30.03.2011 బుథవారము
సాయి భక్తుడుఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
మనము యింతకు ముందు సాయి భక్తుడు యెలా ఉండాలో తెలుసుకున్నాము. ఈ రోజు మరికొంత తెలుసుకుందాము.
సాయి కి అంకిత భక్తుడిగా ఉండాలంటే ఆయన మీద అపారమైన ప్రేమని కలిగి ఉండాలి. ఆ ప్రేమ విపరీతమైన ప్రేమగా ఉండాలి. బాబా ! నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు తప్ప నన్ను ఆదుకునేవారు ఈ ప్రపంచంలో వేరెవరూ లేరు అని ఆయన చరణాలమీద వాలిపోవాలి.
మార్జాల కిశొర న్యాయము, మర్కట కిశొరన్యాయము అని రెండు ఉన్నాయి.
మార్జాల కిశొర న్యాయంలో తల్లి పిల్లి తను యెక్కడికి వెళ్ళినా తనపిల్లని నోటితో కరచుకుని తీసుకుని వెడుతుంది. ఇక్కడ పిల్లకి బాథ్యత లేదు. అంతా తల్లిదే బాథ్యత. కాని మర్కటకిశోర న్యాయంలో తల్లికోతి యెక్కడకయినా వెళ్ళేటప్పుడు పిల్ల కోతి తన తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. అంటే ఇక్కడ పిల్లదె బాథ్యత గట్టిగా పట్టుకుని పడిపోకుండా ఉండటం. ఆ విథంగానే సాయి భక్తుని భక్తికూడా మర్కట కిశోర న్యాయంగా ఉండాలి. అలా మనము సాయినాథుని పట్టుకుని ఉండాలి. ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని మనసులో ముద్రించుకుని యెల్లప్పుడు దర్శిస్తూ ఉండాలి. బాబా మీద శ్రథ్థ, విశ్వాసం థృఢంగా ఉండాలి.
ఇలా కనక సాయిని సేవిస్తే బాబాకి అంకిత భక్తులుగా ఉంటారు. బాబా యేమని చెప్పారూ, యెప్పుడు సాయి - సాయి అని జపిస్తే సప్త సముద్రాలూ దాటిస్తానని చెప్పారు. భక్తి ప్రేమలతో ఒక్కసారి నమస్కరిస్తే చాలు అని అభయమిచ్చారు.
బాబా కరుణకి పాత్రులవాలంటే మనము 8 పుష్పాలతో ఆయనని పూజించాలి.
అవి: 1. అహింస, 2. శాంతము, 3. యింద్రియనిగ్రహము, 4. అన్ని జీవులయందు కరుణ, 5. క్షమాగుణము, 6. తపస్సు, 7. థ్యానము,8. సత్యము.
వీటినన్నిటినీ మనం సులువుగా చేయగలం ప్రయత్నిస్తే.
మనకంటూ యేమీ కోరకుండా ఆ సాయినాథుని మనం పూజిస్తూ ఉండాలి. ఆయనని పూజించేటప్పుడు యితరులకి కూడా వారి వారి కోరికలుతీర్చమని మనం అడగచ్చు. మనం యితరులకోసం బాబా వారిని ప్రార్థించినా నిస్వార్థంగా,ఫలాపేక్ష లేకుండా ప్రార్థించాలి. అంటే వారికి యేదన్నా లాభిస్తే మనకి యేదన్నా కొంత ఇస్తారులే అనే భావం ఉండకూడదు. మన సాయి బంథువులు యెవరికీ కూడా అటువంటి ఉద్దేశ్యం ఉండదు. పైగా ఇంకా ఆనందంతో వారి కోరిక తీర్చమని బాబాని వేడుకుంటారు. యితరులకి మనం సాయం చేయడంలో నే యెక్కువ సంతోషం, తృప్తి కలుగుతాయి. అది వెల కట్టలేనిది. ఒకవేళ యెవరైన, "యేమండీ, మీరు కూడా సాయి భక్తులే కదా, మీరు యింకొకరిని అడగటమేమిటండీ అనవచ్చు.దానికి నేను చెప్పే సమాథానం, ఇది సాయి బంథువులందరూ ఒకరికొకరు చేసుకునే సహాయం. యితరులకి కూడా మనం బాబా కి చెప్పి సహాయం చేస్తున్నాము కదా అనే తృప్తి ఉంటుంది. నేను కూడా కొన్ని కొన్ని సమయాలలో ఇద్దరు ముగ్గురు సాయి బంథువులని నా తరఫున ప్రార్థించమని అడిగినవాడినే.
ఒకవేళ మనకోరికలు, యితరుల కోరికలు నెరవేరాయనుకోండి, ప్రతీరోజు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ప్రతీరోజు పూజపూర్తి అయినతరువాత, లేచేముందు ఇలా అనుకుంటాను ... నాకు ఫలానా పని అయింది, ఫలానవారికి ఈపని జరిగింది, సమస్త దేవతలకి ముక్కోటి దేవతలకి, బాబాకి ఈ పని చేసినందుకు నా కృతజ్ఞతలు, అని చెప్పుకుంటాను. పూజ మొదలు పెట్టేముందు కూడా ఫలానా పని అవ్వాలని పూజ మొదలుపెడతాను. ఇక్కడ మీకు అనుమానం వచ్చే ఉంటుంది. కోరిక లేకుండా సాయిని పూజించమన్నారు కదా మరి మీరు కోరికెందుకు కోరుతున్నారు అని. అంటే నేనికి సాయికి పూర్తిగా అంకిత భక్తుడిని కాలేదన్న మాట. కాని ఒక్కొక్కసారి ఆయన భారమంతా ఆయన భుజస్ఖందాల మీదే వేసి నిశ్చింతగా ఉంటాను.
మనం నిమిత్త మాత్రులుగా ఉండాలి. సుఖం కలిగినప్పుడు పొంగిపోయి, కష్టాలు వచ్చినప్పుదు కృంగిపోయే విథంగా ఉండకూడదు.(స్థితప్రజ్ఞుడు)
ఇక్కడ మీకొక విషయం చెపుతాను. ఈ సాయి సత్సంగములో కి వచ్చాక చాలా మట్టుకు నేను కొన్ని కొన్ని విషయాలకు బాథ పడడం మానివేశాను. రెండు సంవత్సరాల క్రితం నేను ఒక పట్టణంలో పెద్ద షాపు కి వెళ్ళాను. అప్పుడు నావద్ద కొన్ని గిఫ్ట్ చెక్కులు ఉన్నాయి. మొత్తo పాతికవేల రూపాయల విలువ. కొంత సొమ్ముకు ఫర్నిచర్ కొన్నాను ఇంక మిగిలినవి ఎనిమిదివేల రూపాయల చెక్కులు. తరువాత కొంత సరకు కొని చెక్కులు ఇద్దామంటే కనపడలేదు. మిగిలినవి షాపులోనే ఫర్నిచర్ కొన్న ప్రదేశంలో పెట్టి మర్చిపోయాను. ఈలోగానే వాటిని యెవరో తస్కరించారు. చాలా వెతికాను. యేమిటి బాబా ఇది దొరికేలా చెయ్యమని ప్రార్థించాను.. కాని దొరకలేదు. తీసుకున్న మిగతా సరుకులు వాపసు ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. ఇంక దాని గురించి మా బంథువులకి కూడా మాట్లాడవద్దని చెప్పి, ఇంక ఆ విషయం వదలివేశాను. 8,000/- పోతే పోయాయి నాకు బాబా గారు దానికి 10 రెట్లు లాభం చేకూర్చారు. మా అమ్మాయి వివాహానికి నేను డబ్బుకి ఇబ్బంది పడలేదు.
ఇక్కడ కోరికలు లేకుండా పూజించడం దేనికంటే భగవంతుడు మనకి యేది ఇస్తారో మనకి తెలియదు. ఒకవేళ మనం తక్కువ కోరుతున్నామేమో? భగవంతుడు మనకి ఇంకా అథికంగా ఇద్దామనుకున్నారేమో యెవరికి తెలుసు? నువ్వు పెద్ద డిగ్రీ పాసయ్యావు. నీకు ఉద్యోగం కావాలి. బాబా నాకు ఫలానా కంపెనీ లో ఉంద్యోగం ఇప్పించు అని అడిగావు. కాని రాలేదు. అంతమాత్రం చేత నిరాశ పడకుండా నమ్మకం సడలకుండా బాబానే నమ్ముకుని ఉండాలి. నువ్వు కోరుకున్న కంపనీ కన్న మరొక మంచి కంపెనీ లో నీకు ఉద్యోగం ఇవ్వదలచుకున్నరేమో. అందుకనే కోరిక లేకుండా పూజించమనేది.
ఇక్కడ నమ్మకం అంటే నా అనుభవం మీకు చెపుతాను. 1985 ప్రాంతాల్లో ఆంథ్రప్రదేష్ వారి భాగ్య లక్ష్మి లాటరీ ఉండేది. నాక లాటరీ టిక్కట్టులు కొనే అలవాటు. అప్పుడప్పుడు 5,10 20 అల తగులుతూ ఉండేవి. ఒకసారి కొన్ని లాటరీ టిక్కట్టులు కొని మా ఊరిలోనే ఉన్న మా మేనమామగారి ఇంటికి వెళ్ళాను. మా మేనకోడలు బహుశ 5 సంవత్సరాలు అనుకుంటా. మామయ్యా, ఆ టిక్కట్టులు ఇవ్వు, దేవుని పూజా మందిరంలో పెడతాను అంది. నేను ఇవ్వలేదు. యేమో, యెగిరిపోతాయేమో, యెలుకలు ఎత్తుకుపోతాయేమొనని బెంగ. మరునాడు ఫలితాలలో లక్ష రూపాయలు ఒక్క అంకెలో తప్పిపోయింది. ఆ రోజుల్లో ఇలా పూజలు అవీ చేసేవాడిని కాదు. స్నానం అవగానే దేవునికి ఒకసారి దణ్ణం పెట్టుకోవడం అంతే. అప్పుడే కనక బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని దేవుని వద్ద టిక్కట్టు పెట్టి ఉంటే ఫలితం ఎలా ఉండేదొ.
బాబా గారిని మనం ఋణగ్రస్తుణ్ణి చేసుకోవాలి. బాబా గారే చెప్పారు మీరు నాకిచ్చినదానిని నేను 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుందని. అంటే ఇక్కడ ఆయన 10 రెట్లు ఇస్తానన్నారు కదా మనం ఒక లక్ష ఖర్చు పెడదాము, 10 లక్షలు ఇస్తారు అనే భావంలో కాదు మనం ఉండవలసింది. ఆయనకి మనం ప్రేమతో ఇచ్చి ఋణగ్రస్తుణ్ణి చేసుకోవాలి. ఇప్పుడు మనకి చిన్నపిల్లలు ఉన్నరనుకోంది. వాళ్ళకి మనం యేది కొనిపెట్టినా ప్రేమతో కొని ఇస్తాము. వాళ్ళు సంతోషిస్తే మనకి ఆనందం కలుగుతుంది. అంతే కాని పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మనలని బాగా చూస్తారు అనే ఉద్దేశ్యం యెంతమాత్రము ఉండదు. అవునా కాదా? అట్లాగే మనం బాబాగారికి యేమిచ్చిన అదే ప్రేమతో ఇచ్చి ఋణగ్రస్తుణ్ణి చేసుకోవాలి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment