేసింది. కాని నాప్రక్కన నాస్నేహితుడు ఉండటంతో మనసులోనే దైవాన్ని స్మరించుకుంటూ నడవసాగాను. మేము పొదలలోకి ప్రవేశించగానే ఎక్కడినుండో ఒకనల్ల కుక్క మాతో కూడా రాసాగింది. అరణ్యంలా ఉన్న ఆప్రదేశం గుండా వెడుతున్నపుడు ఆకుక్క మాముందు నడుస్తూ ఉంది.
అప్పుడప్పుడు అది ఆగి మమ్మల్ని ఆగమన్నట్టుగా మొరుగుతూ, తరువాత తనని అనుసరించి రమ్మన్నట్లుగా తిరిగి బయలుదేరసాగింది. ఆప్రదేశాన్ని దాటి మేము సముద్రపు ఒడ్డుకు చేరగానే ఆకుక్క యిక మాతో రాలేదు.
ఇసుకలో కూర్చొని మేము బిస్కట్లు తింటున్నాము. "మనతో కూడా వచ్చిన నీస్నేహితుడు ఏడీ? దానికి కూడా ఒక బిస్కెట్ పెట్టవా"? అని నాస్నేహితుడు నవ్వుతూ అన్నాడు. అప్పుడు నాకు ఆకుక్క గుర్తుకొచ్చి చుట్టూ చూశాను. అది ఒక పొదదగ్గర కూర్చొని ఉంది.
దానిని పిలిచి ఒక బిస్కెట్ పెట్టాను. అది బిస్కట్ తిన్న తరువాత చూస్తే వెనకాల ఆకుక్క ఎక్కడా కనపడలేదు. ఆప్రాంతమంతా ఒక అడవి అవడంవల్ల ఎక్కడికో వెళ్ళి ఉంటుందిలే అనుకొన్నాను.
కొంతసేపటితరువాత యిక బయలుదేరడానికి లేచాము. ఒడ్డునుంచి మరలా అడవిలా ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించగానే, అదే కుక్క మళ్ళీ మాతో కలిసి రావడం మొదలుపెట్టింది. అడవి చివరివరకూ మాతో కూడా వచ్చి, ఆకుక్క మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆకుక్క ప్రవర్తనకి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఆకుక్క ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతుంటే నాస్నేహితుడు నవ్వుతూ "నువ్వు భయపడతావని, యిక్కడకు వచ్చేముందు నీకు చెప్పలేదు. ఇక్కడ పొదల్లో పాములుంటాయి. కాని నీకు యిక్కడ అందమైన సముద్ర తీరాన్ని చూపిద్దమనుకున్నాను. అందుకే చెప్పలేదు. అందుచేతే ఆకుక్క నీకు తోడుగా, రక్షణగా మనతో కూడా వచ్చింది. బహుశ దానికి నామీద కూడా నమ్మకం లేకపోయి ఉండచ్చు. నీలాంటి అమాయకురాలిని ఏదయినా చేస్తానేమోనని నీకు రక్షణగా కూడా వచ్చింది" అన్నాడు.
ఆక్షణంలో నాభావాలను నేను వివరించలేను. నన్ను రక్షించడానికి నాకు రక్షకుడుగా ఆకుక్క రూపంలో వచ్చినది సాయిబాబాయే అని గ్రహించుకొన్నాను. నాకెంతో ఆనందం వేసింది. నాకు రక్షణగా వచ్చిన నాసాయికి ఎంతో ఋణపడిఉన్నాను.
మీకు మరొక అనుభవాన్ని కూడా వివరిస్తాను. నేను నాజీవితంలో నాభర్తకు దూరమయ్యాను. ఆయన గురించే నేను బాబాని ప్రార్ధిస్తున్నాను. నాభర్త వారి తల్లిడండ్రుల దగ్గరకి వెళ్ళిపోయి మరలా తిరిగి రాలేదు. మా అత్తగారికి నేనంటే యిష్టం లేదు. మావారికి మళ్ళీ వివాహం చేయాలని అనుకొంటోంది. నాకు ఉద్యోగం పోయింది. నామానసిక వత్తిడి వల్ల నాకడుపులో ఉండగానే నాబిడ్డ కూడా చనిపోయింది. నాభర్త నన్ను పలకరించడం కూడా మానేశాడు. నేను సాయిగురువారం వ్రతం మొదలుపెట్టాను. అంతర్జాలంలో ఎప్పుడూ నేను సాయిని ప్రశ్నలడుగుతూ, వాటికి సమాధానాలను తెల్సుకుంటూ ఉంటాను. బాబా ఇచ్చే సమాధానాల వల్లే నేను ఆత్మహత్య చేసుకొనే ఉద్దేశ్యాన్ని కూడా విరమించుకొన్నాను. కాని నాకు ఆయన ఎప్పుడూ యిచ్చే సమాధానం ఒకటే. సంవత్సరాలుగా నేనడుగుతున్న ప్రశ్నకి సమాధానం రామనవమినాడు అనగా ఈరోజు నాకోరిక నెరవేరుతుందని. జీవితంలో కోల్పోయిన సుఖసంతోషాలను నాకు తిరిగి ప్రసాదించమని బాబా ముందు ప్రతిరోజూ విలపిస్తూ ప్రార్ధించేదానిని. ఈరోజున అంటే రామనవమినాడు నాభర్తను నాకు తిరిగి వచ్చేలా చేస్తానన్నదే బాబా చెప్పిన సమాధానం. ఆశుభసమయం కోసమే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. కాని నేను కోరుకొన్నట్లుగా ఏమీ జరగలేదు. బాబా దగ్గరకెళ్ళి తనివితీరా ఏడిచాను. కాస్త మనసు తేలిక పడిన తరువాత మరలా సాయిబాబా సమాధానాలకోసం అతర్జాలంలో చూశాను. అందులో "అన్నదానం చేయి. నీకు శుభం కలుగుతుంది" అని వచ్చింది. ఇక్కడ నేను ఉన్న ప్రాంతం లో చుట్టూ ధనవంతులు ఉన్నారు. పెద్ద పెద్ద భవనాలు. ఇక్కడికి భిక్షగాళ్ళు ఎవరూ రారు. అన్నం పెడదామన్నా యింతవరకూ నేను ఏభిక్షగాడిని చూడలేదు.
బీదవారు ఎవరయినా కనపడతారేమో చూద్దామని మెయిన్ రోడ్డు వైపు నడుస్తున్నాను. ఇక మెయిన్ రోడ్డుకు చేరుకుంటాననగా "అసల్లాము ఆలేకుం" అని ఎవరో నన్ను పిలవడం వినిపించింది. ఎవరు పిలుస్తున్నారా అని వెనక్కి తిరిగి చూశాను. ఒక యింటి గోడ ప్రక్కగా ఒక నిరుపేద ముస్లిం స్త్రీ ఒక చిన్న పిల్లవాడితో నిలబడి ఉంది. కళ్ళలోంచి ఆనంద భాష్పాలు జాలువారుతుండగా, నా చేతిలో ఉన్న ఆహారం పొట్లం ఆపిల్లవాడికిచ్చి, వెళ్ళిపోయాను. నావెనుక ఆస్త్రీ నన్ను ఆశీర్వదించడం నాకు వినపడింది. నేను రోడ్డుకు చేరుకొన్న తరువాత ఆమెని, పిల్లవాడిని చూద్దామని వెనుకకు తిరిగాను. వాళ్ళిద్దరూ నాకు కనపడలేదు. నేనక్కడినుండి బయలుదేరగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారో, లేక నానుంచీ ఆహారాన్ని స్వీకరించి నన్ను సంతోషపెట్టడానికి బాబాయే ఆరూపంలో వచ్చారో నాకు తెలీదు. బాబాయే స్వయంగా వచ్చి నన్ననుగ్రహించారని పొంగిపోయాను. బాబాని చూడాలనే ప్రగాఢమయిన కోరిక కలిగింది. ఇక్కడ శ్రీలంకలో సాయి మందిరాలు లేవు. అంతర్జాలంలో సాయిమందిరాలు ఏమయినా ఉన్నాఏమో చూసి చిరునామాలు, ఫోన్ నంబర్లు వెబ్ సైట్లలో వెతికి పట్టుకున్నాను. అవి నిజంగా సాయి మందిరాలు అవునో కాదో తెలుసుకోవడానికి ఆ నెంబర్లకు ఫోన్ చేశాను. కాని ఆరెండు నెంబర్లు కూడా పనిచేయడంలేదు. ఎలాగయినా సాయిమందిరానికి వెళ్ళాలని నిశ్చయించుకొని బ్యాంక్ లో నా ఖాతాలో ఆఖరుగా మిగిలిన కొద్ది మొత్తం తీసేసుకొని ఆటోలో బయలుదేరాను. అక్కడ ఎవరిని అడిగినా తమకు సాయిమందిరాల గురించి తెలియదని చెప్పారు. ఎలాగయినా నీ మందిరానికి చేర్చి, నీ దర్శన భాగ్యం కలిగించు బాబా అని ప్రార్ధించాను.
నా దగ్గిర ఎక్కువ డబ్బు కూడా లేదు. దూరదూరాలు వెళ్ళి మధ్యలో చిక్కుకు పోతే చేతిలో డబ్బు లేకుండా తిరిగి వెళ్ళలేని పరిస్థితి. తొందరగా నీదర్శన భాగ్యం కలుగచేయి అని వేడుకొన్నాను. చిరునామా ప్రకారం నేను చేరుకున్న రోడ్డులో ఎక్కడా సాయి మందిరం కనిపించలేదు. అక్కడ ఎవరిని అడిగినా మాకు తెలీదనే చెప్పారు. నాకు చాలా బాధ కలిగింది. మళ్ళీ ఆటోలో కూర్చున్నాను. నేనింక ఆశ వదిలేసుకున్నాను, ఆటో డ్రైవరు మాత్రం ఆటోని మెల్లిగా నడుపుతూ తనుకూడా బాబా మందిరం ఎక్కడ కనపడుతుందాని వెతుకుతున్నాడు. ఆవీధిలో ఉన్న అన్ని సందుల్నీ చూస్తూ ఒక సన్నటి సందు ముందర ఆగి, యిక్కడ 10/2 ఉంది కాబట్టి 10/4 కూడా యిక్కడే ఉండచ్చు. ఒకసారి వెళ్ళి చూడమని చెప్పాడు.
అక్కడ మందిరాలు ఏమీ లేవు. కాని ఆరోడ్డులో ఒక మూడంతస్తుల భవనం ఉంది. గోడమీద షిరిడీ సాయిబాబా పోస్టరు ఉంది. వెంటనే గోడమీద అతికించి ఉన్న బాబా ఫొటో వద్దకు వెళ్ళి చూశాను. కాని గేటుకి తాళం వేసి ఉంది. అక్కడ అతికించిన పోస్టర్ మీద 'ఇది సాయి మందిరం. ఈమందిరం ఉదయం 2గంటలసేపు, సాయంత్రం 2 గంటల సేపు మాత్రమే తెరువబడును అని రాసిఉంది. ఏమిచేయాలో నాకర్ధం కాలేదు. ఇపుడు మధ్యాహ్న్నం ఒంటిగంట అయింది. తిండితిప్పలు లేకుండా, చేతిలో డబ్బు లేకుండా సాయంత్రం 5 గంటలవరకూ వేచి ఉండాలి. అక్కడే 5 నిమిషాలు నిలబడ్డాను. ప్రక్కయింటి గేటు దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడిని దగ్గరకు పిలిచి, యిప్పుడు లోపలికి వెళ్ళి బాబాని చూడచ్చా అని అడిగాను. యింటి ముందున్న కాలింగ్ బెల్ కొట్టమని అప్పుడు లోపలికి వెళ్ళవచ్చని చెప్పాడు. అలా చెప్పి తనే కాలింగ్ బెల్ కొట్టాడు. ఓం సాయిరాం అని నామస్మరణ చేస్తూ నుంచుని ఉన్నాను. ఒక స్త్రీ తలుపు తెరిచింది. లోపలికి వచ్చి బాబా దర్శనం చేసుకోవచ్చా అని ఆమెనడిగాను. ఆమె లోపలికి రమ్మని ఆహ్వానించింది. అది ఒక బాబా ప్రార్ధనా స్థలం అనుకున్నాను. కాళ్ళు కడుగుకొని మేడమీదకు వెళ్ళమని చెప్పింది. పైకి వెళ్ళగానే తలుపు ప్రక్కనే బాబా ఫొటో ఉంది. బాబా ఫొటో ముందు నుంచొని ఆయనకు నమస్కరించి గదిలోపలకు చూశాను. గదిలో తెల్లటి బాబా విగ్రహం, పైన పెద్ద చత్రం తో కనిపించింది. బాబా విగ్రహం చిరునవ్వు చిందిస్తూ కరుణామయ దృక్కులతో చూస్తూ ఉన్నారు.
వెంటనే ఆయన పాదాలముందు వాలిపోయి ఏడవసాగాను. బాబా, ఆఖరికి నన్ను నీదరికి చేర్చావు. ఇదేనా రామనవమినాడు నీవు చూపిస్తానన్న అద్భుతం! బాబా మందిరాన్ని దర్శించాలని ఉందని ఎప్పుడూ అనుకునే నాకోరికను యిప్పుడు తీర్చావా!
మనస్ఫూర్తిగా ఆయనను ప్రార్ధించుకొని, కాసేపటి తరువాత అక్కడినుండి బయలుదేరాను. మరలా నాజీవితంలో సుఖసంతోషాలు కలిగి నాపూర్వపు జీవితం నాకు తిరిగి వస్తే షిరిడి వచ్చి బాబాను దర్శించుకుంటానని మొక్కుకొన్నాను. నేను ముస్లిం అయినప్పటికీ నాసద్గురువు సాయిబాబాపై నమ్మకం ఉంది. ఆయనను నేనెప్పుడూ వదలి ఉండలేను. బాబా నామొఱ ఆలకించి, నాభర్తను తిరిగి నావద్దకు తిరిగి వచ్చేలా చేస్తారనీ, జీవీతంలో నేను కోల్పోయినవాటిని నేను మరలా తిరిగి పొందగలననె నమ్మకం నాకుంది. పోయిన నాఉద్యోగం, సంతానం, ప్రతీదీ కూడా నాసాయి నాకు తిరిగి యిప్పిస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాను.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment