25.08.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు మరొక అద్భుతమైన
బాబా లీలలను తెలుసుకుందాము. బాబా, డాక్టర్ పితలే
కుటుంబంవారికి ఎన్ని అధ్బుతమైన అనుభవాలను ఇచ్చారో తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తుంది. సాయిలీల ద్వైమాసపత్రిక మే – జూన్ 2010 వ.సంవత్సరంలో
ప్రచురింపబడిన ఆంగ్ల వ్యాసానికి తెలుగు అనువాదమ్.
వ్రాసినవారు ః శ్రీమతి మయూరి మహేష కదమ్
మరాఠీనుండి ఆంగ్లంలోకి అనువదించినవారు : శ్రీమతి షంషాద్ ఆలీ బేగ్
సాయిసేవలో తరించిన డాక్టర్
కుటుంబం – డాక్టర్ పితలే దంపతులు
మనకి కొంతమంది వ్యక్తులు
తారసపడుతూ ఉంటారు. నేను ఈ దేవుడికి భక్తుడిని లేక ఆ గురువుకు శిష్యుడిని ఇలా తమకు తామే
చెప్పుకుంటూ ఉంటారు. కాని భక్తుడు లేక శిష్యుడు
అనిపించుకోవడానికి తగిన అర్హతలు లక్షణాలు ఏమిటో ఎంతమంది అర్ధం చేసుకోగలరు? ఫలానా దేవుడికి, లేక సద్గురువుకు నేను భక్తుడిని,
శిష్యుడిని అని చెప్పుకునే ముందు మనలో భక్తుడికి ఉండవలసిన లక్షనాలు ఉన్నాయా లేవా, మనం
ఆయన చెప్పిన బోధలని చెప్పినవి చెప్పినట్లుగా ఆచరిస్తున్నామా లేదా అని అత్మ విమర్శ చేసుకోవాలి. సమాజంలో గుర్తింపు కోసం మనకి మనమే భక్తునిగా, శిష్యునిగా
ప్రకటించుకోకూడదు.
ఎవరయితే తాను నమ్మే భగవంతుడు
లేక గురువుయొక్క బోధనలను పాటిస్తూ దానికనుగుణంగా నడచుకుంటూ వశుడయి ఉంటాడో, అతనే సరైన
శిష్యుడు. అతనిలో ఈ గుణాలన్నీ ప్రతిబింబిస్తూ
ఉంటాయి. నిజమయిన తన గురువు చెప్పిన బోధనలను
ఆచరిస్తాడు. (శ్రీసాయి సత్ చరిత్ర అ.23, ఓ.వి.
172, 189). అటువంటి ఉత్తముడయిన శ్రీసాయిబాబా
భక్తుడయిన డా.అమోత్ పితలేగారు ముంబాయి విలేపార్లేలో ఉంటారు. ఆయన గురుస్థాన్ ట్రస్టీలో సభ్యులు.
శ్రీసాయి సత్ చరిత్ర
32వ.అధ్యాయంలో వివరించినట్లుగా మానవ జీవితం పరోపకారార్ధం ఉపయోగపడాలి. అపుడే మన జన్మ సార్ధకమవుతుంది. ఆవిధంగానే శ్రీసాయిబాబా బోధించిన ప్రకారం డా.పితలేగారు
దశాబ్ద కాలంగా ఎంతోమందికి సేవచేస్తూ ఉన్నారు.
ఎంతోమంది భక్తులు కాలినడకన షిరిడీకి యాత్ర చేస్తూ ఉంటారు. డా.పితలేగారు అటువంటి వారందరికీ వైద్య శిబిరాలను
ఏర్పాటు చేసి అవసరమయినవారికి మందులు ఇస్తూ వైద్యం చేస్తున్నారు. గుడిపడవ దగ్గరనుంచి రామనవమి వరకు నాసిక్ నుండి
షిర్డీకి వచ్చే యాత్రికులందరికీ ఆయన వైద్యం చేస్తున్నారు. ఈ వైద్య సేవా కార్యక్రమాలలో ఆయనకు భార్య డా.అనిత,
ఆయన సోదరి డా.శ్రధ్ధ, సోదరి భర్త డా.ఉజ్వల్ భూరె, తల్లి షైలా పితలే, వీరంతా ఆయనతోపాటుగా ఈ వైద్య సేవాకార్యక్రమాలలో పాలుపంచుకొంటున్నారు. ఎనిమిది
రోజులపాటు సాగే ఈ యాత్రలో ఒక యాత్రికుల బృందంనుంచి మరొక బృందం దగ్గరకు వెడుతూ ఉండేవారు. ఆవిధంగా ఆయన దాదాపుగా 4,500 కి.మీ. ప్రయాణం చేస్తూ
ఉంటారు.
డా.పితలేగారి గురించి
ప్రముఖ గాయకురాలయిన అనుపమా దేశ్ పాండే గారి ద్వారా విన్న తరువాత ఆయనను కలుసుకోవాలని
నిర్ణయించుకున్నాము. వారింటికి ఎప్పుడు రమ్మంటారో ఆయనను సంప్రదించిన తరువాత ఆయన చెప్పిన రోజుకు విలేపార్లేలో
వారింటికి వెళ్ళాము పూర్తిగా సాయిభక్తి సాగరంలో మునిగిపోయిన వారి కుటుంబాన్ని కలుసుకోగానే
మేమెంతగానో ఆనందించాము. వారింటిలోకి ప్రవేశించగానే
మనసుకు పరవశంకలిగే దృశ్యం. హాలులో ఉన్న రెండున్నర
అడుగుల ఎత్తయిన సాయిబాబా వారి ఇత్తడి విగ్రహం.
ఆవిగ్రహాన్ని చెక్కిన శిల్పి డా.పితలేగారి తండ్రి స్వర్గీయ మనోహర్ పితలే.
చిరునవ్వులు చిందిస్తూ
ఉన్న ఆ ఘనమయిన బాబా విగ్రహాన్ని మైమరచి చూస్తున్నంతలో డా.పితలేగారి ఒక సంవత్సరం నాలుగు
నెలల వయసుగల పాప నిష్టా పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చింది. ఆ యింటిలోని కుటుంబంలోని పెద్దవారే కాక అతిచిన్న
వయసుగల ఆ పాప కూడా “బాబా – బాబా” అంటూ బాబాముందు దీపాలు వెలిగించడంలో నిమగ్నమయిపోయింది.
అప్పుడు డా.పితలేగారు
“నిష్టాకి బాబా అంటే ఎంతో భక్తి. ప్రతిరోజూ
ఉదయం లేవగానే హాలులోకి వచ్చి మమ్మల్ని ఎత్తుకోమంటుంది. అపుడు మాపాప బాబాని ముద్దు పెట్టుకుంటుంది. మేము పూజ చేస్తున్నపుడు పాప ఆరతి పాడలేదు కాబట్టి,
“బాబా – బాబా” అని అంటూ బాబా నామాన్ని ఉఛ్చరిస్తూనే ఉంటుంది” అని చెప్పారు.
ఆతరువాత పితలేగారు మాకొక
ఫొటో చూపించారు. ఆఫోటో చూడగానే మేమంతా షాక్
కి గురయ్యాము. మా మనసుల్లో మెదిలిన మొట్టమొదటి
ఆలోచన ‘ఇది సంభవమేనా’? ఆఫొటోలో నిష్టా బాబాని ముద్దు పెట్టుకుంటూ ఉంది. అపుడు బాబా కూడా పాపని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా
ఉంది. నిజానికి విగ్రహంలోని బాబా పెదవులు మూసుకునే
ఉన్నాయి. కాని ఫొటోలో బాబా, పాప ఇద్దరూ ముద్దు
పెట్టుకుంటున్నట్లుగా ఉంది.
దీనికి సంబంధించిన సంఘటనని
గుర్తు చేసుకుంటూ ఆఫొటో గురించి వివరంగా చెప్పారు. “ఆరోజు మాపాప మొట్టమొదటి పుట్టినరోజు. ఎప్పటిలాగానే పాపను ఎత్తుకుని బాబా దగ్గరగా తీసుకుని
వెళ్ళాను. మాపాప బాబాను ముద్దు పెట్టుకుంది. అదేక్షణంలో ఫొటో తీసారు. ఆ సమయంలో మాకు అసాధారణంగా ఏమీ కనిపించలేదు. ఫొటో ప్రింటులు వచ్చాక కూడా మేమేమీ పరిశీలనగా చూడకుండానే
హాలులో గోడకి తగిలించాము. ఒకసారి నాస్నేహితుడు
మాయింటికి వచ్చినపుడు అతను చూసి ఈవిషయం చెప్పాడు”.
డా.పితలే ఈ విషయం చెబుతున్నపుడు
ఆయన కళ్ళలో ఒక విధమయిన సంతోషం, భావోద్రేకాలు కలిగాయి. “శ్రీసాయిబాబా పితలే కుటుంబం అయిదు తరాలవారికీ తమ
అనుగ్రహాన్ని చూపిస్తూ ఉన్నారన్నదానికి ఈ సంఘటనే తిరుగులేని సాక్ష్యం” అన్నారు.
“అయిదు తరాలా?” ఆశ్చర్యపడుతూ అడిగాము.
డా.పితలే అప్పుడు పూర్తిగా
వివరించి చెప్పారు. “అవును. నిష్ట పితలే కుటుంబంలో
అయిదవ తరం. ఆపాపను కూడా బాబా ఆశీర్వదించారు. మా ముత్తాతగారయిన స్వర్గీయ విష్ణుపంత్ పితలే గారు
1916 వ.సంవత్సరంలో బాబాను స్వయంగా దర్శించుకున్నారు. మొట్టమొదటి దర్శనంతోనే ఆయన ప్రేమ మాముత్తాతగారిని
కట్టిపడేసింది. ఆసమయంలోనే మాముత్తాతగారు బాబాను
ఫొటో తీసి, దానిని ద్వారకామాయిలో ఇచ్చారు.
ఆ ఫొటోకు బాబా తమ ఆశీస్సులనందచేశారు.
ఇప్పటికీ ఆఫొటో మాయింటిలో ఉంది. ఆరోజునుంచి
ఈనాటివరకు బాబా మాకుటుంబంలో మాతోనే ఉన్నారు.
ఆయన ఆశీర్వాదాలను పొందుతూ ఉన్నాము.”
(ఇంకా ఉంది)
(రేపటి సంచికలో డా.పితలేగారికి ఊదీ చూపించిన అధ్భుతాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment