Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, May 27, 2026

పాము గండం - బాబా నాకు రక్షణ

0 comments Posted by tyagaraju on 6:13 PM

 




28.05.2026 గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుబాశీస్సులు

పాము గండం -  బాబా నాకు రక్షణ

(నా స్వీయానుభవమ్ - త్యాగరాజు)

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం బాబా నాకు చూపించిన అనుభవాన్ని ఇదే బ్లాగులో ప్రచురించాను.  దానిని ఎప్పుడు ప్రచురించానో నెల తారీకు సంవత్సరం గుర్తులేదు.  బ్లాగులో వెతికాను గాని కనుక్కోలేకపోయాను.  దానిని సాయి భక్తుల కోసం మరల ప్రచురిస్తున్నాను.

అది 2009 వ. సంవత్సరం.  నేను నరసాపురంలో భారతీయ స్టేట్ బ్యాంకులో పనిచేస్తూ ఎస్.బి. ఐ. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఫెసిలిటేటర్ గా కూడా ఉన్నాను.  నా పని నాకు ఇవ్వబడిన చుట్టుప్రక్కల ఎస్.బి. ఐ. బ్రాంచెస్ కి వెళ్ళి బ్యాంక్ కస్టమర్ ల చేత పాలసీలు చేయించడం.

నాకు ఉన్న ఒక అలవాటు ఏమిటంటే ఏదయినా పుస్తకాల దుకాణానికి వెళ్ళినపుడు పుస్తకాలు చూస్తాను.  ఏదో ఒక పుస్తకం తీసి మధ్యలో ఏదో ఒక పేజీ  తీసి చూడటం అలవాటు.  అందులో కనక నాకు నచ్చిన వాక్యాలు గాని విషయాలు గాని ఉంటే కొనేస్తాను.

ఆ విధంగా నేను చాలా పుస్తకాలు కొన్నాను.  తరువాతి కాలంలో అవి నాకు పనికి వచ్చాయి.

2009  వ. సంవత్సరంలో ఒక రోజు.  

నా కంప్యూటర్ బల్ల మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి.

వాటిలో శ్రీ ఓరుగంటి రామప్రసాద్ గారు వ్రాసిన శ్రీ సాయి సత్ చరిత్ర కూడా ఉంది. అది ఎప్పుడో కొన్నాను కాని ఎప్పుడూ పారాయణ చేయలేదు.  అది కొత్తగానే ఉంది.  మనం పుస్తకంలో ఎప్పుడూ ఒకే పేజీ  చూస్తూ ఉంటే మనం అనుకోకుండా తీసినపుడు అదే పేజీ వస్తుంది.  (చదువుకునే రోజులలో నేను  బోటనీ పుస్తకం పట్టుకుని రోజూ ఒకే పేజీ తీస్తూ చదవకుండా ఆలోచిస్తూ ఉండేవాడిని.  పుస్తకం తెరిచిన ప్రతిసారి అదే పేజీ వచ్చేది.)  కాని నా బల్ల మీద ఉన్న శ్రీ సాయి సత్ చరిత్రను ఎప్పుడూ తెరవలేదు, పారాయణ చేయలేదు.  ఒక రోజున యధాలాపంగా ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ఒక పేజీ తెరిచాను.   కళ్ళు మూసుకుని ఆ పేజీలో వేలు పెట్టి చూసాను.  

అందులోని వాక్యాలు…..”నేడు నీకు దుర్ధినం.  నీకు మరణం తప్పదు” అన్న వాక్యాలు ఉన్నాయి.  నానా డేంగలే జ్యోతిష్కుడు బాపూసాహెబ్ బూటీతో అన్నమాటల సందర్భం.   ఇక భయం వేసి మిగతా పేరాలు చదవకుండా పెట్టేసాను.  మరుసటి రోజు కూడా యధాలాపంగా ఒక పేజీ తీసాను.  మరలా అదే పేజీ అవే వాక్యాలు.  ఇలా నాలుగయిదు రోజులు అదే  పేజీ రావడం నేను భయపడి మిగతా వాక్యాలు చదవకుండా పెట్టేయడం ఇలా జరుగుతూ ఉంది.   శ్రీ పత్తి నారాయణరావు గారు వ్రాసిన శ్రీ సాయి సత్ చరిత్ర పుస్తకం నా భార్య షిరిడీ వెళ్లినపుడు తీసుకు వచ్చింది.  అది కొత్త పుస్తకం.  దానిని కూడా నేను పారాయణ చేయలేదు.  మరుసటి రోజు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ఒక పేజీ తెరచి కళ్ళు మూసుకొని ఒక చోట నా వేలు ఉంచాను.  ఆ పేజీలో ఉన్న వాక్యాలు….

“ఈ దినము నీకు అశుభము.  నీకీ దినము ప్రాణగండమున్నది” అని నానా డేంగలే అను జ్యోతిష్కుడు బాపూ సాహెబ్ బూటీ తో అన్న మాటలు. ఈ వాక్యాలు అన్నీ కూడా పాము వల్ల గండము అని సూచించే విషయాలు.  నాకేమీ అర్ధం కాలేదు.  ప్రతి ఆదివారమునాడు మా సాయిభక్తులందరమూ నరసాపురంలో బాబా సత్సంగం చేసుకుంటూ ఉంటాము. మా సత్సంగ సభ్యులకు ఈ విషయం చెప్పాను.  వారుకూడా ఏమీ చెప్పలేకపోయారు.

తరువాతి రోజు సోమవారము నాడు యధావిధిగా నా మోటార్ బైక్  మీద నరసాపురం నుండి ఎస్.బి.ఐ. లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు చేయించడానికి మొగల్తూరు బయలుదేరాను. నరసాపురం నుండి పది కిలోమీటర్ల దూరం.  ప్రయాణం చేస్తూ మనసులో సాయినామ స్మరణ చేసుకుంటూనే ఉన్నాను.     మధ్యలో సీతారాంపురం కాలువ వంతెన మీదుగా మొగల్తూరుకు ఎడమ వైపుకు బైకు మీద వెడుతున్నాను.  ఎడమ ప్రక్కన కాలవ, కుడివైపు పంట పొలాలు.  నేను బైకును రోడ్డుకు కాస్త కుడి ప్రక్కగా పోనిస్తూ ఉన్నాను.  ఇంతలో పైనుంచి ఒక పక్షి ఎగరడం అది ఎడమవైపునుండి వస్తూ కుడివైపుకి వెడుతూ ఉంది.  మధ్యలో రోడ్డు మీద ఏదో నల్లగా పడింది.  అది నా బైకుకి ముందు కాస్త ఎడమ పక్కన పడింది.  వెడుతూనే గమనించాను.   అది ఒక పాము.  రోడ్డు మీడ పడగానే  అది కాస్త తల పైకెత్తి ఉంది.  వెంటనే నా వళ్ళు ఝల్లుమంది.  ఇక మళ్ళి వెనుకకు చూడకుండా బైకును పోనిచ్చాను.   అంటె ఆ పక్షి తన కాళ్ళతో పామును పట్టుకుని తీసుకు వెడుతూ ఉంది.  ఆ పాము పట్టు జారి రోడ్దు మీడ పడి ఉంటుంది. లోపల సాయి నామ స్మరణ ఆగకుండా చేసుకుంటూనే ఉన్నాను.  దీనిని బట్టి బాబా నాకు ముందుగానే పాము గండం గురించి సూచించారని అర్ధమయింది. నేను కాస్త ఎడమవైపు   కాని వెళ్ళినట్లయితే అది నామీద పడి ఉండేదేమో. మొట్టమొదట శ్రీ ఓరుగంటి రామ ప్రసాద్ గారి పుస్తకం లో భయం వేసి మిగతా వాక్యాలు చదవలేదు.  ఆ తరువాతి వాక్యాలు ఏమని ఉన్నాయంటే, “ నువ్వు ద్వారకామాయి బిడ్డవు.  మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక”  ఇవి ఉన్నాయి.  బాబా బాపూ సాహెబ్ బూటీకి అభయమిస్తూ అన్న మాటలు.  బాబా అభయప్రదాత.   ఆ తరువాత నాకు ఎలమంచిలి శాఖకు బదిలీ అయింది. బైక్ మీద బ్యాంక్ కు వెళ్ళేటప్పుడు, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఎలమంచిలిలో రోడ్డు మీద నాలుగైదు సార్లు పాములు పాకుతూ కనిపించేవి.  సాయి  నామ స్మరణే నాకు రక్షణ.

బాబా సాయి సత్ చరిత్ర ద్వారా మన ప్రశ్నలకు సమాధానలను ఇస్తారు.  ఈ విషయం నాకు చాలా సందర్భాలలో ఋజువయింది.  కొన్ని నెలల క్రిత్రం నా స్వీయానుభవాన్ని మీ అందరితో పంచుకుంటానని వ్రాసాను.  ఇప్పుడు  మీ అందరికీ నా స్వీయానుభవాన్ని అందించాను.

సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు

 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List