06.09.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబాబాకు అంకిత భక్తుడయిన అబ్దుల్ గురించి తెలుసుకుందాము. అబ్దుల్ గురించిన సమాచారం సాయిపధం వారి సైట్ నుండి గ్రహింపబడింది. సాయి భక్తుల గురించి శ్రీ బి.వి. నరసింహస్వామి గారు వారిని స్వయంగా కలుసుకుని వారు చెప్పిన విషయాలన్నీ మనకి సమగ్రంగా అందించారు. శ్రీ బి.వి. నరసింహస్వామి గారు అబ్దుల్ ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అబ్దుల్ చెప్పిన సమాచారాన్ని అతని మాటలలోనే వివరించారు.
సాయి భక్తులు – అబ్దుల్
అబ్దుల్ – తండ్రి – సుల్తాన్
వయస్సు సుమారు 65 సంవత్సరములు, ముసల్మాన్, ఖాందేష్ లోని నాందేడు ప్రస్తుత నివాసం షిరిడీ
నేను తపతీనది తీరంలో
ఉన్న నాందేడు నుండి 45 సంవత్సరాల క్రితం అనగా 1889 వ.సం.లో షిరిడీ వచ్చాను. మొదట నేను నాందేడుకు చెందిన అమీరుద్దీన్ ఫకీరు ఆశ్రయంలో
ఉన్నాను. ఆ ఫకీరుకు సాయిబాబా కలలో దర్శనమిచ్చి
రెండు మామిడిపండ్లను ఇచ్చి వాటిని నా చేతికిచ్చి, నన్ను షిరిడీకి పంపించమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీరు తనకు వచ్చిన కల విషయం చెప్పి,
మామిడిపండ్లను ఇచ్చి నన్ను షిరిడీలోని సాయిబాబా వద్దకు వెళ్ళమని చెప్పారు.
నేను ఇక్కడికి నా 20వ.సంవత్సరంలో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చందోర్కర్ కూడా బాబా వద్దకు
రాలేదు. బాబా నన్ను చూడగానే “మేరా కావ్ లా
ఆలా” “నా కాకి వచ్చింది” అంటూ నన్ను ఆహ్వానించారు. బాబా నన్ను తత సేవకు పూర్తిగా అంకితమవ్వమని ఆదేశించారు. మొదటినుండి నేను ఐదు అఖండ దీపాలలో , ( లెండీ, మసీదు,
చావడి మొదలైనవాటిలో ఉన్న దీపాలు) నేను పోయడం, వాటిని వెలిగించడం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు కాని మరెవ్వరికీ కాని భోజనం పెట్టేవారు
కాదు. ఏదో విధంగా నాకు నేను భోజనం సంపాదించుకొంటూ
ప్రస్తుతం ఉన్న గుఱ్ఱపుశాలలో సుమారు 5 లేక 6
సంవత్సరాలు ఉన్నాను. నేనెప్పుడూ బాబా
సేవచేస్తూ వారి ప్రక్కనే గడిపేవాడిని. నేను
రోజుకు మూడుసార్లు స్నానం చేసేవాడిని. మసీదులో
వారిదగ్గర కూర్చుని ఖురాన్ పఠించేవాడిని.
అప్పుడప్పుడు
బాబా ఖురాన్ తెరచి ఆ పేజీలో ఉన్న భాగాలను చదవమనేవారు.
అప్పుడప్పుడు బాబా ఖురాన్ లో ఉన్న వాక్యాలను చెప్పేవారు. బాబా నోటినుండి వెలువడిన ప్రతీమాటా
పవిత్రమైనదే. వారు చెప్పిన మాటలను నేను మరాఠీ, మోడీ లిపిలో వ్రాసిన పుస్తకం
ఇదె.
బాబా నోటివెంట వెలువడిన
మాటలు నన్నేకాకుండా అందరినీ సరియైన మార్గంలో నడిపిస్తాయని నానమ్మకం. అందువల్ల వారి ప్రవచనాల పుస్తకాన్ని క్రింద చెప్పిన
విధంగా ఉపయోగించేవాడిని. బాబా ఆశీర్వాదం వల్ల నాకు ఆయన చెప్పిన మాటలలో సంపూర్ణమైన విశ్వాసం
ఉంది. ఎవరైనా తమ భవిష్యాత్తును తెలుసుకోదలచినప్పుడు గాని క్లిష్టసమస్యలు ఎదురైనప్పుడు
గానీ నాదగ్గరకు వస్తూ ఉండేవారు. నేను భక్తితో
బాబాను మనసులో తలచుకొని పుస్తకాన్ని తెచిచి చూసేవాడిని. తెరిచిన పేజీలో వాళ్ళ భవిష్యత్తుకు
లేదా సమస్యలకు సంబంధించి సమాధానం ఉండేది. ఈ విధంగా ఎన్నో సార్లు జరిగింది. అన్నీ కూడా బాబా చెప్పినవిధంగానే జరిగాయి. బాబాయే
నాచేత ఈ భవిష్యవాణిని చెప్పిస్తున్నారు. ఇందుకు రెండు ఉదాహరణలిస్తాను. ఒకసారి సాయి మందిరంలో ఒక బావిని త్రవ్వారు. కాని ఆబావిలో ఉప్పునీళ్ళు పడ్డాయి. వాళ్ళు నాదగ్గరకొచ్చారు. నేను ప్రవచనాల పుస్తకాన్ని సంప్రదించాను. మరికొంత లోతు త్రవ్వితే మంచినీళ్ళు పడతాయని అందులో
ఉంది. నేను వెళ్ళి మరి రెండడుగులు త్రవ్వాను. మంచినీళ్ళు పడ్డాయి. ఈ సంఘటన బాబా మహాసమాధి
చెందిన తరవాత జరిగింది. ఇక రెండవది బారిష్టర్
గాడ్గిల్ కు సంబంధించినది. అతని కుమారుడు ఇంగ్లండ్
వెళ్ళాడు. అతను తిరిగి ఇండియా వస్తాడా లేక
అక్కడే స్థిరపడతాడా అని అడిగాడు. నేను అతను తిరిగి వస్తాడని చెప్పాను. అలాగే అతని కుమారుడు తిరిగి వచ్చాడు. నేను ఈ ప్రవచనాల
పుస్తకాన్ని ఖురానంత పవిత్రంగా భావించేవాడిని.
నేను ఈ పుస్తకాన్ని ఎంతో భక్తితో పఠిస్తూ, జపమాల త్రిప్పుతూ బాహ్యప్రపంచం మరచి
అందులో పూర్తిగా నిమగ్నమైపోయేవాడిని.
నేను ఒక స్త్రీ ముఖం
చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడిని. నేనలా చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఇదంతా బాబా కృపవలనే సంభవమయింది. నా దగ్గరకు వచ్చేవాళ్ళని నేను ఆశీర్వదిస్తూ ఉండేవాడిని. పైన చెప్పినట్లుగా నేను ఈ పుస్తకాలను పారాయణ గ్రంధంగానే
కాకా భవిష్యదర్శినిగా కూడా ఉపయోగించేవాడిని.
లెండీలో స్థూపంగా కట్టబడిన
దానిమీద ‘నందదీపం’ అనే అఖండదీపం ఉండేది. సాధారణంగా
బాబా ఆ స్థూపం వెనుక కూర్చొనేవారు. దీపానికి
అడ్డుగా స్థంభం ఉండడంవల్ల అక్కడినుండి వారికి ఆదీపం కనిపించేది కాదు. బాబా ఆ దీపంవైపు తమ దృష్టి సారించినట్లు కూడా నేను
చూసి ఎరుగను. నేను బాబాకు లెండీలోను, ఇతరచోట్ల
సేవ చేసేవాడిని. కుండలనిండా నీరు తెచ్చి లెండీలో పెట్టేవాడిని.
బాబా రెండు కుండల దగ్గర కూర్చొని నీటిని అన్ని దిక్కులకు చల్లేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో నీరు చల్లేటప్పుడు ఆయన
ఏదయినా మంత్రం ఉఛ్చరించేవారో లేదో నేను చెప్పలేను. ఆ సమయంలో నేను తప్ప అక్కడ మరెవరూ ఉండేవారు కాదు.
బాబా దగ్గర కూర్చుని
నేను తప్ప ఇతర మహమ్మదీయులెవ్వరూ ఖురాను గాని ఇతర పవిత్ర గ్రంధాలను గానీ పారాయణ
చేసారని నేను అనుకోవడంలేదు. బాబా అప్పుడప్పుడు
పవిత్రమైన పదాలను ఉఛ్ఛరిస్తూ ఉండేవారు. నేను
వాటినన్నిటినీ ఈ పుస్తకంలో వ్రాసాను. ఈ పుస్తకాన్ని
మీరు గాని, ఇతర భక్తులు ఎవరయినా కానీ చదవవచ్చును.
ఇది దేవనాగరి లిపిలో గాని, మోడీ లిపిలో గాని ఉంటుంది.
(తరువాత అబ్దుల్ ఈ పుస్తకాన్ని
బి.వి.నరసింహస్వామి చేతికిచ్చాడు. ఆయన పుస్తకాన్ని తెరిచి చూసారు. అది మరాఠీ భాషలో వ్రాయబడి ఉంది. అందులో బాబా నోటినుండి వెలువడిన మాటలు ఉన్నాయి.
మారుతీ స్తోత్రాలున్నాయి. దేవునియొక్క అవతారాలున్నాయి. హిందూ దశావతారాలతో సహా మహమ్మద్ మరికొందరిని సంప్రదాయబధ్ధంగా
జోడించి వరుసగా వ్రాయబడి ఉన్నాయి. దానికి తగినట్లే
బాబా, ఆయనని అనుసరిస్తూ అబ్దుల్, ఇద్దరూ హిందూ అవతారాలపట్ల, మారుతి పట్ల భక్తిప్రపత్తులతో
ఉండేవారు, ప్రార్ధించేవారు)
నేను ఇంతముకుందు పైన
చెప్పినట్లుగా ఈ పుస్తకాన్ని ప్రతిరోజు పారాయణ చేయడమే కాదు, అందరూ అడిగే ప్రశ్నలకు
భవిష్యవాణిగా కూడా ఉపయోగిస్తూ ఉండేవాడిని.
మార్చి, 10 1938 న అబ్దుల్
షిరిడీలో చెప్పిన విషయాలు
మహమ్మదీయులెవరూ కూడా
బాబాకు ఖురాన్, షరీఫ్ వంటి పవిత్ర గ్రంధాలను చదివి వినిపించడం గాని, వాటిలోని విషయాలను
వివరించమని అడగడం గాని జరగలేదు. ఎంతోమంది
ఫకీర్లు, ముస్లిం సాధువులు బాబా దగ్గరకు వచ్చేవారు. కాని బాబా వారితో ఖురాన్ గురించి గాని, షరీఫ్ గురించి
గాని చర్చించేవారేమో నాకు తెలియదు.
నేను బాబాకు సేవలు చేస్తూ,
వీధులను తుడిచి, కసవును ఊడ్చి, రాత్రంతా మేలుకుని బాబా దగ్గర కూర్చుని ఖురాను చదవడంవంటి
పనులలో నిమగ్నమై ఉండేవాడిని. ఖురాను చదువుతూ
నన్ను నిద్రపోకూడదని బాబా చేప్పేవారు.
“చాలా
స్వల్పంగా తిను, రకరకాల పదార్ధాలను తిందామనే
కోరికను పెట్టుకోవద్దు, (రుచులకు పోవద్దు,) ఒక్క పదార్ధంతో తృప్తి పడు, అతిగా నిద్రపోవద్దు”
అని చెప్పేవారు బాబా. నేను బాబా సలహా ననుసరించి
చాలా స్వల్పంగా తినేవాడిని. రాత్రంతా మేలుకొని
ఉండేవాడిని. మోకరిల్లుతున్న భంగిమలో ఉండి, బాబా
సన్నిదిలో ఖురానును మననం చేసుకోవడం గాని, ధ్యానం చేసుకోవడం గాని చేస్తూ ఉండేవాడిని. నేను చదువుతున్న దానిమీదనే దృష్టి పెట్టమని చెప్పేవారు
బాబా. “నేనెవరినో తెలుసుకో” అన్నారు బాబా.
(మిగిలిన భాగం రేపు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment