29.01.2021 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 37 వ.భాగమ్
( పరిశోధనా రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
సాకోరి – శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం
– ఉదయం 11 గంటలకు.
శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం కార్యదర్శి, మరియు నిర్వాహణాధికారి శ్రీ ఎస్. ఎన్. టిప్నిస్ గారితో జరిపిన సుదీర్ఘమయిన సంభాషణ. ఈ సంభాషణ ఆశ్రమంలోనే ఉన్న ఆయన కార్యాలయంలో
జరిగింది. శ్రీ టిప్నిస్
గారికి ఆంగ్లభాష తెలిసి ఉండటం వల్ల దుబాసీ అవసరం రాలేదు.
శ్రీ ఎస్. ఎన్. టిప్నిస్ చెబుతున్న వివరాలు
---
సాయిబాబాకు, ఉపాసనీ బాబాకు మధ్య ఉన్న సంబంధం గురించి చెబుతాను. సాధువులందరిలాగే ఉపాసనీ బాబాకు కూడా యవ్వనదశలో ఉన్న సమయంలోనే ఆయనకు ఆధ్యాత్మిక జీవితం గడపాలనే ప్రేరణ, కోరిక చాలా బలీయంగా కలిగాయి.
తన చిన్ననాటినుండే ఆయన ఎన్నో ప్రదేశాలను
దర్శిస్తూ ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయన తన గురువును కలుసుకోవడానికి ముందే
ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నతస్థాయిలో ఉన్నారు. గురువు లేకుండా ఆధ్యాత్మికంగా అత్యున్నత
స్థాయికి చేరుకోవడం సాధ్యం కాదు.
ప్రశ్న
--- అయితే గురువుయొక్క
ఆవశ్యకత ఉందంటారా?
జవాబు
--- అవును. ఆవిధంగా భగవంతుని
అన్వేషణలోను, తన గురువు అన్వేషణలోను ఆయన ఎన్నో ప్రదేశాలను
దర్శించుకుంటూ వెళ్ళారు. ఆఖరికి ఎవరో షిరిడీలో ఉన్నసాయిబాబా దగ్గరకు వెళ్లమని ఆయనకు సలహా ఇచ్చారు. ఆయన అనుగ్రహం వల్ల సాయిబాబాను దర్శించుకున్న ఉపాసనీబాబా ఆధ్యాత్మికంగా అతున్నత స్థాయికి
చేరుకొన్నారు. ఇది మనం
నేటికీ అనుభవిస్తున్న వాస్తవం. ఉపాసనీ బాబా మొట్టమొదటగా సాయిబాబా దగ్గరకు వెళ్ళగానే బాబా ఆయనతో “ఎన్నో సంవత్సరాలుగా నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మనిద్దరికీ ఎన్నో జన్మల సంబంధం ఉంది. నువ్వు నా పరశురాముడివి” అన్నారు. పరశురాముడంటే
ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చినవాడు”. సాయిబాబా ఆయన గురించి ఎంతో గొప్పగా
చెప్పారు. ఉపాసనీ బాబా,
సాయిబాబాను మొట్టమొదటిసారి కలుసుకున్నప్పటినుంచి నాలుగు సంవత్సరాలు బాబాతోనే
ఉన్నారు. ఆతరువాత ఉపాసనీబాబా
షిరిడినుండి ఖర్గ్ పూర్ వెళ్ళి అక్కడినుండి చివరికి సాకోరీకి
వచ్చారు. సాకోరి చాలా
చిన్న గ్రామం. ఆసమయంలో
గ్రామ పొలిమేరలో దూరంగా విసిరివేయబడినట్లుగా ఉన్న ప్రాంతాన్ని తను ఉండటానికి ఎంచుకున్నారు. అటువంటి ప్రదేశంలోనయితే సమాజానికి
దూరంగా ఉండవచ్చని ఆయన అభిప్రాయం. కాని త్వరలోనే ప్రజలందరూ ఆయన దగ్గరకు రావడం మొదలుపెట్టారు. షిరిడిబాబా జీవించి ఉన్న రోజులలోనే
ఆయనకు భవన నిర్మాణం ప్రారంభమయింది.
ఒక్కటి గమనించండి…రామకృష్ణపరమహంస,
వివేకానంద వీరిలాగానే షిరిడీబాబా, ఉపాసనీబాబాల మధ్య ఉన్న సంబంధం చాలా అసాధారణంగా విశేషంగా
ఉంటుంది. చాలా అరుదుగాను,
ఉన్నతంగాను సంభవించే గురు-శిష్య సంబంధమది. ఉదాహరణకి రామకృష్ణపరమహంసకి
ఎంతోమంది శిష్యులున్నారు. కాని వివేకానంద యొక్క స్థానం మాత్రం గురు-శిష్య సంబంధశ్రేణిలో చాలా ప్రత్యేకమయిన స్థానం.
వివేకానందులవారు మొట్టమొదటిసారి రామకృష్ణులవారిని కలుసుకున్నపుడు
ఆయన “నువ్వు చాలా అదృష్టవంతుడివి. నాఆశయాన్ని నెరవేర్చడానికి నా కార్యాన్ని
నిర్వహించడానికి వచ్చావు. నువ్వు దైవాంశ సంభూతుడివి”
అన్నారు. సాయిబాబా, ఉపాసనీబాబా ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నపుడు
సాయిబాబా కూడా ఇదే విధంగా అన్నారు.
నేను చెబుతున్నది మీకు అర్ధమవుతోందా? సాయిబాబా
ఆయనను ఖండోబా దేవాలయంలోనే మాట్లాడకుండా అక్కడే ఉండమని చెప్పారు. ఆగుడి చాలా అపరిశుభ్రంగా ఉంది. ఉపాసనీ మహరాజ్ అందులో ఉండలేకపోయారు. అందులో ఆయనకు తోడుగా ఉన్నవి పాములు,
తేళ్ళు. ఆయన అనేక విపత్తులను ఎదుర్కొన్నారు. ఆయనను ఒక వెఱ్ఱివాడనుకుని కొంతమంది
కొట్టేవారు. అయినప్పటికీ
ఆయన మీద సాయిబాబా అనుగ్రహం ప్రసరిస్తూ ఉండేది. ప్రజలు తనను
చూడటానికి వచ్చినపుడు ఆయన సాయిబాబా చెప్పిన మాటలనే చెబుతూ ఉండేవారు. ఆరోజుల్లో ఆవిధంగా ఉండేవి పరిస్థితులు.
కొద్ది నెలలలోనే ఆయనలో ఎన్నో శక్తులు ప్రవేశించాయి. చాలా నెలలపాటు
ఆహారం, నీళ్ళు తీసుకోకుండా గడిపారు. దానివల్ల
ఆయన చిక్కి శల్యమై ఎముకలగూడులా తయారయ్యారు. అయినప్పటికి బాగా కఠినమయిన శారీరక శ్రమచేస్తూ పనిలోనే నిమగ్నమయి ఉండేవారు. ఉపాసనీ మహరాజ్ గారి గొప్పతనం,
ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికసామర్ధ్యం అన్నీ కొంతమంది ప్రజలు అర్ధం
చేసుకొన్నారు.
ప్రశ్న
--- అన్ని విపత్తులనుండి
ఎల్లవేళలా ఆయనను సాయిబాబా అనుగ్రహమే రక్షణగా ఉండేదా?
జవాబు --- అవును. సాయిబాబా ఆయనతో “మనది జన్మజన్మల సంబంధం. భయపడకు. నిన్ను ఆధ్యాత్మికంలో అతున్నత స్థానమయిన మోక్షాన్ని ప్రసాదిస్తాను” అన్నారు.
శ్రీ ఎస్. ఎన్. టిప్నిస్ గారు ఇంకా చెప్పిన వివరాలు ---
ఒకసారి ఉపాసనీ బాబా గారు వంట వండుకుంటున్నారు. ఆయన బ్రాహ్మణుడు కాబట్టి వంట చేసుకోవడం తెలుసు. ఒకరోజున ఆయన ప్రసాదం తయారుచేసి తన గురువయిన సాయిబాబాకు
నైవేద్యంగా సమర్పిద్దామని అంతా పూర్తయిన తరువాత బాబా వద్దకు తీసుకునివచ్చారు. అపుడు బాబా ఆయనను చూసి “నాదగ్గరకెందుకు వచ్చావు
నువ్వు?” అని ప్రశ్నించారు. “నేను మీకోసం వంటవండి
ప్రసాదం చేసి నైవేద్యం పెట్టడానికి తీసుకుని వచ్చాను” అన్నారు ఉపాసనీబాబా. కాని బాబా ఆయనతో “నేను నీవద్దకు వచ్చినపుడు నన్ను
తరిమేశావు. మరి అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు
వచ్చావు? అన్నారు.
“బాబా మీరెక్కడ ఉన్నారు అక్కడ?” బాధతో ఆశ్చర్యంగా అడిగారు ఉపాసనీ
మహరాజ్.
“నేను నిజంగానే నిన్ను చూడటానికి వచ్చాను” అన్నారు బాబా
“కాని నాకక్కడ ఎవరూ కన్పించలేదే? గుడిలోపల కుక్క ఒక్కటే ఉంది” అన్నారు ఉపాసని.
“అది నేనే. నువ్వేమో
నన్ను తరిమేశావు” అన్నారు సాయిబాబా
అది విని ఉపాసనీ చాలా బాధపడ్డారు. “నిజంగా అది మీరేనా?” అని
తిరిగి సాయిబాబాను ప్రశ్నించారు.
“అవును, నేనే. నేను కుక్క, పిల్లి లాంటి జంతువులలోనే కాదు, ఈ
విశ్వమంతటా నేను నిండి ఉన్నాను” అన్నారు సాయిబాబా
(మరుసటి రోజు మరొక పరీక్ష)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment