Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, November 12, 2020

మనసులోని కోరికలను తీర్చిన బాబా...

Posted by tyagaraju on 4:28 AM

                        

                            (శాన్ జోస్ లోని బాబా మందిరమ్)

                  (BABA MANDIR AT SAN JOSE U S A)

12.11.2020 గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

 మనసులోని కోరికలను తీర్చిన బాబా...

ఈ రోజు అధ్భుతమయిన రెండు లీలలను ప్రచురిస్తున్నాను.  ఒకటి అమెరికానుండి సాయి బంధు శ్రీ సుబ్రహ్మణ్యంగారు పంపించారు.  మరొకటి చెన్నైనుండి శ్రీమతి కృష్ణవేణిగారు పంపించారు.  రెండూ అధ్బుతమయిన బాబా లీలలు.  ముందుగా శ్రీ సుబ్రహ్మణ్యంగారు ఆంగ్లంలో  పంపించినదానికి తెలుగు అనువాదమ్…

(Experience of Sai Devotee Sri Subrahmanyam gaaru from 

  U S A)

రెండువారాల క్రితం నాకు శ్రీ సాయి సత్ చరిత్రలోని 38వ.అధ్యాయాన్ని (బాబా గారి వంటపాత్ర) పారాయణకు కేటాయించారు.  నాపారాయణ పూర్తవగానే ఆ అధ్యాయానికి అనుగుణంగా ఉండే బాబా చిత్రంతో కూడిన సందేశాన్ని కూడా పెడుతూ పారాయణ గ్రూపులో పోస్ట్ చేస్తూ ఉంటాను.  


నాకు శ్రీసాయి సత్ చరిత్రలోని 42 వ అధ్యాయాన్ని కేటాయించినపుడు శ్రీసాయిబాబా వారి మహాసమాధి సంఘటనకు సరిపోయే విధంగా చిత్రంతో కూడిన సందేశాన్ని పెట్టాను.  ఈ సారి 38వ.అధ్యాయం (హండీ) కి తగినట్లుగా బాబావారు పెద్దవంట పాత్రలో అన్నం వండుతున్న చిత్రాన్ని పెడదామనుకున్నాను.

కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో ఉన్న బాబా మందిరం దర్బారులో శ్రీసాయిబాబావారు పెద్ద గుండిగలో అన్నం వండుతున్న విగ్రహం ఉంది.  అనుకోకుండా మా అబ్బాయి ఆ గురువారమునాడు శాన్ జోస్ కి వెళ్లడం తటస్థించింది.  అక్కడి బాబా విగ్రహాన్ని ఫోటో తీసి నాకు పంపించమని మా అబ్బాయికి చెబుదామనుకొన్నాను.  మా అబ్బాయికి ఆఫీసు పని వత్తిడి బాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మా అబ్బాయికి ఆ విషయం చెప్పడానికి నేను కాస్త సంకోచించానేమో లేక నేను మర్చిపోయానో నాకు తెలియదు.  ఏమయినాగాని,  ఆరోజు సాయంత్రం మా అబ్బాయి అక్కడి బాబా మందిరానికి వెళ్ళి బాబా విగ్రహాన్ని ఫోటో తీసి నాకు పంపించాడు. ( మా అబ్బాయి ప్రతిగురువారమునాడు బాబా దర్శనానికి ఆమందిరానికి వెడుతూ ఉంటాడు).  మా అబ్బాయి ఆ మందిరానికి ఎప్పుడు వెళ్ళినా మందిరంలోని ప్రధాన విగ్రహాన్ని మాత్రమే ఫోటో తీసి పంపుతూ ఉంటాడు.  కాని, ఆ రోజు మా అబ్బాయి బాబావారు వంటపాత్రతో ఉన్న విగ్రహం ఫోటో తీసి పంపించాడు.  



          ( శ్రీ సుబ్రహ్మణ్యమ్ గారికి వారి కుమారుడు పంపించిన శాన్ జోస్ లోని బాబా విగ్రహం ఫోటోలు)

నా మనసులోని కోరికను గ్రహించి మా అబ్బాయి చేత బాబా తన ఫోటో పంపించినందుకు నేనెంతగానో సంతోషించాను.  ఎంతో సంతోషంతో ఆ రోజు నేను ఫోటోలతో సహా పారాయణ గ్రూపులో పోస్ట్ చేసాను.

2. (EXPERIENCE WITH BABA TOLD BY SMT.KRISHNAVENI)

2.  చెన్నైనుండి శ్రీమతి కృష్ణవేణిగారికి బాబా వారు కొద్దిరోజుల క్రితమే ఇచ్చిన అనుభవాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా పంపించారు.  ఆమెకు బాబా ఏవిధంగా అనుభవాన్ని కలుగజేసారో ఆమె మాటలలోనే….

“నేను చెన్నైనుండి కృష్ణవేణిని నా అనుభవాన్ని మీకందరికీ తెలియచేస్తాను.  ఇది చిన్న లీల అయినా నాకెంతో సంతోషాన్ని కలిగించింది.  బాబాగారి ఏకాదశ సూత్రాలలో నా భక్తుల ఇంటిలో అన్న వస్త్రాలకు ఎప్పుడూ లోటు ఉండదు అని  చెప్పిన తన మాటను నిజం చేస్తూ ఒక చిన్న లీలను బాబా చూపించారు.  ఆలీలను మీ అందరితో కూడా పంచుకుంటే నాకింకా ఎంతో ఆనందం కలుగుతుంది. 

మా వారు ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.  ఈ మధ్య కరోనా ప్రభావం వల్ల కంపెనీవారు మావారికి జీతం ఒకోసారి సగం, ఒకోసారి 75 శాతం ఈ విధంగా ఇస్తున్నారు. అందువల్ల జీతం సక్రమంగా రాకపోవడంతో మా పిల్లల స్కూలు ఫీజులు, ఇంటికి సంబంధించిన ఖర్చులను తట్టుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది.  క్రిందటి నెలలో అనగా అక్టోబరులో మా పెద్దపాపకి స్కూలు ఫీజు కట్టాల్సి రావడం,  ఆనెలాఖరులోనే మాపెద్ద పాప పుట్టినరోజు కావడం, వీటివల్ల ఖర్చుకాస్త ఎక్కువయి డబ్బుకు కాస్త ఇబ్బంది కలిగింది.  మావారికి కంపెనీవారు ప్రతి విజయదశమికి బోనస్ ఇస్తూ ఉంటారు.  మావారికి ప్రతెనెల జీతం ఏడవతారీకున ఇస్తారు.  అందుకని ఈ నెల ముందు పదిరోజులు ఏదోవిధంగా సర్దుబాటు చేసుకుంటే బోనస్ వస్తుందనే ఆశవల్ల డబ్బుకి ఏమీ ఇబ్బందిపడేలా ఉండదని భావించాను.    

మావారు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం ప్రతినెల ఇచ్చే జీతంలో సగం మాత్రమే బోనస్ గా ఇస్తూ ఉంటారు.  ఒకవేళ ఇచ్చే బోనస్ లో సగం ఇచ్చినా మళ్ళీ నెల జీతం వచ్చేవరకు పొదుపుగా వాడుకోవచ్చు అనుకున్నాను.  కాని, ఆరోజు విజయదశమిరోజు ఎప్పటిలాగానే మావారు ఆఫీసుకు వెళ్ళినపుడు కంపెనీ యజమాని వచ్చి కరోనా వల్ల కంపెనీ కాస్త నష్టాలలో ఉండటం వల్ల ఈ సారికి బోనస్ రెండుమూడు నెలల తరువాత అనగా జనవరిలో ఇస్తానన్నట్లుగా చెప్పారు.  ఆవిషయం తెలిసి నేను చాలా బాధపడ్దాను.  ఎవరినయినా డబ్బు సద్దుబాటు గురించి అడుగుదామన్నా నాకే ఇబ్బందిగా అనిపించింది.  అలా ఎవరినన్నా అడగటం నాకిష్టం ఉండదు. ఎదుటివారికి మాపరిస్థితిని ఆవిధంగా తెలిపి సాయం అడుగుదామన్నా నాకే ఇష్టం లేకపోయింది.  “బాబా ఈపరిస్థితినుండి నువ్వే ఆదుకోవాలి.  ఎలా బాబా! నాకు ఎవరినీ అడగటం ఇష్టం లేదు.  మీరే ఎలాగయినా చూడండి” అని ప్రార్ధించి ఏదోవిధంగా ఉన్న డబ్బునే జాగ్రత్తగా సద్దుబాటు చేసుకొంటు వచ్చాను.  ఇక ఆఖరిలో కాస్త కష్టంగా అనిపించింది. మావారి కంపెనీ యజమాని బోనస్ రెండుమూడు నెలల తరువాత ఇస్తానని చెప్పాడు.  జీతం కూడా ప్రతినెల ఏడవతారీకునే ఇస్తున్నారు.  నెలజీతం రావడానికి ఇంకా పదిరోజులు ఉంది.  దసరాకి వస్తుందనుకున్న బోనస్ కూడా రాలేదు.  ఎలాగా అని మనసులోనే మధనపడుతూ ఉన్నాను.  సమయానికి ఇంటిలో ఉన్న సరుకులు కూడా నిండుకుంటు ఉన్నాయి.  ఇక బాబాతోనే నాబాధను పంచుకొన్నాను.  “బాబా, నాకు ఎవరినీ డబ్బు అడగటం ఇష్టం లేదు.  నీభక్తుల ఇంటిలో దేనికీ లోటు ఉండదని నువ్వే మాట ఇచ్చావు కదా – నన్ను నీవు నీ భక్తురాలిని అని అనుకోలేదా బాబా, అనుకుంటూ మనసులోనే బాబాని వేడుకొన్నాను.  ఈ కష్టాన్నుండి నువ్వే బయట పడేయాలి.  నేనిక ఎవరి వద్దకు వెళ్ళి సహాయం చేయమని అడగలేను.  మీరే నాకు సహాయం చేయాలి అని వేడుకొన్నాను. 

నేను బాబాని ప్రార్ధించుకొన్న మరుసటిరోజునే మావారి కంపెనీ యజమాని ఫోన్ చేసి అక్టోబర్ 30వ.తారీకున బోనస్ ఇస్తున్నానని చెప్పారు.  ఎప్పుడూ బోనస్ గా జీతంలో సగం మాత్రమే ఇచ్చే యజమాని ఈసారి ప్రతినెల ఇచ్చే పూర్తిజీతం బోనస్ గా ఇస్తున్నానని చెప్పారు.  అంతేకాదు, ప్రతినెల ఏడవతారీకున ఇచ్చే జీతం కూడా ఆరోజునె అనగా మా పెద్దపాప పుట్తిన రోజు 30వ.తారీకునాడే ఇవ్వడం జరిగింది.  మాపాప పుట్టిన రోజున ఈవిధంగా జరగడం బాబా మాపాపని ఆశీర్వదించినట్లుగా నాకనిపించి ఎంతో సంతోషం కలిగింది.  బాబానువ్వు గొప్పగొప్ప భక్తులకు మాత్రమే స్పందిస్తావని, నీతో ఎక్కువసమయం గడిపే అవకాశంలేని మాలాంటి చిన్న చిన్న భక్తులని పట్టించుకోవేమో అనుకున్నాను. కాని నువ్వు నాప్రార్ధనను మన్నించావు అని మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. బాబాకు అందరూ సమానమే.  ఆయన దృష్టిలో గొప్ప, చిన్న అనే తారరమ్యాలు లేవు.  కష్టం వచ్చినపుడు సామాన్యంగా ఎవరయినా దేవుడినే నిందిస్తారు కదా!  కాని, భగవంతుడు మన మనసులోనే ఉంటాడని తెలిసినా కష్టమొచ్చేసరికి ఆవిషయాన్ని మర్చిపోతాము.  కాని బాబా తాను భక్తులందరిని సమదృష్టితోనే చూస్తానని నిరూపించడానికే నాకు సహాయం చేసారు.

మూడునెలల తరువాత బోనస్ ఇస్తానని చెప్పిన కంపెని యజమాని వారం తిరగకుండానే పిలిచి మరీ బోనస్ ఇవ్వడం, అదికూడా నేను బాబాని ప్రార్ధించుకున్న మరుసటిరోజే నా ప్రార్ధనను మన్నించి సహాయం చేయడం నిజంగా బాబా లీల అనే నాకనిపించింది.

బాబా నీకు మాకృతజ్ఞతలు.  మీ ఆశీర్వాదం ఎప్పుడూ నామీదనే కాదు, మన సాయిబంధువులందరి మీద ఇలాగే కురిపిస్తూ చల్లగా చూడు.

అందరి ఇళ్ళలోను సాయితత్త్వం బాగా ప్రచారంలోకి వచ్చి బాబాపై అందరూ మరింతగా నమ్మకాన్ని పెంచుకోవాలని కోరుకొంటున్నాను.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List