04.05.2011 బుథవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
బాబా పేరుమీద మీకిష్టమైనది వదలండి
సాయి బంధువులకు బాబా ఆశీర్వాదములు
ఈ రోజు మనము శ్రీమతి ప్రియాంకా గారి బ్లాగునుండి ఒక బాబా లీలను తెలుగులో తెలుసుకుందాము.
మనకు కష్టాలలో ఉన్నప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడు. అందుచేత యెన్నో మొక్కులు మొక్కేస్తూ ఉంటాము. కాని ఒకోసారి కష్టాలు తీరగానే మొక్కులు మరచిపోవడం గాని, వాయిదా వేయడం గాని జరుగుతూ ఉంటుంది. అందుచేత మొక్కులు మొక్కేటప్పుడే వాటిని మనం తీర్చగలమా లేదా అన్నది ఆలోచించుకోవాలి. కాని కఠినమైనా గాని అమలు చేయాలి. ఒకొసారి మనం మర్చిపోతే భగవంతుడే మనకి యేదో విథంగా అడ్డంకులు కల్పించి మనకి గుర్తు చేస్తాడు. అది మనని మంచి మార్గంలో పెట్టడానికే తప్ప మరేమీకాదు. లేకపోతే కోరిక తీరిన తరువాత మానవుడు మొక్కిన మొక్కుని తీర్చదుండా గడిపేస్తాడు. మొక్కు విషయంలో భగవంతుడుని మనం మోసం చేయకూడదు.
ఈ సందర్భంగా నేను చిన్నప్పుడు చందమామలో చదివిన చిన్న కథ చెపుతాను.
ఒక వూరిలో కృష్ణుడి గుడి ఉందిట. అక్కడకు వెళ్ళి మొక్కు మొక్కుకున్న వారికి కోరికలు తీరతాయని ఒక నమ్మకం ఉంది. ఆ ఊరిలో ఒక పిసినారి ఉన్నాడు. ఒక సందర్భంలో అతనికి ఒక పని కావలసి ఉండి, కృష్ణుడి గుడిలోకి వెళ్ళి, ఇలా మొక్కుకున్నాడట. "కృష్ణా ! నాకు కనక ఈ పని జరిగితే నీకు చిటికెల పందిరి వేస్తాను" అని. కృష్ణుడికి ముచ్చట వేసి అన్ని పందిళ్ళూ చూశాను గాని, ఈ చిటికెల పందిరి చూడలేదు, సరే, వీడి కోరిక తీర్చి చూద్దామనుకుని ఆ పిసినారి వాడి కోరిక తీరేటట్లు చేశాడు.
తరువాత కోరిన కోరిక తీరిన పిసినారి గుడికి వచ్చి, స్వామీ, నీకు మొక్కుకున్న తరువాత నా కోరిక తీర్చావు. అందుకని నీకు ఇచ్చిన మాట ప్రకారం నీకు చిటికెల పందిరి వేస్తున్నాను, అని, కృష్ణుడి చుట్టూ, నాలుగువైపులా నాలు సార్లు చిటికెలు వేసి, స్వామీ ఇదే చిటికెల పందిరి అని అన్నాడట. కృష్ణుడు ఆశ్చర్యం తో ముక్కు మీద వేలు వేసుకున్నాడట.
మనం బాబా మీద యెన్నో ఆశలు పెట్టుకుంటాం, ప్రతీ చిన్న విషయానికి ఆయన సాయాన్ని అర్థిస్తాము యెందుకంటే మనం ఆయన బిడ్డలం కనక. పిల్లలు యెప్పుడు యేది అవసరమొచ్చినా, లేక కష్టాలలో గాని తల్లిని సహాయమడుగుతూ ఉంటారు. మనం బాబాకి అప్పుడప్పుడు మాట ఇస్తూ ఉంటాము (మొక్కులు మొక్కుకోవడం అటువంటివి). మనం ఆయనకి అలా చేసి శరణువేడడం వెనుక కారణం ఉంటుంది.
మన కోరిక తీరిన మరుక్షణంలోనే, బాబా గారు యేమనుకుంటారనే రెండో ఆలోచన లేకుండానే, మనమిచ్చిన మాటని మర్చిపోతాము. కొన్ని సంవత్సరాలుగా నేను నేర్చుకున్నదేమంటే, మనం కనక ఆయనకిచ్చిన మాట తప్పితే, సాయిమా మనలని దండించి మనకొక గుణపాఠం నేర్పుతారు యెందుకంటే మనము ఆయన బిడ్డలం కనక. కనుకనే మనము మన సాయిమాని మోసం చేయకూడదు. ఒకవేళ మనం ఆ తప్పు కనక చేస్తే, యెదురయ్యే పరిస్థితులని యెదుర్కోవడానికి సిథ్థంగా ఉండాలి. యిదంతా మనమంచికోసమే, యెందుకంటే, తల్లి తన బిడ్డలమీద యెక్కువ కఠినంగా ఉండలేదు. నమ్మకం లేకుండా మనము సాయిమాని సంతృప్తి పరచలేము.
ఈ రోజు మీకు విక్రం స్నేహితుని బాబా లీలని మీకు చెపుతున్నాను. విక్రం పంపిన ఈ మైల్ ని మీకు అందించేముందు, నేను విక్రం కి థన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
సాయి భక్తులందరూ కూడా, తమ అనుభవాలని ఇక్కడ పంచుకోవడానికి, ముందుకు వస్తే వారినందరిని నేను వ్యక్తిగతంగా అభినందిస్తాను. విక్రంగారు ఇచ్చిన మైల్ ఇక్కడ జత చేస్తున్నాను.
ఈ రోజు మీకొక అనుభవాన్ని చెపుతున్నాను. ఇది నాకు అనుభూతికన్నా యెక్కువ. మానవ మాత్రుడిగా, ఒక సాయి భక్తునిగా ఇది నా జీవితంలో ఒక గుణపాఠం. ఇదినాకుమంచి స్నేహితుడు, తోటి సాయి భక్తుడు నాకు చెప్పిన లీల.
అతని అనుమతితో నేను కూడా ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ సంవత్సరం (2010) యేప్రిల్ లో నా స్నేహితుడు (సాయి భక్తుడు) తన ఎంప్లాయర్ ద్వారా యూ.ఎస్. లో వర్క్ పెర్మిట్ కి అప్ప్లై చేశాడు. అతని అప్ప్లికేషన్ ప్రాసెస్ లో ఉండగా, అతను, తన వర్క్ పెర్మిట్ పని జరిగితే, బాబాకి, తన చెడు అలవాటయిన సిగరెట్టు కాల్చడం గురువారము లలో మానివేస్తానని మాట ఇచ్చాడు.
తొందరలోనే అతని వర్క్ పెర్మిట్ అప్ప్రూవ్ అయింది. ఈ వార్త తెలిసిన వెంటనే అతను సంతోషంతో యెగిరి గంతేయడం నాకు గుర్తుంది. ఒక నెల వరకు అతను తన ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, గురువారములలో పొగతాగడం మానివేశాడు. కాని ఒక గురువారమునాడు, పని వత్తిడిలో ఆ వత్తిడిని తట్టుకోలేక సిగరెట్టు కాల్చాడు. నైరాశ్యం బాగ యెక్కువగా ఉండటం చేత, తనకి మనస్థైర్యం లేకపోవడంవల్ల బలహీనత వల్ల తన మాట నిలబెట్టుకోలేకపోయానని ఒప్పుకున్నాడు. ఇక ఆగురువారం మొదలు తను ఇచ్చిన మాట మరచిపోయి ప్రతీ గురువారం పొగతాగడం మొదలు పెట్టాడు.
సచ్చరిత్రలో చెప్పినట్టు, తల్లి పిల్లవాని మంచికోసం, చేదు మందు గొంతులో పోస్తుంది. అలాగే మహాత్ములు కూడా, ఒకోసారి కఠినమైన పథ్థతులని అవలంబిస్తారు, అది వారి మంచి కోసమే. అదే విథంగా ఇతనికి జరిగింది. అతను బాబాకిచ్చిన మాటని జవదాటిన రెండు వారాల తరువాత, అతని యజమానితో సమస్యలు వచ్చాయి, అందుచేత అతని ఎంప్లాయరు అతని వర్క్ పెర్మిట్ ని వెంటనే రద్దు చేశే నిర్ణయం తీసుకున్నాడు. ఇక అతను భంగపడిపోయి చపల చిత్తుడై, తరువాత యేమిచేయాలో తెలీకుండా అయిపోయాడు.
తన వర్క్ పెర్మిట్ రద్దు కాబడిందనే వార్త తెలిసిన తరువాత, అతని మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన, తెలివితక్కువగా తను బాబాకిచ్చిన మాట తప్పడమే అని. అతను బాబా విగ్రహం యెదుట పశ్చాత్తాప పడ్డాడు,రోదించాడు. ఇదంతా సరి అయితే కనక తాను మళ్ళీ మారుతాననే ఉద్దేశ్యంతో బాబాని కషమించమని
వేడుకున్నాడు. తన ఎంప్లాయరు, యేదో పొరపాటువల్ల జరిగింది, మరలా తిరిగి జాయిన్ అవ్వమని తనని పిలుస్తాడని, రోజుల తరబడి ఎదురు చూశాడు. కాని ఆవిథంగా యేమీ జరగలేదు.
అతను ఉద్యోగం పోగొట్టుకుని యింటి వద్దే నెల ఉన్నాడు. బాబా తన గొంతులో చేదు మందును బలవంతంగా పోసింది తన మంచికేనని అతనికి తెలుసు. తిరిగి తను ఇచ్చిన మాట ప్రకారం గురువారములునాడు పొగ తాగడం మానేశాడు.
తల్లి పిల్లవాణ్ణి, కొట్టినా తిట్టినా, వాడు మళ్ళీ మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉంటాడని నిర్థారించుకోవడానికే. కాని, పిల్లవాడు, పిల్లవాడే, వాడికి మంచి కి చెడు కి వున్న తేడాను తెలియ చెప్పాలి.
కాని, తిట్టిన తరువాత, దండించిన తరువాత, తల్లి పిల్లవాణ్ణి కౌగలించుకొని, వాడిని క్షమించి వాడిని అక్కున చేర్చుకుని ప్రేమని కురిపిస్తుంది. ఇదే అతని విషయంలోనూ జరిగింది. అతను తిరిగి ఉద్యోగావకాశాలకోసం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఒక నెలతరువాత అతను కిందటి ఉద్యోగంకన్నా, మంచి ఉద్యోగంలో చేరాడు.
అతనికి వర్క్ పెర్మిట్ తాత్కాలిక ప్రాదిపదికమీద జీతం తీసుకునేలా వచ్చింది. అతని ప్రస్తుత కంపనీ సరియైన వర్క్ పెర్మిట్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని యింకా తీసుకోవలసి ఉంది. అతని భవిష్యత్తు సందిగ్థం, కాని బాబా గారు తనతో ఉన్నారని అంతా ఆయనే చూసుకుంటారని తెలుసు. అతను కఠినమైన మంచి గుణ పాఠం నేర్చుకున్నాడు.
కాని బాబా మంచి దయా సముద్రుడు. ఒకోసారి ఆయన పథ్థతులు కఠినంగా ఉన్నాగాని, ఆఖరికి విజయ తథ్యం.
మనం బాబా చెప్పినట్లు నడుచుకోవడమే. కాని మథ్యలో వదిలి వెళ్ళిపోవద్దు.
నా స్నేహితుని విషయంలో యేమి జరిగింది, బాబా తనమీద కోపగించినందువల్ల కాదని మనం అర్థం చేసుకుందాము. అలా జరగడానికి కారణం దారితప్పి కొట్టుకుపోతున్నవానిని బాబా గారు సరియైన మార్గంలో పెడదామనే ఉద్దేశ్యం..
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment